Sunday, June 28, 2009

'శ్రీ శ్రీ శ్రీ........

......శ్రీ పీతన్న!
రానే వచ్చారు—చెయ్యెత్తుమనిషి, ఒడ్డుకుతగ్గ లావు, పూర్తి బట్టతలా, వెనక చుట్టూ తెల్లని జుట్టూ, విశాలమైన నుదుటిమీద పట్టెవర్ధనాలూ, తెల్లని లాల్చీ, పెద్దంచు చేనేత లుంగీ, భుజమ్మీద వేళ్ళాడే సంచీ, మందపాటి టైరుచెప్పులూ—లాల్చీ విప్పితే లోపల సైనుగుడ్డతో కుట్టించిన కబ్బా (చేతుల్లేని బనియను)—ఇదీ ఆయన ఆహార్యం!
మామూలుగానే మర్యాదలు జరుగుతున్నాయి—మూడు పూటలా—ఫలహారాలతో సహా!
‘ఒరే కృష్ణుడూ—గురువుగారి పేరే పెట్టాడు నీకు మీ నాన్న’—అని నన్ను ముద్దు చేశేవాడు!
స్నానానికి వెళ్ళి, మా పిల్ల కాలవలో నీళ్ళ మీద తేలుతూ ఓ అరగంట శవాసనం వేస్తే, జనాలందరూ విచిత్రంగా చూసి, గట్టు మీదనించే దణ్ణం పెట్టుకొని వెళ్ళిపోయేవారు!
ఓ వారం గడిచింది—భూదేవిలాంటి మా అమ్మకీ కాస్త సహనం తగ్గింది—ఇంకెన్నాళ్ళు వుంటాడో ఈయన? ఓ పక్క సంబారాలు చూసుకోవాలి, ఓ పక్క చాకిరీ—యెలాగో లాక్కురావాలి—అనుకొంటోంది!
అనుకోకుండా తన నోటినించి వచ్చేసింది ‘పీతన్నగారి స్నానం అయిందేమో చూడరా’ అని!
అప్పటిదాకా ‘శ్రీ పీతాంబరధరుడు గారు’ అనలేక చచ్చేవాళ్ళం—ఇప్పుడు నాకు హుషారు— ‘పీతన్నగారు! పీతన్నగారు!’ అంటూ హుషారుగా పరిగెట్టాను—పిల్లకాలవ వంతెనమీదకి!
ఇంకో వారం గడిచింది—నెలాఖరు! మా భూదేవి సహనం భూకంపానికి కొంచెం తక్కువగా వుంది—వెచ్చాలన్నీ మా ఇంటిపక్క వెంకటస్వామి కొట్లో అరువు తేవలసి వస్తోంది, కూరగాయలు, నెయ్యి వగైరా తెచ్చే అమ్మిలకి, ‘ఫస్ట్ కి ఇస్తాన్లే’ అని చెప్పాల్సి వస్తోంది—వీటికితోడు కొంత నీరసం!
యేమాటకామాటే చెప్పుకోవాలి—ఆయన వచ్చిన రోజు యెలా జరిపించిందో, ఈ రోజున కూడా అలాగే జరిపిస్తోంది—చిన్నమెత్తు లోటు కూడా జరగకుండా! ఆయన్ని ‘ఒరే’ అనేంత చనువూ యేర్పడింది—నిజం గా అనకపోయినా!
ఆఖరికి ఆ రోజు అననే అంది నాతో ‘ఒరే! పీతిగాడి స్నానం అయ్యిందో లేదో చూడరా!’ అని!
యెదురుగా వున్న మా నాన్న, కళ్ళెర్రజేస్తూనే ఫక్కున నవ్వారు! నేను ‘పీతిగాడు! పీతిగాడు!’ అని గెంతుకుంటూ వెళుతూంటే!
ఆ రోజు భోజనాలు అవుతూండగా, మా నాన్న, ‘అయ్యా! గురువుగారు భీమడోలులో రేపటినించీ వుపన్యాసాలిస్తారు కదా! నేను రావడానికి కుదరడంలేదు! రేపో, యెల్లుండో వస్తాను. ముందుగా మీరు వెళితే బాగుంటుంది కదా?’ అన్నారు.
పీతన్నగారికి కోపం యేమైనా వచ్చిందో లేదో ఆయన ముఖ కవళికలనించి మాకేమీ తెలియలేదు గానీ, ఆ సాయంత్రం, ‘ఇక నేను వెళ్ళి వస్తానోయ్!’ అనగానే మేమందరం మనసులోనే ‘హమ్మయ్య’ అనుకున్నాము!
(ఇది మా అమ్మ నా చిన్నప్పుడు యెక్కడో చదివి వినిపించిన ఉదంతమే! నిజం గా మా యింట్లో జరిగింది కాదు! హాస్యానికి ఇలా అన్వయించాను!)

Saturday, June 27, 2009

'శ్రీ శ్రీ శ్రీ......

శ్రీ పీతాంబరధరుడు!
మా నాన్నగారు ఆధ్యాత్మికం గా అనేక పురాణాలూ అవీ చదివి, సంస్కృతం లో వాటి గురించి ఆలోచించేవారు! ఆయనకో ‘గురువుగారు ’ వుండేవారు.
ఆయనకోసం ఆయన ‘ఆధ్యాత్మిక స్నేహితులు‘ అంటే గురువుగారి ఉపన్యాసాలకి వచ్చేవాళ్ళు, ఆయన మిగతా శిష్యులూ—ఇలా అన్న మాట!—అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూండేవాళ్ళు!
పాపం మా పిచ్చి అమ్మ, అలాంటివాళ్ళు యెవరైనా ఇంటికి రాగానే, అత్యంత భక్తితో, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి, తుడుచుకోడానికి తుండుగుడ్డ ఇచ్చి, అరుగుమీద పడక కుర్చీ వేసి కూర్చోబెట్టి, త్రాగడానికి మంచి తీర్థం ఇచ్చి, ‘పది నిమిషాల్లో వంట అయి పోతుంది—ఈలోపల కాస్త చల్ల ఇమ్మంటారా?’ అని అడిగి, పెద్దగ్లాసునిండా చల్లని చల్ల అందించి, వంటింట్లో జొరబడేది, విసురుకోడానికి ఓ విసినికర్ర ఇచ్చి!
సరిగ్గా అయిదు నిమిషాల్లో మళ్ళీ వచ్చి, ‘వడ్డించేస్తాను—మీరు మడి కట్టుకోండి—నూతిదగ్గర స్నానం చేసినా సరే, లేదా పక్కనే కాలవ వుంది అక్కడైనా సరే!’ అనగానే, ఒకాయన ‘ఇంకా ఆకలి లేదమ్మా, కాలవకే వెళతాను’ అని వెళ్ళి, కాసేపు ఈతకొట్టి, ఆసనాలు వేసి, అనుష్ఠానాలు పూర్తి చేసుకొని వచ్చి, పీట మీద కూర్చొని, చక్కగా మారు అడిగి మరీ వడ్డింపించుకొని, తృప్తిగా తిని, చెయ్యి కడిగి, అమ్మ ఇచ్చిన తాంబూలం వేసుకొని, అలవాటు లేకపోతే, వక్కపొడి చాలమ్మా అని, మళ్ళీ అరుగు మీద మడత మంచం మీద చేరేవారు!
నాన్న స్కూలు నించి వచ్చాక, ఆధ్యాత్మిక చర్చల్లో రాత్రి అయిపోతే, మల్లీ రాత్రి కూడా భోజనాలు చేసి, ‘పొద్దున్నే ఫస్టు బస్సుకి వెళ్ళిపోతానోయ్!’ అంటూ ఆరుబయట నిద్రపోయేవారు!
(ఆయనెప్పుడు లేచాడో, యెప్పుడు వెళ్ళిపోయేడో మాకు తెలిసేది కాదు!)
అలాంటి రోజుల్లో, ఒక రోజు కబురు వచ్చింది ‘శ్రీ పీతాంబరధరుడు గారు వస్తున్నారు!’ అని! --
(ఇంకా వుంది)

Thursday, June 25, 2009

మా ఆస్థాన 'మంత్రి '

నా అయిదోయేడు నడుస్తున్న మనవడు (అట్లాంటావాడు) మొన్న ఓ జోక్ పేల్చాడు!
నేను మామూలుగా మా ఆస్థాన 'మంత్రి ' చేత గడ్డం గొరిగించుకొని, అలవాటుగా చెయ్యి పైకెత్తాను, మా మంత్రి 'చంక ' గొరిగేస్తున్నాడు!
యక్కడనించి చూశాడో నా మనవడు, వాళ్ళమ్మతో అంటున్నాడు, "అమ్మా! బుద్ధీష్ తాత తన 'చంకలో కూడా గుండు' చేయించుకుంటాడా?" అని!
మరి ఇలాంటి ఊహలు ఈ జనరేషన్ కి యెలా వస్తున్నాయో!

Sunday, June 7, 2009

పావలా వడ్డీకి…..

బంగ్లా బృందం ప్రశంస!
స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా—ల గురించి వినే వుంటారు—తన గురించి తను వాయించుకునే డబ్బా—స్వడబ్బా; ఇతరుల గురించి వాయించే డబ్బా—పర డబ్బా; ఒకరినిగురించి ఇంకొకరు వాయించుకునే డబ్బా—పరస్పర డబ్బా! బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ అనే ఆయన, మహిళా సంఘాలకి, ఇతర సంఘాలకీ, ‘మైక్రో ఫైనాన్సింగ్’ పేర తక్కువ వడ్డీ ఋణాలని అందించే ప్రయోగాలు చేసి, యేకంగా నోబెల్ ప్రైజు కొట్టేశాడు! అప్పుడు మనదేశం వాళ్ళు వెళ్ళి, ఆ విధానాలని అధ్యయనం చేసి వచ్చి, వాడికి డబ్బా కొట్టారు! ఇప్పుడు వారి వంతు! వారు వచ్చి, వట్టి వసంత్ కుమార్ ని కలిసి, గ్రామ సంఘాలూ, మండల సమాఖ్యలూ, స్వయం సహాయ సంఘాలూ చాల చక్కగా పావలా వడ్డీ ని ఉపయోగించుకుంటున్నాయి—అని ప్రశంసల జల్లు అనే డబ్బా కొట్టేశారట! ఈ పరస్పర డబ్బ యెంత బాగుందో కదూ!