Tuesday, September 21, 2010

నేను నేర్చుకున్న......

కన్నడ పాఠం

"చింతపండు అయిపోయింది....చూసుకోలేదు....వచ్చేటప్పుడు ఓ పావుకేజీ తెస్తారా?" సాయంత్రం నడకకి బయలుదేరుతున్న నన్ను వినయపూర్వకం గా ఆఙ్ఞాపించింది మా ఆవిడ ఓ రోజు.

"అదెంత భాగ్యం" అంటూ బయలుదేరాను.

మేం అనంతపురం జిల్లా, రాయదుర్గం లో వున్నప్పుడు సాయంత్రం పూట అలా బళ్లారి వెళ్లే రోడ్డుకో, ఇలా చెళ్లికెరె మీంచి బెంగుళూరు వెళ్ళే రోడ్డులోనో, ఇటు కళ్యాణదుర్గం వెళ్లే రోడ్డులోనో, ఓ మూడుకిలోలు దూరం వెళ్లి, మళ్లీ తిరిగి రావడం అలవాటు.

బాగా వెలుగుండగానే బయలుదేరి, చీకటి పడుతూండగా తిరిగి వచ్చేవాణ్ని.

మా ఇంటి ముందే వుండేది--ఓ కిరాణా-కమ్-ఫాన్సీ-కమ్-బడ్డీ కొట్టు. యెప్పుడైనా చిన్న చిన్నవి అవసరమైతే అక్కడ తీసుకొనేవాళ్లం. రాయదుర్గం లో అందరూ దాదాపు ఇంట్లో కన్నడమే మాట్లాడుకుంటారు. మహమ్మదీయులు ఉర్దూలో మాట్లాడుకుంటారు. తెలుగు మాట్లాడినా, కన్నడం కలిపే!

సరే, తిరిగి వచ్చేటప్పుడు యెంతసేపు తీసుకొని ఇంట్లోకి వెళ్లాలిలే అనుకొని, నడక సాగించాను.

నడక అయ్యాక, ఆ కొట్టు దగ్గర ఆగి, "బాబూ ఓ పావుకేజీ చింతపండు ఇవ్వు" అన్నాను. అప్పటికి చీకటిపడి, లైట్లు వెలిగించేశారు వీధి లైట్లతో సహా. 

"లైట్ హెలిగిత్తది--హిగ్గది" అన్నాడు వాడు కన్నడం లో, పైనుంచి వేళ్లాడుతున్న లైటుని చూపిస్తూ! (నాకలా వినిపించిందో!)

అంత సీరియస్ గా అంటున్నాడు, కన్నడం లో యేమైనా తిట్టాడా అని నేను అనుకుంటుంటే, మళ్లీ వాడే, "అఫ్టర్ లైట్, నో సేల్, చింతపండు!" అన్నాడు. ఆహా, రాత్రి అయితే చింతపండు అమ్మకూడదు అని వాళ్ల సెంటిమెంటు అన్నమాట అనుకొని, సరేలే అని ఇంట్లోకి చేరాను.

మా ఆవిడ చింతపండేదీ? అనడిగితే, నేను కూడా, "లైట్ హెలిగిత్తది--హిగ్గది" అన్నాను సీరియస్ గా. 

సంగతి చెప్పాక, పడీ పడీ నవ్వు! "పోనీలెండి, ఇవాళకి వుప్మాతో సరిపెట్టుకుందాం!" అంది.

అదీ మా కన్నడ పాఠం ప్రహసనం.



2 comments:

రహ్మానుద్దీన్ షేక్ said...

" ఓ మూడుకిలోలు దూరం వెళ్లి, మళ్లీ తిరిగి రావడం అలవాటు."
కిలోల చొప్పున కూడా దూరాన్ని కొలవచ్చనమాట
ఒందు కిలో దల్లి ఎష్టు కిలోమీటర్ ఇద్దే?

A K Sastry said...

డియర్ రహ్మానుద్దీన్ షేక్!

గ్రాములైనా, మీటర్లయినా, లీటర్లయినా కెలోల్లెఖ్ఖేకదండీ! మరి నేను కన్నడ హేళది.

తెలుగుమీద అభిమానం తో తెలుగు తల్లి చిత్రం పెట్టారు--నా అభినందనలు.

ధన్యవాదాలు.