Sunday, October 17, 2010

ఇదియొకరకపు

"బ్లాగ్వెఱ్ఱి"

(కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ బ్లాగ్ వ్రాయడం మొదలుపెడితే.......అనే ఆలోచనతో--ఈ సరదా రచన. యిక కొన్ని వందల అరసున్నాలు టైపు చేసే వోపికలేక, యిలాగే ప్రచురిస్తున్నాను--వుండవలసినచోట అవి వున్నాయని భావించే చదువుకోవలసిందిగా మనవి)

"యింద్రజాల మహేంద్రజాలముల ను వింటిమి. యిప్పుడిది యేమో అంతర్జాలమనుచున్నారది యంతటిదే యేమో. 

మొన్న నా నూఱవ బుట్టినరోజున నా మనుమడు నాకొక 'గణన యంత్రము ' (దీనిని యాంగ్లమున గoప్యూటరందురట) బహూకరించినాడు. దీనిద్వారా యంతర్జాలమును జేరుట జాల సులభము. అదియొక జిత్రము.

యీ యంతర్జాలములో యనేకమంది వ్రాయు రచనలను బ్లాగులందురట. నేను గూడ నొక బ్లాగును బ్రారంభించితిని. 

దీనిలో జిత్రమేమనగా, వొకడు దన బ్లాగు (యీ బ్లాగులను గొంతమంది యాంతర్యములను బేరుతో బిలచుచున్నారట) లో నొక లేఖ వ్రాయును. దానిని జదివినవారు వారి యభిప్రాయములను వ్యాఖ్యలుగాబెట్టుదురు. వీనిని వీడు జదువుకొని, బ్రతివ్యాఖనుగూడ పెట్టవచ్చును. అదియట్లుండనిండు.

వీడు యితరుల ఆంతర్యములను జదువ వచ్చును, దన వ్యాఖ్యలనందుంచవచ్చును. దానికి బ్రతి వ్యాఖ్య యేమైన వచ్చినదేమో గూడ జూచుకొనవచ్చును. యీ బ్రక్రియకోసము, సంకలినులు బ్రవేశబెట్టబడినవట. బాగుగయున్నది.

యీ సంకలినులయందు గొన్ని వ్రేల లేఖలుండవచ్చును. 

వొకడు యీ యంతర్జాలమున తన లెఖలే వ్రాయునా, వాటి మీది వ్యాఖ్యలేజూచుకొనునా, వాటికి ప్రతివ్యాఖ్యలేజేయునా.....!? యివిగాకుండ సంకలినులలోని వేనవ్రేల లేఖలనేజదువునా, వాటిపై వ్యాఖ్యానించునా, మఱల బ్రతి వ్యాఖ్యలేజదువుకొనునా.......!?...యేమో....దీనియంతుబట్టకున్నది.

అయిననూ నేనొక సులభమార్గమును గనిబెట్టితిని--

యదియేమన...సాధారణముగా లేఖలు వ్రాయువారికి యది యొక వ్యసనముగా మారును.వ్రాయువాడెవడైన దానందరికంటె బాగుగా వ్రాయుచున్నానని యనుకొనును. పాడువాడెవడైన దాను మిగతయందరికంటె బాగుగాబాడుచున్నాననియే యనుకొనును. యిది మరియొక జిత్రము. 

వీరిలోగొంతమంది రోజుకొక లేఖ వ్రాయవలెనను నియమముబెట్టుకున్నవారుందురు, గొందరు రోజునకెన్నైన వ్రాయుదునని సవాలు విసిరినయట్లు వ్రాయుదురు. మరిగొందరు యే యెండకో, వానకో నొకటి వ్రాయుదురు.

యిక బండుగులు, సెలవు దినములు, బ్రపంచ "యేదో" దినములు వచ్చినప్పుడందరునదే విషయమును గురించి వ్రాయుదురు....యిది యింకొక జిత్రము. శుభాకాంక్షలను దెలుపుకొనుట గూడ బాడియే! యింకొకనికి జాకిరేవు బెట్టుకొని, వుతికియారవేయుటే నియమము. వేరొకనికి దేవుళ్ల దేవుళ్లాటలు, వేదములు, బురాణములు, మట్టీ, మసేనము బ్రముఖముగాదోచును. మరిగొందరికిదమ బాకశాస్త్రబ్రావీణ్యము బ్రదర్శింపవలెననిపించును. 

యివియన్నియు మనముజదువక్కరలేదనుకొన్న, జదువవలసినవి వ్రేళ్లమీద లెక్కింపదగును. యిది జిత్రములలోకెల్ల జిత్రము.

యివ్విధమున నా యాంతర్యముల బఠనమును గొనసాగింప నిశ్చయించుకొంటిని. 

యిక మరియొక గల్పవృక్షమునో, గామధేనువునో వ్రాయ సంకల్పించితిని నా యాంతర్యములో. మరల గలసికొందుము. 

యితిశ్రీః"

8 comments:

susi said...

baavundi

A K Sastry said...

డియర్ susi!

సంతోషం.

సంకలినులలో బ్లాగుల గురించి ఆయన అభిప్రాయం యెలావుంది?

ధన్యవాదాలు.

amma odi said...

మీ ఆలోచన బాగుందండి!:)

A K Sastry said...

డియర్ AMMA ODI!

సంతోషమమ్మా. (సంకలినులలో వ్రాసే) ఇంకొంతమంది చేత ఈ టపా చదివించే ప్రయత్నం చేస్తే, ధన్యుణ్ణి.

ధన్యవాదాలు.

karlapalem Hanumantha Rao said...

విశ్వనాథవారి ప్రతిభను అనుకరించటం ఎంత కష్టమో వారి శైలిని అనుకరించటం అంత తేలిక .పారడీలు రాసినవారందరూ దాదాపుగా కవిసామ్రాట్ ని వదిలింది లేదు.
మీ ప్రయత్న కొత్తది కాకపోయినా హర్షించదగినదే!

A K Sastry said...

అహో! పెద్దలు హనుమంతరావుగారు నా టపా మీద వ్యాఖ్యానించడమా! ధన్యోస్మి!

మీరన్నట్టు, విశ్వనాధవారి ప్రతిభను అనుకరించగలవాళ్లు కూడా 'న భూతో.....'. అంతేకాదు, ఆయన శైలిని అనుకరించడం కూడా కత్తిమీద సామే!

మనలో మన మాట--బ్లాగుల్లో వస్తున్న టపాలనీ, బ్లాగులని కొంతమంది వాడుకుంటున్న విధానాన్నీ, వాటిమీద నాకు కలిగిన "అసంతృప్తినీ" వెళ్లగక్కడానికి మాత్రమే ఈ మార్గాన్ని అనుసరించాను. అంతే. (పెద్దాయన చుఱకలు వేస్తే కొంత ఫలితం వుండొచ్చు అని.) అంతేగానీ, విశ్వనాధవారిని పూర్తిగా అనుకరించే సాహసం చేద్దామని కాదు.

అనేక ధన్యవాదాలు.

బాలు said...

చాలాబాగా అనుకరించారండీ.
‘అదియట్లుండనిండు’ ...ఇది మాత్రం సూపరు!

A K Sastry said...

డియర్ బాలు!

చాలా సంతోషం.

తీరికైనప్పుడు, నా మిగతా బ్లాగుల్నీ, టపాలనీ చూసి మీ అమూల్యాభిప్రాయాలు వ్రాస్తూ వుండండి.

ధన్యవాదాలు.