Saturday, October 8, 2011

ఇలాంటివాళ్లని చూశారా?......నేను చూశాను మరి!   

లండాచోరీ--పితలాటకం--లిటికిలేషన్--యెడ్డెం అంటే తెడ్డెం--ఇలా కొన్ని మాటలున్నాయి మనతెలుగులో. కొన్ని అచ్చతెలుగు పదాలూ, కొన్ని పరభాషా స్వీకర్తాలూ!

వీటివెనుక కొన్ని "తర్క, మీమాంసా" వగైరా శాస్త్రాలున్నాయి(ట).

ఒకాయన బజార్లో నిమ్మకాయలు కొనడానికొచ్చి, అడిగాడు "యెలా ఇస్తున్నావు?" అని. 

వాడు రసికుడు--"చేత్తోనే" అన్నాడు. 

"ఆహా! అలాగా? అయితే ఒక్కోటీ యెంతకిస్తావు?" 

"ఒక్కోటీ ఓ రూపాయికిస్తానండి!" 

"బాగుంది. పళ్లు బాగున్నాయి. నువ్వు ఒక్కోటీ పాతిక రూపాయలన్నా కొనుక్కోవలసిందేకదా? అవసరం నాది మరి! సరే....ఓ పది ఇవ్వు" అంటూ పదిరూపాయల నోటిచ్చాడు. 

వాడు ఓ పది నిమ్మకాయలని (పళ్లని) ఓ సంచీలో వేసి ఇచ్చాడు. 

తీసుకొని వెళ్లిపోవచ్చుకదా? వూహూఁ! 

(బుట్టలో ఇంకా ఓ అరవై డెభ్భయి నిమ్మపళ్లున్నాయి.) 

"ఇప్పుడు చెప్పు. ఈ యెండలో ఆ బుట్టలో పళ్లన్నీ ఒక్కోటీ రూపాయకి సాయంత్రందాకా అమ్ముకుంటావా? లేక, యేదో రేటుకి మొత్తం నాకిస్తావా? ఇస్తే యెంతకిస్తావు?" 

"మారాజులడగాలేగానండీ, ఓ యాభై రూపాయలకిస్తానండి!" 

"పదిహేనిస్తాను" 

"ఖుదరదండి" 

"సరే! ఇరవై?" 

"రావండి" 

"ఫైనల్గా చెపుతున్నాను. ఇరవై రెండు.....నీ యిష్టం!" 

"ఇవ్వలేనండి.....సరే, మారాజులు ఓ పాతికిప్పించండి!" 

పావుగంటలోపలే బేరం ఫైసల్! ఆయన పాతికా ఇచ్చి, బుట్టెడు కాయలూ తీసుకొన్నాడు. 

"రండిబాబూ! రండి! నిమ్మపళ్లు కావాలా? వూరికే ఇస్తున్నాను! తీసుకోండి!" అంటూ, పావుగంటలో వెళ్లేవాళ్లకీ, వచ్చేవాళ్లకీ పంచిపెట్టేసి, కారెక్కి, వెళ్లిపోయాడు!

ఈ లండాచోరీ యేమిటీ? ఇందులో యెవరి బలం యెంత? యెవరి బలహీనత యేమిటి? ఇలాంటివే "తర్క, మీమాంసా"వగైరా శాస్త్రాలు!

(ఆ బుట్టగలవాడు రైతు కాదు! ఓ వందకాయలు పాతిక రూపాయలకి రైతుదగ్గరకొన్న 'దళారి!')

 యెవరి వ్యాపారం వారిదికదా!?

(తెలివి ఒక్కడి సొమ్ముకాదోయ్!)


Monday, October 3, 2011

బాగా "పండుతున్న" క్యామెడీ..........గుర్తింపు కార్డులూ

మన ప్రభుత్వ విధానాలూ, ప్రకటనలూ చూస్తూంటే, కొన్ని కార్టూన్లూ, జోకులూ గుర్తొస్తాయి నాకు. 

అందులో, కొంటెబొమ్మల బాపు వేసినది మొదటిది. 

ఓ అందమైన అమ్మాయి రోడ్డు ప్రక్కన నిలబడి వుంటుంది. ఒకడు ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ, స్పీడుగా వచ్చేస్తూంటాడు. ఆ ప్రక్కనే ఓ డ్రైనేజీ కాలువ వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చేవాడు ఆ కాలువలో పడటం ఖాయం! అప్పటికే ఆ కాలువలో వున్న ఇద్దరు ముగ్గురిలో ఒకడంటాడు..."ఇంకోడొస్తున్నాడు! జరగండి, జరగండి" అని! 

ఆ అమ్మాయీ, వచ్చేవాడూ, ఆ మాటలన్నవాడూ....వాళ్ల హావభావాలు యెంతచక్కగా చిత్రించారంటే, యెవరైనా "జరగండి" అనగానే ఫక్కున నవ్వు వచ్చేస్తుంది నాకు! 

ఇంకో జోకు....ఒకడు రోడ్డు ప్రక్కన నుంచొని, "పదకొండు.....పదకొండు...." అని లెఖ్ఖ మరిచిపోకుండా వల్లెవేసుకొంటూ వుంటాడు. చాలా సేపు అతన్ని గమనించిన ఇంకొకడు "యేమిటీ ఇందాకణ్నుంచీ లెఖ్ఖ పెడుతున్నావు?" అనడిగితే, దగ్గరకి రమ్మని వాణ్ని ప్రక్కనున్న డ్రైనేజి కాలవలో తోసేసి, "పన్నెండు.....పన్నెండు...." అంటూ వల్లెవేయడం మొదలెడతాడు! 

ఇంకో స్కిట్ లో, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఓ పేషంటుగా, డాక్టర్ దగ్గరకి వెళ్లి, ఆయనరాసిన అన్ని టెస్టులూ చేయించుకొని, అన్ని మందులూ కొని, అన్నీటికీ ఫీజులు, డబ్బులూ  చెల్లించుకొంటూ, "వాళ్లు కూడా బ్రతకాలిగా మరి?" అంటూంటాడు. చివరికి ఆ మందులన్నీ మురిక్కాలవలో పారేస్తాడు! అదేమిటీ అని అడిగితే, "నేను కూడా బ్రతకాలిగా మరి?!" అంటాడు. 

నిద్రలో కూడా నవ్వు పుట్టిస్తూ, చురకలు వేసే ఇలాంటివి "అజరామరాలు!"

మొన్నీమధ్య మా జిల్లాలో, వోటర్ల లిస్టుల సమీక్షలో, ఇంటింటికీ తిరిగి సేకరించిన వివరాలగురించి ఓ పెద్దాయన పరిశీలించి, "జనాభా ఇంత పెరిగితే, మొత్తం వోటర్లు ఇంత శాతం పెరిగితే, కొత్తగా వోటు హక్కు పొందినవాళ్లు.....'ఇంత శాతమేనా?' అంటే మీరు మీ ఇంట్లో బజ్జునే, ఇంటింటి సర్వే చేసేశారన్నమాట!" అంటూ చిర్రుబుర్రులాడారట. హెంత మాట!

మన కి కు రె, తన పథకాలని ప్రకటిస్తూ, ప్రతీదానికీ ".....అవినీతిని తగ్గించడానికి" అంటూ ప్రకటిస్తూండడంతో, వుద్యోగుల సంఘాలు, ముఖ్యంగా రెవెన్యూ వుద్యోగులు "యేం? వేళాకోళంగా వుందా? మీ మంత్రులూ, రాజకీయులూ అనేక కార్యక్రమాలపేరుతో మా వూళ్లకి వచ్చినప్పుడు, వాళ్లకి 'సుక్కా, ముక్కా....'లతో మర్యాదలు చెయ్యడానికి డబ్బులు మీబాబిస్తున్నాడా? పైగా, ప్రతీవాడూ 'మర్యాదలు సరిగ్గా జరగలేదు ' అని నీకు ఫిర్యాదు చేసేవాడే!" అంటూ ఖస్సుమంటున్నారట! 

2003 వరకూ చంద్రబాబు చేసిన తప్పిదమల్లా "నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనియ్యను" అనడమేననీ, తరవాత "నందోరాజా భవిష్యతి" జరిగింది అనీ మరిచిపోతే యెలా?

ఇంక విషయానికొస్తే, ఇప్పటివరకూ.....ఆథార్ తో సహా.....కొన్ని పదుల సంఖ్యలో....కంటిపాపల, వ్రేలిముద్రల, కాలి ముద్రల, చెవితమ్మెల, ముక్కు వంగిన కోణాల రికార్డులతో.....కార్డులు జారీచేయబడుతున్నాయి.....భాగ్యశాలులైన దేశ ప్రజలందరికీ! 

ఇప్పుడింకో "స్మార్ట్ కార్డ్" రాబోతోందట! (జరగండి....జరగండి.....!) 

2013 లోగా, "దేశంలోని వయోజనులందరికీ" బహుళ ప్రయోజన గుర్తింపుకార్డులు జారీచెయ్యాలని "భారత రిజిస్ట్రార్ జనరల్" ప్రతిపాదిస్తే, ప్రభుత్వం తగిన "కసరత్తు" చేస్తోందట!  రేషన్ కార్డుగా, యెన్నికల కార్డుగా....ఇలా అనేక రకాలుగా వుపయోగించవచ్చట. ప్రభుత్వానికి "యెంతో ఖర్చు ఆదా" అవుతుందట. 

దేశజనాభాలో 65% వయోజనులున్నారు. ఒక్కో స్మార్ట్ కార్డు తయారీకీ రూ.50/- మాత్రమే ఖర్చు అవుతుంది. (65 కోట్లూ X 50....యెంత?). 

ఇంకా, ఎన్ ఐ సీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో కమీటీ వేశామనీ, వాళ్ల సిఫార్సులు అందితే, అప్పుడు "అసలు ధర" నిర్ణయం అవుతుందనీ కూడా సెలవిచ్చారట! (ఆ కమిటీ కెంతో, ఆ రిపోర్టులకెంతో, యెన్నాళ్లు పనిచేస్తుందో, చివరాఖరికి "అంచనా వ్యయాలు" యెంతకు పెరుగుతాయో!) 

ఇంకా, ఆథార్ సంఖ్యలతోపాటు, ఫోటోలూ, వ్రేలిముద్రలూ, కనుపాపముద్రలూ "లాంటి"వన్నీ ఈ స్మార్ట్ కార్డులో నిక్షిప్తమై వుంటాయట. "వివిధ కార్డుల స్థానంలో" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "ఈ స్మార్ట్ కార్డు" వుపయోగించొచ్చు....అని "బయోమెట్రిక్ మార్కెట్ నిపుణులు" చెపుతున్నారట. 

(ఓప్రక్క "తన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయిందో" అంటూ యెవరో "తొలి" ఫిర్యాదు దాఖలు చేశారట......ఆ "ఆథార్" అధికార సంస్థకి. ఇది కూడా స హ చట్టం క్రింద దరఖాస్తు చేస్తేనే తెలిసిందట. ప్రస్తుతానికైతే ఫిర్యాదు "నమోదు" చేసుకొని, సంబంధిత విభాగానికి పంపించాము "అని మాత్రమే" వెల్లడించారట!)

మన వ్యాలెట్లలోని కార్డుల్లో పైన వున్నది మిగిలినవాటితో అంటోందీ...."జరగండి, జరగండి, ఇంకోటొస్తోంది!" అని.

పనికిరానికార్డులని పారేస్తూ, "ఐదు.....ఐదు....ఆరు" అంటూ లెఖ్ఖ పెడుతూ వల్లెవేస్తూ వుండాలేమో మనం! (పోయింది మనడబ్బేగా!)

ఈ కంప్యూటర్, బయోమెట్రిక్, మార్కెటింగ్....ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూలు....అంటారూ, "యెవరి జీవనోపాధి వారిది, యెవరి వ్యాపారం వారిది, యెవరి సంపాదన వారిది.....'అందరూ బ్రతకాలిగా'?"....అని!

"సామాన్యుడూ! సామాన్యుడూ! నీ వోటేవరికి?" అనడిగితే, "అందరూ సామాన్యులేగానీ, వాళ్లలో కొంచెం 'యెక్కువ ' సామాన్యుడికేనండి బాబయ్యా!" అన్నాడట.

కార్డులూ.....పథకాలూ.....యెన్నికలూ.....మీకు జోహార్లు!   

Thursday, September 22, 2011

మా ఇంటి వంట అనే.........కసరత్తుల ప్రహసనం

"కొంచెం అజినమోటో వుంటే ఇస్తావా వదినా?"

"అంటే యేమిటొదినా?"

"యేమోనమ్మా.....నాకూ తెలీదు....మొన్న మా ఎపార్ట్ మెంట్ లో 'మావూరి వంట; మా వీధి పెంట' అనో యేదో టీవీ కార్యక్రమం చిత్రీకరిస్తే, అందులో మా 'డీ-4' ఆవిడ అదేదో 'సోయా ఢాల్ భేజా ఫ్రై కొళంబు-21369' అని వండింది. అందులో.....వెయ్యాల్సినది ఈ అజినమోటో వొకటి! అదే చెయ్యమంటోంది మా మనవరాలు"

"బాగుందొదినా! ఇలాంటి వంటల్లో, మామూలుగా వేసే ఆవాలూ, జీలకర్రా వగైరాలతోపాటు, జాజికాయ, జాపత్రి, గసగసాలూ, లవంగాలూ, యాలకులూ, కొత్తిమీరా, పుదీనా, కరేపాకూ వగైరాలతోపాటు, జీడిపప్పూ, బాదం పప్పూ, పిస్తా పప్పూ, వేరుశెనగపప్పూ, నువ్వులూ (అంటే నూపప్పు అని చదూకోవాలి).....ఇలా అన్నీ వేసేసి, అజినమోటో, నిమ్మగడ్డీ, పనీర్, బట్టర్, సిల్వర్ ఫాయిల్స్....ఇలా అన్నీ వేసెయ్యాలటమ్మా!"

"నాకైతే వొదినా, మనచిన్నప్పుడు చూసిన "చింతామణి" నాటకం, అందులో సుబ్బిసెట్టి డైలాగులు గుర్తొస్తాయి వొదినా!"

"అవునొదినా, భలే హాస్యం వుండేది! ఇంతకీ ఆ డైలాగులు యేమిటో గుర్తుచెయ్యొదినా!"

"నాకు జీడిపప్పూ, మా పెద్దమ్మాయికి బాదం పప్పూ, చిత్రకి పిస్తాపప్పూ అంటే ఇష్టం. కాలక్షేపానికి ఓ రెండు పప్పులు నోట్లో వేసుకొంటూ వుంటాం! అన్నట్టు శెట్టిగారూ, మీదగ్గర ఆ పప్పులన్నీ దొరుకుతాయికదా? ఓ బస్తాడు జీడిపప్పూ, ఓ రెండు బస్తాలు బాదంపప్పూ, ఓ బస్తా పిస్తా పప్పూ పంపించకూడదూ? అన్న శ్రీహరితో, మరి గన్నేరు పప్పో? అనడుగుతాడు సుబ్బిసెట్టి! దానికావిడ.....అది మీయింటికి పంపించండి.....మీ ఆవిడ (స్వర్గానికి చేరి) సుఖపడుతుంది! అంటుంది--శ్రీహరి!"

"భలే నవ్వొస్తూందొదినా ఇప్పటికీ! ఇంకా తన చేతికున్న రాళ్ల వుంగరాలని ఇస్తానంటే, శ్రీహరి, వొద్దులెండి, రాళ్లేం చేసుకుంటాం? అంటే, ఇంకానయం కంకర్రాళ్లన్నావుకాదు--ఇది 'కంపు'; ఇది 'రవల' ఖరీదైన రాళ్లు పొదిగిన వుంగరాలు! అంటాడు చూడు!"

"అద్సరేగానొదినా, వీళ్ల వంటలు చూస్తుంటే, మనకసలు వంట చెయ్యడం వచ్చా? ఇన్నాళ్లు మనం చేసుకుంటున్నవి వంటలేనా అనో సందేహం వస్తూంటుంది నాకు! అదేదో వంటలో--ముందు అన్నం వుడికించేసి, తరవాత దాన్ని నూనెలో వేయించేసి, దాన్ని ముద్దచేసేసి, జంతికల గొట్టంలో కారప్పూసలా చుట్టలు చుట్టేసి, ఆ చుట్టలని ఆవిరిమీద కుడుముల్లా వుడికించి, దింపాక చిన్న చిన్న ముక్కలు చేసి, పళ్లెంలో పెట్టుకోవాలట! ఇంక దాంట్లోకి కూర--అన్ని రకాల కూరగాయల ముక్కలూ, ఆకు కూరలూ, వాటిని వుడికించిన నీళ్లూ, బఠాణీలూ, చిక్కుడు గింజలూ, బీన్సూ, మొలకెత్తిన సెనగలూ, పెసలూ ఇలా అన్నీ వేసేసి, దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్దా; అల్లం కొత్తిమీర ముద్దా; కొత్తిమీర పచ్చి మిర్చి ముద్దా వేసేసి, గరం మసాలా, కర్రీ మసాలా, ఛాట్ మసాలా, నా దిబ్బ మసాలా అన్నీ వేసేసి, చివరలో క్యారట్ రేకలూ, కీరదోస ముక్కలూ, కుంకం పువ్వూ తో అలంకరిస్తే, సరిపోతుందట!"

"మన వంటలంటే గుర్తొచ్చింది వదినా--చక్కగా ఆరు రుచులూ, యేడు రంగులూ స్పష్టంగా తెలిసేవి! ఆరోగ్యానికి ఆరోగ్యం! మరి మా కోడలైతే, మామిడికాయ పప్పులోనూ, టమాటా పప్పులోనూ--ఇలా దేంట్లోనైనా వేసే పోపులో, చేరెడు మినప గుళ్లూ, ఇన్ని మెంతులూ కూడా వేసి పోపు పెట్టేస్తుంది! యేదో రెండుముద్దలు వేడివేడిగా తినెయ్యడం నాకలవాటా? నావసలే దంతసిరి గల పళ్లు! ముద్దనోట్లో పెట్టగానే, "ఫట్"మంటూ ఓ మినపగుండు పడిందనుకో--బుర్ర ఛప్పన్నారు నరకాలనీ చూసి, గుడ్లలో నీళ్లు వెళ్లుకొచ్చేస్తాయి! అధవా నమిలేసినా, అసలు రుచి పోయి, ఓ వెర్రి కమ్మదనంతో గడ్డి తింటున్నామేమో అని అనుమానం! ఇంక మెంతులతో చచ్చే చేదు! అక్కడికీ యెన్నిసార్లో చెప్పాను....అలవాటుగా అన్నీ పడిపోతాయత్తయ్యా! యేమీ అనుకోకండి.....అని వోదార్పు! ఇలాకాదని, పోపుల డబ్బాలోంచి ఆ గిన్నెలు తీసేసి, వేరే పెట్టేశాను. అయినా తన లెఖ్ఖ ప్రకారం పోపులో యేమేమి తగ్గాయో చూసి, వెతుక్కొని, దొరకకపోతే ప్రక్కనే వున్న కొట్లోనో, దగ్గర్లో వున్న బేకరీలోనో అప్పటికప్పుడు కొనుక్కొచ్చి మరీ వేసేస్తుంది! ఇంక నా బాధ చూడలేక, వడ్డించేముందు గబగబా కంటికి కనిపించినవన్నీ యేరేసి, అప్పుడు వడ్డిస్తుంది....పాపం పిచ్చి పిల్ల! ఇంకేమంటాము?"

"అవునొదినా.....తప్పు వాళ్లది కాదు.....ఈ ఛానెళ్లవాళ్లదీ, బ్లాగర్లదీ, వంటలమ్మలదీ!"

"నిన్న టీవీలో పనీర్ చెయ్యడానికి తొందరగా గట్టిపడుతుందని 'జిల్లేడు పాలు' పోసేస్తున్నారనీ, ఇలా యేవేవో చూపించారు! ఇలాంటివి కొనుక్కొనే కన్నా, చక్కగా మన వంటలు మనం చేసుకొని తింటే, ఆకలీ తీరుతుంది, ఆరోగ్యమూ! అజినమోటోలు వద్దులే వదినా! ఇంక వంటిళ్లలోకి వెళదాం!"

"బాగా చెప్పావొదినా!"

Monday, September 19, 2011

స్నేహితుల దినాలూస్నేహ సౌరభం

కొందరికి "భాయ్"లు అయినా, నాకు మాత్రం "గాళ్లే" నా కొండెలు!

మా పేరి మేష్టారు, ప్రతీయేడూ, మొదటిసారి మా క్లాసుకి వచ్చి, అటెండెన్స్ వేస్తూ, ఓ గంటసేపు, మా పేర్లని చిత్రవిచిత్రంగా పిలుస్తూ, మమ్మల్ని నవ్విస్తూ గడిపేశేవారు. అలాంటిపేర్లే మా క్లాసుమేట్లకి శాశ్వతం అయిపోయాయి చాలామందికి!

వుదహరణకి "నూరుల్లా" అనేవాణ్ని--"నరట్లా" అని పిలిచేవారు! వాడికి ఇప్పటికీ అదే పేరు. ఇంకా వాణ్ని "ఒరే! సాయిబ్బు శాస్త్రులూ!" అని పిలిచి, "ఆ 'శత్రుడిదగ్గరికి ' వెళ్లి, ఓ సారి నశ్యం డబ్బాతేరా!" అనేవారు. యెప్పుడూ ఆపని వాడికే చెప్పేవారు! (దీనివెనక్కాలో కథ వుంది--ఇదివరకు టూకీగా వ్రాశాను.)

నన్ను "యేకేవాడా" అనీ, నాతరవాత వాడైన పువ్వాడ కృష్ణమూర్తిని "పీకేవాడా" అనీ పిలిచేవారు.

అలాగే, "సత్యానందం" అనే అబ్బాయి తండ్రి, పేరు "దాసు" ఓ సినిమాహాల్లో పనిచేస్తూ, ఒంటెద్దు బండిలో మైకూ, స్పీకరూ, గ్రామఫోనూ పెట్టుకొని, క్రొత్తగా వచ్చే సినిమాలకి పబ్లిసిటీగా 'వొళ్లు గగుర్పొడిచే పోరాటాలూ, భయంకరమైన కత్తి యుధ్ధాలూ, గుర్రములపై నడచుటా, మర్రివూడలపై పరుగెత్తుట లాంటి విశేషాలతో, నేడే చూడండి....ఆలసించిన ఆశాభంగం....ఇంకా కొన్ని రోజులు మాత్రమే!' అంటూ చెప్పేవాడు.   

ఆ సత్యానందాన్ని మాత్రం, "ఒరే దాసూ" అనే పిలిచేవాడాయన. వాడు స్కూల్లో చదువుకొనే టైములోనే, సినీ రికార్డింగు డ్యాన్సులు వెయ్యడమే కాకుండా, ప్రోగ్రాం మధ్యలో--నాగుపాముచేత, బొట్టూ, కళ్లకు కాటుకా పెట్టించుకొనుట....మొదలైన విద్యల్లో ఆరితేరాడు! యేదో చదివి, ఓ చిన్న వుద్యోగం సంపాదించాడు తరవాత!  

ఆమధ్య నేను మావూరు బదిలీపై వచ్చాక, ఓ రోజు ఒకావిడ తన దగ్గరున్న కొంచెం డబ్బు బ్యాంకులో డిపాజిట్ చెయ్యడానికి వస్తే, ఆవిడభర్తపేరు చూసి, మీ ఆయన్ని ఓ సారి వచ్చి నాకు కనపడమను.....అనగా, ఓ నాలుగైదురోజుల తరవాత, నేను చాలా బిజీగా వుండగా, "నమస్కారం అయ్యగారూ!" అన్న పిలుపు విని, తలెత్తి చూసి, "ఒరే! నేను నీకెప్పుడు అయ్యగార్నయిపోయాన్రా దాసూ?" అని వాడి భుజమ్మీద తట్టి, కవుగలించుకుంటే, వాడు ఆనందభాష్పాలు రాలుస్తూ....ఒరే! నువ్వు పెద్దవాడివి కదా! అంటూ యేదేదో వాగాడు!

అలాగ, స్నేహానికీ, సౌభ్రాతృత్వానికీ, కుల, మతాలు లేవు! వున్నదల్లా మనసులలో కాస్త చోటు--అంతే!

Thursday, September 15, 2011

దేవుడిసొమ్మూ..........శిక్షలూ

గాలి ఇంట్లో జప్తులకి సంబంధించి "పంచనామా" మీద సంతకం చెయ్యడానికి కూడా యెవరూ ముందుకు రాలేదుట. మరి ఇలాంటి పంచనామాలు బుధ్ధి వున్న యే న్యాయమూర్తి న్యాయస్థానంలోనూ చెల్లవు--అజిత్ భరిహోకే లాంటి వాళ్లుండే "ఫాస్ట్ ట్రాక్" న్యాయ స్థానాల్లో తప్ప!

ఆయన, "సుంకులమ్మ" ఆలయాన్ని కూలగొట్టినందుకే, బ్రతికి వుండగానే, శిక్షగా "ఛిప్పకూడు" తింటున్నాడు....అమాయక గిరిజనులు శపించారు......అనీ, పాపభయం తోటే ఇంకో ఆలయాన్ని సుంకులమ్మకి కట్టించాడు అనీ, అదే భయంతో, తిరుమలేశుడికీ, కాళహస్తీశ్వరుడికీ కిరీటాలూ వగైరాలు చేయించాడు అనీ, 'జ్యోతిష్యంలో చెపుతాము దేవాలయాన్ని కూలగొట్టినా, భూములూ, ఆస్థులూ కబ్జా చేసినా, పుష్కరాలపాటు శిక్ష వుంటుంది '--అని చెపుతున్న ఫేషన్ గడ్డాల పండితులూ......ఇలా రెచ్చిపోతున్నాయి.....టీవీ ఛానెళ్లు!

"పితా......ఆ.....ఆ....ఆ.....! ఆఁ! ఆఁ! ఆఁ! ఇవన్నీ నిజాలేనంటావా! దేవాలయ భూములని కబ్జా చేసి, అపార్ట్ మెంట్లూ, కాలనీలు కట్టినవాళ్లూ, తరతరాలుగా అనుభవిస్తున్నవాళ్లూ, 'వాళ్లు జీవించి వున్నప్పుడే' శిక్షలు అనుభవిస్తారు.....అంటావా! సరే....సరే.....అదే అందరికీ చెపుతాను......"

Wednesday, September 7, 2011

క్రీడలు.....క్రీడా"కారులు" (గుఱ్ఱాలు)

మనకో మెగాస్టారున్నాడు--మెగా మెగా స్టెప్పులేసీ, "యాంటీ కరప్షన్ ఫోర్స్" లాంటివి (సినిమాల్లో) స్థాపించీ, అభిమానుల గుండెలు అదరగొట్టేసేవాడు. మొన్ననే ఓ "మెగా జంప్" చేశాడు కూడా! (సినిమాల్లో బంగీ జంపులు చేసినట్టు!). 

ఇంక ఆయన తమ్ముడు "పవర్ స్టార్"! తరవాత ఆయన కొడుకుని "మెగా పవర్ స్టార్" అనో యేదో అంటున్నారు. (అసలు వీళ్లకి ఈ "బిరుదులు" యెవరిచ్చారో? వాళ్లే తగిలించుకున్నారో, వాళ్ల పబ్లిసిటీ తైనాతీలు పెట్టారో!)

సరే బాగానే వుంది. 

ఆ చిరుత ఇప్పుడు వార్తల్లోకొచ్చాడు--అదేదో "పోలో" జట్టుని కొనేశాడుట. కాబోయే భార్య అడిగితే, కొండమీది కోతిని కూడా తెస్తారెవరైనా! తనకి తాహతుంది, కొన్నాడు. బావుంది.

ఓ టీవీ ఛానెల్ వాళ్లు తెగ రెచ్చిపోయారు--".....వారం జరగబోయే పోలో మ్యాచ్ లో ....స్టార్ ఆడబోతున్నారా?" అంటూ. 

మర్నాడు పేపర్లలో, వాళ్ల ఫోటోలతో, "మ్యాచ్ ని తిలకించారు" అని ఫోటోలు వస్తే, ఆ ఛానెల్ వాళ్లు ".....స్టార్ రైడింగుచేసి ప్రేక్షకులని అలరించారు" అంటూ, ఈక్వెస్ట్రియన్ ట్రాక్ లని చూపించారు! (వాళ్ల కాబోయే ఆవిడ బహుశా వార్నింగిచ్చివుంటుంది--రైడింగు యేదో చిన్నప్పుడు నేర్చుకున్నావేమో.....ఇప్పుడు పోలో అన్నావంటే, 'సుమంగళిలో నాగేశ్వర్రావు ' అయిపోగలవు! అప్పుడు నా గతేమిటి? అని!)

అసలు ఈరోజుల్లో, మన (ఆడ) హీరోయిన్లని ప్రశ్నించినా, మాకు "పోలో, గోల్ఫ్, రగ్బీ, ట్రెక్కింగ్, రాక్ క్లయింబింగ్, రివర్ రాఫ్టింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్"--ఇవన్నీ మాకిష్టం, ఖాళీ దొరికితే అవే ఆడేస్తాము అంటున్నారు!

అసలు వీళ్లకి గోల్ఫ్ గ్రవుండ్ లో మొత్తం యెన్ని కన్నాలు వుంటాయి, యెన్నిరకాల "కర్రలు", యెన్నిరకాల "షాట్లు" వుంటాయి, స్కోర్లు యెలా వేస్తారు, టైము యెంత పడుతుంది--ఇలాంటివేమైనా తెలుసా?

ఇంక పోలో లో ఆ ఛానెళ్లవాళ్లకి కూడా యెన్ని జట్లుంటాయి, గోళ్లు యెలా లెఖ్ఖిస్తారు, పెనాల్టీలు యెలా వుంటాయి, అసలు ప్రత్యర్థి గుర్రాలని గుర్తుపట్టడం యెలా--ఇలాంటివి తెలుసా?

మా చిన్నప్పుడు మామూలుగా స్కూలు వున్న రోజుల్లో బాల్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడుతూ, సెలవలు వస్తే, రోజుకోరకం ఆట--సీజన్ ని బట్టి--గోళీలూ, జీడిపిక్కలూ, బొంగరాలూ, క్రికెట్టూ, ఇంకా ఉప్పట్లూ, గూటీబిళ్లా, కబాడీ (చెడుగుడు), పేడపూతి, ఆకు తెచ్చే--ఇలాంటి ఆటలు ఆడేవాళ్లం!

(వీటిగురించి వివరాలు కావాలంటే మరో టపా వ్రాస్తాను.)

ఇంకా, స్కూల్లో డ్రిల్ పీరియడ్ లో, ఫుట్బాల్, బేస్కెట్ బాల్, వాలీబాల్, హాకీ, ఖోఖో లాంటివికూడా ఆడించేవారు.

ఇప్పుడు కొత్త కొత్త హేండ్ బాలూ, సెపక్ తక్రా (ఇదేదో గేది తక్రం, ఆవు తక్రం లా అనిపిస్తుంది నాకు) లాంటి ఆటలు కూడా ఆడించేస్తున్నారు స్కూళ్లలో!

స్పోర్ట్స్ లో రన్నింగ్ రేసులతో పాటు, జావెలిన్, డిస్కస్, హేమర్, షాట్పట్--ఇలాంటివి నేర్పించేవారు.

మరిప్పుడు మన క్రీడలు యెటుపోతున్నాయి? స్టేడియాలు కట్టించడం, క్రీడా భవనాలు నిర్మించడం, వాటిలో వర్షం నీళ్లు తోడించడం తో ఆగిపోతున్నాయి!

పోటీలూ, బహుమతులూ మాత్రం వచ్చేస్తున్నాయి.

అంతర్జాతీయంగామాత్రం, బాణాలేసే గిరిజనులూ వాళ్లే దిక్కు మనకి--పతకాలు వచ్చాయి అని చెప్పుకోడానికి!

మేరా క్రీడాభారత్ మహాన్!

Wednesday, August 31, 2011

కాంగీలకి ఆక్సిజన్'రక్తం' విరుస్తామంటున్న ఎక్స్ పీఆర్పీలు!

ఓ పాతికేళ్లక్రితం ఎం ఆర్ ప్రసాద్ అని ఓ మిమిక్రీ ఆర్టిస్టు (రాజమండ్రి అనుకుంటా) తరచూ తన మిమిక్రీ తో కొన్ని సన్నివేశాలని సృష్టించి, ఆడియో క్యాసెట్లు రిలీజు చేసేవాడు.  (ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు).

అతని క్యాసెట్లలో అందర్నీ ఆకట్టుకొన్నవాటిల్లో ఒకటి "చిరంజీవి-శ్రీదేవిల పెళ్లి". సినీ ఆర్టిస్టుల గళాలని అనుకరిస్తూ కామెడీని ప్రవహింపచేశాడు. కడుపుబ్బ నవ్వకుండా వుండలేము!

ఆ క్యాసెట్లో బోనస్ గా ఓ స్కిట్ అందించాడు--పాత తరం విలన్ నాగభూషణం (మంచిమనసులు) ఓ సినిమా తియ్యదలుచుకుని, హీరో కోసం ప్రకటన ఇస్తే, నాగేశ్వర రావు, రామా రావు, కృష్ణ, శోభన్ బాబు--ఇలా అందరూ తమ కొడుకులని హీరోగా రికమెండు చేస్తూ, "ప్రక్కనుంచీ, వెనుకనుంచీ, ముందునుంచీ, పైనుంచీ" తమ తమ సహకారాలని ఆయనకి వాగ్దానం చేస్తారు!

అందులో అందరూ అనే మాట "నా కొడుకులని ఇష్టం వచ్చినట్టు వాడుకోండి! నన్నుకూడా ఇష్టం వచ్చినట్టు వాడుకోండి!" అని.

ఇప్పుడు--చిరంజీవి పాపం--ఇదే డైలాగు కాంగీ వాళ్లకి అనేకసార్లు చెపుతున్నా--వాళ్లు "వాడుకోవడం లేదు" అని ప్ర రా పా "సామాజిక న్యాయులు" బొచ్చెలాంటివాళ్లమీద ఆగ్రహించడంలో తప్పేమైనా వుందా?

యేమో మరి!

Monday, August 29, 2011

పరిత్రాణాయసాధూనాం.....సారధ్యం.....మంత్రాంగం

ఇదివరకటి ఫ్ర రా పా లో శల్యుడెవరో, శకుని యెవరో నాకు తెలీదు గానీ, భలే రాజకీయం నడిపిస్తున్నారు. 

వై ఎస్ ఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసినవాళ్లు అందరూ ఆయన బొమ్మమీదే గెలిచారు అన్నది అతిశయోక్తికాదు. 

అలాంటివాళ్లందరూ ఇప్పుడు, సహజంగా,  అందుకు కృతఙ్ఞతగా "వైయెస్సార్ కాంగ్రెస్" లో చేరాలి కదా?

లేదూ, మేము సోనియా బొమ్మే పెట్టుకొని గెలిచాం, అందుకే జగన్ తో చేరడంలేదు అనైనా చెప్పాలికదా?

సరే. నిజంగా వైఎస్సార్ బొమ్మతో గెలిచి, ఇప్పుడు కాదు పొమ్మంటున్నవాళ్లు--ఇంకా మంత్రులుగా, నాయకులుగా కొనసాగుతున్నవాళ్లు యెవరికి కృతఙ్ఞులుగా వుండాలి?

సహజంగా, నిస్సందేహంగా, మన చిరంజీవికే కదా?

ఆయన ఫోటోలూ, బ్యాడ్జీలూ లేకుండా మీరు జిల్లాల్లో పర్యటనలు కొనసాగిస్తారా? హౌ డేర్ యూ? 

మీరు ఆయన ఫోటోలు పెట్టుకున్నాసరే, లేదా జగన్ తో చేరినా సరే, లేదా రాజీనామాలుచేసి మళ్లీ యెన్నికల్లో నిలబడినా సరే!

అంతేగానీ, వెధవ్వేషాలెయ్యకండి! అని హెచ్చరిస్తున్నారు ప్ర రా పా "ఆన్నా" లు!

బాగుంది కదూ?

Sunday, August 14, 2011

వార్తాహరులూ.......3.......సందేశాలూ

ఆ విధంగా ఒకానొక దివసంబున నా కవుంటర్లో పనిలో వుండగా, రద్దీ తక్కువగా వున్న సమయంలో మేనేజరు గది నుంచి పిలుపు. లోపలికి వెళ్లేసరికి ఓ కస్టమరు ని పరిచయం చేసి, నా వివరాలు చెప్పమన్నాడు మా మేనేజరు. 

బయటికి వచ్చేసరికి, మా కొలీగ్ ఫ్రెండ్స్ "పెళ్లి సంబంధమే" అని గొడవ.  నిజంగానే ఓ పెద్దింటి సంబంధం చెప్పాడాయన. జరగలేదనుకోండి.

ఆలా మొదలైన పెళ్లి సంబంధాల పరంపరలో, ఓ సారి మా వూరు వెళ్లినప్పుడు, ఇంకో సంబంధం గురించి చెప్పారు.

మా వీధి పోస్ట్ మేన్, కాకినాడలో మా (అప్పటికింకా కాని) తోడల్లుడిగారి వీధి పోస్ట్ మేన్ చుట్టాలట. ఆ పోస్ట్ మేన్ నా వుద్యోగం, వివరాలూ మా పోస్ట్ మేన్ ద్వారా తెలుసుకొని, ఆయనకి చెపితే, వెంటనే మా కాబోయే మామగారిని మా ఇంటికి పంపించాడు. మిగతావన్నీ యథావిథిగా జరిగి, ఇదిగో, మా కాపురం ఇన్నేళ్లుగా జరుగుతోంది!

అందుకనే, "ఆ పోస్ట్ మేన్ ని తన్నాలి" అని అప్పుడప్పుడూ తిట్టుకోవడం. 

అదీ "నేనూ నా రాక్షసి" కథ.

Sunday, July 10, 2011

నిజజీవితంలో కామెడీ

చిత్రమైన వార్తలు

"చిక్కీ పిక్కీ" అనే కాలనీలో "గురునాథ్" అనే వ్యక్తి, తోపుడుబండిమీద వస్తువులు పెట్టుకొని, వ్యాపారం చేసుకుంటాడట. మామూలుగానే పాపం నిన్న తన బండితోసుకుపోతూంటే, యెక్కడనుంచి వచ్చిందో, ఓ బుల్లెట్ అతని యెడమ భుజం దండలో దిగబడిందట! హటాత్తుగా రక్తం కారడం, నెప్పీ తెలిసేసరికి అతన్ని ఆసుపత్రిలో చేర్చి, బుల్లెట్ తీయించి చికిత్సచేయించారట. ఆ విషయాన్ని, అతని స్నేహితుడు "రాహుల్ గాంధీ" ఫోనుద్వారా తన భార్య "గులాబ్ జామూన్" కి చెపితే, ఆమె పొరుగునే వున్న గురునాథ్ భార్య "జపాన్" కీ, మామయ్య "అండమాన్" కీ చెప్పిందట. ఇదంతా "దొండకాయంత" దొంగాడు, "పొట్లకాయంత" పోలీసు, "జామకాయంత" జైలు లాంటి కథ కాదండోయ్! బెంగుళూరు నగరంలో నిజంగా జరిగిన ఘటన అని పేపర్లో ఫోటొతోసహా ప్రచురించారు!
మామూలుగా ఆడవాళ్లు ముందుండే ద్వారంలోంచీ, మగవాళ్లు వెనకుండే ద్వారంలోంచీ యెక్కుతారు సిటి బస్సులో. బెంగుళూరులో, ముందు ద్వారంలోంచి యెక్కేసిన ఓ యువ సాఫ్ట్ వేర్ మగ ఇంజనీరుని కండక్టరు కన్నడంలో "నువ్వేమయినా ఆడపిల్లవా? ముందునించి యెక్కేశావు?" అని కోప్పడ్డాడట. దానికతను "గొత్తిల్ల"  (నాకు కన్నడం "తెలీదు" అనే వుద్దేశ్యంతో) అని సమాధానం ఇచ్చేసరికి బస్సంతా గొల్లున నవ్వులు! (ఇది పాత జోకే అయినా, బెంగుళూరు ప్రసక్తి వచ్చింది కాబట్టి సరదాగ మరోసారి!)

అమెరికాలోని ఓహియో నగరంలో 911 (పోలీసు) కి ఓ ఫోను వచ్చిందట. విషయం "బనానా పీల్" (అరటిపండు తొక్క) ఒకటి "గొరిల్లా" ని గుద్దేసి వెళ్లిపోతే, గొరిల్లా క్రిందపడిపోయి నడుమో యేదో బెణికిందట! పోలీసులు ఆరా తీస్తే, విషయం--తన వుద్యోగంలో భాగంగా ఒకాయన, ఓ స్టోరు దగ్గర గొరిల్లా వేషంలో, వచ్చేవాళ్లని అలరిస్తూ వుంటాడట. ఓ నలుగురు టీనేజర్లు తమ విచిత్ర వేషధారణలో భాగంగా రకరకాల దుస్తులు ధరించి పరిగెట్టుకు వెళుతూ, ఆయన్ని ఓ సగం వొలిచిన అరటిపండు వేషంలో వున్న ఒక టీనేజరు గుద్దేశాడట! పోలీసులు దర్యాప్తు చేసినా, ఆ అరటి తొక్క దొరకలేదట గానీ, అదో పెద్ద వార్త అయిపోయింది! అదీ సంగతి.

Thursday, July 7, 2011

వార్తాహరులూ........2

.......సందేశాలూ
......ఆ సబ్ పోస్ట్ మాష్టరు.....కొంచెం తెల్లగా, పొడుగు ముక్కు తప్పితే, "అమ్యమ్యా" సినిమాలో అల్లు రామలింగయ్యలా వుండేవాడు......యేదో సీరియస్ గా పని చేస్తున్నట్టు నటిస్తూ, అరగంటకి గానీ బుర్రపైకెట్టి కళ్లజోడు పైనుంచి చూసేవాడు కాదు. ఈ లోపల వెనక్కాల కొంత క్యూ పెరిగేది. నా చేతిలోని కవరు తూచి, '....రూపాయలు అంటించండి ' అని బయటికి విసిరేసి, "నెక్స్ట్..." అనేవాడు....ఆ స్టాంపులు కొనుక్కొనే అవకాశం కూడా ఇవ్వకుండా. మళ్లీ క్యూ చివర చేరి, వాడి దగ్గరకి వచ్చేసరికి ఇంకో అరగంట. అప్పుడు ఇచ్చేవాడు స్టాంపులు. సరే, వాటిని అంటించి, డబ్బాలో వేసేవాడిని. ఓ గంట ఆలస్యంగా కాలేజీ కి వెళ్లేవాడిని.

ఓ సారి బాగా వొళ్లు మండిపోయి, వీడిమీద యెలా కక్ష తీర్చుకోవాలా అని తీవ్రంగా ఆలోచించి, ఓ పథకం వేశాను. అదే.....ఓ అరఠావు తెల్లకాయితం తీసుకొని, దాన్ని ఇన్లేండ్ లెటర్ ఆకారంలో కత్తిరించి, దానిమీద, "ఒరే అల్లు రామలింగయ్యా! యెంతసేపూ వచ్చినవాళ్లని పట్టించుకోకుండా యేమి మిడుకుతావు? ఆ మిడికేదేదో వచ్చినవాళ్ల అవసరాలు చూసి, ఖాళీగా వున్నప్పుడు మిడిక్కోవచ్చు కదా? నీకు మిడకడానికే కాదు జీతం ఇస్తున్నది. కార్డులూ, కవర్లూ, స్టాంపులూ అమ్మాలి, రిజిస్టర్ కవర్లు తీసుకోవాలి....ఇలా బోళ్లు పనులు అప్పచెప్పారు కదా? ఇంకెప్పుడైనా నీ కిటికీ ముందు ఇద్దరో, ముగ్గురో క్యూలో కనపడినా నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను జాగ్రత్త!" అని వ్రాసి, చక్కగా మడిచి జిగురుతో అంటించేసి, టు అడ్రెస్ లో "పోస్ట్ మాస్టర్..." అంటూ వాడి అడ్రెస్ వ్రాసి, ఫ్రమ్ అడ్రెస్లో, "పీ ఎం జీ, హైదరాబాద్" అని రబ్బర్ స్టాంప్ అకారంలో నల్ల సిరాతో చెక్కి, కవరుపై అంటించవలసిన స్టాంపు స్థానంలో "పోస్టేజ్ విల్ బి పెయిడ్ బై ది అడ్రెసీ" అని చిన్న అక్షరాల్లో ప్రింటులా వ్రాసి, వాడి పోస్టు డబ్బాలోనే ఓ సాయంత్రం పూట వేసేశాను. (దీనికి సాక్ష్యం, నాకు నేల టిక్కెట్టుతో సినిమా చూడ్డం నేర్పాడని చెప్పానుచూడండి--వాడే--భాస్కర రావు అనే నా కొండెగాడు). తరవాత యేమయిందో, రకరకాలుగా సీన్లు వూహించుకొంటూ, నవ్వుకుంటూ, యేకపాత్రాభినయాలు చేస్తూ, యెంతో ఆనందించేవాళ్లం! ఆ మర్నాటినుంచీ, కిటికీ ముందుకి యెవరు వచ్చినా, తన కళ్లజోడుపైనుంచి అనుమాన దృక్కులు పరుస్తూనే,  గబగబా వాళ్ల పని చేసి పంపించేసేవాడు. క్యూ యెప్పుడూ కనపడలేదంటే నమ్మండి! నా కొండెగాడు ఇప్పటికీ అంటూ వుంటాడు--"అబ్బాయిగారి దెబ్బంటే....గోలుకొండ అబ్బా!" అని. అదీ పిట్టకథ. (బాగా వుపయోగించానంటారా.....ఇంగ్లాండు కవరుని?)

ఇంక వార్తాహరుల గురించి అసలు విషయానికొస్తే, మా ఆవిడా నేనూ సరదాకయినా, సీరియస్ గా నైనా, వాదన లో పడితే, మేమిద్దరూ ప్రకటించే యేకాభిప్రాయం--"అసలు ఆ పోస్ట్ మ్యాన్ ని తన్నాలి!" అని!

ఆ కథాక్రమంబెట్టిదనిన......

1972 చివర్లో, మేం నిరుద్యోగుల సంఘం తరఫున ప్రత్యేక ఆంధ్రోద్యమం చివర్లో వుండగా, మా ఇంటి వార్డు పోస్ట్ మ్యాన్ (ఆయన పేరు గుర్తు లేదు--ఇంటిపేరు 'పితాని '. మంత్రి పితానికి యేమైనా అవుతాడోలేదో తెలీదు.) నాకు ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం వచ్చినట్టు అపాయింట్ మెంట్ లెటరు తెచ్చిచ్చాడు. ఇంటిల్లిపాదికీ ఆనందం. అందులో "త్వరలో మీకు వుత్తరం వ్రాస్తాము. మేము చెప్పిన తేదీల్లో, మెడికల్ టెస్ట్ కి హాజరు కావలసి వుంటుంది" అని కూడా వ్రాశారు. అక్కడనించీ, యెదురు చూపు ప్రారంభం. యెంతకీ ఆ వుత్తరం రాదు. ఓ రోజున, ఆ పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్లిపోతుంటే, మా కాలవగట్టున అతన్ని ఆపి, మా ఇంటి అడ్రెస్ కి వుత్తరాలు యేమీ రాలేదా? అని అడుగుతూంటే, ప్రక్కన వున్న యెవరో, "ఈయనకి ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం వచ్చింది. మెడికల్ టెస్ట్ కి ఇంకో వుత్తరం రావాలిట--అందుకనీ ఆతృత!" అనగానే, పోస్ట్ మ్యాన్ "మెసెంజరుగానా?" అని అడగడం, ప్రక్కాయన, "ఈయన బీ కాం సెకండు క్లాసు--కేషియరు వుద్యోగమే!" అనడం, పోస్ట్ మ్యాన్ "అబ్బో! ఇంకేం! నక్కని తొక్కారు" అనడం, నాకిప్పటివరకూ గుర్తే. కానీ ఆ మెడికల్ టెస్ట్ వుత్తరం మాత్రం రాలేదు! (దాని గురించి వ్రాస్తే ఇంకో ప్రహసనం! యెవరైనా అడిగితే, మరోసారి....)

మొత్తానికి, 12-03-1973 న, ఆంధ్రా బ్యాంకు గాంధీనగర్, విజయవాడ శాఖలో వుద్యోగంలో చేరాను. (అప్పటికి వుప ముఖ్యమంత్రి బీ వీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేసి, వుద్యమంలో చేరడంతో, రాష్ట్రపతి పాలన విధించారో, విధించనున్నారో!) విజయవాడలో అన్ని బ్యాంకులూ, వాటి శాఖలూ, వారానికి రెండురోజులు మాత్రమే పని చేసేవి. (దాని ప్రభావం నా వుద్యోగమ్మీద సంగతి వేరే కథ.)

అలా నా వుద్యోగంలో నేనుండగా.......
   
........తరువాయి మరోసారి!

Wednesday, July 6, 2011

వార్తాహరులూ........

.......సందేశాలూ

(మొన్న ఫణిబాబుగారు మన పోస్ట్ కవర్లగురించి "వుయ్ మిస్ యూ డియర్" అని వ్రాసిన టపా చదివాక)

{నా చిన్నప్పుడు "కాశీ మజిలీ" లాంటి కథల్లో, ఓ అందమైన మాంత్రికురాలూ, ఆమె వెనక ఓ "తాంబూల కరండ వాహినీ" అని చదివి, ఇదేదో ఆ మాంత్రికురాలికన్నా గొప్పదేమో అనుకొని, తరువాత ఆవిడే హీరోకి సహాయం చెయ్యడం చదివి, ఆశ్చర్యపోయేవాడిని! ఇంతకీ ఆ మాటకి అర్థం తెలుసా మీకు?}

నాకు "పోస్ట్ మ్యాన్" లంటే చచ్చేంత ప్రేమా, ఇష్టమూ, కృతఙ్ఞతా వగైరలన్నీనూ--వాళ్లు నాకు తెచ్చిచ్చిన/తెచ్చివ్వని వుత్తరాలూ, ఎం వో లూ, వీ పీ పీ మరియు 'నితర ' పార్సెళ్లకూ'! (అలాంటి 'నితర ' పార్చెళ్లలోనే వచ్చింది--నేను గత 36 యేళ్ల 17 రోజులుగా కాపురం చేస్తున్న మా ఆవిడ అనే "నా రాక్షసి"!).

ఇప్పుడు పోస్ట్ మ్యాన్లు లేరు, వుమన్లూ లేరు--ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కుర్రాళ్లు--పాపం యెండలో మా ఇంటికి వచ్చి, పనికిరాని కవర్లు పట్టుకొచ్చినా (మనం కనపడకపోతే కిటికీలోంచి లోపల పారేస్తారు వాటిని) కవరో యేదో "ప్రత్యక్షంగా" తీసుకొని, "బాబూ! మంచినీళ్లు కావాలా?" అనడిగి, ఫ్రిజ్ లోంచి గ్లాసుడిచ్చి, పంపిస్తూంటాను నేను. ఆ కృతఙ్ఞతలాంటిదీ!

అద్ దానికి "వెనుక మెరుపు" (ఫ్లాష్ బ్యాక్) యేమన.......(అక్కడికే వస్తున్నాను! కొంచెం వోపిక పట్టండి మరి!)

మా చిన్నప్పుడు, పోస్టు కార్డులుండేవి (ఇప్పుడూ వున్నాయి). ఆ కార్డులమీద ఓ స్టాంపు అచ్చయ్యి వుండేది (మూడు తలలు కనిపిస్తున్న శివుడూ, వెనక నాలుగో తల కనిపించకుండా). అప్పట్లో అలాంటి స్థూపం యేమైనా వుండేదేమో తెలీదు. తరవాత ఆ స్థానాన్ని "నాలుగు సిం హాలూ" ఆక్రమించాయి. కార్డులేకాకుండా, ఇంకాస్త పెద్ద వుత్తరాలని రాసుకోడానికి "ఇన్లేండ్" కవర్లని వుండేవి. వాటిమీదకూడా ఆ ఈశ్వరుడి స్టాంపులే. అవి కాకుండా, యెన్ని తెల్లకాయితాలమీదైనా వుత్తరాలు వ్రాసుకొని, వాటిని మడిచిపెట్టి పంపించేందుకు--యెన్వలప్స్ కూడా వుండేవి. వాటిమీదా ఆ ఈశ్వరుడే. కార్డులని అప్పటికీ ఇప్పటికీ "ఓ కార్డు ముక్క"గానే పరిగణిస్తున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నాలెడ్జ్ మెంట్ల బదులుగా, పుట్టుక, మరణ వార్తలు చేరవెయ్యడానికీ! మూడోదైన ఎన్వలప్ ల గురించి చెప్పఖ్ఖర్లేదు--అందరికీ తెలిసినవే. ఇంక రెండోవైన "ఇన్లాండ్" కవర్ల గురించే ఓ పిట్ట కథ.

అదేం ఖర్మమోగానీ, దాన్ని, చదువుకున్నవాళ్లు కూడా, "ఇంగ్లాండ్" కవర్ అనే అనేవారు--యే కొద్దిమందో తప్పిస్తే. దానిమీద "ఈన్లాండ్ లెటర్--కార్డ్" అని ఇంగ్లీషులోనూ, "అంతర్దేశీయ పత్ర్--కార్డ్" అని హిందీలోనూ ముద్రించి వుండేది. "కార్డులు వేరే వున్నాయి కదా, దీన్ని కార్డ్ అని యెందుకు వ్రాస్తారూ?" అని ఇంగ్లీషు పండితులు రుంజుకుంటే, హిందీలో కార్డ్ ని "కాయీ" అని చదివిన హిందీ "ఎమెటర్" పండితులు ఆశ్చర్యపోయేవారు. ఇంక నిష్ణాత తెలుగు-హిందీ పండితులకైతే, భలే సందేహాలు. హిందీది కూడా, సంస్కృతం లాగానే, లండాచోరీ వ్యవహారం. హిందీలో, మనం తెలుగులో రాష్ట్రం అనేదాన్ని "దేశం" అంటారు, మనం దేశం అనేదాన్ని "రాష్ట్రం" అంటారు. అందుకనే, అంతర రాష్ట్రీయ అని మనం అనేదాన్ని, అంతర్దేశీయ అంటారు వాళ్లు. (మనం తెలుగులో "ఇంటర్నేషనల్" అనడానికి వుపయోగించే "అంతర్దేశీయ" లేదా "అంతర్జాతీయ" ని హిందీ వాళ్లు "అంతర్ రాష్ట్రీయ" అంటారు!) సరే. యెవరెలా యేడిస్తే మనకేం?

ఈ ఇన్లాండ్ కవర్లమీద కొంత రీసెర్చ్ చేశాను నేను నా 15వ యేటనే. అప్పుడే తెలుసుకున్నాను--యే చెత్తకాయితం మీద మనం వుత్తరం వ్రాసినా, దాన్ని చక్కగా మడతపెట్టి, అప్పటి ఇన్లేండ్ కవర్ కి యెంత స్టాంపు విలువ వుంటుందో అంత విలువ స్టాంపూ అంటించి డబ్బాలో వేస్తే, చచ్చినట్టు అది గమ్యస్థానాన్ని చేరుతుంది--అని! ఇంకా, కొన్ని "ప్రచార" సంస్థలు, చేరవలసిన చిరునామా తమదిగా ముద్రించుకొని,  మనకి ఇలాంటి ఇన్లేండ్ లెటర్స్ పంపించి, సమాధానం వ్రాయమనడం, వాటి మీద స్టాంపు స్థానంలో "పోస్టేజ్ విల్ బీ పెయిడ్ బై ది అడ్రెస్సీ" అని ముద్రించి వుండడం--బాగా గమనించాను.

మా ఇంటికీ, కాలేజీకి మధ్యలో వుండే ఓ పోస్టాఫీసు దారిలో రోడ్డుమీదే వుండేది. మనకి యే అవసరం వచ్చినా (పోస్టలుకి సంబంధించి) అక్కడికే వెళ్లేవాడిని. (అప్పట్లో కథలూ, కవితలూ వెలగబెట్టడం, పోటీల్లో పాల్గొనడం చేసేవాణ్ని లెండి). కొన్ని గంటలో, రోజులో "ఖష్ట"పడి, ఓ కథో, కవితో వ్రాసుకొని, దాన్ని ఓ కవరుతయారుచేసుకొని, అందులో పెట్టుకొని, తుమ్మజిగురుతో అంటించి, తీరా పోస్టాఫీసుకెళ్లి (ఆ కవరు యెంత బరువుందో, యెంత విలువగల స్టాంపులు అంటించాలో తెలీదు) కిటికీ ముందు నుంచుంటే......

........తరువాయి మరోసారి!

Saturday, June 4, 2011

మన సినిమాలుమనకి యెవార్డులు యెందుకు రావు?

(మొన్న తేట గీతి వారి టపా చదివాక)

మనకి కథలకి కొరతా? జానారెడ్డి భాషలో మనకి "చితషుధి" వుంటే, మనం "సమ్యమ్నమనం" పాటిస్తే, ఆస్కార్, గీస్కార్, బూస్కార్ లాంటి అంతర్జాతీయ ఎవార్డులన్నీ మన తెలుగు సినిమా గుమ్మం ముందు నిలుచుంటాయి.

యెటొచ్చీ, 1991 భారత సినీ జన్మోత్సవం నాటికి పరిశ్రమలో వున్నవాళ్లని వుంచి, తరవాత పరిశ్రమకి వచ్చినవాళ్లని "బ్యాన్" చెయ్యాలి.

అక్కడనుంచీ, మన విఠలాచార్య సినిమాలనీ, కమలాకర కామేశ్వర రావు పౌరాణికాల్నీ, బీ ఆర్ చోప్రా తీసిన మహాభారత్ లెవెల్లో, కొత్త నటులనీ, నటీమణులనీ, సాంకేతిక నిపుణులనీ పెట్టి, అధునాతన "గ్రాఫిక్స్", "మేకప్స్", "స్టంట్స్", "డబ్బింగ్స్", "వాయిస్ ఓవర్స్", "డోఁయ్, డోఁయ్ మ్యూజిక్స్", "3డీ", '4డీ" ఎఫ్ఫెక్టులతో, పాబూ లాంటి దర్శకులతో, రె. కాఘవేంద్రరావు లాంటి కళా దర్శకులతో, కళా పతస్వి లాంటి "ఎడిటర్లతో", "బీరవాణి", "మేళయరాజా", "సీఎఫ్ బహ్మాన్" లాంటి దుబాయ్, పార్సీ, అఫ్ఘనీ, పాకిస్తానీ "మెట్ల"గాళ్లతో సంగీత దర్శకత్వంలో, "బంకర్ మహావేదన్"; "జీపే దేసుబాబు"; "భరిభరన్"; "భస్పీ"; (వీడితో టైటిలు సాంగు మాత్రమే పాడించండి!); "సౌకల్య"; "తుషా"; "భవదర్శిని"; "జుతాస" లాంటి లేడీ సింగర్స్ తో పాటలు పాడించేసి, సినిమాలు చుట్టేసి, విడుదల చేసేస్తే, యెవడికోసం వస్తాయి.....ప్రపంచవ్యాప్త ఎవార్డులు?

అంతకన్నా హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ లేమైనా పొడిచేస్తున్నాయా?

కాబట్టి, ద్వారకానగరి దారిబట్టి, నీ క్లాసుమేటయిన బాల కృష్ణుని, బాల గోపాల కృష్ణుని, ఆ బాల గోపాల కృష్ణుని ఇంటర్వ్యూ సంపాదించి, మన దరిద్రాన్ని వదిలించవయ్యా......... అని.....!

అదీ సంగతి!

Monday, May 30, 2011

"మంత్రాలూ............చింతకాయలూ!"

నేను తఱచూ నా టపాల్లో ప్రస్తావించే మా తెలుగు మేష్టారు (పేరి వారు) వ్యంగ్యంగా, "మంతరాలకి సింతకాయలు రాల్తాయేటి?" అని, మళ్లీ తనే "మర్రాలవేటి?" అని, "వొరే అప్రాచ్యులూ! మంత్రాలకి చింతకాయలేకాదు.....కొబ్బరికాయలూ, బుర్రకాయలూ కూడా రాల్తాయి....జాగ్రత్త!" అని కోపగించేవారు.

అఫ్ కోర్స్....ఆయన మంత్రాలూ, అనుష్టానాలూ, నమ్మకాలూ, దీక్షలూ ఆయనవి.

ఈ మధ్య, "ఓం! .......య విద్మహే! .....య ధీమహి! తన్నో/థన్నో/దన్నో/ధన్నో/తన్నః/ధన్నః ........ప్రచోదయాత్" అనే ఓ మంత్రాన్ని తరచూ వింటున్నాము.

వుదాహరణకి ".....వేంకటేశా......శ్రీనివాసా......విష్ణుః......" పెట్టుకోండి పై డేష్ లలో!

ఇలా, ".....మాతృదేవతా.......తలుపులమ్మా.....పార్వతీ దేవ్యః....." అంటూ, యే దేవీ దేవతలకైనా వాడేస్తున్నారు.

మొన్న సాయిబాబాని సమాధి చేస్తున్నప్పుడు, చుట్టూ కర్టెన్లు క్రిందికి లాగేసి, గంటన్నర పాటు "ఓం సాయి దేవాయ విద్మహే....సత్యదేవాయ ధీమహి, 'తన్నః సర్వః' ప్రచోదయాత్!" అంటూనేవున్నారు సాయిసేవాదళ్ వలంటీర్లు. (సత్య, సాయి పేర్లూ అటూ ఇటూ అయ్యాయేమో సరిదిద్దుకోండి అవసరమైతే!)

మరి ఇదేమి మంత్రం? దీని వ్యుత్పత్తి యెక్కడా? యెవరు మొట్టమొదట ప్రవచించారు? దాని అనుష్టాన విథానాలేమిటి? యే వేదంలో, వుపనిషత్తులో, పురాణంలో వుంది?....లాంటి తన ప్రశ్నలకి సరైన జవాబు ఇచ్చినవాళ్లకి "అర్థ రాజ్యమూ, తన కూతుర్నిచ్చి పెళ్లీ" అనీ, అలా చెప్పలేకపోతే, "శిరచ్చేదం చేసి" కోటగుమ్మానికి వ్రేళ్లాడగడతాననీ ప్రకటించేశాడు మా కొండె.....పెసిగాడు అనబడే ప్రసాద్ గాడు. 

(వాడి రాజ్యం గురించీ, కూతురి గురించే ఇప్పుడే చెప్పేకన్నా, మీ తలకాయలు భద్రంగా చూసుకోండి అని హెచ్చరిస్తూ, వాటి వివరాలు "రేపు చెపుతాను" అని కోటగోడమీద వ్రాస్తున్నా!)

ప్రయత్నించండి మరి!

Friday, May 20, 2011

వేణ్నీళ్లకి చన్నీళ్లు...........అనబడే పాట్లు

పెద్ద పెద్ద జీతాలు తీసుకొంటూ, పదవీ విరమణ చేశాక, "పింఛను" అనే వేణ్నీళ్లకి "ఇంకో జీతం" అనే చన్నీళ్లు తోడవుతాయంటూ కక్కుర్తి వుద్యోగాలు చేస్తున్నవాళ్ల పాట్లని చూస్తే, నవ్వు రావడమే కాదు....పగవాళ్లకి కూడా వద్దురా బాబూ....అనిపిస్తోంది.

మా వూళ్లో వేదాంతం వెంకట సుబ్బయ్య అని ఒకాయన వుండేవాడు. వార్డు కౌన్సిలరు దగ్గరనించీ--దేశాధ్యక్షుడిదాకా అన్ని యెన్నికల్లోనూ నామినేషన్ వేసేవాడు ఇండిపెండెంట్ గా. 

తన సైకిలు కడ్డీ మీద కొన్ని పాత న్యూస్ పేపర్లు వ్రేళ్లాడేసి, అవి పడిపోకుండా ఓ తాడు కట్టి, ఓ చిన్న నిచ్చెనని ఓ ప్రక్క తగిలించుకొని, ఓ వాడేసిన పందుంపుల్లా, కాస్త నీలిమందూ, ఓ గిన్నెలో మైదా జిగురూ, ఓ హరికేన్ లాంతరూ పట్టుకొని బయలుదేరేవాడు. తనకి ముఖ్యం అనిపించిన సెంటర్లలో ఆగి, న్యూస్ పేపరు మీద నీళ్లలో తడిపిన నీలిమందులో పందుంపుల్ల ముంచి, "ఫలానా గుర్తుకే మీ వోటు" అని వ్రాసి, నిచ్చెన వేసుకొని, సినిమా వాల్ పోస్టరుల క్రిందో, ప్రక్కనో మైదా జిగురుతో అంటించి, అక్కడ మీటింగు పెట్టేవాడు. ఓ రేకు గొట్టం--పాత న్యూస్ రీళ్లలోనూ, బొలో స్వతంత్ర భారత్ కీ అనేవాళ్లు వుపయోగించిందీ--మూతి పట్టేంత వెడల్పు వుండి, తరవాత సన్నగా వుండి, పోనుపోనూ వెడల్పుగా ఓ 18 అంగుళాలు పొడవుండే గొట్టం--లోంచి మాట్లాడుతూ తనకి వోటు వెయ్యమని అభ్యర్థించేవాడు.

(ఆయన యెప్పుడూ నెగ్గలేదు, డిపాజిట్ దక్కించుకోలేదు అని వేరే చెప్పఖ్ఖర్లేదుగా? కానీ "ప్రజాస్వామ్యం మీద" ఆయనకి అంత నమ్మకం మరి!)

ఇంక, ప్రత్యేక ఆంధ్ర రాష్ ట్రోద్యమం లో, మా నరసాపురం మునిసిపాలిటీకి "రాబోయే యెన్నికల్లో కాబోయే ఛైర్మన్" గా తన పదవికి రాజీనామా ఇచ్చిన కొవ్వలి అయ్యన్న నాయుడి గురించి ఇదివరకోసారి వ్రాశాను. (తరవాత ఓసారి అసెంబ్లీ యెన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, ప్రథాన పార్టీల ప్రత్యర్థులకి షాకులమీద షాకులిచ్చాడు--కౌంటింగ్ పూర్తయ్యేదాకా.)

తాత-మనవడు, స్వర్గం-నరకం, పాలూ-నీళ్లూ లాంటి జంట పదాలతో దా నా రా వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. అవన్నీ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో, తన వెరయిటీ ట్రీట్మెంటూ, సింబాలిజాలతో, జనాలకి తెగ నచ్చేశాయి. మేఘం లో తన పేరు వేసుకోవడం కూడా అప్పట్లో ఓ వెరయిటీ! తరవాత కొన్ని "కళా ఖండాలు" కూడా తీశాడు--మేక...సారీ...మేఘ సందేశం; ప్రేమాభి.....ప్రేమకి పట్టాభి.....ఇలా!

కడుపులో చల్ల కదలకుండా వున్న చిరంజీవిని ముఖ్య మంత్రిని చెయ్యకపోగా, ముక్కు వూడిన మంత్రిని చేశాడు. ఇప్పుడు బాల కృష్ణ మీద పడ్డాడు. ఆయనేమౌతాడో మరి!

ఇవన్నీ యెందుకు గుర్తు వస్తున్నాయంటే, కాలేజీల ప్రిన్సిపాల్ లగానూ, లెక్చరర్లగానూ పని చేసి, యూజీసీ స్కేళ్లతో యాభయ్యేసివేల రూపాయల జీతాలతో పదవీ విరమణ చేసినవారు, "వేణ్నీళ్లకి చన్నీళ్లు" అంటూ ప్రైవేటు కాలేజీలలో కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ లు, సూపర్వైజర్లు గా, నెలకి 3 నుంచి ఫదివేల రూపాయలకి కుదురుకొంటున్నారు--బాగానే వుంది.

ఇప్పుడు వాళ్లని, వేసవి సెలవల్లో మీకు జీతం కావాలంటే, రాత్రి వేళల్లో మన కాలేజీ పబ్లిసిటీకి వాల్ పోస్టర్లు అంటించండి అనీ, పగలు యెండలో, డోర్ టు డోర్ తిరిగి, విద్యార్థులని మన కాలేజీలో చేర్పించండి అనీ వుత్తర్వులు జారీ చేస్తున్నారట!

సంచీ లాభం చిల్లు తీర్చిందని, యెంత బాగున్నాయో--వేణ్నీళ్లూ, చన్నీళ్లూ--పాలూ, నీళ్లూ--!

(ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో "లైఫ్ సర్టిఫికెట్ కమ్ నాన్ రీ-ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్" మాత్రం చిరునవ్వుతో సంతకంపెట్టి పారేస్తారు--లేకపోతే మొదటికే మోసం కదా మరి!)

Saturday, April 16, 2011

గోడమీది.............వ్రాతలు

నాకు తెలుసు.....గోడమీది అనగానే, పిల్లులూ, బల్లులూ వగైరా అనే అనుకుంటారని. 

కానీ నేను వ్రాసేది "వ్రాతల" గురించి. అంటే........

1960 ల లోనో, ఇంకా ముందేనో, ఈ 'గోడమీది వ్రాతలు' వ్రాయబడేవి. సినిమాలలో చూపించినట్టు కాదు--ప్రకటనల రూపం లో. నీటిమీది వ్రాతలకి ఇంగ్లీషులో యేదైనా పేరు వుందో లేదో తెలీదుగానీ, ఈ గోడమీది వ్రాతలకి ఓ పేరుంది "గ్రాఫిట్టీ" అని. దీంట్లో "గిన్నిస్ బుక్" లోకి యెక్కినవి కూడా వున్నాయి(ట).

సిమెంటు ఇటికలతోనో, మామూలు ఇటికలతోనో మనం ప్రహరీ కట్టించుకుంటాం మన ఇంటి చుట్టూ. దాని తడి ఇంకా ఆరదు. కొంతమేర తెల్లగా సున్నం వేయబడి వుంటుంది తెల్లారేసరికల్లా! మనం గమనించం. ఆ మర్నాటికి, ఆ చోటులో ఓ ప్రకటన ప్రత్యక్షం! అదీ రోడ్డున పోయేవాళ్లు మనకి చెపితేనే తెలిసేది. 

అప్పట్లో--"అదేదో; లీకో; కాల్ గ్యాస్" అనే ప్రకటన ముఖ్యమైనది. మొదటిది నాకు ఙ్ఞాపకం లేదు. యెవరైనా గుర్తు చేస్తే సంతోషం. రెండోది, 'క్రమ షడ్భుజాకారంగా' వుండే లీకో బొగ్గులు. అవి ప్రత్యేకంగా 'నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్' వారు తయారు చేసేవారు. మూడోది నేటి మన వంట గ్యాస్. ఇంటింటికీ కావిళ్లలో మోసుకొచ్చి, సిలిండర్లూ, స్టవ్ లూ ప్రదర్శించి, కేవలం రెండువందల రూపాయలో యెంతో, కొనుక్కోమని బ్రతిమలాడేవారు. "ఊహూ...." అనేవారు చాలా మంది. (తరవాత కథ అందరికీ తెలిసినదే!)

ఇంక, "సీతా మలమా"; "సపట్ లోషన్; మలమా"; "దాద్, ఖుజ్లీ కీ దవా--జాలిం లోషన్" లాంటి ప్రకటనలు తరవాత వచ్చేయి. 

ఇంకా ముఖ్యంగా, యెన్నికలు వచ్చినప్పుడు, "ఫలానా పార్లమెంటు అభ్యర్థి.....కీ; ఫలనా అసెంబ్లీ అభ్యర్థి......కీ 'మాత్రమే' మీ వోటు వేయండి. యెన్నికల గుర్తు ఫలనా, యెన్నికల తేదీ ఫలానా!" అని ప్రకటనలు తెల్లారేసరికల్లా అనేక గోడలమీద, అంతకు ముందటి ప్రకటనలని తుడిచేసి ప్రత్యక్షమైపోయేవి.

టీ ఎన్ (అల్) శేషన్ పుణ్యమా అని అవి రద్దు అయిపోయాయి. (వాడు లేడు కాబట్టి, మేము ఇప్పుడు తెగిస్తాం అనేవాళ్లెవరూ రాకపోవడం మన అదృష్టం.)

ఇందులో క్యామెడీ యేమి వుంది అని మీరడగొచ్చు. 

మా తెలుగు మేష్టారు ఒకాయన చెప్పారు--విజయనగరంలో ఓ అర్టిస్ట్ వుండేవాడట. గోడలమీది ప్రకటనల్లో స్పెషలిస్ట్. "ఫలానా....ఫలానా" అని ప్రకటన వ్రాసేసి, ఓ మూల చిన్న అక్షరాల్లో తన పేరు/సంతకం చేసేవాడట "నందెం గవయ్య" అని. 

మేము మా మాస్టారిని యెక్కువగా అల్లరిచేసి విసిగించేసినప్పుడు ఆయన "నా మొహం మీద నాపేరు నం|| గ|| అనిరాసుందేమిట్రా?" అని ఖోప్పడేవారు. 

ఇంక యెలెక్షన్ గ్రాఫిట్టీలకొస్తే, మా కొండెలు "జమ్షీద్", "యజ్దానీ" అని వుండేవారు. (ఆవి వాళ్ల అసలు పేర్లు కాదు) జమ్షీద్ మంచి ఆర్టిస్ట్. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అక్షరాలనీ, అప్పట్లో వచ్చే సినిమా టైటిల్సునీ "యెలా వున్నవి అలా" వ్రాసేసేవాడు. సహజంగా, యెన్నికల్లో అభ్యర్థులు వాణ్ణి పిలిచి, నీకు ఇన్ని గోడ బోర్డులకి ఇంత ఇస్తాం అని కాంట్రాక్టు కుదుర్చుకొనేవారు.

మరి యజ్దానీ తక్కువ తిన్నాడా? తనకి యే భాష అయినా 'వంకర టింకరగా' వ్రాయడమే వచ్చు. పైగా, రంగులు యెలా కలుపుకోవాలో, వాటికి ముడి పదార్థాలు యేమిటో, బ్రష్షులు యేవి వాడాలో--ఇలాంటివి వాడికి తెలీదు. కానీ, ప్రయోగాలు చేసేసేవాడు. జమ్షీద్ గాడు కుదుర్చుకున్న అభ్యర్థికి ప్రత్యర్థిని యెంచుకొని, వాడికన్నా 'తక్కువ రేటు' కి తాను వ్రాస్తాను అని కాంట్రాక్టు కుదుర్చుకొని, ఇంక మొదలెట్టేవాడు--పెట్రోమాక్స్ లైట్లు వెలిగించుకొని, (జమ్షీద్ పగలే వ్రాసేసేవాడు--తనకి భయం లేదు కదా!) తెల్లవార్లు ఓ పది పదిహేను బోర్డులు చాలా ఖష్టపడి వ్రాసేసి, తెల్లవారాక ఇంటికివెళ్లి పడుకొనేవాడు.

ప్రొద్దున్నకల్లా, ఆ బోర్డులు--పెయింట్లు రంగులు కారుకొంటూ, గడ్డకట్టి, భయంకరంగా అయిపోయి--దర్శనం ఇచ్చేవి జనాలకి! 

అంతకు ముందే హిందీలో "గుమ్ నామ్" (అంటే అర్థం రహస్యంగా అనేమో) సినిమా వచ్చింది. దాని టైటిల్ అలా 'రక్తం కారి గడ్డకట్టినట్లు' చిత్రీకరించారు. 

అప్పటినించీ యజ్దానీని "గుమ్ నామ్ ఆర్టిస్ట్" అని యేడిపించేవాళ్లం. 

పాపం జమ్షీద్ 50 యేళ్లకే వెళ్లిపోయాడు. యజ్దానీ మాత్రం ఇంకా ఓ జర్నలిస్టుగా వున్నాడట. కలుస్తాడేమో చూద్దాం!

Tuesday, January 11, 2011

పాడి 'పెంటలూ'.....

......ఓ బ్యాంకు మేనేజర్ పాట్లు

"హమ్మయ్య! ఈరోజు శనివారం. అయినా, శుక్రవారాంతానికి హెడ్డాఫీసుకి పంపించవలసిన 'టీ డీ ఎల్' మధ్యాహ్నం 12.30 లోపల పోస్టువాళ్లకి అందించడంతో, రెండుకల్లా బ్యాంకు శాఖ మూసేసి, మధ్యాహ్నం రావఖ్ఖర్లేదు." అనుకొని, 'పంగనామాల' ఇంటిపేరున్న ఆ బ్యాంకు మేనేజరు, ఇంటికెళ్లి, భార్య వండిన కూరా, పచ్చడీ, చారూ, మజ్జిగతో భోజనం ముగించి (మామూలు రోజుల్లో ఆ అదృష్టం వుండదు పాపం!) రేడియోలో పాటలు వింటూ, నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు.

వాళ్లావిడకూడా, 'పాపం! యెన్నాళ్లకో ఈయనకి ఈ సౌఖ్యం!' అనుకుంటూ, తన పని తను చేసుకొంటోంది--ఆయన్ని లేపకుండా.

సాయంత్రం ఆరవుతోంది--బ్యాంకువారు తన ఇంటికి ఇచ్చిన ఫోను మోగింది--"మేంజరు గారూ...'మీ గేదె' కోరమాండల్ క్రింద పడి....." అంటూ. (లం. కో! ఆ గేదె రోజుకి 10 లీటర్లు పాలు ఇచ్చినప్పుడు నీదా....అది 'ఇప్పుడు' నా గేదా?! అని తిట్టుకొన్నాడు!)

దెబ్బతో నిద్రమత్తు వదిలిపోయిన ఆయన, బట్టలు వేసుకొని (అంటే అప్పటి వరకూ లుంగీలో వున్నాడనే!) స్కూటరు స్టార్ట్ చేసుకొని, రైలు గేటు దగ్గరకి పరుగెట్టాడు. 

రైలుగేటు దగ్గరకి చేరేసరికి, అక్కడ జనం కొంతమంది మూగి వున్నారు.....'యెక్కడా?' అని ఆయన ప్రశ్నిస్తూండగా, రైల్వే ట్రాక్ మీద ఓ పదిహేను మీటర్ల దూరం ఈడ్చుకుపోబడి, అసువులు బాసిన గేదె కళేబరాన్ని చూసి, 'హమ్మయ్య ' అనుకొనేంతలో, తమ బ్యాంకులోనే అప్పుతీసుకొన్న ఓ గొడారివాడు 'నమస్కారం సార్!' అనగా, 'ఓ! నువ్వా! సరే, సరే, ముందు ఆ చెవుల చివర వున్న 'ట్యాగ్' లని కత్తిరించు!' అని పురమాయించి, ఆ చెవుల్ని పట్టుకొని, దగ్గర్లో వున్న ఓ షాపులోకి వెళ్లి, 'మీ ఫోనోసారి వాడుకుంటా....' అని అడిగి, ఇన్ స్యూరెన్సు ఇన్స్ పెక్టరుకి ఫోను చేస్తాడు.

........మిగతా మరోసారి.

Sunday, January 2, 2011

నా వార్తలు....

నా యిష్టం....!

ఈ శీర్షికతో, ఎన్‌డీటీవీలో రాత్రి పదీ, ఆ తరవాతా ప్రసారమౌతున్న రోశయ్య, కిరణ్ కుమార్, కేసీఆర్, చిరంజీవీ వగైరాల 'న్యూస్ బులెటిన్లు', తరవాత మియా-మామా లూ చూస్తున్నారా? భలే వుంటున్నాయి.

ప్రత్యేకంగా, 'నా వార్తలు, నాయిష్టములు...' అంటూ, న్యూస్ రీడర్ 'సోనియా' చెపుతున్న వార్తలు భలే గమ్మత్తుగా వుంటున్నాయి.

ఆ ఆర్టిస్టు యెవరోగానీ, వాయిస్ యెనాలిసిస్ చేసినా పెర్ఫెక్ట్ గా కుదిరే గొంతుకతో, సోనియాని మిమిక్ చేస్తూంది! హేట్సాఫ్!

రోజూ చూడండి--ఇవాళ మామా-మియాలో--నిత్యానందా, రంజిత గురించీ......!

తప్పక చూడండి.....మీ యింట్లోనే.....ప్రతీరోజూ, మీరు కోరినన్ని ఆటలు......త్వరపడండి....ఆలసించిన ఆశాభంగం!