Sunday, July 10, 2011

నిజజీవితంలో కామెడీ

చిత్రమైన వార్తలు

"చిక్కీ పిక్కీ" అనే కాలనీలో "గురునాథ్" అనే వ్యక్తి, తోపుడుబండిమీద వస్తువులు పెట్టుకొని, వ్యాపారం చేసుకుంటాడట. మామూలుగానే పాపం నిన్న తన బండితోసుకుపోతూంటే, యెక్కడనుంచి వచ్చిందో, ఓ బుల్లెట్ అతని యెడమ భుజం దండలో దిగబడిందట! హటాత్తుగా రక్తం కారడం, నెప్పీ తెలిసేసరికి అతన్ని ఆసుపత్రిలో చేర్చి, బుల్లెట్ తీయించి చికిత్సచేయించారట. ఆ విషయాన్ని, అతని స్నేహితుడు "రాహుల్ గాంధీ" ఫోనుద్వారా తన భార్య "గులాబ్ జామూన్" కి చెపితే, ఆమె పొరుగునే వున్న గురునాథ్ భార్య "జపాన్" కీ, మామయ్య "అండమాన్" కీ చెప్పిందట. ఇదంతా "దొండకాయంత" దొంగాడు, "పొట్లకాయంత" పోలీసు, "జామకాయంత" జైలు లాంటి కథ కాదండోయ్! బెంగుళూరు నగరంలో నిజంగా జరిగిన ఘటన అని పేపర్లో ఫోటొతోసహా ప్రచురించారు!
మామూలుగా ఆడవాళ్లు ముందుండే ద్వారంలోంచీ, మగవాళ్లు వెనకుండే ద్వారంలోంచీ యెక్కుతారు సిటి బస్సులో. బెంగుళూరులో, ముందు ద్వారంలోంచి యెక్కేసిన ఓ యువ సాఫ్ట్ వేర్ మగ ఇంజనీరుని కండక్టరు కన్నడంలో "నువ్వేమయినా ఆడపిల్లవా? ముందునించి యెక్కేశావు?" అని కోప్పడ్డాడట. దానికతను "గొత్తిల్ల"  (నాకు కన్నడం "తెలీదు" అనే వుద్దేశ్యంతో) అని సమాధానం ఇచ్చేసరికి బస్సంతా గొల్లున నవ్వులు! (ఇది పాత జోకే అయినా, బెంగుళూరు ప్రసక్తి వచ్చింది కాబట్టి సరదాగ మరోసారి!)

అమెరికాలోని ఓహియో నగరంలో 911 (పోలీసు) కి ఓ ఫోను వచ్చిందట. విషయం "బనానా పీల్" (అరటిపండు తొక్క) ఒకటి "గొరిల్లా" ని గుద్దేసి వెళ్లిపోతే, గొరిల్లా క్రిందపడిపోయి నడుమో యేదో బెణికిందట! పోలీసులు ఆరా తీస్తే, విషయం--తన వుద్యోగంలో భాగంగా ఒకాయన, ఓ స్టోరు దగ్గర గొరిల్లా వేషంలో, వచ్చేవాళ్లని అలరిస్తూ వుంటాడట. ఓ నలుగురు టీనేజర్లు తమ విచిత్ర వేషధారణలో భాగంగా రకరకాల దుస్తులు ధరించి పరిగెట్టుకు వెళుతూ, ఆయన్ని ఓ సగం వొలిచిన అరటిపండు వేషంలో వున్న ఒక టీనేజరు గుద్దేశాడట! పోలీసులు దర్యాప్తు చేసినా, ఆ అరటి తొక్క దొరకలేదట గానీ, అదో పెద్ద వార్త అయిపోయింది! అదీ సంగతి.

Thursday, July 7, 2011

వార్తాహరులూ........2

.......సందేశాలూ
......ఆ సబ్ పోస్ట్ మాష్టరు.....కొంచెం తెల్లగా, పొడుగు ముక్కు తప్పితే, "అమ్యమ్యా" సినిమాలో అల్లు రామలింగయ్యలా వుండేవాడు......యేదో సీరియస్ గా పని చేస్తున్నట్టు నటిస్తూ, అరగంటకి గానీ బుర్రపైకెట్టి కళ్లజోడు పైనుంచి చూసేవాడు కాదు. ఈ లోపల వెనక్కాల కొంత క్యూ పెరిగేది. నా చేతిలోని కవరు తూచి, '....రూపాయలు అంటించండి ' అని బయటికి విసిరేసి, "నెక్స్ట్..." అనేవాడు....ఆ స్టాంపులు కొనుక్కొనే అవకాశం కూడా ఇవ్వకుండా. మళ్లీ క్యూ చివర చేరి, వాడి దగ్గరకి వచ్చేసరికి ఇంకో అరగంట. అప్పుడు ఇచ్చేవాడు స్టాంపులు. సరే, వాటిని అంటించి, డబ్బాలో వేసేవాడిని. ఓ గంట ఆలస్యంగా కాలేజీ కి వెళ్లేవాడిని.

ఓ సారి బాగా వొళ్లు మండిపోయి, వీడిమీద యెలా కక్ష తీర్చుకోవాలా అని తీవ్రంగా ఆలోచించి, ఓ పథకం వేశాను. అదే.....ఓ అరఠావు తెల్లకాయితం తీసుకొని, దాన్ని ఇన్లేండ్ లెటర్ ఆకారంలో కత్తిరించి, దానిమీద, "ఒరే అల్లు రామలింగయ్యా! యెంతసేపూ వచ్చినవాళ్లని పట్టించుకోకుండా యేమి మిడుకుతావు? ఆ మిడికేదేదో వచ్చినవాళ్ల అవసరాలు చూసి, ఖాళీగా వున్నప్పుడు మిడిక్కోవచ్చు కదా? నీకు మిడకడానికే కాదు జీతం ఇస్తున్నది. కార్డులూ, కవర్లూ, స్టాంపులూ అమ్మాలి, రిజిస్టర్ కవర్లు తీసుకోవాలి....ఇలా బోళ్లు పనులు అప్పచెప్పారు కదా? ఇంకెప్పుడైనా నీ కిటికీ ముందు ఇద్దరో, ముగ్గురో క్యూలో కనపడినా నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను జాగ్రత్త!" అని వ్రాసి, చక్కగా మడిచి జిగురుతో అంటించేసి, టు అడ్రెస్ లో "పోస్ట్ మాస్టర్..." అంటూ వాడి అడ్రెస్ వ్రాసి, ఫ్రమ్ అడ్రెస్లో, "పీ ఎం జీ, హైదరాబాద్" అని రబ్బర్ స్టాంప్ అకారంలో నల్ల సిరాతో చెక్కి, కవరుపై అంటించవలసిన స్టాంపు స్థానంలో "పోస్టేజ్ విల్ బి పెయిడ్ బై ది అడ్రెసీ" అని చిన్న అక్షరాల్లో ప్రింటులా వ్రాసి, వాడి పోస్టు డబ్బాలోనే ఓ సాయంత్రం పూట వేసేశాను. (దీనికి సాక్ష్యం, నాకు నేల టిక్కెట్టుతో సినిమా చూడ్డం నేర్పాడని చెప్పానుచూడండి--వాడే--భాస్కర రావు అనే నా కొండెగాడు). తరవాత యేమయిందో, రకరకాలుగా సీన్లు వూహించుకొంటూ, నవ్వుకుంటూ, యేకపాత్రాభినయాలు చేస్తూ, యెంతో ఆనందించేవాళ్లం! ఆ మర్నాటినుంచీ, కిటికీ ముందుకి యెవరు వచ్చినా, తన కళ్లజోడుపైనుంచి అనుమాన దృక్కులు పరుస్తూనే,  గబగబా వాళ్ల పని చేసి పంపించేసేవాడు. క్యూ యెప్పుడూ కనపడలేదంటే నమ్మండి! నా కొండెగాడు ఇప్పటికీ అంటూ వుంటాడు--"అబ్బాయిగారి దెబ్బంటే....గోలుకొండ అబ్బా!" అని. అదీ పిట్టకథ. (బాగా వుపయోగించానంటారా.....ఇంగ్లాండు కవరుని?)

ఇంక వార్తాహరుల గురించి అసలు విషయానికొస్తే, మా ఆవిడా నేనూ సరదాకయినా, సీరియస్ గా నైనా, వాదన లో పడితే, మేమిద్దరూ ప్రకటించే యేకాభిప్రాయం--"అసలు ఆ పోస్ట్ మ్యాన్ ని తన్నాలి!" అని!

ఆ కథాక్రమంబెట్టిదనిన......

1972 చివర్లో, మేం నిరుద్యోగుల సంఘం తరఫున ప్రత్యేక ఆంధ్రోద్యమం చివర్లో వుండగా, మా ఇంటి వార్డు పోస్ట్ మ్యాన్ (ఆయన పేరు గుర్తు లేదు--ఇంటిపేరు 'పితాని '. మంత్రి పితానికి యేమైనా అవుతాడోలేదో తెలీదు.) నాకు ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం వచ్చినట్టు అపాయింట్ మెంట్ లెటరు తెచ్చిచ్చాడు. ఇంటిల్లిపాదికీ ఆనందం. అందులో "త్వరలో మీకు వుత్తరం వ్రాస్తాము. మేము చెప్పిన తేదీల్లో, మెడికల్ టెస్ట్ కి హాజరు కావలసి వుంటుంది" అని కూడా వ్రాశారు. అక్కడనించీ, యెదురు చూపు ప్రారంభం. యెంతకీ ఆ వుత్తరం రాదు. ఓ రోజున, ఆ పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్లిపోతుంటే, మా కాలవగట్టున అతన్ని ఆపి, మా ఇంటి అడ్రెస్ కి వుత్తరాలు యేమీ రాలేదా? అని అడుగుతూంటే, ప్రక్కన వున్న యెవరో, "ఈయనకి ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం వచ్చింది. మెడికల్ టెస్ట్ కి ఇంకో వుత్తరం రావాలిట--అందుకనీ ఆతృత!" అనగానే, పోస్ట్ మ్యాన్ "మెసెంజరుగానా?" అని అడగడం, ప్రక్కాయన, "ఈయన బీ కాం సెకండు క్లాసు--కేషియరు వుద్యోగమే!" అనడం, పోస్ట్ మ్యాన్ "అబ్బో! ఇంకేం! నక్కని తొక్కారు" అనడం, నాకిప్పటివరకూ గుర్తే. కానీ ఆ మెడికల్ టెస్ట్ వుత్తరం మాత్రం రాలేదు! (దాని గురించి వ్రాస్తే ఇంకో ప్రహసనం! యెవరైనా అడిగితే, మరోసారి....)

మొత్తానికి, 12-03-1973 న, ఆంధ్రా బ్యాంకు గాంధీనగర్, విజయవాడ శాఖలో వుద్యోగంలో చేరాను. (అప్పటికి వుప ముఖ్యమంత్రి బీ వీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేసి, వుద్యమంలో చేరడంతో, రాష్ట్రపతి పాలన విధించారో, విధించనున్నారో!) విజయవాడలో అన్ని బ్యాంకులూ, వాటి శాఖలూ, వారానికి రెండురోజులు మాత్రమే పని చేసేవి. (దాని ప్రభావం నా వుద్యోగమ్మీద సంగతి వేరే కథ.)

అలా నా వుద్యోగంలో నేనుండగా.......
   
........తరువాయి మరోసారి!

Wednesday, July 6, 2011

వార్తాహరులూ........

.......సందేశాలూ

(మొన్న ఫణిబాబుగారు మన పోస్ట్ కవర్లగురించి "వుయ్ మిస్ యూ డియర్" అని వ్రాసిన టపా చదివాక)

{నా చిన్నప్పుడు "కాశీ మజిలీ" లాంటి కథల్లో, ఓ అందమైన మాంత్రికురాలూ, ఆమె వెనక ఓ "తాంబూల కరండ వాహినీ" అని చదివి, ఇదేదో ఆ మాంత్రికురాలికన్నా గొప్పదేమో అనుకొని, తరువాత ఆవిడే హీరోకి సహాయం చెయ్యడం చదివి, ఆశ్చర్యపోయేవాడిని! ఇంతకీ ఆ మాటకి అర్థం తెలుసా మీకు?}

నాకు "పోస్ట్ మ్యాన్" లంటే చచ్చేంత ప్రేమా, ఇష్టమూ, కృతఙ్ఞతా వగైరలన్నీనూ--వాళ్లు నాకు తెచ్చిచ్చిన/తెచ్చివ్వని వుత్తరాలూ, ఎం వో లూ, వీ పీ పీ మరియు 'నితర ' పార్సెళ్లకూ'! (అలాంటి 'నితర ' పార్చెళ్లలోనే వచ్చింది--నేను గత 36 యేళ్ల 17 రోజులుగా కాపురం చేస్తున్న మా ఆవిడ అనే "నా రాక్షసి"!).

ఇప్పుడు పోస్ట్ మ్యాన్లు లేరు, వుమన్లూ లేరు--ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కుర్రాళ్లు--పాపం యెండలో మా ఇంటికి వచ్చి, పనికిరాని కవర్లు పట్టుకొచ్చినా (మనం కనపడకపోతే కిటికీలోంచి లోపల పారేస్తారు వాటిని) కవరో యేదో "ప్రత్యక్షంగా" తీసుకొని, "బాబూ! మంచినీళ్లు కావాలా?" అనడిగి, ఫ్రిజ్ లోంచి గ్లాసుడిచ్చి, పంపిస్తూంటాను నేను. ఆ కృతఙ్ఞతలాంటిదీ!

అద్ దానికి "వెనుక మెరుపు" (ఫ్లాష్ బ్యాక్) యేమన.......(అక్కడికే వస్తున్నాను! కొంచెం వోపిక పట్టండి మరి!)

మా చిన్నప్పుడు, పోస్టు కార్డులుండేవి (ఇప్పుడూ వున్నాయి). ఆ కార్డులమీద ఓ స్టాంపు అచ్చయ్యి వుండేది (మూడు తలలు కనిపిస్తున్న శివుడూ, వెనక నాలుగో తల కనిపించకుండా). అప్పట్లో అలాంటి స్థూపం యేమైనా వుండేదేమో తెలీదు. తరవాత ఆ స్థానాన్ని "నాలుగు సిం హాలూ" ఆక్రమించాయి. కార్డులేకాకుండా, ఇంకాస్త పెద్ద వుత్తరాలని రాసుకోడానికి "ఇన్లేండ్" కవర్లని వుండేవి. వాటిమీదకూడా ఆ ఈశ్వరుడి స్టాంపులే. అవి కాకుండా, యెన్ని తెల్లకాయితాలమీదైనా వుత్తరాలు వ్రాసుకొని, వాటిని మడిచిపెట్టి పంపించేందుకు--యెన్వలప్స్ కూడా వుండేవి. వాటిమీదా ఆ ఈశ్వరుడే. కార్డులని అప్పటికీ ఇప్పటికీ "ఓ కార్డు ముక్క"గానే పరిగణిస్తున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నాలెడ్జ్ మెంట్ల బదులుగా, పుట్టుక, మరణ వార్తలు చేరవెయ్యడానికీ! మూడోదైన ఎన్వలప్ ల గురించి చెప్పఖ్ఖర్లేదు--అందరికీ తెలిసినవే. ఇంక రెండోవైన "ఇన్లాండ్" కవర్ల గురించే ఓ పిట్ట కథ.

అదేం ఖర్మమోగానీ, దాన్ని, చదువుకున్నవాళ్లు కూడా, "ఇంగ్లాండ్" కవర్ అనే అనేవారు--యే కొద్దిమందో తప్పిస్తే. దానిమీద "ఈన్లాండ్ లెటర్--కార్డ్" అని ఇంగ్లీషులోనూ, "అంతర్దేశీయ పత్ర్--కార్డ్" అని హిందీలోనూ ముద్రించి వుండేది. "కార్డులు వేరే వున్నాయి కదా, దీన్ని కార్డ్ అని యెందుకు వ్రాస్తారూ?" అని ఇంగ్లీషు పండితులు రుంజుకుంటే, హిందీలో కార్డ్ ని "కాయీ" అని చదివిన హిందీ "ఎమెటర్" పండితులు ఆశ్చర్యపోయేవారు. ఇంక నిష్ణాత తెలుగు-హిందీ పండితులకైతే, భలే సందేహాలు. హిందీది కూడా, సంస్కృతం లాగానే, లండాచోరీ వ్యవహారం. హిందీలో, మనం తెలుగులో రాష్ట్రం అనేదాన్ని "దేశం" అంటారు, మనం దేశం అనేదాన్ని "రాష్ట్రం" అంటారు. అందుకనే, అంతర రాష్ట్రీయ అని మనం అనేదాన్ని, అంతర్దేశీయ అంటారు వాళ్లు. (మనం తెలుగులో "ఇంటర్నేషనల్" అనడానికి వుపయోగించే "అంతర్దేశీయ" లేదా "అంతర్జాతీయ" ని హిందీ వాళ్లు "అంతర్ రాష్ట్రీయ" అంటారు!) సరే. యెవరెలా యేడిస్తే మనకేం?

ఈ ఇన్లాండ్ కవర్లమీద కొంత రీసెర్చ్ చేశాను నేను నా 15వ యేటనే. అప్పుడే తెలుసుకున్నాను--యే చెత్తకాయితం మీద మనం వుత్తరం వ్రాసినా, దాన్ని చక్కగా మడతపెట్టి, అప్పటి ఇన్లేండ్ కవర్ కి యెంత స్టాంపు విలువ వుంటుందో అంత విలువ స్టాంపూ అంటించి డబ్బాలో వేస్తే, చచ్చినట్టు అది గమ్యస్థానాన్ని చేరుతుంది--అని! ఇంకా, కొన్ని "ప్రచార" సంస్థలు, చేరవలసిన చిరునామా తమదిగా ముద్రించుకొని,  మనకి ఇలాంటి ఇన్లేండ్ లెటర్స్ పంపించి, సమాధానం వ్రాయమనడం, వాటి మీద స్టాంపు స్థానంలో "పోస్టేజ్ విల్ బీ పెయిడ్ బై ది అడ్రెస్సీ" అని ముద్రించి వుండడం--బాగా గమనించాను.

మా ఇంటికీ, కాలేజీకి మధ్యలో వుండే ఓ పోస్టాఫీసు దారిలో రోడ్డుమీదే వుండేది. మనకి యే అవసరం వచ్చినా (పోస్టలుకి సంబంధించి) అక్కడికే వెళ్లేవాడిని. (అప్పట్లో కథలూ, కవితలూ వెలగబెట్టడం, పోటీల్లో పాల్గొనడం చేసేవాణ్ని లెండి). కొన్ని గంటలో, రోజులో "ఖష్ట"పడి, ఓ కథో, కవితో వ్రాసుకొని, దాన్ని ఓ కవరుతయారుచేసుకొని, అందులో పెట్టుకొని, తుమ్మజిగురుతో అంటించి, తీరా పోస్టాఫీసుకెళ్లి (ఆ కవరు యెంత బరువుందో, యెంత విలువగల స్టాంపులు అంటించాలో తెలీదు) కిటికీ ముందు నుంచుంటే......

........తరువాయి మరోసారి!