Wednesday, May 5, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-4

మేం అక్కడ వుండగానే, మా చిన్న మామయ్య వాళ్ళ ఆవుకి ఓ దూడ పుట్టింది. పూర్తిగా కాషాయరంగులో, యెక్కడా మచ్చలేకుండా, ముద్దొస్తూ వుండేది అది. చెంగు చెంగున పరిగెడుతూ మాతో బలే ఆడేది. అప్పుడు మేం నేర్చుకున్న ఇంకో కొత్తమాట--'తువ్వాయి!'

ఆ వూళ్ళోనే, 'పురెల గాదెలూ', 'వరల గాదెలూ' మొదటిసారి చూసి తెలుసుకున్నాము.

మా చిన్న మామయ్యకి ఓ సవారీ బండి వుండేది. ఓ రోజు ఆ బండి కట్టించి, మమ్మల్ని మా చిన్న దొడ్డ వుండే వూరు (అక్కణ్ణించి ఓ పదిహేను కిలో మీటర్లుంటుందనుకుంటా) పంపించారు. ఆ దారి లోనే మేము 'పల్లకీ బొంగు'లున్న వెదురు పొదల్ని చూసింది!

ఆ బండి తోలిన అబ్బాయి మా నాన్నతో మాట్లాడుతూండగా, మేం విన్న మరో కొత్త మాట 'కాబోలు బాకీలు.' అప్పట్లో అర్థం తెలియకపోయినా, అదో వింత మాటగా గుర్తుంచుకుని, తరవాత విరిగిగా వాడేసేవాళ్ళం.

ఆ రోజు రాత్రి కూడా మా దొడ్డా వాళ్ళింట్లో వుండి, మర్నాడు పొద్దున్న బయల్దేరి, మా అమ్మమ్మగారి వూరు వచ్చేశాం.

వాళ్ళ వూరికో ప్రత్యేకత వుండేది. వూళ్ళో ఓ 30; 40 ఇళ్ళుండేవి. అన్నీ తాటాకు పైకప్పు వున్న ఇళ్ళే. దాని పైన గడ్డి పరిపించేవారు. మా తాతగారిదే రాళ్ళ పునాదులతో, ఇటుకలతో కట్టిన ఇల్లు. మిగిలినవన్నీ మట్టి ఇళ్ళే. పై కప్పు క్రింద, గోడల లెవెల్ వరకూ ఓ మేదరి తడికో, వెదురు తడికో బిగించి, దాన్ని మట్టి తో మెత్తేవారు. పైకి యేమైనా చేర్చడానికి మనిషి పట్టే ఓ కన్నం వుంచేవారు. దానికో వెదురో, చెక్కో నిచ్చెన వుండేది. తడిక పై భాగాన్ని 'మిద్దె' అని వ్యవహరించేవారు.

ప్రత్యేకత యేమిటంటే, ప్రతీ సంవత్సరం వేసంకాలం లో ఆ వూళ్ళో ఇళ్ళన్నీ 'పరశురామ ప్రీతి' అయిపోయేవి!

కొన్ని సార్లయితే, సంవత్సరం లో రెండు, మూడు సార్లు కూడా ఇళ్ళన్నీ అగ్నికి ఆహుతి అయ్యేవి!

'ఆ సూరప్ప లంజె (వెనకింటావిడో, పక్కింటావిడో) జీడిగింజలు కాల్చుకొని, కుంపటి ఆర్పి, మిద్ది మీద పెట్టేసిందటే! నిప్పు మళ్ళీ రాజుకొని, ఇళ్ళన్నీ తగలబడ్డాయి!' అనేది మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చేసి!

మా పెద్ద మామయ్య అప్పటికే తన వుద్యోగ రీత్యా రాజమండ్రి లో వుండేవాడు. (అప్పటికి ఆయనకి ఓ మునిసిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడుగా వుద్యోగం అయ్యింది). చిన్న మామయ్య తన సొంత ఇంట్లో వుండేవాడు అదే వూళ్ళో. అమ్మమ్మ ఒక్కతే ఆ యింట్లో వుండేది. కొన్నాళ్ళకి మా చిన్న మామయ్య ఆ యింటికి మళ్ళీ తన పొలం లోంచి తాటి పట్టెలూ, తాటాకులూ, కొబ్బరాకులూ, గడ్డీ తో పై కప్పు వేయించి, ఓ కార్డు ముక్క వ్రాసేవాడు. మళ్ళీ ఈవిడ ప్రయాణం తన సొంత ఇంటికి!    

తరవాత మా చిన్న మామయ్యకి కూడా ఆ వూరికి రెండు కిలో మీటర్ల దూరం లో ఓ పల్లెలో ప్రాధమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా వుద్యోగం రావడం, దాంతో పాటు ఆయనని ఆ వూరి పోస్ట్ మాస్టర్ గా నియమించడం తో, ఆయన ఆ వూళ్ళో ఓ ఇల్లు కట్టుకొని, అక్కడికి మారి పోయారు.

ఆక్కడనించి, మా అమ్మగారి ఇల్లు యేమయిందో, యెవరు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారో యెవరికీ తెలియదు! 

--ఇంకొన్ని గుర్తు తెచ్చుకొని, మరోసారి.

No comments: