Wednesday, June 23, 2010

పూర్వ వైభవాలు

"మాతాతలూ............

......నేతులు తాగారు!"

(ఇప్పుడు మా మూతులు వాసన చూడకండి!)

యెందుకంటే, మేమూ నేతులు తాగాం మరి!

యేదైనా కార్యం జరిగితే, వూరి బ్రహ్మణ్యానికంతా పిలుపులు వెళ్ళేవి--భోజనాలకి రమ్మని. 

కనీసం రెండు మూడు పిలుపులు వచ్చేవి--అసలు పిలుపు కాకుండా--'మడి కట్టుకోమన్నారండి ' అనీ, 'విస్తర్లు వేసేశారండి '  అనీ, 'వడ్డనలు అయ్యాయి ' అనీ!

ఆ పిలుపు తరవాత, పట్టు పంచెలు కట్టుకొని, మరచెంబుల్లో నీళ్ళు నింపుకొని, చెప్పులు లేకుండా నడుచుకుంటూ, భోజనాలకి బయలుదేరేవాళ్ళు.

కనీసం రెండు చెంచాల నెయ్యి అభికరించాక, పరిషేచన చేసి, యెడమ చేతి మధ్యవేలితో ఉదకం ముట్టుకున్నాక, ఓ పెద్దాయన 'భోజన కాలే, గోవింద నామ స్మరణా--గోవిందా' అనగానే, అందరూ 'గోవింద ' అని, విస్తర్లో కాస్త అన్నం ముందుకు జరుపుకొని, ముద్దపప్పు అందులో వేసుకోగానే, పెద్ద నేతి జారీ చెంబులతో వడ్డన బ్రాహ్మలు ప్రత్యక్షం--ప్రతీవాళ్ళూ 'వెయ్యండి ' అంటూంటే, 'లోపలికి పుచ్చుకోండి ' అని పుడిషిటి నిండా నెయ్యి పోసేవారు. తరవాత పప్పూ అన్నం లోకీ, ముందుకి తీసుకోగా మిగిలిన అన్నం రాశి లోకీ, ధారగా నెయ్యి వడ్డించేవారు.

అదే కాకుండా ప్రతీ ఆధరువూ కలపడం మొదలెట్టగానే, మళ్ళీ నేతి జారీలతో వడ్డనే! 

కూరలూ, పచ్చళ్ళూ అయ్యాక, ఇక పిండివంటల వంతు--పులిహోర, గారెలూ, బూరెలూ, పరవాణ్ణం--మారు వడ్డనకి వచ్చి, మళ్ళీ జారీలతో నెయ్యి వడ్డించేవారు. 'నెమ్మదిగా కూచోండి--ఇంకా అపరాహ్ణం కాలేదు ' అంటూ, కావలసినంత సమయం ఇచ్చేవారు. మధ్యలో ఇంకో పెద్దాయన, 'భోజన మధ్యకాలే గోవింద నామ స్మరణా--గోవిందా' అనడం మిగిలినవాళ్ళు 'గోవింద ' అనడం.

పిండి వంటలయ్యాక, ఇక 'ధప్పళం' (పులుసు), చారు. మళ్ళీ నెయ్యి! (అప్పటిదాకా మరచెంబుల్లో మడినీళ్ళు తాగేవాళ్ళు, ఇక మడి అక్కర్లేదనుకుంటా--మిగిలిన నీళ్ళని హోస్టు పెట్టిన అరలీటరు పట్టే కంచు, ఇత్తడి గ్లాసుల్లో పోసేసుకొని, చెంబుల్ని పిండివంటలతో నింపేసుకొనేవారు--నెయ్యితో సహా!)

తరవాత మజ్జిగ, కలుపుకోడానికీ, నోట్లోకి పుచ్చుకోడానికి, అయిపోయాక గ్లాసులో వేరే తాగడానికి!

మళ్ళీ, ఓ పెద్దాయన 'భోజనానంతరే గోవింద నామ స్మరణా--గోవిందా' అనగానే, అందరూ 'గోవింద ' అని వుత్తరాపోశన పట్టి, బంతిలో అందరూ ఒకేసారి లేవాలి.

తరవాత, తాంబూల సేవనం, 'అన్నదాతా సుఖీభవ ' అని నిష్క్రమించడం--ఇళ్ళకి చేరేసరికి--సాయంత్రం మూడు!

మరి ఇప్పుడో? 

(అది మరోసారి!)