Saturday, July 3, 2010

కుక్కపిల్ల

మా 'జిమ్మీ' కథ

(శ్రీ పంతుల జోగారావు గారి సాలూరు 'టామీ' కథ చదివాక)

మా తమ్ముడు యెనిమిదో క్లాసులో వుండగా, శంకర్, చోటూ అని ఇద్దరన్నదమ్ములు మా నాన్నగారిదగ్గర చదువుకోడానికి వచ్చేవారు. శంకర్ యేడో క్లాసులో, సన్నగా, కొంచెం పొడుగు అనిపించేలా వుండేవాడు. చోటూ అయిదో క్లాసులో, బొద్దుగా, గుండులా వుండేవాడు. సాయంత్రం వచ్చి, చదువుకొని, రాత్రి మా యింట్లోనే ఆరుబయటో, వీధి గది లోనో పడుకొని, పొద్దున్నే వెళ్ళేవారు. వీళ్ళిద్దరినీ మా మామగారు సరదాగా 'లవకుశులు ' అనేవారు.

కథేమిటంటే, ఓ కుక్కపిల్ల (టామీ లో సగం వుంటుందేమో) రోజూ వాళ్ళు చదువుకుంటున్నంతసేపూ ఓ ప్రక్కన పడుకొని, వాళ్ళనే చూస్తూ వుండేది. తరవాత, వాళ్ళు పడుకొన్నప్పుడు రాత్రి యెప్పుడో వాళ్ళిద్దరి మధ్యనీ వెచ్చగా పడుకొనేసేది! రోజూ ఇదే తతంగం అవడం తో, మా తమ్ముడితో సహా వాళ్ళిద్దరూ--జిమ్మీని (ఈ పేరు ఇప్పుడే నేను పెట్టాను) యెలా వదిలించుకోవాలా? అని తీవ్రం గా ఆలోచించి, కార్యాచరణలోకి దిగారు.

మొదట, దాన్ని ఓ చేతి సంచీలో మూటకట్టి, ఓ కిలోమీటరు దూరం మోసుకెళ్ళి, పెద్దకాలవ గట్టున సంచీలోంచి బయటికి తీసి, వదిలిపెట్టి, వచ్చేశారు.

మర్నాడు, ఓ గోనె సంచీలో పెట్టి, మోసుకెళ్ళి, మళ్ళీ నిన్నటి చోటుకి ఇంకొంచెం దూరం లో, సంచీ పళంగా వదిలేసి వచ్చేశారు.

ఆ మర్నాడు, దీని పని ఇలా కాదు అనుకుంటూ, పెద్దకాలవమీద బల్లకట్టు యెక్కి, అవతలి వొడ్డుకి చేరి, అక్కడనించీ ఓ వంద అడుగులు వెళ్ళి, నిర్జన ప్రదేశం లో వదిలేసి వచ్చేశారు.

ఆ మర్నాడు, 'దీనికీ కాలవ రూటు బాగా తెలిసి పోయింది. పైగా అడుగుజాడల వాసన పసికట్టి తిరిగి వచ్చేస్తోంది ' అని తీవ్రం గా ఆలోచించి, సైకిలు మీద మూడు కిలోమీటర్లు ప్రయాణించి, రైల్వే స్టేషన్ చేరి, బయలుదేరబోతున్న గుంటూరు పాసింజెరు బండిలో యెక్కి, దాన్ని ఓ పెట్టెలో వదిలేసి, బండి కదిలే ముందు దానిక్కనపడకుండా దిగి వచ్చేశారు!

ఓ రెండు మూడు రోజుల తరవాత, 'చీ చీ! అది పాసింజెరు బండి కదా! స్లోగా వెళుతుంది. ఈ సారి......' అనుకొని, మళ్ళీ హైదరాబాదు ఎక్స్ ప్రెస్ లో వదిలేసి వచ్చేశారు!

చిత్రమేమిటంటే, కాలవ దగ్గరా అక్కడా వదిలేసినప్పుడు, వాళ్ళకంటే ముందుగానే, అడ్డదారిలో ఇల్లు చేరేది!

రైళ్ళలో వదిలితే, ఆ మర్నాడో, రెండురోజులకో మళ్ళీ ఇంటికి చేరేది!

చివరాఖరికి, ఓ రోజున దాన్ని సంచీలో మూటకట్టి, తాడు గట్టిగా బిగించి, హైదరాబాదు రైల్లో, పది కిలోమీటర్లు ప్రయాణించి, దాన్ని ఓ సీటు క్రింద వదిలేసి, పాలకొల్లు లో దిగిపోయి, మళ్ళీ తిరిగి వచ్చే రైలు లో వాళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి పది అయ్యింది!

మా అమ్మ 'యెందుకురా దాన్ని అలా హింస పెడతారు?' అని రోజూ తిట్లు. ఆ రోజునైతే, ఇంట్లో అందరూ వాళ్ళని తెగ తిట్టేశాము.

కానీ, ఆ జిమ్మీ మళ్ళీ తిరిగి రాలేదు! యేమయిపోయిందో ఇప్పటివరకూ తెలియదు!

అదండీ సంగతి!

Friday, July 2, 2010

అందరికీ పెద్ద డబ్బా

పరస్పర డబ్బా

"ఆడ వాళ్ళు"--'ఆడ' అంటే మన సినీ రచయితలూ, దర్శకులూ ఇచ్చిన నిర్వచనం--'ఈడ' (పుట్టింట్లో) కాదు, 'ఆడ' (అత్తింట్లో) అని.

కానీ నా అనుమానం, 'ఆడ' అంటే 'వంటిల్లు' అనే అర్థం యెక్కడైనా వుందేమోనని! (యే సూర్యారాయాంథ్ర నిఘంటువులోనో ఈ అర్థం దొరక్కపోదు)

యెందుకంటున్నానంటే, బ్లాగుల్లోకూడా వంటల గోలే!

(ఓ యాభై యేళ్ళ క్రితం మాలతీ చందూర్ వ్రాసిన వంటలూ, పిండి వంటలూ దగ్గర నించీ, భానుమతి వ్రాసిన వంటల నించి, ప్రతీ పత్రికలోనూ, టీవీ ఛానెల్లోనూ వస్తున్న 'రుచి-అభిరుచి', 'మీ ఇంట మా వంట', 'మా వూరి వంట' వరకూ ఇవే వంటలు)


అన్నట్టు 'అవడా మామిడికాయలతో' యేమి వంటలు చెయ్యచ్చో మీకెవరికైనా తెలుసా?

యేనుగుల-వడ చెట్లుంటాయని వాటికి కాయలుంటాయని తెలుసా?


దీనికి తోడు, ఓ పాప్యులర్ దినపత్రిక ఓ రోజు 'బ్లాగుల్లో షడ్రుచులు' అనో, యేదో వ్రాస్తే, ఇక పరస్పర డబ్బాలు.

నాలాంటివాడు యేదో ఓ వ్యాఖ్య వ్రాస్తే, ఓ 'తెల్లారిలేస్తే తరవాత ముద్ద గురించి ఆలోచించేవాడో యెవడో' ఈయనకి ఇక్కడేమి పని? అని ప్రశ్నిస్తాడు!

ఇదేమి చోద్యమో?

'ఆడవాళ్ళూ--వంటింట్లోంచి, పూలూ, మొక్కలూ, మొగుళ్ళ డబ్బాలు కొట్టడాలూ--వీటినించి బయటికి రండి! మీకు పోయేదేమీలేదు--........తప్ప!'

(డేష్ లో యేమిటో మీరే పూరించుకోండి)

==>ఇది కేవలం సరదాకోసం వ్రాసినదే తప్ప, అమ్మల్ని, అమ్మాయిల్నీ నిందించడానికి కాదు. గమనించి, దాడి చెయ్యకండి!

చేసినా మరేం ఫర్వాలేదు--నా సోదరులే నాకు రక్ష.