Thursday, December 9, 2010

సరదాలూ.....

......యెద్దేవాలూ

........వేళాకోళాలూ, వెక్కిరింతలూ, కొక్కిరింతలూ, కు.కా.చె.దె లూ, చతుర్లూ, వ్యంగ్యాలూ.....ఇవన్నీ తెలుగు సాహిత్యంలోనూ, మన సంస్కృతిలో భాగాలే! అవునంటారా?

"మీ రుమాలా" అంటే, "అవును--మాదిగా" నుంచి, "మీవూళ్లో గాడిదలెక్కువ సుమండీ" అంటే, "వున్నవిచాలక ప్రక్కవూళ్లనించి కూడా వచ్చేస్తున్నాయిస్మండీ" వరకూ కోకొల్లలు!

12 డిసెంబరు (మానాన్నగారి జయంతి)--బ్లాగర్ల దినం--సారీ, దినోత్సవంట! అందరికీ శుభాకాంక్షలు!

ఇదేమిటి--(బ్లాగుల్లో) దినాల వుత్సవాల సందర్భంగా శుభాకాంక్షల్ని విశ్వనాధవారిచేత యెద్దేవా చేయించిన వీడేమిటీ.....ఇప్పుడు శుభాకాంక్షలంటాడూ.....అంటారా! ఇదీ యెద్దేవాయేనండోయ్!

నా బాధల్లా, టపాలు పూర్తిగా చదివో, చదవకుండానో, ఓ పాయింటు పట్టుకొని కామెంట్లు పెట్టేస్తున్నారు చాలా మంది. బాగుంది. సరే!

కొన్ని విషయాలనీ, వ్యక్తులనీ యెంత ఘాటుగా విమర్శించినా, చదువరులు (చదువరి పేరుతో బ్లాగులు వ్రాసేవారు కాదండోయ్!) యెందుకో వాళ్ల వాళ్ల 'కామెంటుచేసే' రైట్ ని 'రిజర్వ్' చేసేసుకొని, వ్యాఖ్యానించడంలేదు!

దీనిక్కారణం......? (భయమా, సంకోచమా, బిడియమా.....ఇలా ప్రశ్నిస్తే మళ్లీ విరుచుకు పడతారేమో!)

అయినా, నా నోరాగదు! నోరా వీపుకు తేకే అన్నట్టు! యేంచేస్తాం! యెప్పుడూ చెఱువుమీద కోపమే నాకు!

మరోసారి 'శుభాకాంక్షలు!'

బ్లాగండి, బ్లాగించండి, బ్లాగులనే శ్వాసించండి! (యెలా వుంది?)

Saturday, November 27, 2010

'....పరిఙ్ఞానం'

రాజకీయ శంకలు

"గురువుగారూ! నాకు లఘుశంక వచ్చింది!"

"హారి నీ! అయితే నాదగ్గరెకెందుకొచ్చావు?"

"లఘుశంక అయినా, గురుశంక అయినా మీదగ్గరకే కదండీ రావాలి?"

"నీ భాషా పరిఙ్ఞానం మండా! చిన్న సందేహం, పెద్ద సందేహం అనా నీ వుద్దేశ్యం! సరే, యేమిటది?"

"దానికన్న ముందు ఇంకోటి......."

"అదేదో చెప్పేడూ!"

"తమరు భక్తులచేత చేయించడమేగానీ, ఆచమానం చేస్తున్నట్టు యెప్పుడూ నేను చూడలేదు....అసలు చేస్తారా? అని"

"హారినీ! రోజూ 'దేవతార్చన ' చేసేటప్పుడు మనసులోనే చేస్తానులే! అదే కాకుండా, నా కమండలం లోంచీ, తాబేటికాయలోంచీ ఆరారగా తీర్థం పుచ్చుకొంటూ, ఫలాలూ అవీ ఆరగిస్తూ, రెండుమూడు గంటలకోసారి 'అల్పాచమనం', రోజూ ఒకటి రెండు సార్లు 'అధికాచమానం' చేస్తూనే వుంటాను లే! ఇంతకీ నీ శంక యేమిటీ?"

"మా వాళ్లని పదవులనించి తప్పించాం! కమలం వాళ్లు యెడ్డప్పని తప్పించడం లేదు అని ఇటాలియమ్మ యాగీ చేస్తోంది కదా, మరి కమలం వాళ్లు దీటుగా జవాబివ్వట్లేదు యెందుకంటారు?"

"బాగుంది నీ శంక! ఆవిడ దృష్టిలో పదవినించి తప్పించడం ఓ ఘోర శిక్ష! ఆ పదవి కల్మాడీ లాంటివాడి 'ఫలానా రోజున ఫలానా టైముకి మీటింగు వుంది ' అని వుత్తరాలు వ్రాసే అత్యున్నత పదవి అయినా సరే! అంతేగానీ, వాళ్ల మీద ఈగకూడా వాలకూడదు. ఈ పదవీదారులు యేమి చేసినా, వెనకాల వుండేది అధికార గణం. వాళ్ల మీద కూడా ఈగ వాలకూడదు. అదేపని చెయ్యమని కమలం వాళ్లకి వుద్బోధిస్తోంది!"

"బాగా చెప్పారు! ఇంకో గురు శంక వుంది గానీ, ఇంకోసారి!"

"నీ భాషా పరిఙ్ఞానం మరోసారి మంటెట్టా! అసలు ఈ 'శంకలకీ' 'ఆచమానాలకీ' అర్థాలు తెలుసుకొని మరీ యేడు ఈ సారి!"

శుభంభూయాత్.

Friday, November 26, 2010

ఇల్లరికపు.....

.....అల్లుడిరికం

"గురువుగారూ! ఒక పెద్దమనిషిని--మేథావీ, ఆర్థిక వేత్తా, వున్నత పదవిలో వున్న మచ్చలేని వ్యక్తీ అయిన ఆయన్ని, బొత్తిగా "నిష్ క్రియాపరుడు" అంటూ నిందించడం యేమి బాగుంది?"

"ఆవును శిష్యా! ఆయన నిజం గా 'నిష్కామ కర్మ యోగి!' అలా అనడం తప్పే!"

"అదేంటండోయ్! అంత గొప్ప బిరుదిచ్చేశారు!"

"అవును నాయనా! ఆయన వొప్పుకున్నదే ఇల్లరికపు అల్లుడిరికానికి. దానికి తగ్గ 'క్రియలే' చేస్తున్నాడు--నిష్కామంగా!"

"నాకర్థం కాలే!"

"చెపుతా విను.

వెనకిటికో అత్తగారు వుండేది--'మా అల్లుడు బహుమానస్తుడు--ఆతనికి యేపనియు చెప్పము--ఐనంగానీ, తగు మూడు పనులు చేయను--ఇల్లలుకను, పేడ చేయ, యెంగిళ్లెత్తన్!" అని గర్వం గా చెప్పేదట ఇరుగుపొరుగులతో.

అలాగే, ఇలాంటిపనులకి వొడబడే ప్రథానిత్వం స్వీకరించాడు అత్తగారిలాంటి ఆవిడ అధికారానికి యేమాత్రం లోటు రానివ్వకుండా. 

ఆయన నిష్కామంగా చేస్తున్న పనులు 1. తన పదవిని కాపాడుకోవడం--లేకపోతే, తన స్థానం లో ఇంకో చేటపెయ్యని వెతుక్కోవడం ఆవిడకెంత కష్టం!

2. తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం--లేకపోతే చీమదూరే సందిస్తే యేకంగా యేనుగులని దోపెయ్యడానికీ, కోట్లు గుమ్మరించి కోటలో పాగా వెయ్యడానికి కార్పొరేట్ రాజకీయులు సిద్ధం గా వున్నారు.

3. తన పార్టీని కాపాడుకోవడం--ఆవిడ అధికారానికి తిరుగులేకుండా, పార్టీని చక్కని కేకుగా భద్రపరచి, వీలైతే దానిమీద చెర్రీలూ వగైరా అలంకరించి, రేపు ఆవిడ కొడుకుకి అప్పగించాలి మరి!

ఇంకా, తానే ప్రభుత్వం అని మరచిపోయి, 'అవినీతిరహిత పరిపాలనని అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది' అని కూడా సెలవిచ్చారు.

ఇలా మూడు పనులని ప్రతిఫలం ఆశించకుండా నిర్వహిస్తున్న ఆయన కర్మ యోగి కాడూ మరి?"

"నిజమేనండీ గురూగారూ!"

Tuesday, November 2, 2010

ఈనాడు "తెగులు"

మన తెలుగు

"రేప్పండక్కి యేం చేస్తున్నావొదినా?"

"కొంచెం వెరైటీగా వుంటుందని 'నువ్వుపప్పు' పాయసం చేద్దామనుకొంటున్నానొదినా!"

"యేమిటీ? 'నువ్వు పప్పా'?"

"అవునొదినా".

"అయితే, 'నువ్వు' పప్పా?"

"భలేదానివే. నేను కాదొదినా! 'నువ్వు' పప్పు!"

"బాగుంది. ఇవాళ ఈనాడు వసుంధర లో "నువ్వుల పాయసం" అంటూ వ్రాశారు! ఓ సారి చూడు."

"చూశానొదినా. వాళ్లు పెట్టిన ఫోటో లో మాత్రం చక్కగా తెల్లగానే వుంది. కానీ, నువ్వులతో యెవరైనా పాయసం చేస్తే, అలా వుంటుందంటావా? మరి రుచెలా వుంటుందో?"

"భలేదానివొదినా! ఇంకా నువ్వులతో చేసేశావు కాదు! నువ్వులంటే యేమిటనుకుంటున్నావు? వాళ్ల తెలుగులో 'నువ్వు పప్పు'!"

"వీళ్ల తెలుగు మంటెట్టా! మా యింటి దగ్గర్లో, నా చిన్నప్పుడు తెలుకులవాళ్లు జల్లెడలా చిల్లులుపొడిచిన డ్రమ్ముల్లో నువ్వులనివేసి, నానపెట్టి, చాలా కష్టపడి పొట్టు వొలిచి, పప్పు చేసి, యెండబెట్టడం చూసేదాన్ని! అలాంటిది యెంత తేలిగ్గా నువ్వులు అని వాడేస్తున్నారు వీళ్లు!"

"అంతే కాదొదినా. మీ అన్నగారు ఈ మధ్య తన వుద్యోగానికి నువ్వులూ, నీళ్లూ వొదిలేశారుగా? అప్పుడే తెలిసింది--నువ్వులు అంటే నాకు విశదం గా!"

"ఆవునొదినా! పెద్దవాళ్ల ఆబ్దికాలకి కూడా, తర్పణాలకీ వాటికీ నువ్వులే వాడతారు. అందుకే నాకూ డౌటొచ్చింది!"

"సరే! వాళ్ల తెలుగు మంటెట్టా అన్నావుగా. అలాగేకానీ! పాయసం మాత్రం నాకు కొంచెం పంపించుమీ.....మీ అన్నగారికి!"

"అలాగే వొదినా".

Sunday, October 17, 2010

ఇదియొకరకపు

"బ్లాగ్వెఱ్ఱి"

(కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ బ్లాగ్ వ్రాయడం మొదలుపెడితే.......అనే ఆలోచనతో--ఈ సరదా రచన. యిక కొన్ని వందల అరసున్నాలు టైపు చేసే వోపికలేక, యిలాగే ప్రచురిస్తున్నాను--వుండవలసినచోట అవి వున్నాయని భావించే చదువుకోవలసిందిగా మనవి)

"యింద్రజాల మహేంద్రజాలముల ను వింటిమి. యిప్పుడిది యేమో అంతర్జాలమనుచున్నారది యంతటిదే యేమో. 

మొన్న నా నూఱవ బుట్టినరోజున నా మనుమడు నాకొక 'గణన యంత్రము ' (దీనిని యాంగ్లమున గoప్యూటరందురట) బహూకరించినాడు. దీనిద్వారా యంతర్జాలమును జేరుట జాల సులభము. అదియొక జిత్రము.

యీ యంతర్జాలములో యనేకమంది వ్రాయు రచనలను బ్లాగులందురట. నేను గూడ నొక బ్లాగును బ్రారంభించితిని. 

దీనిలో జిత్రమేమనగా, వొకడు దన బ్లాగు (యీ బ్లాగులను గొంతమంది యాంతర్యములను బేరుతో బిలచుచున్నారట) లో నొక లేఖ వ్రాయును. దానిని జదివినవారు వారి యభిప్రాయములను వ్యాఖ్యలుగాబెట్టుదురు. వీనిని వీడు జదువుకొని, బ్రతివ్యాఖనుగూడ పెట్టవచ్చును. అదియట్లుండనిండు.

వీడు యితరుల ఆంతర్యములను జదువ వచ్చును, దన వ్యాఖ్యలనందుంచవచ్చును. దానికి బ్రతి వ్యాఖ్య యేమైన వచ్చినదేమో గూడ జూచుకొనవచ్చును. యీ బ్రక్రియకోసము, సంకలినులు బ్రవేశబెట్టబడినవట. బాగుగయున్నది.

యీ సంకలినులయందు గొన్ని వ్రేల లేఖలుండవచ్చును. 

వొకడు యీ యంతర్జాలమున తన లెఖలే వ్రాయునా, వాటి మీది వ్యాఖ్యలేజూచుకొనునా, వాటికి ప్రతివ్యాఖ్యలేజేయునా.....!? యివిగాకుండ సంకలినులలోని వేనవ్రేల లేఖలనేజదువునా, వాటిపై వ్యాఖ్యానించునా, మఱల బ్రతి వ్యాఖ్యలేజదువుకొనునా.......!?...యేమో....దీనియంతుబట్టకున్నది.

అయిననూ నేనొక సులభమార్గమును గనిబెట్టితిని--

యదియేమన...సాధారణముగా లేఖలు వ్రాయువారికి యది యొక వ్యసనముగా మారును.వ్రాయువాడెవడైన దానందరికంటె బాగుగా వ్రాయుచున్నానని యనుకొనును. పాడువాడెవడైన దాను మిగతయందరికంటె బాగుగాబాడుచున్నాననియే యనుకొనును. యిది మరియొక జిత్రము. 

వీరిలోగొంతమంది రోజుకొక లేఖ వ్రాయవలెనను నియమముబెట్టుకున్నవారుందురు, గొందరు రోజునకెన్నైన వ్రాయుదునని సవాలు విసిరినయట్లు వ్రాయుదురు. మరిగొందరు యే యెండకో, వానకో నొకటి వ్రాయుదురు.

యిక బండుగులు, సెలవు దినములు, బ్రపంచ "యేదో" దినములు వచ్చినప్పుడందరునదే విషయమును గురించి వ్రాయుదురు....యిది యింకొక జిత్రము. శుభాకాంక్షలను దెలుపుకొనుట గూడ బాడియే! యింకొకనికి జాకిరేవు బెట్టుకొని, వుతికియారవేయుటే నియమము. వేరొకనికి దేవుళ్ల దేవుళ్లాటలు, వేదములు, బురాణములు, మట్టీ, మసేనము బ్రముఖముగాదోచును. మరిగొందరికిదమ బాకశాస్త్రబ్రావీణ్యము బ్రదర్శింపవలెననిపించును. 

యివియన్నియు మనముజదువక్కరలేదనుకొన్న, జదువవలసినవి వ్రేళ్లమీద లెక్కింపదగును. యిది జిత్రములలోకెల్ల జిత్రము.

యివ్విధమున నా యాంతర్యముల బఠనమును గొనసాగింప నిశ్చయించుకొంటిని. 

యిక మరియొక గల్పవృక్షమునో, గామధేనువునో వ్రాయ సంకల్పించితిని నా యాంతర్యములో. మరల గలసికొందుము. 

యితిశ్రీః"

Tuesday, October 12, 2010

మన చెవలాయిలకి.....

......"అదుర్స్" కార్డులు!

బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ వాళ్లు, వ్రేలి ముద్రలూ, చేతి ముద్రలూ, ఐరిస్ లూ లాగే "చెవులని" కూడా బయోమెట్రిక్ పధ్ధతిలో స్కాన్ చేసి, ఆయా వ్యక్తుల వివరాలని గుర్తించే విధానాన్ని రూపొందించారట! కేవలం 252 మంది చెవులని మాత్రమే పరిశీలించి, ఈ పధ్ధతి విజయవంతం అవుతుందని తేల్చేశారట!

మరింకేం! మనం కూడా ఈ "చెవోమెట్రిక్" విధానం లో కార్డులు జారీ చేసేద్దాం! 

కానీ ఇప్పటికే, రైతులకీ, చిన్న వ్యాపారులకీ, పేదలకీ, వుపాధి వాళ్లకీ, వోటర్లకీ, విద్యార్థులకీ, గిరిజనులకీ రక రకాల చెత్తా చెదార కార్డులిచ్చేశామే?! మరి కొత్త కార్డులెవరికి ఇవ్వాలి?

"అదుర్స్" కార్డుల పేరుతో మన రా నా లకి ఇచ్చేస్తే పోలా? సురక్షితం గా "మన పని" కానిచ్చుకోవచ్చు, పైగా వాళ్లు వాళ్ల జీత భత్యాలనీ, ప్రభుత్వం నించి రావలసిన బిల్లులనీ, అలవెన్సులనీ వగైరా ఈ కార్డు తో డ్రా చేసుకొని, ఆదాయ పన్ను రిటర్న్ లని యేమాత్రం శ్రమ పడకుండా సమర్పించడానికి అనుకూలంగా వుంటుంది! (ఇవన్నీ వైటే కదా--పైగా ఆడిటర్లకి ఇచ్చే ఫీజు కలిసొస్తుంది!)

ప్రభుత్వం వారూ--టెండర్లు యెప్పుడు పిలుస్తారు?

Friday, October 8, 2010

ముగ్గురు జోగులు

ఆ ముగ్గురే.....

జోగీ జోగీ రాసుకుంటే?......బూడిద రాలుతుందంటారు. ఇక్కడలా కాదు......స్కాములు రాలాయిట!

మొన్నోరోజు "పొన్నాల లక్ష్మయ్య అసమర్థ మంత్రి. అందుకే నీళ్లన్నీ సముద్రం పాలయిపోతున్నాయి" అన్నాడట రఘువీరా. 

"నువ్వు మాత్రం తక్కువా? గోదాముల్లో  ఎరువులున్నా, రైతులకి ఎదురుచూపులు తప్పడం లేదు!" అన్నాట్ట పొన్నాల.

ప్రక్కనే వున్న జూపల్లి ని "నువ్వు మహబూబ్ నగర్ జిల్లాకే మంత్రివా? రాష్ట్రానికి కూడానా?" అనడిగాడట రఘువీరా.

జూపల్లి, "నువ్వు అనంతపురానికే అమాత్యునివా? లేక రాష్ట్రానికా?" అనడిగాడట.

పొన్నాల నవ్వుతూ "దొందూ దొందే"! మంచోళ్లే దొరికారు--అన్నాడట. (దొందూ దొందే కథ గుర్తుందా?)

అవండీ మన మంత్రుల (స్కాము)జోకులు! 

Saturday, September 25, 2010

మేనేజ్ మెంట్ మరియూ......

కంప్యూటర్ వెర్రి

ఎం బీ యే--అంటే, యెంత పెద్ద వ్యాపారాన్నైనా, తన కొనగోటితో అలవోకగా నిర్వహించి పారేశేవాడు.

ఎం సీ యే--అంటే, తెల్లారి లేస్తే, పళ్లు తోముకోవడం దగ్గరనించీ కంప్యూటరు చేతే చేయించుకోగల మాయల మరాఠీ.

ఇవీ ఒకప్పటి చాలామంది అభిప్రాయాలు.

మా అమ్మాయి ఎం ఎస్ సీ (కంప్యూటర్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతూండగానే (ఆంధ్రా యూనివర్సిటీలో ఆ కోర్స్ లో వాళ్లదే మొదటి బ్యాచ్), మా ఆవిడ సతాయింపు యెక్కువై, సరే, ఇప్పటినించీ పెళ్లి సంబంధాలు చూస్తే మంచిదే కదా అని నిశ్చయించుకొని, ఈనాడు పెళ్లి పందిరిలో, త్వరలో (పెళ్లి కోసమే) ఇండియా రానున్న ఓ అమెరికా పెళ్లికొడుకు వివరాలు నచ్చి, వాళ్లిచ్చిన ఫోను నెంబరు కి చేశాను--ఓం ప్రథమం గా.

అటునించి, అబ్బాయి తండ్రి "అమ్మాయేం చేస్తూంది?" అనగానే, ఇలా ఎం ఎస్ సీ అని చెపుతున్నాను.

త్రాచుపామంత కోపం వచ్చింది ఆ పెద్దాయనకి! "మేము ఎం సీ యే గానీ, బీ టెక్ గానీ అయితేనే కాంటాక్టు చెయ్యమని చాలా క్లియర్ గా చెప్పామే?" అంటూ గై గైలాడుతుంటే, "చాలా సంతోషం! ఇకముందు కూడా అంత క్లియ్యర్ గానే వుండండి" అని ఫోను పెట్టేశాను.

(నా ఙ్ఞాపకం గా ఆ మూర్ఖుడి అడ్రెస్సూ, ఫోను నెంబరూ వగైరా మాత్రం నా డైరీలో భద్రపరచుకున్నాను!)

మా జిల్లాలో మొన్న జరిగిన ఎంబీయే, ఎంసీయే కోర్సుల ప్రవేశాలకోసం జరిగిన కౌన్సెలింగ్ చూస్తే, ఎంసీయే కి 36 కళాశాలల్లో వున్న 2150 సీట్లకీ, 10 కళాశాలల్లో పది నించి పదిహేనుమందీ, ఇంకో 16 కళాశాలల్లో ఒక్కడంటే ఒక్కడూ చేరారట. మిగిలిన 10 కళాశాలలకీ అది కూడా లేదట!

ఇక యాజమాన్యాలు తలలు పట్టుక్కూర్చున్నాయట! ఒక్కడికోసం అంతమంది టీచర్లనీ, లేబ్ లనీ యెలా మేపాలిరా భగవంతుడా! అని.

మీ ద్వారా యెవరినైనా చేరిస్తే, మీకు ఇంత కమీషన్ ఇస్తాం అని కన్సల్టెన్సీ వాళ్లని బతిమాలుతున్నారట!

ఎంబీయేల సంగతి కొంచెం మాత్రమే మెరుగుట!

మేము యూత్ గా వుండగా, సినిమాలు విడుదలైన రోజే చూసేసి, తరవాత అడిగినవాళ్లకి మా అమూల్యాభిప్రాయం వుచితం గా చెప్పేవాళ్లం. ఫ్లాప్ సినిమా ఐతే, "థియేటరు వాడు మనం వెళ్లగానే, మెడలో దండ వేసి, పేపర్ ప్లేట్లో ఓ సమోసా చేతికిచ్చి, తింటుండగానే గ్లాసుతో నీళ్లు ప్రక్కన పెట్టి, వేడి వేడి ఇరానీ టీ ఇచ్చి, అయ్యాక, రండి రండి అంటూ ఓ పది మంది మనల్ని లోపలకి తీసుకెళ్తున్నారు!" అని చెప్పేవాళ్లం.

ఇప్పుడీ కాలేజీ యజమానులు, పాతకాలం మహారాజుల లగా, చేరేవాళ్లకి "అర్థరాజ్యం, కూతురుని ఇచ్చి పెళ్లీ" కూడా ఆఫరు చేస్తారేమో ఇంక!

దటీజ్ ఎంసీయే!

Tuesday, September 21, 2010

నేను నేర్చుకున్న......

కన్నడ పాఠం

"చింతపండు అయిపోయింది....చూసుకోలేదు....వచ్చేటప్పుడు ఓ పావుకేజీ తెస్తారా?" సాయంత్రం నడకకి బయలుదేరుతున్న నన్ను వినయపూర్వకం గా ఆఙ్ఞాపించింది మా ఆవిడ ఓ రోజు.

"అదెంత భాగ్యం" అంటూ బయలుదేరాను.

మేం అనంతపురం జిల్లా, రాయదుర్గం లో వున్నప్పుడు సాయంత్రం పూట అలా బళ్లారి వెళ్లే రోడ్డుకో, ఇలా చెళ్లికెరె మీంచి బెంగుళూరు వెళ్ళే రోడ్డులోనో, ఇటు కళ్యాణదుర్గం వెళ్లే రోడ్డులోనో, ఓ మూడుకిలోలు దూరం వెళ్లి, మళ్లీ తిరిగి రావడం అలవాటు.

బాగా వెలుగుండగానే బయలుదేరి, చీకటి పడుతూండగా తిరిగి వచ్చేవాణ్ని.

మా ఇంటి ముందే వుండేది--ఓ కిరాణా-కమ్-ఫాన్సీ-కమ్-బడ్డీ కొట్టు. యెప్పుడైనా చిన్న చిన్నవి అవసరమైతే అక్కడ తీసుకొనేవాళ్లం. రాయదుర్గం లో అందరూ దాదాపు ఇంట్లో కన్నడమే మాట్లాడుకుంటారు. మహమ్మదీయులు ఉర్దూలో మాట్లాడుకుంటారు. తెలుగు మాట్లాడినా, కన్నడం కలిపే!

సరే, తిరిగి వచ్చేటప్పుడు యెంతసేపు తీసుకొని ఇంట్లోకి వెళ్లాలిలే అనుకొని, నడక సాగించాను.

నడక అయ్యాక, ఆ కొట్టు దగ్గర ఆగి, "బాబూ ఓ పావుకేజీ చింతపండు ఇవ్వు" అన్నాను. అప్పటికి చీకటిపడి, లైట్లు వెలిగించేశారు వీధి లైట్లతో సహా. 

"లైట్ హెలిగిత్తది--హిగ్గది" అన్నాడు వాడు కన్నడం లో, పైనుంచి వేళ్లాడుతున్న లైటుని చూపిస్తూ! (నాకలా వినిపించిందో!)

అంత సీరియస్ గా అంటున్నాడు, కన్నడం లో యేమైనా తిట్టాడా అని నేను అనుకుంటుంటే, మళ్లీ వాడే, "అఫ్టర్ లైట్, నో సేల్, చింతపండు!" అన్నాడు. ఆహా, రాత్రి అయితే చింతపండు అమ్మకూడదు అని వాళ్ల సెంటిమెంటు అన్నమాట అనుకొని, సరేలే అని ఇంట్లోకి చేరాను.

మా ఆవిడ చింతపండేదీ? అనడిగితే, నేను కూడా, "లైట్ హెలిగిత్తది--హిగ్గది" అన్నాను సీరియస్ గా. 

సంగతి చెప్పాక, పడీ పడీ నవ్వు! "పోనీలెండి, ఇవాళకి వుప్మాతో సరిపెట్టుకుందాం!" అంది.

అదీ మా కన్నడ పాఠం ప్రహసనం.



Friday, September 10, 2010

మన బ్యాంకులూ.......

........సెలవులూ

అదేదో సామెజ్జెప్పినట్టు, బ్యాంకు వుద్యోగులకి సెలవొచ్చిందన్న ఆనందం యేమాత్రం వుండదు.

ఇప్పుడు చూడండి--దాదాపు నెలరోజుల క్రితం నించీ, వరసగా 3 రోజులు సెలవలు వస్తున్నాయని (బ్యాంకులకి ఈ సందర్భం చాలా అరుదు), చాలా కాలం తరవాత సొంత వూళ్లకో, వేరే వూళ్లకో ప్రయాణాలు పెట్టుకొని, రిజర్వేషన్లూ గట్రా చేసుకొని, గురువారం సాయంత్రానికి బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టుకొని, పడుతూ లేస్తూ స్టేషన్ కో, బస్ కాంప్లెక్స్ కో చేరి, దారిలో యే విజయవాడకో చేరాక, ప్రభుత్వం ఓ రాత్రివేళ--శుక్రవారం (10-09-2010) సెలవు కాదు అని ప్రకటించేసింది!

అది కూడా, రాష్ట్ర ప్రభుత్వం వారు "ప్రభుత్వ కార్యాలకు సెలవు లేదు" అని ప్రకటించి వూరుకుంటారు.

ఇక బ్యాంకువాళ్లకి సంకటం మొదలు. శంఖం లో పోస్తేగానీ తీర్థం కానట్టు--ఆ సెలవుగానీ, సెలవు లేకపోవడం గానీ "నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం క్రింద" వర్తిస్తాయా లేదా--అని. 

బ్యాంకులవాళ్లు మళ్లీ ప్రత్యేకం గా ప్రభుత్వం వారిని అడిగాక,ఇంకో గంటో, రెండు గంటలో పోయాక, అప్పుడు ప్రకటిస్తారు--అసలు సంగతి!

ఇదివరకోసారి (నా 'ఓ ప్రపంచపౌరుడు ' బ్లాగులో) వ్రాశాను--ప్రస్తుతం ఈ నె. ఇ. చట్టం బ్యాంకులకి సెలవలు ప్రకటించడానికి మాత్రమే వుపయోగించబడుతోంది గానీ, వేరే యే విధం గానూ అమలు కావడం లేదు అని. అది వేరే సంగతి.

(అన్నట్టు, "ఈ నె. ఇ. చట్టం క్రింద" అనేదానికి ఈనాడు వారు తమకే తెలిసిన ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు--"ప్రైవేటు సంస్థలకు వేతనం తో కూడిన సెలవు" అని!) 

కొత్తసంవత్సరం ఇంకా రాకుండానే, వచ్చే కేలెండరు సంవత్సరం లో, యేయే రాష్ట్రాల్లో యేయే రోజులు సెలవలు అనేది ప్రభుత్వం నిర్ణయించాక, బ్యాంకులు తమ ప్రణాలికల్ని రచించుకుంటాయి. 

మరి వాటి మీద నిలబడి, 'సెలవులు యెప్పుడో ప్రకటించేశాం, ఇక మార్చం--మీరు తన్నుకు చస్తే చావండి ' అనే ధైర్యం ఈ ప్రభుత్వాలకి లేదు!

(అమ్మో! ఇంకేమైనా వుందా--మతభావాలు దెబ్బతినవూ?)

ఇక మత పెద్దలు చూడాలి--చంద్రుడు కనపడ్డాడనో, కనపడలేదు అనో, తిథి మిగులు వుంది అనో, ఇంకా
తగులుకోలేదు అనో, మా ఇమాం చెప్పాడు అనో, రాత్రి కలలో 'విఖనో మునీంద్రుడో, 'పాంచరాత్రేశ్వరుడో' కనపడి చెప్పాడు అనో--పండగల్ని ఓ రోజు ముందుకో, వెనక్కో మార్చేస్తూ వుంటారు.

అసలు ఆ చంద్రుడు ఢిల్లీలోని ఆ ఇమామ్ కే యెందుకు కనిపించాలో, కనిపించకుండా వుండాలో, ఆ మునీంద్రులో ఈశ్వరులో ఫలనా జీయరు స్వామికే యెందుకు చెప్పాలో నాకు అర్థం కాదు.

(నిజం చెపుతున్నాను--గత యాభై యేళ్లలో నేనెప్పుడూ ఈ విఖనో మునీంద్రుడో, విఖన మునీద్రుడో--వీడి పేరు యెక్కడా వినలేదు. ఈ మధ్య మాత్రం యేకం గా వాడికి విగ్రహాలు పెట్టేసి, గుడులు కట్టెయ్యడమో, వున్న గుళ్లలో ప్రతిష్ట చేసెయ్యడమో చేస్తున్నారు! అలాగే వాల్మికికీ, వ్యాస భట్టారక/మునీంద్ర/భగవాన్ కీ కూడా. ఇక ప్రతీ గుడిలోనూ మంటపాలపైనో, గోడల పైనో సప్త ఋషుల్నీ విగ్రహాలు పెట్టేస్తున్నారు--అందరికీ నెత్తిమీద పెద్ద పెద్ద చుట్టలూ, గడ్డాలూ, మీసాలూ కామను). 

అసలు మన జాతీయ వుత్సవాలు--స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధిజీ జన్మదినం--ఈ మూడింటికి మాత్రమే సెలవులు ఇచ్చి, శని ఆదివారాలు రెండూ సెలవలుగా ప్రకటించి, మిగిలిన సెలవలు అన్నీ రద్దు చేసేస్తే యెంత బాగుండును!

ఇక బ్యాంకు వుద్యోగుల పాట్ల గురించి మరోసారి. 

Monday, August 23, 2010

తెలుగు తేజాలు

కలలు కనండి

ఇక్ష్వాకుల దగ్గరనించి, శాతవాహనుల దగ్గరనించి, కృష్ణదేవరాయలు దగ్గరనించి, టంగుటూరీ, పీవీ, లేటేస్ట్ శ్రీరామ్ వరకూ యెందరో తెలుగు తేజాలు!

పాతవాళ్లకి మన కలామ్ లాంటివాళ్లెవరైనా "కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి!" అని చెప్పారో లేదో తెలియదు గానీ, శ్రీరామ్ లాంటి వాళ్లకి మాత్రం ఆయన చెప్పింది శిరోధార్యం.

అదేమిటోగానీ, మన తెలుగు వాళ్లకి వచ్చే కలలు కూడా అంత గొప్పగా వుండవేమో అనిపిస్తూంది.

దేవుడికోసం తపస్సు చేసి, ప్రత్యక్షమవగానే, "మా మేనమామ చెవుల్లో వెంట్రుకలు మొలిపించు" అని కోరుకున్నవాడు మన తెలుగువాడే!

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని "సద్వినియోగం" చెయ్యడం కూడా తెలియాలంటారు.

అందాలరాముడు సినిమాలో ముళ్లపూడివారనిపించినట్టు--"ఓ వందరూపాయలనోటుని అలా గాలిలో యెగరేసి, పెసరట్టు తెమ్మంటే తేదూ?" (ఈ డైలాగు ఇలాగే వుండకపోవచ్చు)

చెప్పొచ్చేదేమిటంటే, మన ప్రస్తుత తెలుగు తేజం కేవీపీ రామచంద్రరావు చాణక్యుడి వంటివాడయితే, జగన్ చంద్రగుప్తుడివంటివాడు కాదూ? (గాలి ని పర్వతకుడనుకోవచ్చు)

ఆ లెవెల్లో, ప్రథాన మంత్రి సీటుకి ప్రయత్నించకుండా, బోడి ముఖ్యమంత్రి యేమిటండీ?

యాత్రలవల్ల వోట్లు రాలితే, చిరంజీవి ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యేవాడుగా?

కుంచం మామూలుగా కొలవడం కుదరకపోతే, తిరగేసి కొలవమన్నారు!

తగిన వ్యూహం తో ముందుకెళితే ప్రథానమంత్రి పదవి ఓ లెఖ్ఖలోది కాదు--మన పీవీ, సోనియా చూపిన మార్గాలెలాగూ వున్నాయి! 

అప్పుడు అన్ని రాష్ట్రాలవాళ్లూ ముఖ్యమంత్రి పదవులకోసం మన కాళ్ల ముందరే పడి వుంటారు కదా?

చిన్న సమస్య యేమిటంటే, ప్రత్యర్థి రాహుల్ ని యెదిరించాలంటే, అంతర్జాతీయ ఇటాలియన్ కనెక్షన్ తో పెట్టుకోవాలి.

మనకి రస్ అల్ ఖైమాలూ, మారిషస్ కనెక్షన్లూ వున్నాయి కదా! అదెంతపని.

జగన్! ఆలోచించు! 2014 కల్లా జగన్ ని ప్రథాన మంత్రిని చెయ్యాలి అనే ఆశయంతో ముందుకు సాగడమే మా వంతు అని తమ అనుచరులుతో అనిపిస్తే యెలావుంటుందో!

శుభస్య శీఘ్రం!

Saturday, July 3, 2010

కుక్కపిల్ల

మా 'జిమ్మీ' కథ

(శ్రీ పంతుల జోగారావు గారి సాలూరు 'టామీ' కథ చదివాక)

మా తమ్ముడు యెనిమిదో క్లాసులో వుండగా, శంకర్, చోటూ అని ఇద్దరన్నదమ్ములు మా నాన్నగారిదగ్గర చదువుకోడానికి వచ్చేవారు. శంకర్ యేడో క్లాసులో, సన్నగా, కొంచెం పొడుగు అనిపించేలా వుండేవాడు. చోటూ అయిదో క్లాసులో, బొద్దుగా, గుండులా వుండేవాడు. సాయంత్రం వచ్చి, చదువుకొని, రాత్రి మా యింట్లోనే ఆరుబయటో, వీధి గది లోనో పడుకొని, పొద్దున్నే వెళ్ళేవారు. వీళ్ళిద్దరినీ మా మామగారు సరదాగా 'లవకుశులు ' అనేవారు.

కథేమిటంటే, ఓ కుక్కపిల్ల (టామీ లో సగం వుంటుందేమో) రోజూ వాళ్ళు చదువుకుంటున్నంతసేపూ ఓ ప్రక్కన పడుకొని, వాళ్ళనే చూస్తూ వుండేది. తరవాత, వాళ్ళు పడుకొన్నప్పుడు రాత్రి యెప్పుడో వాళ్ళిద్దరి మధ్యనీ వెచ్చగా పడుకొనేసేది! రోజూ ఇదే తతంగం అవడం తో, మా తమ్ముడితో సహా వాళ్ళిద్దరూ--జిమ్మీని (ఈ పేరు ఇప్పుడే నేను పెట్టాను) యెలా వదిలించుకోవాలా? అని తీవ్రం గా ఆలోచించి, కార్యాచరణలోకి దిగారు.

మొదట, దాన్ని ఓ చేతి సంచీలో మూటకట్టి, ఓ కిలోమీటరు దూరం మోసుకెళ్ళి, పెద్దకాలవ గట్టున సంచీలోంచి బయటికి తీసి, వదిలిపెట్టి, వచ్చేశారు.

మర్నాడు, ఓ గోనె సంచీలో పెట్టి, మోసుకెళ్ళి, మళ్ళీ నిన్నటి చోటుకి ఇంకొంచెం దూరం లో, సంచీ పళంగా వదిలేసి వచ్చేశారు.

ఆ మర్నాడు, దీని పని ఇలా కాదు అనుకుంటూ, పెద్దకాలవమీద బల్లకట్టు యెక్కి, అవతలి వొడ్డుకి చేరి, అక్కడనించీ ఓ వంద అడుగులు వెళ్ళి, నిర్జన ప్రదేశం లో వదిలేసి వచ్చేశారు.

ఆ మర్నాడు, 'దీనికీ కాలవ రూటు బాగా తెలిసి పోయింది. పైగా అడుగుజాడల వాసన పసికట్టి తిరిగి వచ్చేస్తోంది ' అని తీవ్రం గా ఆలోచించి, సైకిలు మీద మూడు కిలోమీటర్లు ప్రయాణించి, రైల్వే స్టేషన్ చేరి, బయలుదేరబోతున్న గుంటూరు పాసింజెరు బండిలో యెక్కి, దాన్ని ఓ పెట్టెలో వదిలేసి, బండి కదిలే ముందు దానిక్కనపడకుండా దిగి వచ్చేశారు!

ఓ రెండు మూడు రోజుల తరవాత, 'చీ చీ! అది పాసింజెరు బండి కదా! స్లోగా వెళుతుంది. ఈ సారి......' అనుకొని, మళ్ళీ హైదరాబాదు ఎక్స్ ప్రెస్ లో వదిలేసి వచ్చేశారు!

చిత్రమేమిటంటే, కాలవ దగ్గరా అక్కడా వదిలేసినప్పుడు, వాళ్ళకంటే ముందుగానే, అడ్డదారిలో ఇల్లు చేరేది!

రైళ్ళలో వదిలితే, ఆ మర్నాడో, రెండురోజులకో మళ్ళీ ఇంటికి చేరేది!

చివరాఖరికి, ఓ రోజున దాన్ని సంచీలో మూటకట్టి, తాడు గట్టిగా బిగించి, హైదరాబాదు రైల్లో, పది కిలోమీటర్లు ప్రయాణించి, దాన్ని ఓ సీటు క్రింద వదిలేసి, పాలకొల్లు లో దిగిపోయి, మళ్ళీ తిరిగి వచ్చే రైలు లో వాళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి పది అయ్యింది!

మా అమ్మ 'యెందుకురా దాన్ని అలా హింస పెడతారు?' అని రోజూ తిట్లు. ఆ రోజునైతే, ఇంట్లో అందరూ వాళ్ళని తెగ తిట్టేశాము.

కానీ, ఆ జిమ్మీ మళ్ళీ తిరిగి రాలేదు! యేమయిపోయిందో ఇప్పటివరకూ తెలియదు!

అదండీ సంగతి!

Friday, July 2, 2010

అందరికీ పెద్ద డబ్బా

పరస్పర డబ్బా

"ఆడ వాళ్ళు"--'ఆడ' అంటే మన సినీ రచయితలూ, దర్శకులూ ఇచ్చిన నిర్వచనం--'ఈడ' (పుట్టింట్లో) కాదు, 'ఆడ' (అత్తింట్లో) అని.

కానీ నా అనుమానం, 'ఆడ' అంటే 'వంటిల్లు' అనే అర్థం యెక్కడైనా వుందేమోనని! (యే సూర్యారాయాంథ్ర నిఘంటువులోనో ఈ అర్థం దొరక్కపోదు)

యెందుకంటున్నానంటే, బ్లాగుల్లోకూడా వంటల గోలే!

(ఓ యాభై యేళ్ళ క్రితం మాలతీ చందూర్ వ్రాసిన వంటలూ, పిండి వంటలూ దగ్గర నించీ, భానుమతి వ్రాసిన వంటల నించి, ప్రతీ పత్రికలోనూ, టీవీ ఛానెల్లోనూ వస్తున్న 'రుచి-అభిరుచి', 'మీ ఇంట మా వంట', 'మా వూరి వంట' వరకూ ఇవే వంటలు)


అన్నట్టు 'అవడా మామిడికాయలతో' యేమి వంటలు చెయ్యచ్చో మీకెవరికైనా తెలుసా?

యేనుగుల-వడ చెట్లుంటాయని వాటికి కాయలుంటాయని తెలుసా?


దీనికి తోడు, ఓ పాప్యులర్ దినపత్రిక ఓ రోజు 'బ్లాగుల్లో షడ్రుచులు' అనో, యేదో వ్రాస్తే, ఇక పరస్పర డబ్బాలు.

నాలాంటివాడు యేదో ఓ వ్యాఖ్య వ్రాస్తే, ఓ 'తెల్లారిలేస్తే తరవాత ముద్ద గురించి ఆలోచించేవాడో యెవడో' ఈయనకి ఇక్కడేమి పని? అని ప్రశ్నిస్తాడు!

ఇదేమి చోద్యమో?

'ఆడవాళ్ళూ--వంటింట్లోంచి, పూలూ, మొక్కలూ, మొగుళ్ళ డబ్బాలు కొట్టడాలూ--వీటినించి బయటికి రండి! మీకు పోయేదేమీలేదు--........తప్ప!'

(డేష్ లో యేమిటో మీరే పూరించుకోండి)

==>ఇది కేవలం సరదాకోసం వ్రాసినదే తప్ప, అమ్మల్ని, అమ్మాయిల్నీ నిందించడానికి కాదు. గమనించి, దాడి చెయ్యకండి!

చేసినా మరేం ఫర్వాలేదు--నా సోదరులే నాకు రక్ష.

Wednesday, June 23, 2010

పూర్వ వైభవాలు

"మాతాతలూ............

......నేతులు తాగారు!"

(ఇప్పుడు మా మూతులు వాసన చూడకండి!)

యెందుకంటే, మేమూ నేతులు తాగాం మరి!

యేదైనా కార్యం జరిగితే, వూరి బ్రహ్మణ్యానికంతా పిలుపులు వెళ్ళేవి--భోజనాలకి రమ్మని. 

కనీసం రెండు మూడు పిలుపులు వచ్చేవి--అసలు పిలుపు కాకుండా--'మడి కట్టుకోమన్నారండి ' అనీ, 'విస్తర్లు వేసేశారండి '  అనీ, 'వడ్డనలు అయ్యాయి ' అనీ!

ఆ పిలుపు తరవాత, పట్టు పంచెలు కట్టుకొని, మరచెంబుల్లో నీళ్ళు నింపుకొని, చెప్పులు లేకుండా నడుచుకుంటూ, భోజనాలకి బయలుదేరేవాళ్ళు.

కనీసం రెండు చెంచాల నెయ్యి అభికరించాక, పరిషేచన చేసి, యెడమ చేతి మధ్యవేలితో ఉదకం ముట్టుకున్నాక, ఓ పెద్దాయన 'భోజన కాలే, గోవింద నామ స్మరణా--గోవిందా' అనగానే, అందరూ 'గోవింద ' అని, విస్తర్లో కాస్త అన్నం ముందుకు జరుపుకొని, ముద్దపప్పు అందులో వేసుకోగానే, పెద్ద నేతి జారీ చెంబులతో వడ్డన బ్రాహ్మలు ప్రత్యక్షం--ప్రతీవాళ్ళూ 'వెయ్యండి ' అంటూంటే, 'లోపలికి పుచ్చుకోండి ' అని పుడిషిటి నిండా నెయ్యి పోసేవారు. తరవాత పప్పూ అన్నం లోకీ, ముందుకి తీసుకోగా మిగిలిన అన్నం రాశి లోకీ, ధారగా నెయ్యి వడ్డించేవారు.

అదే కాకుండా ప్రతీ ఆధరువూ కలపడం మొదలెట్టగానే, మళ్ళీ నేతి జారీలతో వడ్డనే! 

కూరలూ, పచ్చళ్ళూ అయ్యాక, ఇక పిండివంటల వంతు--పులిహోర, గారెలూ, బూరెలూ, పరవాణ్ణం--మారు వడ్డనకి వచ్చి, మళ్ళీ జారీలతో నెయ్యి వడ్డించేవారు. 'నెమ్మదిగా కూచోండి--ఇంకా అపరాహ్ణం కాలేదు ' అంటూ, కావలసినంత సమయం ఇచ్చేవారు. మధ్యలో ఇంకో పెద్దాయన, 'భోజన మధ్యకాలే గోవింద నామ స్మరణా--గోవిందా' అనడం మిగిలినవాళ్ళు 'గోవింద ' అనడం.

పిండి వంటలయ్యాక, ఇక 'ధప్పళం' (పులుసు), చారు. మళ్ళీ నెయ్యి! (అప్పటిదాకా మరచెంబుల్లో మడినీళ్ళు తాగేవాళ్ళు, ఇక మడి అక్కర్లేదనుకుంటా--మిగిలిన నీళ్ళని హోస్టు పెట్టిన అరలీటరు పట్టే కంచు, ఇత్తడి గ్లాసుల్లో పోసేసుకొని, చెంబుల్ని పిండివంటలతో నింపేసుకొనేవారు--నెయ్యితో సహా!)

తరవాత మజ్జిగ, కలుపుకోడానికీ, నోట్లోకి పుచ్చుకోడానికి, అయిపోయాక గ్లాసులో వేరే తాగడానికి!

మళ్ళీ, ఓ పెద్దాయన 'భోజనానంతరే గోవింద నామ స్మరణా--గోవిందా' అనగానే, అందరూ 'గోవింద ' అని వుత్తరాపోశన పట్టి, బంతిలో అందరూ ఒకేసారి లేవాలి.

తరవాత, తాంబూల సేవనం, 'అన్నదాతా సుఖీభవ ' అని నిష్క్రమించడం--ఇళ్ళకి చేరేసరికి--సాయంత్రం మూడు!

మరి ఇప్పుడో? 

(అది మరోసారి!)



Friday, May 7, 2010

అవకరాలు

నత్తి

నన్నన్నన్నన్నత్తి అంటే.....

మా...మా...మా...మాటలని....

సలిగ్గా....

అదేంటీ.....బల్కలేపోవడం!

ఇవి 'నత్తి' అని వ్యవహరించే అవకరం లో కొన్ని వెరైటీలు.

ఇది వరకు కొక్కొండ వెంకట రత్నం పంతులు కీ, బహుశా గిడుగు రామ్మూర్తి పంతులికీ అనుకుంటా--ఒకళ్ళ సాహిత్య పంథా ఒకళ్ళకి నచ్చక, పత్రికల్లో వ్యాసాలు వ్రాసుకొనేవారట!

అది యెంతవరకూ వెళ్ళిందంటే, ఓ నాటకం లో ఓ నత్తి పాత్రని ప్రవేశపెట్టి, ఇంకో పాత్ర చేత 'నీ పేరేంట్రా?' అని అడిగించి, నత్తి పాత్ర చేత, 'కొ..క్కొండ వెంకడండీ!' అని చెప్పించేవరకూ!

నిజానికి, చాలామంది, చాలా మాటలు స్పష్టం గా పలకలేరు. అది యే భాషైనా. 

మనకి కాస్త వినోదం అనిపించినా, మనం కూడా అప్రయత్నం గా వాళ్ళ భాషలోనే మాట్లాడతాం.

చిన్న పిల్లల విషయం లోనైతే, వాళ్ళముద్దు ముద్దు మాటల్ని మనం అలాగే అనుకరిస్తాం!

ఓ హిందీ ఆవిడ వాళ్ళ పక్క పోర్షన్ లో వున్న తెలుగావిడని అడిగిందట--"మీరు మొన్న చాలాసేపు 'పపో....తాలందీ' అనే మాట చాలా సార్లు అన్నారు! దాని అర్థం యేమిటండీ?" అని అడిగిందట.

పాపం ఆ తెలుగావిడకి, యెప్పుడూ ఆ మాట వినలేదే--నేను అన్ని సార్లు ఆ మాట వాడానా! అని ఆశ్చర్యం అయ్యిందట.

మళ్ళీ ఆ హిందీ ఆవిడే సహాయ పడిందట. "మీ పాపా, మీరూ పకపకా నవ్వారు చాలా సేపు!" అని చెప్పి.

అప్పుడు తెలుగావిడకి గుర్తుకొచ్చిందట--వాళ్ళ మూడేళ్ళ పాపని కిటికీలో నిలబెడితే, ఆ పాప తన చిన్నెల్లో భాగం గా, ఓ కాలు క్రిందకి వేస్తూంటే, ఆవిడా 'ఒద్దండీ! పడిపోతారండీ' అనడానికి, 'పప్పోతాలందీ' అని అందట!

అదీ సంగతి.

1979 లో మేం మొదటిసారి బొంబాయి (ప్రస్తుతం ముంబై) వెళ్ళినప్పుడు, మాకు బట్టలుతుక్కునే ప్లాస్టిక్ బ్రష్ అవసరమై, షాపుల్లో అడుగుతూ పోతుంటే, షాపు వాళ్ళు 'కట్లెరీ కీ దూకాన్ మే మిల్తా హై' అనేవారు. సరే, ఇంకా కొన్ని ప్లాస్టిక్ సామానుల షాపుల్లో అడుగుతూ పోతుంటే, యెవరూ తెలీదనే అంటున్నారు. ఓ షాపువాడు, 'కప్డే ధోనేకీ బ్రష్' అని అడిగితే, "ఓ....ఆప్ కో 'బురూస్' చాహియే!" అని వెంటనే తీసిచ్చాడు!

అలాగే, ఓ ఫోన్ నెంబరు అవసరమై, హోటెల్ రిసెప్షన్ లో యువతిని 'ఫోన్ డైరెక్టరీ ఓ సారిస్తారా?' అనడిగితే, ఆవిడకి అర్థం కాలేదు! మా పక్కనున్న మా స్నేహితుడు, దొందూ దొందే అన్నట్టు--చేతి వేళ్ళని లావైన పుస్తకాన్ని సూచించేంత వెడల్పు గా పెట్టి, 'ఫోన్ బుక్ ప్లీజ్...ఫోన్ బుక్!' అన్నాడు. (ఆ రోజుల్లో బొంబాయి టెలిఫోన్ డైరెక్టరీ అంటే, 'బాట్లిబాయ్' ఎకౌంటెన్సీ టెక్స్ ట్ కన్నా లావుగా వుండేది!) ఆ అమ్మాయి (బహుశా గోవన్ అయి వుంటుంది) ఆశ్చర్యం గా '....ఫోన్...బూక్?...' అంది. కొంచెం వెలిగినట్టుంది--'యూ మీన్ ఫోన్ డిరెక్టొరీ?' అనడిగింది. 

నేను వెంటనే, అమెరికన్ ఏక్సెంట్ లో, 'యా! ద టెలిఫోన్ డిరెక్టోరీ' అనగానే, మనోహరం గా నవ్వుతూ, అది నా చేతుల్లో పెట్టింది!

మా రూం బాయ్ ని 'చిప్స్' తెమ్మంటే, వాడు గ్రీకో, లాటినో విన్నట్టు ముఖం పెట్టేవాడు. వాడికి వివరణ ఇస్తూ, 'పొటాటో చిప్స్--ఇలా వుంటాయి--' అని వివరిస్తే, వాడు 'ఓ! బటటా చిప్స్? అభీ లావూంగా!' అని వెళ్ళిపోయాడు.

మా అత్తగారి వూరులో, ఓ పదేళ్ళ అమ్మాయి 'అమ్మా! పప్పువుల్లాతి' అనేది! ఆ మాట తప్పితే, ఇంకో మాట రాదు పాపం!

మా ఆడపిల్లలెవరైనా కొంచెం నంగి గా వుంటే, మేం 'పప్పు వుల్లాతి లా వున్నావు!' అని యేడిపిస్తాం.

రేలంగి నించి, బాల కృష్ణ, కేవీ చలం, రాజ బాబు--బ్రహ్మానందం దాకా, ఇలాంటి హాస్య పాత్రలు వేసినవాళ్ళే!

కానీ, ఇలాంటి అవకరం వున్నవాళ్ళని, ఓ రకం వికలాంగులని (ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారిప్పుడు!) అనుకరించి, హాస్యం పిండుకోవడం ఓ రకం గా అమానుషత్వమే!

కదూ?

Wednesday, May 5, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-4

మేం అక్కడ వుండగానే, మా చిన్న మామయ్య వాళ్ళ ఆవుకి ఓ దూడ పుట్టింది. పూర్తిగా కాషాయరంగులో, యెక్కడా మచ్చలేకుండా, ముద్దొస్తూ వుండేది అది. చెంగు చెంగున పరిగెడుతూ మాతో బలే ఆడేది. అప్పుడు మేం నేర్చుకున్న ఇంకో కొత్తమాట--'తువ్వాయి!'

ఆ వూళ్ళోనే, 'పురెల గాదెలూ', 'వరల గాదెలూ' మొదటిసారి చూసి తెలుసుకున్నాము.

మా చిన్న మామయ్యకి ఓ సవారీ బండి వుండేది. ఓ రోజు ఆ బండి కట్టించి, మమ్మల్ని మా చిన్న దొడ్డ వుండే వూరు (అక్కణ్ణించి ఓ పదిహేను కిలో మీటర్లుంటుందనుకుంటా) పంపించారు. ఆ దారి లోనే మేము 'పల్లకీ బొంగు'లున్న వెదురు పొదల్ని చూసింది!

ఆ బండి తోలిన అబ్బాయి మా నాన్నతో మాట్లాడుతూండగా, మేం విన్న మరో కొత్త మాట 'కాబోలు బాకీలు.' అప్పట్లో అర్థం తెలియకపోయినా, అదో వింత మాటగా గుర్తుంచుకుని, తరవాత విరిగిగా వాడేసేవాళ్ళం.

ఆ రోజు రాత్రి కూడా మా దొడ్డా వాళ్ళింట్లో వుండి, మర్నాడు పొద్దున్న బయల్దేరి, మా అమ్మమ్మగారి వూరు వచ్చేశాం.

వాళ్ళ వూరికో ప్రత్యేకత వుండేది. వూళ్ళో ఓ 30; 40 ఇళ్ళుండేవి. అన్నీ తాటాకు పైకప్పు వున్న ఇళ్ళే. దాని పైన గడ్డి పరిపించేవారు. మా తాతగారిదే రాళ్ళ పునాదులతో, ఇటుకలతో కట్టిన ఇల్లు. మిగిలినవన్నీ మట్టి ఇళ్ళే. పై కప్పు క్రింద, గోడల లెవెల్ వరకూ ఓ మేదరి తడికో, వెదురు తడికో బిగించి, దాన్ని మట్టి తో మెత్తేవారు. పైకి యేమైనా చేర్చడానికి మనిషి పట్టే ఓ కన్నం వుంచేవారు. దానికో వెదురో, చెక్కో నిచ్చెన వుండేది. తడిక పై భాగాన్ని 'మిద్దె' అని వ్యవహరించేవారు.

ప్రత్యేకత యేమిటంటే, ప్రతీ సంవత్సరం వేసంకాలం లో ఆ వూళ్ళో ఇళ్ళన్నీ 'పరశురామ ప్రీతి' అయిపోయేవి!

కొన్ని సార్లయితే, సంవత్సరం లో రెండు, మూడు సార్లు కూడా ఇళ్ళన్నీ అగ్నికి ఆహుతి అయ్యేవి!

'ఆ సూరప్ప లంజె (వెనకింటావిడో, పక్కింటావిడో) జీడిగింజలు కాల్చుకొని, కుంపటి ఆర్పి, మిద్ది మీద పెట్టేసిందటే! నిప్పు మళ్ళీ రాజుకొని, ఇళ్ళన్నీ తగలబడ్డాయి!' అనేది మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చేసి!

మా పెద్ద మామయ్య అప్పటికే తన వుద్యోగ రీత్యా రాజమండ్రి లో వుండేవాడు. (అప్పటికి ఆయనకి ఓ మునిసిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడుగా వుద్యోగం అయ్యింది). చిన్న మామయ్య తన సొంత ఇంట్లో వుండేవాడు అదే వూళ్ళో. అమ్మమ్మ ఒక్కతే ఆ యింట్లో వుండేది. కొన్నాళ్ళకి మా చిన్న మామయ్య ఆ యింటికి మళ్ళీ తన పొలం లోంచి తాటి పట్టెలూ, తాటాకులూ, కొబ్బరాకులూ, గడ్డీ తో పై కప్పు వేయించి, ఓ కార్డు ముక్క వ్రాసేవాడు. మళ్ళీ ఈవిడ ప్రయాణం తన సొంత ఇంటికి!    

తరవాత మా చిన్న మామయ్యకి కూడా ఆ వూరికి రెండు కిలో మీటర్ల దూరం లో ఓ పల్లెలో ప్రాధమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా వుద్యోగం రావడం, దాంతో పాటు ఆయనని ఆ వూరి పోస్ట్ మాస్టర్ గా నియమించడం తో, ఆయన ఆ వూళ్ళో ఓ ఇల్లు కట్టుకొని, అక్కడికి మారి పోయారు.

ఆక్కడనించి, మా అమ్మగారి ఇల్లు యేమయిందో, యెవరు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారో యెవరికీ తెలియదు! 

--ఇంకొన్ని గుర్తు తెచ్చుకొని, మరోసారి.

Monday, April 26, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-3

ఆవిడ చిన్నప్పుడు బడులు లేవు--కనుక చదువు ప్రసక్తే లేదు. అయినా చదవడం, వుత్తరం వ్రాయడం నేర్చుకొంది.

అలాగే భగవద్గీత, సుందరకాండ లాంటివి చదివేసేది!

ఆవిడకి ఆ పాండిత్యం యెక్కడనించి వచ్చిందోగానీ, యెవరిదైనా ఇంటిపేరు చెప్పగానే, వాళ్ళ శాఖా, గోత్రం, ఋషులూ అన్నీ చెప్పేసేది. (18 మందీ, 23 మందీ ఋషులు కూడా వున్న గోత్రాలు వున్నాయట!)

ఆవిడ ఇంకో లక్షణం యేమిటి అంటే, కళ్ళు అంతగా స్పష్టం గా కనపడని దశ వచ్చినా, కనపడిన కాయితాన్ని, అది యేదైనా, కూడబలుక్కుని చదవకుండా వదిలేది కాదు! ఇతరభాషా పదాలు తెలుగు లిపిలో వుంటే, 'ఇదేభాషరా?' అని అడిగేది!

ఒక్కొక్కప్పుడు, గది వూడ్చి, తుక్కు యెత్తడానికి ఓ కాయితం సంపాదించి, ఆ కాయితం లో యేమి ప్రింటు చేసి వుందో చదువుతూ కూర్చొని, తుక్కు సంగతి కాసేపు మరిచిపోయేది!

తనకి తెలుసున్నవాళ్ళందరివీ జన్మ నక్షత్రాలు, వాళ్ళు పుట్టిన తెలుగు సంవత్సరాలతో సహా గుర్తుండేవి!

తమాషా యేమిటంటే, మేము 'అమ్మమ్మా! నీదే నక్షత్రం?' అని అడిగితే, 'నేనూ--పితూరీషా నక్షత్రయుక్త సరీసృప లగ్న పుష్కరాంశ లో పుట్టానురా!' అనేది! నిజం మాత్రం యెప్పుడూ చెప్పలేదు!

మేము ఎలిమెంట్రీ స్కూల్లో వుండగా, ఓ సారి వాళ్ళ వూరు వెళ్ళాము.

ఆ వూళ్ళో 'ధర్మారం మేష్టారు' అనే ఆయన వీధి బడి వుండేది. మా మేనమామ కొడుకు అప్పుడు అక్కడే చదువుకొనేవాడు.

ఆ బడి పుణ్యమా అని, కొన్ని కొత్త, వింత అనిపించే పదాలు నేర్చుకొని, నవ్వుకొనేవాళ్ళం.

యెవరింటినించి అయినా ఓ 'బరకం' పట్టుకెళ్ళాలి రోజూ--బళ్ళో పిల్లలు కూర్చొనేందుకు--మేష్టారింటి అరుగు మీద.

అరుగు నిండిపోయి, ఆలస్యం గా బడికి వచ్చేవాళ్ళు యెవరి 'చదర' వాళ్ళు తెచ్చుకోవాలి.

పొద్దున్న బడి అయిపోగానే, 'యాల గంజి' కి ఇంటికి వచ్చి, మళ్ళీ రెండో పూట బడికి వెళ్ళాలి.

--ఇంకొన్ని గుర్తు తెచ్చుకొని, మరోసారి.

Monday, April 12, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-2

మా అమ్మకి ఓ పదేళ్ళు వచ్చేసరికి, వాళ్ళ అమ్మమ్మ (ఆవిడపేరు నాకు గుర్తులేదు) కి 60 యేళ్ళు వుండేవట. అప్పటికే ఆమెకి మతిస్థిమితం తప్పిందట. ఆవిడకి 13 మంది సంతానం!

సరదాకి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మని 'నీకెంత మంది సంతానం?' అనడిగితే, వ్రేళ్ళతో లెఖ్ఖ ప్రారంభించి, "పెద్దబ్బీ, చిన్నబ్బీ, నారాయుడూ (మా అమ్మమ్మ), దద్ద, సోదెమ్మ......మళ్ళీ పెద్దబ్బీ, చిన్నబ్బీ...."ఇలా వ్రేళ్ళన్నీ అయిపోయినా ఆవిడ లెఖ్ఖ తేలేది కాదట!

ఈ "దద్ద" మా అమ్మ మేనమామ. దాదాపు 8 1/2 అడుగుల పైగా పొడవూ, 4 1/2 అడుగుల కైవారం వుండి, 24 కుంచాల ధాన్యాన్ని బస్తాలో భుజం పై నరేంద్రపురం నించి (రాజమండ్రి--కోరుకొండ--కోటి కేసరం దారిలో వుండేది) మోసుకు వెళ్ళి, రాజానగరం లో మిల్లు ఆడించి, బియ్యం బస్తాతో తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరేవాడట--నడుచుకుంటూ!

నిన్న మొన్న, మా ఆవిడ 'బియ్యం అయిపోతున్నాయి, తెప్పించండి' అంటే, మా దగ్గరలో వున్న షావుకారుకి ఫోనుచేసి, బియ్యం రేటు యెలా వుంది అనడిగితే, 'సోనా మసూరి బస్తా 850/- వుందండి' అన్నాడు. అబ్బా! కేజీ 8-50 కి తగ్గిందే! అని ఆశ్చర్యపోయి, ఓ పది కేజీలు పంపించమంటే, 340/- రూపాయలు బిల్లు వేశాడు! (బస్తా అంటే ఇప్పుడు లెక్క 25 కేజీలు అని ఆ తరవాత నాకు తెలిసింది!)

సరే.............వాళ్ళమ్మ వాళ్ళ సంగతి అలా వుంచితే, మా అమ్మమ్మ..........భలే చిన్నెలు చేసేది. 

ఆవిడ వొంటిమీద చిన్నమెత్తు బంగారం కూడా వుండేది కాదు! (వుంటే ఆవిడ జీవితం యెలా వుండేదో!)

కొడుకుల ఇంట్లో వున్నా, కూతురు ఇంట్లో వున్నా, కొన్ని బియ్యం అమ్మేసి, ఓ బేడ డబ్బులు (అంటే పాత 24 పైసలు) జాగ్రత్త పెట్టుకొనేది--తన శిరో ముండనం ఖర్చుకి! ఇంకో యెర్రకాణీయో (అంటే 3 పాత పైసలు) యెంతో యెక్కువగానే జాగ్రత్తపెట్టుకొనేది!

కొడుకు ఇంట్లోంచి వచ్చేటప్పుడు, వాళ్ళ ఇంట్లో వున్న ఇత్తడి గిన్నెల్లో "పి కొం" అని చెక్కివున్న (పిరాట్ల కొండయ్య--ఆవిడ భర్త పేరు) గిన్నె ఒకటి సంగ్రహించి, సంచీలో వేసుకొని, పైన తన సైను పంచెలు కప్పెట్టి, బస్సులో వచ్చేసేది. తీరా బస్సు దిగేటప్పుడు, ఆ సంచీ మరిచిపోయి, దిగిపోయేది!

వాళ్ళ ఇంట్లో, దొంగతనం ఆరోపణ, ఫలితం దక్కకపోవడం!

ఇదీ ఆవిడ స్థితి!

(పాపం--ఆ కాణీ మాత్రం నాకే ఇచ్చేది--యేదైనా కొనుక్కోరా! అంటూ)

--మళ్ళీ ఇంకోసారి.

Sunday, April 4, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ

పిరాట్ల సత్యనారాయణమ్మ!

ఆవిడతో నా తొలి ఙ్ఞాపకం--మా అమ్మకి నా తరవాత మా చెల్లెలు పుట్టినప్పుడు ఆ పాపకి స్నానం చేయించి, యెర్రని గౌను తొడిగి, జల్లెడలో గుడ్డ పరిచి పడుకోబెట్టి, 'చూడరా నీ చెల్లెల్ని--ముండ యెంత ముద్దొస్తూందో!' అనడం.

మా తాతగారు పిరాట్ల కొండయ్యగారు మా అమ్మ చిన్నప్పుడే, పెళ్ళి కాకముందే పోయారట.

వాళ్ళకి ఇద్దరు కొడుకులూ, నలుగురు కూతుళ్ళూ. మా అమ్మ మూడోది.

మా అమ్మమ్మకి కోడళ్ళతో పడేది కాదు--కొడుకుల్నీ వాళ్ళనీ కలిపి తిడుతూండేది. 

అలాని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మానేది కాదు! యేడాదికి మహా అయితే ఓ నెల పెద్దకొడుకుదగ్గరా, ఓ నెల చిన్న కొడుకుదగ్గరా వుండి, వాళ్ళతో తగువాడి, 'మా నరిసిమ్మూర్తి (మా నాన్న) వున్నాడు--నాక్కొడుక్కన్నా యెక్కువ ' అంటూ మా యింటికి వచ్చేసేది. 

మా చెల్లెలు పుట్టాక మా నాన్నగారు ఓ తాటాకిల్లు కొనుక్కొని, అద్దె యింట్లోంచి సొంత యింట్లోకి మారారు. రెండుపక్కలా దాదాపు ఐదున్నర అడుగుల యెత్తు మట్టి అరుగులూ, మధ్యలో అడుగున్నర యెత్తు 5 మెట్లూ, సిం హ ద్వారం తరవాత ఓ హాలు, యెడంపక్కన పడగ్గదీ, వెనుక వసారా లోకి పడగ్గది లోంచి ఒకటి, హాలు లోంచి ఒకటీ గుమ్మాలూ, వాటికి క్రిందకి మెట్లూ....ఆ వసారాయే సగం వంట గదీ, సగం భోజనాల గదీ, వెనక్కాల కావలసినంత పెరడూ, వెనకాల వుమ్మడి బావీ! ఇంటి ముందు కూడా స్థలం వుండేది.

మా అన్నకీ, నాకూ, చెల్లెలికీ మూడేసి యేళ్ళ యెడం. అప్పుడు నాకు నాలుగు దాటి అయిదు వచ్చాయి. అన్నయ్య ఒక్కడే స్కూలుకి వెళుతున్నాడు.

మా అమ్మమ్మ రాత్రుళ్ళు నన్ను తన పక్కన పడుకోమని, 'అచ్యుతం, కేశవం, నారాయణం, నమః కృష్ణ, దామోదరం, శ్రీధరం....' ఇలా స్త్రోత్రం చదివించి నిద్రపుచ్చేది.

అందులో నాకు గుర్తున్న కొన్ని భాగాలు--'దశరథనందన లోకగురో, రావణమర్దన రామనమో, భక్తంతే, పరిపాలయమాం, నామ స్మరణ, ధన్యోపాయం, నహిపశ్యామం, భవహరణే, రామ హరే, కృష్ణహరే, తవనామ వదాను సదాను మతే!'

(ఈ స్తోత్రం యెవరికైనా పూర్తిగా గుర్తుంటే, అది ప్రచురిస్తే సంతోషిస్తాను.)

ఇంకా 'చుంచు దువ్వి పింఛం కడుదురా--గోపాల కృష్ణా--పంచదార పాలు పోతురా' లాంటి పాటలు నేర్పేది. భయం వేస్తోందంటే, ఆంజనేయ దండకం పఠింప చేసేది. 

"శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్య కాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహంపవిత్రం, భజేహం, భజేహం, భజేహం. సాయంత్రమున్నీనామ సంకీర్తనల్జేసితే, పాపముల్ బాసునో, భయములున్ దీరునో, భాగ్యముల్గలుగునో, ఓ వానరాకార, ఓ వర్థగంభీర, ఓ పుణ్య సంచార, నీవేసమస్తమున్.........శాకినీ ఢాకినీ పిశాచమ్ములన్, గాలి దయ్యంబులన్ నీదు వాలంబునంజుట్టి, నేలంబడంగొట్టి...... నమస్తే, నమస్తే, నమః!"

(అంటూ సాగే ఆ దండకాన్ని కూడా పూర్తిగా చెప్పగలవాళ్ళు యెవరైనా ప్రచురిస్తే ఇంకా సంతోషిస్తాను--పుస్తకాల షాపుల్లో కూడా హనుమాన్ చాలీసా లభిస్తోందిగానీ, ఈ దండకం దొరకడంలేదు.)

మా ముగ్గురికీ ఓ పెద్ద కంచం లో 'చల్ది వణ్ణం' పెట్టేది మా అమ్మమ్మ. (అది ఆవిడ పరిభాష! అప్పటికే ఆవిడ వయస్సు దాదాపు 60-65 మధ్య)

రాత్రి యెక్కువ అన్నం మిగలకపోతే, ప్రత్యేకం గా చల్ది వణ్ణాల కోసం మళ్ళీ వండి వార్చేది. 

పెద్ద కంచం లో అన్నం మూడు, నాలుగు కరుళ్ళుగా వడ్డించి, ఆవిడ అరచేతినిండా పచ్చడి (కందిపప్పో, శెనగపప్పో, గోంగూరో, వుసిరికాయో, చింతకాయో, నిమ్మకాయో, ఆవకాయో, మాగాయో, తొక్కుపచ్చడో--ఇంకా చాలా!) పట్టుకొని, చాకచక్యం గా తన బొటన, చూపుడు వ్రేళ్ళతో నిమ్మకాయంత గోళీ చేసి రడీగా వుండేది. అన్నయ్య 
'పచ్చడి' అనగానే, ఆ గోళీని కంచంలో వేసేది. అన్నయ్య వెంటనే 'నూని' అంటే, అప్పటికే నూనె గిన్నె పట్టుకుని, చెంచాలో నూనెతో రడీగా వున్న ఆవిడ, 'బోడిగుండుమీద వెయ్యమంటావా? వెధవా! కలపండిరా!' అని విసుక్కొనేది!

కలుపుకొని ముగ్గురం ఆబగా తినేయ్యగానే, మళ్ళీ అన్నం వడ్డించి, 'ఇప్పుడేమిటి?' అనేది. 

అన్నయ్య 'పచ్చడి' అనగానే (అప్పటిదాకా ఆ పచ్చడి ఆవిడ అరచేతిలోనే వుండేది) మళ్ళీ వ్రేళ్ళతో ఓ గోళీకాయంత పచ్చడి 'ఊఁ' అంటూ కంచంలో పడేసేది. కావలసినంత అన్నం కలిపి, 'ఇంకొంచెం పచ్చడి' అనగానే, ఇంకో చిన్న గోళీకాయంత పచ్చడి మళ్ళీ 'ఊఁ'. మళ్ళీ 'ఇంకొంచెం పచ్చడి' అంటే, మరో బుల్లి గోళీకాయంత పడేసి, మళ్ళీ 'ఊఁ'!--ఇలా ఓ అరగంట సాగేది ఆ కార్యక్రమం.

--మళ్ళీ ఇంకోసారి.

Tuesday, March 16, 2010

సాహిత్యం

కథలు

కథ; కవిత; నాటిక; గల్పిక; నాటకం; నవల; కావ్యం--ఇలా సాహిత్యం లో అనేక ప్రక్రియలు.

వీటిలో మొదటిది కథ.

దీని ఉపరూపాలు--కధ; ఖద; ఖత; కత; కద--ఇలాంటివి.

వుదాహరణకి, కధ--అంటే బరువైన ఇతివృత్తం కలిగినది.

ఖద అంటే, విషాదం తో కూడిన ఫ్లాష్ బ్యాక్.

కత అంటే, అబధ్ధం! 'కతల్సెప్పమాక!' అనేది రావుగోపాలరావు మేనరిజం!  

కద అంటే, ఓ సామాన్య కథనం! చప్పగా, పేలవం గా వుంటుందన్నమాట.

ఇక ఖత అంటే--చదివే, వినే వాళ్ళని ఖతం చేసేదాకా వదలదన్నమాట!

ప్రతీ మనిషికీ--ఆడైనా, మగైనా--వెనకో కథ వుంటుంది.  దాన్ని కొంతమంది చెపుతారు, కొంతమంది చెప్పరు. 

చెప్పేవాళ్ళు చెప్పే విధానం లో అవి వివిధ రూపాలు సంతరించుకుంటాయి--కద, కత.....ఇలాగ.

సాధారణం గా ఆత్మకథలు (ఆటో బయోగ్రఫీ) వ్రాసేవాళ్ళు అబధ్ధాలు వ్రాయరు. ఇంకొకరి ఆత్మకథ (బయోగ్రఫీ) వ్రాసేవాళ్ళు మాత్రం, వాళ్ళ జీవితాల్లోని గొప్ప విషయాలనే వ్రాస్తారు.

ఇక భార్యా భర్తల మధ్య నడిచే కతలు చాలా వుంటాయి.

నిజజీవితం లోంచే సాహిత్యం పుట్టుకొస్తుంది.

అవునా, కాదా?

Sunday, March 7, 2010

పడుకొని ఆడే ఆటల్లో......


ఛాంపియన్ షిప్

ఈ టోర్నమెంట్ లో ప్రపంచ ఛాంపియన్ శ్రీ ప్రకాష్ 'పడుకొని ' కూడా ఆడే అవకాశం వుంది!

ఓ ఇరవై/పాతికేళ్ళక్రితం, ప్రకాష్ పదుకొణె ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ గా వుండగా, ఒక టోర్నమెంట్ నిర్వాహకుల ప్రకటన ఇది--పేపర్లలో వచ్చింది!

Sunday, January 17, 2010

ప్రెడికమెంట్


ఆశీర్వాదాలు!


84 యేళ్ళ ఒకాయన--ప్రభుత్వం లో మంచి వుద్యోగం చేసి, పదవీ విరమణచేసి, 24 యేళ్ళు అయ్యింది. 


ఆయన సుమారు యెత్తుగా (పొట్టిగానే) వుంటారు. సాక్స్ లేకుండ రెయిన్ బూట్లు, పొడుగు లాగు, దానిమీద పంచెకట్టు, అఫీషియల్ లాల్చీలాంటి చొక్కా (కఫ్ లింక్స్ తో), మెడచుట్టూ కండువా (ఒకే రంగు అంచు--అత్తా కోడళ్ళంచు కాదు), నుదుట విభూతి పుండ్రాలు, మధ్యలో కుంకం బొట్టు (గంధం బొట్టుమీద కాదుస్మీ!), చేతిలో ఒక ప్లాస్టిక్ బస్తాలాంటి, పర్సులాంటి ఫోల్డరూ, బ్రాహ్మణ తేజస్సు వుట్టిపడుతూ--వస్తారు మా బ్యాంకుకి.  


ఓ 35 యేళ్ళ క్రితం మా బ్యాంకు బ్రాంచి ప్రారంభించినప్పుడు, మొట్టమొదటి ఖాతాదారుగా, సేవింగ్స్ బ్యాంకు ఎక్కౌంట్ నంబరు '1' ఆయనదే!  


ఆయనకి ఆ గౌరవం యెప్పుడూ ఇస్తూవుంటుంది మా బ్యాంక్; బ్రాంచీ! ఖాతాదారుల సమావేశామైనా, కొత్త 'ప్రొడక్ట్ లాంచింగ్' అయినా, యేదైనా ప్రారంభించాలన్నా, ఆయన చేతుల మీదుగానే!  


ఆయన ఈ బ్రాంచిలో ఖాతా పెట్టిన ఆరునెల్లకి, నేను కేషియర్ గా ఈ బ్రాంచికి వచ్చాను. నా వయస్సు 23 యేళ్ళు. ఆయన వయస్సు 49 యేళ్ళు!  


ఆయన బ్యాంకుకి రాగానే, అందరికీ చేతులుజోడించి, 'నమస్కారం' అంటూ వచ్చేవారు! మేనేజరుతోసహా అందరూ ప్రతి నమస్కారం చేసేవారు--చేతులు జోడించి.  


నేను మాత్రం, ఆయన నా ముందు చేతులు జోడించగానే, 'పెద్దవారు! నాకు చేతులు జోడించితే నాకు ఆయుక్షీణం!' అంటూ ఆయన చేతుల్ని విడదీసి, కాళ్ళకి నమస్కరించేవాడిని--ఆయన--'అయ్యో!' అంటూండగా.  


ఇప్పుడు ఆయన వయస్సు--చెప్పానుగా--84 యేళ్ళు! నా వయసు--58 యేళ్ళు! ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి--ఆయన రెటైర్ అయిపోయినా, మా బ్రాంచికి ముఖ్యమైన 'కస్టమర్ '! నేను ఈ బ్రాంచిలో వుద్యోగిని!  


ఆయన అన్నీ ఆలోచించుకొని, ఇంటిలో ప్రాక్టిసు చేసుకొని మరీ వస్తారు మా బ్రాంచికి!  


జ్యోతిబాసు లెవల్లో, మా పేటకే పెద్దాయన ఆయన!  


లోపలికి రాగానే, ముందు నేనే వుంటాను--నా సీటులో! ఆయన చేతులుజోడించి, 'నమస్కారం' అంటే, నాది స్టాండర్డ్ డైలాగు!  


అందుకని, ఆయన ప్రవేశిస్తూనే, "ఆశీర్వచనాలు! ఆశీర్వచనాలు!" అంటూ వస్తారు--కానీ, ఆయన చేతులు జోడించే వుంటాయి మరి!  


ఈ 'ప్రెడికమెంట్' గురించి మీరేమంటారు?

Friday, January 15, 2010

కీప్ వాచింగ్........



సాగేశ్న నిత్య నారాయణ యాజు


"ఇక నా రేపటి 'క్షుద్ర రహస్యాలు '--387 వ ఎపిసోడ్ లో  


'నిశాచరులకి నిమ్మకాయలంటే ఇష్టమా? భయమా'?  


తప్పక చూడండి!"

Friday, January 8, 2010

రికార్డు


'అన్నీస్' రికార్డు


నా ప్రశ్నలకి సమాధానం:-  


1. 'తదితరులు'  


2. 'మున్నగువారు'  


3. 'మొ. వారు'  


వీళ్ళు నటించని సినిమాగానీ, పాల్గొనని ఫంక్షన్ గానీ ఇప్పటివరకూ ప్రపంచం లో లేదు!  


అంతెందుకు--ఎలక్షన్లలో ఫలితాన్ని ప్రభావితం చేసేది కూడా వీళ్ళే!




Thursday, January 7, 2010

రికార్డు



'అన్నీస్' రికార్డు


ఈ ప్రపంచం లో ఇప్పటివరకూ తీసిన 'అన్ని సినిమాలలో' నటించినవారు, ప్రతీ దేశం లో, ప్రతీ మీటింగులో, ప్రతీ ఫంక్షన్ లో పాలుగొన్నవాళ్ళు--అత్యధికం గా--యెవరు?  


1, 2, 3 ఇలా రేటింగులు ఇవ్వండి............!


O kay?