Saturday, July 3, 2010

కుక్కపిల్ల

మా 'జిమ్మీ' కథ

(శ్రీ పంతుల జోగారావు గారి సాలూరు 'టామీ' కథ చదివాక)

మా తమ్ముడు యెనిమిదో క్లాసులో వుండగా, శంకర్, చోటూ అని ఇద్దరన్నదమ్ములు మా నాన్నగారిదగ్గర చదువుకోడానికి వచ్చేవారు. శంకర్ యేడో క్లాసులో, సన్నగా, కొంచెం పొడుగు అనిపించేలా వుండేవాడు. చోటూ అయిదో క్లాసులో, బొద్దుగా, గుండులా వుండేవాడు. సాయంత్రం వచ్చి, చదువుకొని, రాత్రి మా యింట్లోనే ఆరుబయటో, వీధి గది లోనో పడుకొని, పొద్దున్నే వెళ్ళేవారు. వీళ్ళిద్దరినీ మా మామగారు సరదాగా 'లవకుశులు ' అనేవారు.

కథేమిటంటే, ఓ కుక్కపిల్ల (టామీ లో సగం వుంటుందేమో) రోజూ వాళ్ళు చదువుకుంటున్నంతసేపూ ఓ ప్రక్కన పడుకొని, వాళ్ళనే చూస్తూ వుండేది. తరవాత, వాళ్ళు పడుకొన్నప్పుడు రాత్రి యెప్పుడో వాళ్ళిద్దరి మధ్యనీ వెచ్చగా పడుకొనేసేది! రోజూ ఇదే తతంగం అవడం తో, మా తమ్ముడితో సహా వాళ్ళిద్దరూ--జిమ్మీని (ఈ పేరు ఇప్పుడే నేను పెట్టాను) యెలా వదిలించుకోవాలా? అని తీవ్రం గా ఆలోచించి, కార్యాచరణలోకి దిగారు.

మొదట, దాన్ని ఓ చేతి సంచీలో మూటకట్టి, ఓ కిలోమీటరు దూరం మోసుకెళ్ళి, పెద్దకాలవ గట్టున సంచీలోంచి బయటికి తీసి, వదిలిపెట్టి, వచ్చేశారు.

మర్నాడు, ఓ గోనె సంచీలో పెట్టి, మోసుకెళ్ళి, మళ్ళీ నిన్నటి చోటుకి ఇంకొంచెం దూరం లో, సంచీ పళంగా వదిలేసి వచ్చేశారు.

ఆ మర్నాడు, దీని పని ఇలా కాదు అనుకుంటూ, పెద్దకాలవమీద బల్లకట్టు యెక్కి, అవతలి వొడ్డుకి చేరి, అక్కడనించీ ఓ వంద అడుగులు వెళ్ళి, నిర్జన ప్రదేశం లో వదిలేసి వచ్చేశారు.

ఆ మర్నాడు, 'దీనికీ కాలవ రూటు బాగా తెలిసి పోయింది. పైగా అడుగుజాడల వాసన పసికట్టి తిరిగి వచ్చేస్తోంది ' అని తీవ్రం గా ఆలోచించి, సైకిలు మీద మూడు కిలోమీటర్లు ప్రయాణించి, రైల్వే స్టేషన్ చేరి, బయలుదేరబోతున్న గుంటూరు పాసింజెరు బండిలో యెక్కి, దాన్ని ఓ పెట్టెలో వదిలేసి, బండి కదిలే ముందు దానిక్కనపడకుండా దిగి వచ్చేశారు!

ఓ రెండు మూడు రోజుల తరవాత, 'చీ చీ! అది పాసింజెరు బండి కదా! స్లోగా వెళుతుంది. ఈ సారి......' అనుకొని, మళ్ళీ హైదరాబాదు ఎక్స్ ప్రెస్ లో వదిలేసి వచ్చేశారు!

చిత్రమేమిటంటే, కాలవ దగ్గరా అక్కడా వదిలేసినప్పుడు, వాళ్ళకంటే ముందుగానే, అడ్డదారిలో ఇల్లు చేరేది!

రైళ్ళలో వదిలితే, ఆ మర్నాడో, రెండురోజులకో మళ్ళీ ఇంటికి చేరేది!

చివరాఖరికి, ఓ రోజున దాన్ని సంచీలో మూటకట్టి, తాడు గట్టిగా బిగించి, హైదరాబాదు రైల్లో, పది కిలోమీటర్లు ప్రయాణించి, దాన్ని ఓ సీటు క్రింద వదిలేసి, పాలకొల్లు లో దిగిపోయి, మళ్ళీ తిరిగి వచ్చే రైలు లో వాళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి పది అయ్యింది!

మా అమ్మ 'యెందుకురా దాన్ని అలా హింస పెడతారు?' అని రోజూ తిట్లు. ఆ రోజునైతే, ఇంట్లో అందరూ వాళ్ళని తెగ తిట్టేశాము.

కానీ, ఆ జిమ్మీ మళ్ళీ తిరిగి రాలేదు! యేమయిపోయిందో ఇప్పటివరకూ తెలియదు!

అదండీ సంగతి!

2 comments:

సుజాత వేల్పూరి said...

ఇలా పిల్లులు కూడా తిరిగొచ్చేస్తాయండోయ్! మా ఇంట్లో ఒకసారి మూడు పిల్లులు ఒకేసారి 3x4=12 పిల్లల్ని పెట్టేసరికి మొత్తం కలిసి పదిహేనయ్యాయి. ఇన్నింటిని తట్టుకోలేక కొంచెం పెరిగాక ఓక్ ఏడెనిమిది పిల్లుల్ని ఐదారు కిలోమీటర్ల దూరంలో వదిలేసి మా అన్నయ్య అలా బజారెళ్ళి కూరలు తీసుకుని ఇంటికొచ్చేసరికి అవి ఇంట్లో స్వాగతం చెప్పాయి వాడికి.

ఇలా రెండు మూడుసార్లు జరిగాక అమ్మకి బాధేసింది. "పోనీలే, మనతోనే ఉంటాయి.మనతోనే తింటాయి"అని ఉంచేసింది. అలా ఒక ఏడాది తర్వాత గండు(మగ)పిల్లన్నీ సంప్రదాయం ప్రకారం ఇల్లొదిలి వెళ్ళిపోయాయి.

A K Sastry said...

డియర్ సుజాత!

సాధారణం గా పిల్లులు పిల్లలని పెట్టాక, కనీసం యేడు ఇళ్ళు మారుస్తాయంటారు!

మరి ఆ మూడు పిల్లులూ తమ స్థావరాన్ని మార్చుకోలేదంటే, మీ యిల్లు వాటికి అంత బాగా నచ్చిందన్నమాట.

ధన్యవాదాలు.