........సెలవులూ
అదేదో సామెజ్జెప్పినట్టు, బ్యాంకు వుద్యోగులకి సెలవొచ్చిందన్న ఆనందం యేమాత్రం వుండదు.
ఇప్పుడు చూడండి--దాదాపు నెలరోజుల క్రితం నించీ, వరసగా 3 రోజులు సెలవలు వస్తున్నాయని (బ్యాంకులకి ఈ సందర్భం చాలా అరుదు), చాలా కాలం తరవాత సొంత వూళ్లకో, వేరే వూళ్లకో ప్రయాణాలు పెట్టుకొని, రిజర్వేషన్లూ గట్రా చేసుకొని, గురువారం సాయంత్రానికి బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టుకొని, పడుతూ లేస్తూ స్టేషన్ కో, బస్ కాంప్లెక్స్ కో చేరి, దారిలో యే విజయవాడకో చేరాక, ప్రభుత్వం ఓ రాత్రివేళ--శుక్రవారం (10-09-2010) సెలవు కాదు అని ప్రకటించేసింది!
అది కూడా, రాష్ట్ర ప్రభుత్వం వారు "ప్రభుత్వ కార్యాలకు సెలవు లేదు" అని ప్రకటించి వూరుకుంటారు.
ఇక బ్యాంకువాళ్లకి సంకటం మొదలు. శంఖం లో పోస్తేగానీ తీర్థం కానట్టు--ఆ సెలవుగానీ, సెలవు లేకపోవడం గానీ "నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం క్రింద" వర్తిస్తాయా లేదా--అని.
బ్యాంకులవాళ్లు మళ్లీ ప్రత్యేకం గా ప్రభుత్వం వారిని అడిగాక,ఇంకో గంటో, రెండు గంటలో పోయాక, అప్పుడు ప్రకటిస్తారు--అసలు సంగతి!
ఇదివరకోసారి (నా 'ఓ ప్రపంచపౌరుడు ' బ్లాగులో) వ్రాశాను--ప్రస్తుతం ఈ నె. ఇ. చట్టం బ్యాంకులకి సెలవలు ప్రకటించడానికి మాత్రమే వుపయోగించబడుతోంది గానీ, వేరే యే విధం గానూ అమలు కావడం లేదు అని. అది వేరే సంగతి.
(అన్నట్టు, "ఈ నె. ఇ. చట్టం క్రింద" అనేదానికి ఈనాడు వారు తమకే తెలిసిన ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు--"ప్రైవేటు సంస్థలకు వేతనం తో కూడిన సెలవు" అని!)
కొత్తసంవత్సరం ఇంకా రాకుండానే, వచ్చే కేలెండరు సంవత్సరం లో, యేయే రాష్ట్రాల్లో యేయే రోజులు సెలవలు అనేది ప్రభుత్వం నిర్ణయించాక, బ్యాంకులు తమ ప్రణాలికల్ని రచించుకుంటాయి.
మరి వాటి మీద నిలబడి, 'సెలవులు యెప్పుడో ప్రకటించేశాం, ఇక మార్చం--మీరు తన్నుకు చస్తే చావండి ' అనే ధైర్యం ఈ ప్రభుత్వాలకి లేదు!
(అమ్మో! ఇంకేమైనా వుందా--మతభావాలు దెబ్బతినవూ?)
ఇక మత పెద్దలు చూడాలి--చంద్రుడు కనపడ్డాడనో, కనపడలేదు అనో, తిథి మిగులు వుంది అనో, ఇంకా
తగులుకోలేదు అనో, మా ఇమాం చెప్పాడు అనో, రాత్రి కలలో 'విఖనో మునీంద్రుడో, 'పాంచరాత్రేశ్వరుడో' కనపడి చెప్పాడు అనో--పండగల్ని ఓ రోజు ముందుకో, వెనక్కో మార్చేస్తూ వుంటారు.
అసలు ఆ చంద్రుడు ఢిల్లీలోని ఆ ఇమామ్ కే యెందుకు కనిపించాలో, కనిపించకుండా వుండాలో, ఆ మునీంద్రులో ఈశ్వరులో ఫలనా జీయరు స్వామికే యెందుకు చెప్పాలో నాకు అర్థం కాదు.
(నిజం చెపుతున్నాను--గత యాభై యేళ్లలో నేనెప్పుడూ ఈ విఖనో మునీంద్రుడో, విఖన మునీద్రుడో--వీడి పేరు యెక్కడా వినలేదు. ఈ మధ్య మాత్రం యేకం గా వాడికి విగ్రహాలు పెట్టేసి, గుడులు కట్టెయ్యడమో, వున్న గుళ్లలో ప్రతిష్ట చేసెయ్యడమో చేస్తున్నారు! అలాగే వాల్మికికీ, వ్యాస భట్టారక/మునీంద్ర/భగవాన్ కీ కూడా. ఇక ప్రతీ గుడిలోనూ మంటపాలపైనో, గోడల పైనో సప్త ఋషుల్నీ విగ్రహాలు పెట్టేస్తున్నారు--అందరికీ నెత్తిమీద పెద్ద పెద్ద చుట్టలూ, గడ్డాలూ, మీసాలూ కామను).
అసలు మన జాతీయ వుత్సవాలు--స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధిజీ జన్మదినం--ఈ మూడింటికి మాత్రమే సెలవులు ఇచ్చి, శని ఆదివారాలు రెండూ సెలవలుగా ప్రకటించి, మిగిలిన సెలవలు అన్నీ రద్దు చేసేస్తే యెంత బాగుండును!
ఇక బ్యాంకు వుద్యోగుల పాట్ల గురించి మరోసారి.
1 comment:
కృష్ణశ్రీ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు
హారం
Post a Comment