Monday, April 13, 2009

కబుర్లు

“మా తమ్ముడు ఇండియాలోనే పుడతానని అమ్మతో చెప్పాడట! అందుకని అమ్మని ఇక్కడకి తీసుకొచ్చేశాను” నాలుగో యేడు నడుస్తున్న మా మనవడు మా వూరు రాగానే అన్న డైలాగు ఇది! సరే, వాడికి తమ్ముడు పుట్టేశాడు, వాడికి మూడునెలలూ నిండాయి! బారసాలకి వాళ్ళ నాన్న వచ్చాడు—అమెరికా నించి. ఈ లోగా మనకి ఎలక్షన్లూ వచ్చాయి! వాళ్ళ నాన్న దగ్గర తన రాజకీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు! “నాన్నా! నాన్నా! ముందు రాశ్శేఖర్రెడ్డి ‘అతను చంద్రబాబు కాదు—దొంగబాబు!’ అన్నాడు నాన్నా” అన్నాడు చక్కగా ఇమిటేట్ చేస్తూ! “అలాగా!” అన్నాడు వాళ్ళ నాన్న. “తరవాత, చంద్రబాబు ‘వాడిది జలయజ్ఞం కాదు! ధన యజ్ఞం! దోపిడీ యజ్ఞం’ అన్నాడు.” “అలాగా!” “తరవాత, చిరంజీవి రాశ్శేఖర్రెడ్డిని ‘టక్కు టమార’ అన్నాడు” “అలాగా!” ‘తరవాత, కేసీఆర్ రాశ్శేఖర్రెడ్డిని ‘గోల్ మాల్ గాడు’ అన్నాడు” “అలాగా!” “అంతకు ముందు నించీ, రాశ్శేఖర్రెడ్డి బాల కృష్ణనీ, చిరంజీవినీ, ‘రాజకీయాలంటే తొడగొట్టడం, మీసాలు మెలేయడం కాదు’ అంటున్నాడు” “అలాగా!” “రోజాయేమో, రాశ్శేఖర్రెడ్డి ‘గాలిలో ముద్దులు విసిరి వోటర్లనీ, ముఖ్యం గా గాళ్స్ నీ అవమానిస్తున్నాడు’ అంది” “ఒరే బాబూ—నీకిప్పుడే ఇంత రాజకీయం వంటబట్టిందంటే……….ఇక వద్దురా బాబూ! మల్లీ అట్లాంటా పారిపోదాం వెంటనే!” అన్నాడు వాళ్ళ నాన్న ఫైనల్ గా! అదండీ సంగతి!