Monday, April 26, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-3

ఆవిడ చిన్నప్పుడు బడులు లేవు--కనుక చదువు ప్రసక్తే లేదు. అయినా చదవడం, వుత్తరం వ్రాయడం నేర్చుకొంది.

అలాగే భగవద్గీత, సుందరకాండ లాంటివి చదివేసేది!

ఆవిడకి ఆ పాండిత్యం యెక్కడనించి వచ్చిందోగానీ, యెవరిదైనా ఇంటిపేరు చెప్పగానే, వాళ్ళ శాఖా, గోత్రం, ఋషులూ అన్నీ చెప్పేసేది. (18 మందీ, 23 మందీ ఋషులు కూడా వున్న గోత్రాలు వున్నాయట!)

ఆవిడ ఇంకో లక్షణం యేమిటి అంటే, కళ్ళు అంతగా స్పష్టం గా కనపడని దశ వచ్చినా, కనపడిన కాయితాన్ని, అది యేదైనా, కూడబలుక్కుని చదవకుండా వదిలేది కాదు! ఇతరభాషా పదాలు తెలుగు లిపిలో వుంటే, 'ఇదేభాషరా?' అని అడిగేది!

ఒక్కొక్కప్పుడు, గది వూడ్చి, తుక్కు యెత్తడానికి ఓ కాయితం సంపాదించి, ఆ కాయితం లో యేమి ప్రింటు చేసి వుందో చదువుతూ కూర్చొని, తుక్కు సంగతి కాసేపు మరిచిపోయేది!

తనకి తెలుసున్నవాళ్ళందరివీ జన్మ నక్షత్రాలు, వాళ్ళు పుట్టిన తెలుగు సంవత్సరాలతో సహా గుర్తుండేవి!

తమాషా యేమిటంటే, మేము 'అమ్మమ్మా! నీదే నక్షత్రం?' అని అడిగితే, 'నేనూ--పితూరీషా నక్షత్రయుక్త సరీసృప లగ్న పుష్కరాంశ లో పుట్టానురా!' అనేది! నిజం మాత్రం యెప్పుడూ చెప్పలేదు!

మేము ఎలిమెంట్రీ స్కూల్లో వుండగా, ఓ సారి వాళ్ళ వూరు వెళ్ళాము.

ఆ వూళ్ళో 'ధర్మారం మేష్టారు' అనే ఆయన వీధి బడి వుండేది. మా మేనమామ కొడుకు అప్పుడు అక్కడే చదువుకొనేవాడు.

ఆ బడి పుణ్యమా అని, కొన్ని కొత్త, వింత అనిపించే పదాలు నేర్చుకొని, నవ్వుకొనేవాళ్ళం.

యెవరింటినించి అయినా ఓ 'బరకం' పట్టుకెళ్ళాలి రోజూ--బళ్ళో పిల్లలు కూర్చొనేందుకు--మేష్టారింటి అరుగు మీద.

అరుగు నిండిపోయి, ఆలస్యం గా బడికి వచ్చేవాళ్ళు యెవరి 'చదర' వాళ్ళు తెచ్చుకోవాలి.

పొద్దున్న బడి అయిపోగానే, 'యాల గంజి' కి ఇంటికి వచ్చి, మళ్ళీ రెండో పూట బడికి వెళ్ళాలి.

--ఇంకొన్ని గుర్తు తెచ్చుకొని, మరోసారి.

4 comments:

budugu said...

యాలగంజి అంటే (వేళ గంజి ఆ? లంచి లాంటిది)
చదర అంటే "చద్దర్" (తెలంగాణలో ఉర్దూ ప్రయోగం అయ్యుంటుంది.
బరకం ఎంఇటా? కర్పెట్?

Alapati Ramesh Babu said...

యాలగంజి, చదర,బరకం హమ్మ్మ చాలరొజులు అయునది ఈమాటలు విని .బహుశా అందరు మర్చి పొయి వుండరు .యాలగంజి తప్ప ఆ 2 పదాలు వాదుక లొ వున్నై.

A K Sastry said...

డియర్ budugu!

యాలగంజి అంటే మీరన్నది కరక్ట్. వేళకి తాగే గంజి అని!

చదర అంటే, ఒక్కళ్ళకే సరిపోయే, చతుస్రాకారపు చాప.

'చాప చిరిగి చదర అయ్యింది ' అనే ప్రయోగం వినే వుంటారు.

ఇక గోనె సంచులు విడదీసి, అన్నీ ఒకదానికి ఒకటి కలిపి కుట్టి, పెద్ద 'కార్పెట్' లాంటిది తయారు చేస్తే, అది బరకం!

ఇంకా ఇలాంటి పదాలు మన తెలుగు లో చాలా వున్నాయి.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ rameshsssbd!

మీరీ పదాలన్నీ విన్నామనడమే అద్భుతం.

యాలగంజి ని కూడా వాడకం లో పెడదామా?

ధన్యవాదాలు.