Sunday, October 17, 2010

ఇదియొకరకపు

"బ్లాగ్వెఱ్ఱి"

(కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ బ్లాగ్ వ్రాయడం మొదలుపెడితే.......అనే ఆలోచనతో--ఈ సరదా రచన. యిక కొన్ని వందల అరసున్నాలు టైపు చేసే వోపికలేక, యిలాగే ప్రచురిస్తున్నాను--వుండవలసినచోట అవి వున్నాయని భావించే చదువుకోవలసిందిగా మనవి)

"యింద్రజాల మహేంద్రజాలముల ను వింటిమి. యిప్పుడిది యేమో అంతర్జాలమనుచున్నారది యంతటిదే యేమో. 

మొన్న నా నూఱవ బుట్టినరోజున నా మనుమడు నాకొక 'గణన యంత్రము ' (దీనిని యాంగ్లమున గoప్యూటరందురట) బహూకరించినాడు. దీనిద్వారా యంతర్జాలమును జేరుట జాల సులభము. అదియొక జిత్రము.

యీ యంతర్జాలములో యనేకమంది వ్రాయు రచనలను బ్లాగులందురట. నేను గూడ నొక బ్లాగును బ్రారంభించితిని. 

దీనిలో జిత్రమేమనగా, వొకడు దన బ్లాగు (యీ బ్లాగులను గొంతమంది యాంతర్యములను బేరుతో బిలచుచున్నారట) లో నొక లేఖ వ్రాయును. దానిని జదివినవారు వారి యభిప్రాయములను వ్యాఖ్యలుగాబెట్టుదురు. వీనిని వీడు జదువుకొని, బ్రతివ్యాఖనుగూడ పెట్టవచ్చును. అదియట్లుండనిండు.

వీడు యితరుల ఆంతర్యములను జదువ వచ్చును, దన వ్యాఖ్యలనందుంచవచ్చును. దానికి బ్రతి వ్యాఖ్య యేమైన వచ్చినదేమో గూడ జూచుకొనవచ్చును. యీ బ్రక్రియకోసము, సంకలినులు బ్రవేశబెట్టబడినవట. బాగుగయున్నది.

యీ సంకలినులయందు గొన్ని వ్రేల లేఖలుండవచ్చును. 

వొకడు యీ యంతర్జాలమున తన లెఖలే వ్రాయునా, వాటి మీది వ్యాఖ్యలేజూచుకొనునా, వాటికి ప్రతివ్యాఖ్యలేజేయునా.....!? యివిగాకుండ సంకలినులలోని వేనవ్రేల లేఖలనేజదువునా, వాటిపై వ్యాఖ్యానించునా, మఱల బ్రతి వ్యాఖ్యలేజదువుకొనునా.......!?...యేమో....దీనియంతుబట్టకున్నది.

అయిననూ నేనొక సులభమార్గమును గనిబెట్టితిని--

యదియేమన...సాధారణముగా లేఖలు వ్రాయువారికి యది యొక వ్యసనముగా మారును.వ్రాయువాడెవడైన దానందరికంటె బాగుగా వ్రాయుచున్నానని యనుకొనును. పాడువాడెవడైన దాను మిగతయందరికంటె బాగుగాబాడుచున్నాననియే యనుకొనును. యిది మరియొక జిత్రము. 

వీరిలోగొంతమంది రోజుకొక లేఖ వ్రాయవలెనను నియమముబెట్టుకున్నవారుందురు, గొందరు రోజునకెన్నైన వ్రాయుదునని సవాలు విసిరినయట్లు వ్రాయుదురు. మరిగొందరు యే యెండకో, వానకో నొకటి వ్రాయుదురు.

యిక బండుగులు, సెలవు దినములు, బ్రపంచ "యేదో" దినములు వచ్చినప్పుడందరునదే విషయమును గురించి వ్రాయుదురు....యిది యింకొక జిత్రము. శుభాకాంక్షలను దెలుపుకొనుట గూడ బాడియే! యింకొకనికి జాకిరేవు బెట్టుకొని, వుతికియారవేయుటే నియమము. వేరొకనికి దేవుళ్ల దేవుళ్లాటలు, వేదములు, బురాణములు, మట్టీ, మసేనము బ్రముఖముగాదోచును. మరిగొందరికిదమ బాకశాస్త్రబ్రావీణ్యము బ్రదర్శింపవలెననిపించును. 

యివియన్నియు మనముజదువక్కరలేదనుకొన్న, జదువవలసినవి వ్రేళ్లమీద లెక్కింపదగును. యిది జిత్రములలోకెల్ల జిత్రము.

యివ్విధమున నా యాంతర్యముల బఠనమును గొనసాగింప నిశ్చయించుకొంటిని. 

యిక మరియొక గల్పవృక్షమునో, గామధేనువునో వ్రాయ సంకల్పించితిని నా యాంతర్యములో. మరల గలసికొందుము. 

యితిశ్రీః"

Tuesday, October 12, 2010

మన చెవలాయిలకి.....

......"అదుర్స్" కార్డులు!

బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ వాళ్లు, వ్రేలి ముద్రలూ, చేతి ముద్రలూ, ఐరిస్ లూ లాగే "చెవులని" కూడా బయోమెట్రిక్ పధ్ధతిలో స్కాన్ చేసి, ఆయా వ్యక్తుల వివరాలని గుర్తించే విధానాన్ని రూపొందించారట! కేవలం 252 మంది చెవులని మాత్రమే పరిశీలించి, ఈ పధ్ధతి విజయవంతం అవుతుందని తేల్చేశారట!

మరింకేం! మనం కూడా ఈ "చెవోమెట్రిక్" విధానం లో కార్డులు జారీ చేసేద్దాం! 

కానీ ఇప్పటికే, రైతులకీ, చిన్న వ్యాపారులకీ, పేదలకీ, వుపాధి వాళ్లకీ, వోటర్లకీ, విద్యార్థులకీ, గిరిజనులకీ రక రకాల చెత్తా చెదార కార్డులిచ్చేశామే?! మరి కొత్త కార్డులెవరికి ఇవ్వాలి?

"అదుర్స్" కార్డుల పేరుతో మన రా నా లకి ఇచ్చేస్తే పోలా? సురక్షితం గా "మన పని" కానిచ్చుకోవచ్చు, పైగా వాళ్లు వాళ్ల జీత భత్యాలనీ, ప్రభుత్వం నించి రావలసిన బిల్లులనీ, అలవెన్సులనీ వగైరా ఈ కార్డు తో డ్రా చేసుకొని, ఆదాయ పన్ను రిటర్న్ లని యేమాత్రం శ్రమ పడకుండా సమర్పించడానికి అనుకూలంగా వుంటుంది! (ఇవన్నీ వైటే కదా--పైగా ఆడిటర్లకి ఇచ్చే ఫీజు కలిసొస్తుంది!)

ప్రభుత్వం వారూ--టెండర్లు యెప్పుడు పిలుస్తారు?

Friday, October 8, 2010

ముగ్గురు జోగులు

ఆ ముగ్గురే.....

జోగీ జోగీ రాసుకుంటే?......బూడిద రాలుతుందంటారు. ఇక్కడలా కాదు......స్కాములు రాలాయిట!

మొన్నోరోజు "పొన్నాల లక్ష్మయ్య అసమర్థ మంత్రి. అందుకే నీళ్లన్నీ సముద్రం పాలయిపోతున్నాయి" అన్నాడట రఘువీరా. 

"నువ్వు మాత్రం తక్కువా? గోదాముల్లో  ఎరువులున్నా, రైతులకి ఎదురుచూపులు తప్పడం లేదు!" అన్నాట్ట పొన్నాల.

ప్రక్కనే వున్న జూపల్లి ని "నువ్వు మహబూబ్ నగర్ జిల్లాకే మంత్రివా? రాష్ట్రానికి కూడానా?" అనడిగాడట రఘువీరా.

జూపల్లి, "నువ్వు అనంతపురానికే అమాత్యునివా? లేక రాష్ట్రానికా?" అనడిగాడట.

పొన్నాల నవ్వుతూ "దొందూ దొందే"! మంచోళ్లే దొరికారు--అన్నాడట. (దొందూ దొందే కథ గుర్తుందా?)

అవండీ మన మంత్రుల (స్కాము)జోకులు!