Monday, August 23, 2010

తెలుగు తేజాలు

కలలు కనండి

ఇక్ష్వాకుల దగ్గరనించి, శాతవాహనుల దగ్గరనించి, కృష్ణదేవరాయలు దగ్గరనించి, టంగుటూరీ, పీవీ, లేటేస్ట్ శ్రీరామ్ వరకూ యెందరో తెలుగు తేజాలు!

పాతవాళ్లకి మన కలామ్ లాంటివాళ్లెవరైనా "కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి!" అని చెప్పారో లేదో తెలియదు గానీ, శ్రీరామ్ లాంటి వాళ్లకి మాత్రం ఆయన చెప్పింది శిరోధార్యం.

అదేమిటోగానీ, మన తెలుగు వాళ్లకి వచ్చే కలలు కూడా అంత గొప్పగా వుండవేమో అనిపిస్తూంది.

దేవుడికోసం తపస్సు చేసి, ప్రత్యక్షమవగానే, "మా మేనమామ చెవుల్లో వెంట్రుకలు మొలిపించు" అని కోరుకున్నవాడు మన తెలుగువాడే!

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని "సద్వినియోగం" చెయ్యడం కూడా తెలియాలంటారు.

అందాలరాముడు సినిమాలో ముళ్లపూడివారనిపించినట్టు--"ఓ వందరూపాయలనోటుని అలా గాలిలో యెగరేసి, పెసరట్టు తెమ్మంటే తేదూ?" (ఈ డైలాగు ఇలాగే వుండకపోవచ్చు)

చెప్పొచ్చేదేమిటంటే, మన ప్రస్తుత తెలుగు తేజం కేవీపీ రామచంద్రరావు చాణక్యుడి వంటివాడయితే, జగన్ చంద్రగుప్తుడివంటివాడు కాదూ? (గాలి ని పర్వతకుడనుకోవచ్చు)

ఆ లెవెల్లో, ప్రథాన మంత్రి సీటుకి ప్రయత్నించకుండా, బోడి ముఖ్యమంత్రి యేమిటండీ?

యాత్రలవల్ల వోట్లు రాలితే, చిరంజీవి ఇప్పటికే ముఖ్యమంత్రి అయ్యేవాడుగా?

కుంచం మామూలుగా కొలవడం కుదరకపోతే, తిరగేసి కొలవమన్నారు!

తగిన వ్యూహం తో ముందుకెళితే ప్రథానమంత్రి పదవి ఓ లెఖ్ఖలోది కాదు--మన పీవీ, సోనియా చూపిన మార్గాలెలాగూ వున్నాయి! 

అప్పుడు అన్ని రాష్ట్రాలవాళ్లూ ముఖ్యమంత్రి పదవులకోసం మన కాళ్ల ముందరే పడి వుంటారు కదా?

చిన్న సమస్య యేమిటంటే, ప్రత్యర్థి రాహుల్ ని యెదిరించాలంటే, అంతర్జాతీయ ఇటాలియన్ కనెక్షన్ తో పెట్టుకోవాలి.

మనకి రస్ అల్ ఖైమాలూ, మారిషస్ కనెక్షన్లూ వున్నాయి కదా! అదెంతపని.

జగన్! ఆలోచించు! 2014 కల్లా జగన్ ని ప్రథాన మంత్రిని చెయ్యాలి అనే ఆశయంతో ముందుకు సాగడమే మా వంతు అని తమ అనుచరులుతో అనిపిస్తే యెలావుంటుందో!

శుభస్య శీఘ్రం!