Monday, March 31, 2014

ఏప్రిల్ ఫూల్......!



..........ఓ ఫూలిష్ రోజు 

"మేష్షాండీ.......వాడు నా చొక్కా వీపు మీద ఇంకు పోశాడండీ!"

"మేష్షాండీ.......వాడు నా చొక్కా వీపు మీద ముద్దరేశాడండీ!"

అలా మొదలయ్యాయి మా ఏప్రిల్ ఫూల్ సరదాలు.

ఎదటి వాడికి తెలియకుండా, వాడి వీపు మీ ద పెన్నులోని సిరా చల్లేయడం, బంగాళా దుంపని సగానికి కోసేసి, దాన్ని "ఏ ఎఫ్" అనే అక్షరాలు పైకి వచ్చేలా బ్లేడుతో చెక్కేసి, దాన్ని స్టాంపు ఇంకులోనో, పెన్ను ఇంకులోనో అద్దేసి, ఎదటివాడి వీపు మీద ముద్దర వేసెయ్యడం అలా. 

అప్పట్లో ఫౌంటెన్‌ పెన్నులే. తెలుగులో ఊట కలాలు. యెంత జాగ్రత్తగా స్క్రూ, కేప్ బిగించినా, అవి కక్కేసి జేబులు పాడు చేసేవి. అలాంటివి, కేప్ తెరిచి, ఊపగానే, యెదటివాడి వీపుమీద చుక్కలు చుక్కలుగా డిజైన్‌ పడిపోయేది.

ఇంక బంగళా దుంపలైతే, పైనే చెప్పానుగా. అలా యెంతమంది వీపులమీద ముద్ర వేస్తే అంత గ్రేట్. 

అప్పట్లో, తాలూకాఫీసు ముద్ర యేదైనా కాగితం పై వేస్తే, ఒక్క అక్షరమూ కనిపించేది కాదు. అందుకని, ఈ బంగళా దుంప ట్రిక్ ని  ఆ ముద్రకోసం వుపయోగించిన రోజులు కూడా వున్నాయి. 

యెవరికైనా "ఇన్‌కమ్‌ సర్టిఫికెట్" కావాలంటే, ఆకుపచ్చ ఇంకుతో తాసిల్దారు సంతకాన్ని పెట్టేసి, బంగళాదుంప ముద్ర వేసేసి, ఇచ్చేసేవాళ్లం. దాన్ని స్కూల్లో దాఖలు చేస్తే, యెవరికీ అనుమానమే వచ్చేది కాదు. 

నిజమే. అది ఫోర్జరీనే. నేరమే. మరెందుకు అంటే, నిజంగా ఆ సర్టిఫికెట్ తాలూకాఫీసులో తీసుకుంటే, దాని మీద ముద్ర వేసేందుకు డవాలా బంట్రోతుకి అర్థరూపాయి ఇవ్వవలసి వచ్చేది! "అలా కూడా ఇచ్చుకొలేని వాళ్లకోసమే" మా నేరాలు!

వ్యవస్థ అప్పటికీ ఇప్పటికీ కొంత మారింది. కానీ అది చాలదు.

యెన్నికల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు అభ్యర్థులు. వాళ్లకి మనల్ని ఫూల్ చేసే ఛాన్‌స్ ఇవ్వకండి. 

చివరిగా ఈ ప్రపంచం లోని ప్రతి మనిషీ ఒక ఫూలే అని యేడాదికోసారి గుర్తు చేసేదే--ఈ మూర్ఖుల పండగ!

హేపీ ఏప్రిల్ ఫూల్!