Monday, May 30, 2011

"మంత్రాలూ......



......చింతకాయలూ!"

నేను తఱచూ నా టపాల్లో ప్రస్తావించే మా తెలుగు మేష్టారు (పేరి వారు) వ్యంగ్యంగా, "మంతరాలకి సింతకాయలు రాల్తాయేటి?" అని, మళ్లీ తనే "మర్రాలవేటి?" అని, "వొరే అప్రాచ్యులూ! మంత్రాలకి చింతకాయలేకాదు.....కొబ్బరికాయలూ, బుర్రకాయలూ కూడా రాల్తాయి....జాగ్రత్త!" అని కోపగించేవారు.

అఫ్ కోర్స్....ఆయన మంత్రాలూ, అనుష్టానాలూ, నమ్మకాలూ, దీక్షలూ ఆయనవి.

ఈ మధ్య, "ఓం! .......య విద్మహే! .....య ధీమహి! తన్నో/థన్నో/దన్నో/ధన్నో/తన్నః/ధన్నః ........ప్రచోదయాత్" అనే ఓ మంత్రాన్ని తరచూ వింటున్నాము.

వుదాహరణకి ".....వేంకటేశా......శ్రీనివాసా......విష్ణుః......" పెట్టుకోండి పై డేష్ లలో!

ఇలా, ".....మాతృదేవతా.......తలుపులమ్మా.....పార్వతీ దేవ్యః....." అంటూ, యే దేవీ దేవతలకైనా వాడేస్తున్నారు.

మొన్న సాయిబాబాని సమాధి చేస్తున్నప్పుడు, చుట్టూ కర్టెన్లు క్రిందికి లాగేసి, గంటన్నర పాటు "ఓం సాయి దేవాయ విద్మహే....సత్యదేవాయ ధీమహి, 'తన్నః సర్వః' ప్రచోదయాత్!" అంటూనేవున్నారు సాయిసేవాదళ్ వలంటీర్లు. (సత్య, సాయి పేర్లూ అటూ ఇటూ అయ్యాయేమో సరిదిద్దుకోండి అవసరమైతే!)

మరి ఇదేమి మంత్రం? దీని వ్యుత్పత్తి యెక్కడా? యెవరు మొట్టమొదట ప్రవచించారు? దాని అనుష్టాన విథానాలేమిటి? యే వేదంలో, వుపనిషత్తులో, పురాణంలో వుంది?....లాంటి తన ప్రశ్నలకి సరైన జవాబు ఇచ్చినవాళ్లకి "అర్థ రాజ్యమూ, తన కూతుర్నిచ్చి పెళ్లీ" అనీ, అలా చెప్పలేకపోతే, "శిరచ్చేదం చేసి" కోటగుమ్మానికి వ్రేళ్లాడగడతాననీ ప్రకటించేశాడు మా కొండె.....పెసిగాడు అనబడే ప్రసాద్ గాడు. 

(వాడి రాజ్యం గురించీ, కూతురి గురించే ఇప్పుడే చెప్పేకన్నా, మీ తలకాయలు భద్రంగా చూసుకోండి అని హెచ్చరిస్తూ, వాటి వివరాలు "రేపు చెపుతాను" అని కోటగోడమీద వ్రాస్తున్నా!)

ప్రయత్నించండి మరి!

Friday, May 20, 2011

వేణ్నీళ్లకి చన్నీళ్లు.....



......అనబడే పాట్లు

పెద్ద పెద్ద జీతాలు తీసుకొంటూ, పదవీ విరమణ చేశాక, "పింఛను" అనే వేణ్నీళ్లకి "ఇంకో జీతం" అనే చన్నీళ్లు తోడవుతాయంటూ కక్కుర్తి వుద్యోగాలు చేస్తున్నవాళ్ల పాట్లని చూస్తే, నవ్వు రావడమే కాదు....పగవాళ్లకి కూడా వద్దురా బాబూ....అనిపిస్తోంది.

మా వూళ్లో వేదాంతం వెంకట సుబ్బయ్య అని ఒకాయన వుండేవాడు. వార్డు కౌన్సిలరు దగ్గరనించీ--దేశాధ్యక్షుడిదాకా అన్ని యెన్నికల్లోనూ నామినేషన్ వేసేవాడు ఇండిపెండెంట్ గా. 

తన సైకిలు కడ్డీ మీద కొన్ని పాత న్యూస్ పేపర్లు వ్రేళ్లాడేసి, అవి పడిపోకుండా ఓ తాడు కట్టి, ఓ చిన్న నిచ్చెనని ఓ ప్రక్క తగిలించుకొని, ఓ వాడేసిన పందుంపుల్లా, కాస్త నీలిమందూ, ఓ గిన్నెలో మైదా జిగురూ, ఓ హరికేన్ లాంతరూ పట్టుకొని బయలుదేరేవాడు. తనకి ముఖ్యం అనిపించిన సెంటర్లలో ఆగి, న్యూస్ పేపరు మీద నీళ్లలో తడిపిన నీలిమందులో పందుంపుల్ల ముంచి, "ఫలానా గుర్తుకే మీ వోటు" అని వ్రాసి, నిచ్చెన వేసుకొని, సినిమా వాల్ పోస్టరుల క్రిందో, ప్రక్కనో మైదా జిగురుతో అంటించి, అక్కడ మీటింగు పెట్టేవాడు. ఓ రేకు గొట్టం--పాత న్యూస్ రీళ్లలోనూ, బొలో స్వతంత్ర భారత్ కీ అనేవాళ్లు వుపయోగించిందీ--మూతి పట్టేంత వెడల్పు వుండి, తరవాత సన్నగా వుండి, పోనుపోనూ వెడల్పుగా ఓ 18 అంగుళాలు పొడవుండే గొట్టం--లోంచి మాట్లాడుతూ తనకి వోటు వెయ్యమని అభ్యర్థించేవాడు.

(ఆయన యెప్పుడూ నెగ్గలేదు, డిపాజిట్ దక్కించుకోలేదు అని వేరే చెప్పఖ్ఖర్లేదుగా? కానీ "ప్రజాస్వామ్యం మీద" ఆయనకి అంత నమ్మకం మరి!)

ఇంక, ప్రత్యేక ఆంధ్ర రాష్ ట్రోద్యమం లో, మా నరసాపురం మునిసిపాలిటీకి "రాబోయే యెన్నికల్లో కాబోయే ఛైర్మన్" గా తన పదవికి రాజీనామా ఇచ్చిన కొవ్వలి అయ్యన్న నాయుడి గురించి ఇదివరకోసారి వ్రాశాను. (తరవాత ఓసారి అసెంబ్లీ యెన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, ప్రథాన పార్టీల ప్రత్యర్థులకి షాకులమీద షాకులిచ్చాడు--కౌంటింగ్ పూర్తయ్యేదాకా.)

తాత-మనవడు, స్వర్గం-నరకం, పాలూ-నీళ్లూ లాంటి జంట పదాలతో దా నా రా వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. అవన్నీ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో, తన వెరయిటీ ట్రీట్మెంటూ, సింబాలిజాలతో, జనాలకి తెగ నచ్చేశాయి. మేఘం లో తన పేరు వేసుకోవడం కూడా అప్పట్లో ఓ వెరయిటీ! తరవాత కొన్ని "కళా ఖండాలు" కూడా తీశాడు--మేక...సారీ...మేఘ సందేశం; ప్రేమాభి.....ప్రేమకి పట్టాభి.....ఇలా!

కడుపులో చల్ల కదలకుండా వున్న చిరంజీవిని ముఖ్య మంత్రిని చెయ్యకపోగా, ముక్కు వూడిన మంత్రిని చేశాడు. ఇప్పుడు బాల కృష్ణ మీద పడ్డాడు. ఆయనేమౌతాడో మరి!

ఇవన్నీ యెందుకు గుర్తు వస్తున్నాయంటే, కాలేజీల ప్రిన్సిపాల్ లగానూ, లెక్చరర్లగానూ పని చేసి, యూజీసీ స్కేళ్లతో యాభయ్యేసివేల రూపాయల జీతాలతో పదవీ విరమణ చేసినవారు, "వేణ్నీళ్లకి చన్నీళ్లు" అంటూ ప్రైవేటు కాలేజీలలో కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ లు, సూపర్వైజర్లు గా, నెలకి 3 నుంచి ఫదివేల రూపాయలకి కుదురుకొంటున్నారు--బాగానే వుంది.

ఇప్పుడు వాళ్లని, వేసవి సెలవల్లో మీకు జీతం కావాలంటే, రాత్రి వేళల్లో మన కాలేజీ పబ్లిసిటీకి వాల్ పోస్టర్లు అంటించండి అనీ, పగలు యెండలో, డోర్ టు డోర్ తిరిగి, విద్యార్థులని మన కాలేజీలో చేర్పించండి అనీ వుత్తర్వులు జారీ చేస్తున్నారట!

సంచీ లాభం చిల్లు తీర్చిందని, యెంత బాగున్నాయో--వేణ్నీళ్లూ, చన్నీళ్లూ--పాలూ, నీళ్లూ--!

(ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో "లైఫ్ సర్టిఫికెట్ కమ్ నాన్ రీ-ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్" మాత్రం చిరునవ్వుతో సంతకంపెట్టి పారేస్తారు--లేకపోతే మొదటికే మోసం కదా మరి!)