Monday, September 28, 2009

.......అదొక్కటే

తరవాయి  


గుళ్ళో ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరి చిప్పతో పచ్చడి చేద్దామని ముచ్చటపడిన మా ఆవిడ, ఆ చిప్ప పీచు తక్కువగా, చిన్న సైజులో వుండడంతో, 'దీన్ని పగలకొట్టకుండా కొబ్బరి తియ్యగలరేమో ప్రయత్నించండి' అని నా ముందు పడేసింది.  


నేను దాన్ని పరిశీలించి, అది 'ఐ న్యూస్' చానెల్లో 'జీవన రహస్యాలు' బోధించే మంతెనవారు చెప్పిన 'లైసెన్స్ లేని (ముదిరిన) కాయ' అని గమనించి, చాకుతో చక్కగా ఒలిస్తే, బయటికి వచ్చేసింది కొబ్బరి.  


అది ముచ్చికవైపు చిప్ప అవడంతో, పలచగా వున్న ఓ కన్నుని గట్టిగా నొక్కి, రంధ్రం చేసి, 'ఇప్పుడు దీంతో జిలేబీలు వేసుకుంటే బలేవుంటుంది కదోయ్?' అన్నాను సరదాగా.  


'మీది మరీ చోద్యం! చిల్లుకొబ్బరిచిప్ప వుంటేచాలు జిలేబీ యెలా వచ్చేస్తుంది?'  


'మరదే! నీకు చూపుడువేలుంది, కొబ్బరి చిప్పవుంది--ఇక జిలేబీలు రావడమే తరవాయి!' అన్నాను!  


'ఇదేం సంబడం! ఆ రెండూ వుంటే జిలేబీలు యెలా వచ్చేస్తాయి?'  


'మాకలాగే వచ్చేవి! ఆ కథాక్రమంబెట్టిదనిన.....' అంటూంటే, కత్తిపీట ముందేసుకుని కొబ్బరి తరుగుతూ, 'మొదలెట్టారుగా, కొనసాగించండి.....నాకూ కాలక్షేపం!' అంది.  


'మన పాతింట్లో పడమరవైపు మూడుగదులుండేవి గుర్తుందిగా? ఆ పోర్షన్ అద్దెకిచ్చేవాళ్ళం. అందులో ఓ అన్నయ్యా, వదినా, వాళ్ళ చంటిపిల్లా దిగారు. అతనికి ఇద్దరు తమ్ముళ్ళూ, ఓ చెల్లీ కూడా వుండేవార్లే--అందుకని అందరికీ అన్నయ్య అయిపోయాడు.  


ఆ వదిన ఒకరోజు ఇలాగే ఓ చిల్లుకొబ్బరిచిప్ప మా అమ్మకి చూపిస్తే, ఆవిడ--ఇకనేం. జిలేబీచేసెయ్యి! అంది సరదాగా!'  


'ఇక ఆ వదిన, యెలా చెయ్యాలో మా అమ్మనడిగి, పుస్తకం లో వ్రాసుకొని, వాళ్ళాయన్ని తరిమి పిండీ, బెల్లం వగైరా తెప్పించి, జిలేబీలు వేసి, మాక్కూడా నాలుగు ఇచ్చింది! పాకం అంటుకొనీ, అంటుకోక, మెత్తటి జంతికల్లా వున్నాయనుకో--అది వేరే సంగతి!' అన్నాను.  


'బాగుంది! అయితే ఇక మిమ్మల్ని తోలడమొకటే తరవాయి అన్నమాట ' అని అంటించింది.  


'వెనకటికి నీలాంటివాడే, దారిలో కాలికి ఓ గుఱ్ఱపునాడా తగిలితే అది జేబులోవేసుకొని--ఇక మూడు నాడాలూ, ఓ గుఱ్ఱమూ దొరికితే చాలు అనుకున్నాట్ట!' అంటే 'నాలాంటివాడెందుకు అవుతాడు....' అని తగువు పెంచబోతుంటే.....  


'రాముడు కూడా అలాంటివాడే తెలుసా? అసలైన సీత లేకుండా, గుఱ్ఱం వుంది, నేనున్నాను--ఇక అశ్వమేధయాగం చేసేస్తాను! అన్నాడట.'  


'నాకుతెలియకడుగుతా--అసలు సీతెందుకండీ?' అంది.  


'నా శృంగార చానెల్లో టపా చదువు '. అని ముగించాను.  


మరి చదివిందో లేదో--ఇంకా తెలీదు.