Friday, January 24, 2014

ఆమ్ ఆద్మీ.....వీధుల్లో....


వృధ్ధి కనబడదూ?

"వంకాయ్ లు, దొండకాయ్ లు, బెండకాయ్ లు, బీరకాయ్ లు, కాకరకాయ్ లు, అరిటికాయ్ లు, ఆనపకాయ్ లు, పొట్లకాయ్ లు, ఉల్లిపాయ్ లు, బంగాళదుంపలు, టమాటాలూ..........."

"గోంగూర, తోటకూర, మెంతికూర, పాలకూర, చుక్కకూర, బచ్చలికూర, పొన్నగంటికూరా......"

"........మెత్తళ్లు, బొమ్మిడాయిలు, పచ్చిరెయ్యలు, పిత్తపరిగెలూ............"

......దాదాపు అన్ని వూళ్లలోనూ ప్రొద్దున్నపూట వీధిలో వినిపించే కేకలు ఇవి. (మిగిలిన రాష్ట్రాల్లో భాషలు వేరే....అంతే).

దశాబ్దాలుగా వినవచ్చిన ఇతర కేకలు చూడండి.

అల్లావుద్దీన్--అద్భుత దీపం రోజుల్లో........

"పాత దీపాలకి కొత్త దీపాలిస్తాం......."

1950 లూ 60 ల్లో ఇలా వినిపించేవి......

"ఇత్తడీ, రాగీ, కంచూ, సీవెండీ......జీళ్లు జీళ్లేయ్...."
(కొందరు ఆకతాయి పిల్లలు "వెండికీ, బంగారానికీ...." అనికూడా కలిపి అరిచేవారు).

"మరమరాలు, శెనగపప్పు, బటానీలు, వేరుశెనక్కాయలూ......."

1970 ల్లో......

"పాతబట్టలకి స్టీలు సామాన్లిస్తాం........."

"ఐదు శాల్తీలూ వందరూపాయలే......"

1980 ల్లో......

".......పండగ సందర్భంగా.......20 శాతం డిస్కవుంట్"

1990 ల్లో....

"ఇప్పుడు మీ ప్రియమైన షాంపూ 2 రూపాయలకే...."

"ఇప్పుడు.....సాషేల్లో....తగ్గింపు ధరలకే....."

2000 ల్లో.......

"బొంబై కా మాల్ ఆఫ్ రేట్......"

"కలకత్తా శారీ ఎగ్జిబిషన్ కమ్ సేల్.....నమ్మలేని తక్కువ ధరల్లో....."

2010 ల్లో....

"ఒకటి కొంటే ఒకటి ఫ్రీ", "ఒకటి కొనండి రెండు ఉచితంగా పొందండి"

"ఫలానా పండుగ సందర్భంగా 10 నుంచి 90 శాతంవరకూ డిస్కౌంట్!"

"కార్లపై డిస్కవుంట్ ఆఫర్లు....ఇన్సూరెన్స్ ఫ్రీ.....ఎం పీ 3 ఫ్రీ......"

ఇంక 2020 ల్లో.......

"పీసీలు, లేప్ టాప్ లు, టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు, ఐ పేడ్లు, ఐ పాడ్లు, ఐ ఫోన్లూ...."

"మారుతీలు, టాటాలు, హ్యుండైలు, హోండాలు, రెనాల్టులు, ఆడీలు, క్రిజ్లర్లూ........"

"నెక్లెస్లు, హారాలు, గొలుసులు, గాజులు, వుంగరాలు, దుద్దులు, చెవికమ్మలు, బ్రేస్లెట్లు, పైటపిన్నులూ......"

"వజ్రాభరణాలు, ప్లాటినం ఆభరణాలూ......"

.........ఇలాంటి కేకలు వినబడితే ఆశ్చర్య పోకండేం?!

(యెవరన్నారు.......వృధ్ధిరేటు బాగా లేదని?)

Tuesday, January 21, 2014

అసలైన హాస్యం (కామెడీ)


"తియ్యని కల్లలు"

"తియ్యని కల్లలు" అనే ఈ వ్యాసం మునిమాణిక్యం నరసిం హా రావుగారు ఏప్రియల్, 1949 ఆంధ్రజ్యోతి ఉగాది సంచికలో వ్రాసినది! (అప్పటికి నేనింకా పుట్టలేదు!) 

యథాతథంగా వ్రాశాను--అచ్చులో యెలా వచ్చిందో అలా--అచ్చుతప్పులతో సహా.

రచయితని మిత్రులు బాగానే పోల్చుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు.

ఇంక, ఇదంతా నేనే వ్రాస్తున్నాను అనుకున్నవాళ్లెవరైనా వుంటే, మళ్లీ మొదటి భాగం నుంచీ చదివి, అసలైన హాస్యాన్ని ఆస్వాదించండి.

ఇలాంటి ఆణిముత్యాలని మరువకండి.



సర్వేజనాస్సుఖినోభవంతు!

Monday, January 20, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

అసత్యం పలకటంలో, కల్లలు అల్లడంలో కవులు ఆరితేరారు. వారి అబధ్ధాలు కళారూపం కట్టినవి. అబధ్ధాలు ఆడుతున్నాము చూడండి అని ఢక్కా మీద దెబ్బకొట్టి, మరీ అబధ్ధాలు ఆడారు.

మనుచరిత్ర అని ఓ పుస్తకం వ్రాసిన పెద్దనకవి వ్రాస్తాడు--

"వరుణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై, సౌధ సుధా ప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీ హరిణంబై యరుణాస్పదంబనగ నార్యావర్త దేశంబునం బురమొప్పన్ మహికంఠహారతరళస్ఫూర్తిన్ విడంబించుచున్" అన్నాడు..

అరుణాస్పదం అనే ఊరు ఉందిట. వరుణాద్వీపవతీ తటాంచలములో ఉన్నదిట! ఒఠ్ఠిది. అటువంటి ఊరులేదు అసలు! పోనీ ఉందనుకొన్నాము.

ఆవూరి ప్రాకారములు ఆకాశాన్ని తాకుతున్నయ్యనీ, ఆవూళ్లో ఉన్న ఎత్తైన మేడలయొక్క తెల్లదనము చంద్రుడిలోకి కొట్టేసరికి, చంద్రుడిలో ఉన్న నల్లమచ్చ కాస్తా మాయం అయిందనీ వ్రాశాడు. ఇటువంటి ప్రాకారాలు, మేడలు ఎక్కడన్నా ఉంటయ్యయ్యా, ఎందుకీ అబధ్ధాలు అని నిలవేసి అడిగేవాడు లేకపోయినాడు ఆ రోజులలో.

పైగా కృష్ణదేవరాయలవంటి మహా ప్రభువు ఆయనను గౌరవించి, ఎదురైనచో మదకరీంద్రము డిగ్గి చేయూతనిచ్చి ఎక్కించుకొనే వాడట!

అత్యున్నతమైన అబధ్ధాలు ఆడినందులకు అంత గౌరవం లభించింది. అది చూచి మిగతా పిల్లకవులంతా, తమ చేతనైన అబధ్ధాలు ఆడటం సాగించారు.

చిన్న చిన్న విషయాలలో కూడా ఈ కవులు పుటుక్కున అబధ్ధం ఆడేస్తారు. ఓ అమ్మాయిని పట్టుకుని, నీ కళ్లు ఆకర్ణాంత విశాలాలు అని వర్ణిస్తారు. నిజానికి ఎంత అందంగలదైనా, మనిషి జన్మ ఎత్తిఉంటే అంత కళ్లు ఉండవు. 

ఆమె జడ సుదీర్ఘమై, నల్లకోడెత్రాచులాగ మిసమిసలాడుతున్నది. అంటాడు. అసలు ఆమె జడ దీర్ఘం కానేకాదు. సవరం పెడితే అంత పొడుగైంది. మిసమిసలాడుతుందట త్రాచులాగ! ఛాఛా! వఠ్ఠి అబధ్ధం! నిజం ఏమిటంటే, ఆమె జడ గరెటెకాడలాగ గట్టిగా ఉన్నది.

పైగా, తనకేదో ప్రియురాలు ఉన్నట్లూ ఆమె ఏదో సౌందర్యనిధి అయినట్టూ పద్యాలు వ్రాస్తారు. పచ్చి అబధ్ధాలు కదా!

ఆ అనాథ బాలిక ప్రియురాలు నాకు. ఆమె కనులలో నీలంపు నిధులుగలవు. అని ఇల్లాగ ఒక కవి వ్రాస్తే నేను అడిగాను ఎవరయ్యా ఆ బాలిక అని! నీకు చెబుతానా నాప్రియురాలు ఎవరో! చచ్చినా నీకు చెప్పను. అని గర్వంగా అన్నాడు. ఉంటే ఎందుకు చెప్పడు. ఒఠ్ఠిది. అతనికి ప్రియురాలూలేదూ, ఎవరూలేదు. అబధ్ధాలు. బొత్తిగా అబధ్ధాలుకదా!

ఇల్లాగ కవులు ఆడే అబధ్ధాలకు అంతూపొంతూ లేదు అదంతా భాషకు అలంకారం అన్నారు.

అబధ్ధాలు భాషకు మాత్రమే అలంకారాలని వాళ్లు అన్నారు. నేను ఏమంటానంటే అబధ్ధాలు జీవితానికే అలంకారాలని అంటాను.

జీవితాన్ని అబధ్ధాలు అల్లిబిల్లిగా అల్లుకుపోయినయి. కల్లా కపటం తెలియనివాడు అంటే శుధ్ధ తెలివితక్కువ వాడని అర్థం. వేమనకూడా కల్లనిజము తెలిసిన మనుజుడెపో, నీతిపరుడు మహిలో వేమా అన్నాడు. కల్లము నిజము అంటే కల్ల నిజ స్వరూపము అన్నమాట! కాబట్టి కల్లలాడటం తెలియకపోయినవాడికి జీవిత సౌందర్యమే తెలియకుండా పోతుంది.

(అయిపోయింది)  

రచయితగురించీ, ఇతర వివరాలూ.....త్వరలో. ఈలోగా కూడా మీరు ఊహించి చెప్పవచ్చు.

Thursday, January 16, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

సాంఘిక వ్యాపారాలలో కూడా అసత్యమే గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. మర్యాద కాపాడుతుంది. నా దగ్గర ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చదువుకొన్న కుఱ్ఱవాడు ఒక రోజున కనపడి నమస్కారం చేశాడు. నేను ఎవరో అని బిక్కగా చూశాను. 'నేనండీ మాస్టారూ నాగేశ్వరరావును. మీదగ్గర చదువుకున్నానూ' అన్నాడు.

నాకు ఆ కుఱ్ఱవాడు ఎవరో జ్ఞాపకం రాలేదు. సందేహంగా చూస్తూ 'అవును. అవును. ఎప్పుడూ నీవు చదువుకున్నదీ?' అని అడిగాను. ఆ కుఱ్ఱవాడు విచారంగా ముఖంపెట్టి, 'అప్పుడే మరిచిపోయినారండీ మాస్టారూ? 1945 లో నండి, మీ క్లాసులో నేను ముందు బెంచీలో కూర్చునేవాడినండి' అని జ్ఞాపకం చేశాడు. ఎప్పుడో నాలుగేండ్ల క్రిందటినాటిమాట! ఈ మధ్య ముందుబెంచీలమీద ఎంతమంది కూర్చున్నారో! జ్ఞాపకం రాలేచు.

ఆ మాట చెపితే వాడు చాలా ఖిన్నుడైపోతాడు. అందుకని జ్ఞాపకం వచ్చినవాడిలాగే చూస్తూ, 'అవునయ్యా నీవు.........సిక్ స్తు ఫారంలో ఉండేవాడివి. కాదూ?' అన్నాను. వాడు తెల్లపోయి 'అదేమిటండీ మాస్టారూ, అల్లాగంటారూ? నేను సిక్ స్తు ఫారం మీదగ్గర చదవలేదండీ' అన్నాడు.

వెధవ, చదవలేదు కామాలు. ఎవరికి జ్ఞాపకం! వాడు బందరు వదిలి వెళ్ళి ఇంకో ఊళ్ళో చదువుకొని ఉంటాడు. సాధారణంగా అట్లాగే జరుగుతూ ఉంటుంది. అందుకనే నేను, 'అవునోయ్, నేను మరిచిపోయినాను. నీవు బందరు వదిలివెళ్ళి ఎక్కడో చదివావు కదూ!' అన్నాను, నవ్వుతూ.

నాఊహ తప్పింది. వాడు అక్కడే చదివాడట. 'నేను ఎక్కడికీ వెళ్ళలేదండీ. మీదగ్గర చదవలేదండీ అంటే, మీ డివిజన్లో లేనండీ. రామమూర్తిగారి డివిజన్లో పడ్డాను' అన్నాడు.

నాకు అసహ్యం అనిపిస్తున్నది. అయినా ఏమీ అనలేక--'అల్లా చెప్పు, ఇంకో డివిజన్ లోకి వెళ్ళావూ, అందుకనే నాకు జ్ఞాపకం లేకపోయింది' అన్నాను.

దానితరువాత ఏవో కుశల ప్రశ్నలు వేయటంలో వాడికి ఏదో అనుమానం కలిగింది, తాను ఎవరైనది నేను సరిగా జ్ఞాపకం తెచ్చుకోలేదని. అందుకని వాడు అన్నాడు. 'మాస్టారూ నేను ఎవరైందీ మీకు సరిగ్గా గుర్తుకు వచ్చినట్టులేదు. నేను సుబ్బారావు తమ్ముణ్ణి' అని సూటిగా జ్ఞాపకం చేశాడు.

సుబ్బారావు తమ్ముణ్ణి అని చెపితే నాకు బాగా గుర్తుకువస్తుందని వాడికి గట్టి నమ్మకంతో ఆమాట అన్నాడు. నేను ఇంకా నీళ్ళునమిలితే వాడికి నామీద అసహ్యం కలుగుతుంది. చిరాకు పుడుతుంది. వాడి మనస్సు కష్టపడుతుంది. అదికాక సుబ్బారావు తమ్ముణ్ణి అని చెప్పినతరువాత కూడా నాకు జ్ఞాపకం రాకపోవటమేమిటి అనుకొని, అప్పుడు సర్వమూ జ్ఞాపకం వచ్చినట్లు నటిస్తూ, నవ్వుతూ, 'ఓరి సన్యాసీ. సుబ్బారావు తమ్ముడివా! ఆ సంగతి మొట్టమొదటే చెపితే బాగుండేది. చంపావు! సుబ్బారావు తమ్ముడివా! సరిసరి' అని మెచ్చుకొని వాడి వీపుపై తట్టి సంతోషపెట్టి పంపాను. ఆ సుబ్బారావు ఎవరో నాకు తెలియదు. గుర్తుకు రాలేదు. ఇహ వాడి తమ్ముడి విషయము అసలే గుర్తుకు రాలేదు. అంతా జ్ఞాపకం వచ్చినట్లు నటించాను. అబధ్ధాలు ఆడాను. అయితే యేం! వాడిని సంతోషపెట్టాను.  అబధ్ధమైనా, ఒక ప్రాణి సంతోషించింది. అల్లాంటి మనోహరమైన అసత్యాలను వదిలి, నిజం చెపుతానంటూ, ఇతరులను ఏడిపించటం ఎందుకో నాకు అర్థం కాలేదు. సత్యం చేదుమందులాంటిది. కల్ల పంచదార మాత్రవంటిది. సత్యం ఒంటరిగా జీవిస్తుంది. కల్ల పిల్లలతల్లి. సత్యానికి రంగులు లేవు. అలంకారాలు లేవు. కల్ల రంగు రంగుల దుస్తులు వేసుకొంటేగాని రాణించదు. సత్యానికి మెఱుపు లేదు. కల్ల మెఱుగులు దిద్దుకొని ఆకర్షిస్తుంది. అసత్యం వెలయాలు. పదిమందినీ సంతోషపెడుతుంది.

........మిగతా మరోసారి.

Tuesday, January 14, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

అసత్యం ఇచ్చే ఆనందం సత్యం ఇయ్యలేదు. నేను ఒకసారి పొరుగూరులో ఉన్న ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాను. ఆ స్నేహితుడు ఊళ్ళోలేడు. కాని అతని భార్య నాకోసం వంటచేసి భోజనానికి లెమ్మన్నది. ప్రత్యేకంగా నాకోసమని వంకాయకూర వండింది. కాని కూరలో ఉప్పు ఎక్కువ పడ్డది. నేను మాట్లాడకుండా తింటున్నాను. ఆ అమ్మాయి 'కూర ఎట్లాగుంది అన్నయ్యా' అని అడిగింది.

ఉప్పు కొంచెం ఎక్కువ అయింది అమ్మా అని చెపితే ఆ బిడ్డ చాలా కష్టపడుతుంది. అందుకని 'కూరకేం అమ్మా, కమ్మగా ఉంది' అని ఒక అబధ్ధం ఆడాను.

ఆ అమ్మాయి ఇంకా కాస్త వేసింది బాగుంది అన్నానని. ఏంజేసేది పారేస్తే? బాగుండదు. అందుకని గబగబా గొంతులో వేసుకుని మ్రింగి కాసిని నీళ్లు తాగాను. చాలా రుచిగా ఉండబట్టే అంత ఆప్యాయంగా తింటున్నానని ఆమె అనుకొని ఇంకాస్త వేస్తానంటూ కూర్చున్నది. వద్దమ్మా వద్దు అని ఇక తినలేను అని ఇంకో అబధ్ధం ఆడాను, నిజానికి ఆకలి తీరకపోయినా. 'ఏం అన్నయ్యా ఎందుకు తినవూ?' అని అడిగితే ఆకలి లేదని ఇంకో అబధ్ధమూ, ఎందుకు ఆకలి లేదూ అంటే, దారిలో కాఫీ తాగి వచ్చానని మరో అబధ్ధము ఆడవలసి వచ్చింది. అయితే ఆ బిడ్డను సంతోషపెట్టటానికి సత్యాన్ని త్యాగం చేసి ఇన్ని అబధ్ధాలు ఆడవలసి వచ్చిందని నాకు నేను చెప్పుకొని సంతోషించాను.

అంతటితో పోతే బాగుండేది.

కాని ఆ తరువాత ఆ అమ్మాయి, అన్నానికి కూర్చుని కూర రుచిచూచి, నేను అన్నీ అబధ్ధాలాడానని తెలుసుకొన్నది. తెలుసుకొన్నది ఊరుకోక నన్ను అడిగింది---'ఏమి అన్నయ్యా, కూరలో అంత ఉప్పు ఎక్కువైతే చెప్పకపోయినావా? ఇంకేదైనా ఆదరవు వేసేదాన్ని. బాగుందంటే, నిజమేననుకొని ఇంకా కాస్త కూడా వేసి తినమని బలవంతం చేశాను పాపిష్టిదాన్ని.' అంటూ ఊ విచారపడటం సాగించింది. ఆ పిల్ల విచారాన్ని పోగొట్టటానికి, 'అదేమిటమ్మా, ఉప్పు ఎక్కువైందా? నాకు తెలియదమ్మా తల్లీ. నేను కాస్త ఉప్పు ఎక్కువ తింటాను. ఎంత ఉప్పు వేసినా సరిపోదని, మీ వదిన ఊరికే గోల పెడుతుంది. అంతేకాని నాకు తెలిస్తే చెప్పకపోయినానా తల్లీ' అని అయిదోసారి అబధ్ధం ఆడాను. ఆ అమ్మాయి నా మాటలు నమ్మి సంతోషించింది. 

ఇన్ని అబధ్ధాలు ఆడినందుకు నాకేమీ విచారంలేదు. ఆ పిల్లను సంతోషపెట్టటానికి ఇంకో పది అబధ్ధాలైనా సరే ఆడాలిసిందే. నిజంచెప్పి ఆ బిడ్డకు మనక్లేశం కలుగజేసే కంటే, అబధ్ధాలు ఆడి ఒక ప్రాణిని సంతోష పెట్టటం ఎంతైనా మంచిదని నా ఉద్దేశ్యం.

........మిగతా మరోసారి.

Monday, January 13, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

అయితే మరీ పచ్చి అబధ్ధాలు ఆడితే అసహ్యంగానే ఉంటుంది. అబధ్ధం ఆడడంలో కూడా అందం ఉంది.

చూడండి అబధ్ధం ఆడినా ఎంత సరసంగా ఉందో!

ఒకసారి సుబ్బారావుగారి భార్య మా యింటికొచ్చింది, మా ఆవిడను చూడటానికి. సుబ్బారావుగారూ అంటే మా జిల్లాలో పెద్ద భాగ్యవంతుడు. ఆవిడకు మెడనిండా సొమ్ములు, రాళ్ల దిద్దులు, ఉంగరాలు, కెంపులు తాపిన నెక్ లేసులు ఉన్నయి. మా ఆవిడకు మెడలో ఒక గొలుసు, వ్రేలికో ఉంగరం, ఉన్నవి. అంతకంటే ఏమీలేవు.

ఆవిడ తన గొప్పలన్నీ చెపుతూ, మాటల సందర్భలో, కెంపులు, వైడూర్యాలు, పచ్చలు ఇల్లాంటివి మాసినా, నీరుదిగినా, ఏంజెయ్యాలో చెపుతున్నది. వైడూర్యాలు మాస్తే ఫలాని యాసిడ్ తో కడగాలె, పచ్చలు మాస్తే దీనితో కడగాలె, కెంపులు మాస్తే ఇల్లాగ శుభ్రం చెయ్యాలె అని ఇల్లాగ చెప్పింది తన గొప్పతనాన్ని వలకబోస్తూ.

ఎవరికి కావాల ఈ గొడవంతా.

మా ఆవిడకు ఇదంతా వెధవగొడవగా ఉంది. అయినా వింటూ ఊరుకొన్నది మర్యాదగా. ఆవిడ చెప్పి చెప్పి, చివరకు 'అయితే కెంపులు మాస్తే మీరేం చేస్తారమ్మా' అని అడిగింది.

కెంపులు మాకు ఉండి ఏడిస్తేగద! ఆవిడకు విషయం తెలియకనా! ఏదో అడిగింది మా ఆవిడను చిన్నతనం చెయ్యాలనో ఏమో మరి.

మా ఆవిడకు ఒళ్ళు మండి పోయింది ఈ ప్రశ్న అడిగేసరికి. అందుకని ఏం చెప్పిందంటే, 'కెంపులుగానీ, వైడూర్యాలు కానీ, ఏవైనాసరే మాస్తే మేము ఏమీ చెయ్యమమ్మా! మాసినవాటిని విసిరి గోడ అవతల పారేసి కొత్తవి కొనుక్కొంటాము ' అన్నది.

మాకు కెంపులు లేవు అని నిజం చెప్పి చిన్నతనం పొందేకంటే బ్రహ్మాండమైన అబధ్ధం ఇల్లాగ ఒకటి ఆడేయటంలో చాలా అందం ఉందని నా ఉద్దేశ్యము.

అసలు అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది. దాని కల్పన, నిర్మాణం, ప్రదర్శన, అంతా కూడా ఒక కళ. ప్రకృతిలో ఎక్కడా కనుపించని సౌందర్యాన్ని చిత్రకారుడు చిత్రిస్తాడు. ఆ కల్పనలో ఆ కూర్పులో అందం ఉంది. అసత్యానికి కూడా, కల్పనా, కూర్పూ కావాలె. దాని నిర్మాణంలో పనితనానికి ఎంతైనా అవసరం ఉంది. అందుకనే సత్యానికంటే అసత్యము ఎక్కువ సుందరమైనది.

నేను ప్రభుత్వోద్యోగిని. నాకు సెలవు కావాలె. ఎందుకూ? జ్వరం వచ్చిందా? లేదు. కాని ఏదో బధ్ధకంగా ఉంది. ఇంట్లో పడుకోవాలె అనిపించింది. లేకపోతే భార్యతో కబుర్లు చెప్పుకొంటూ కూర్చోవాలెనని బుధ్ధి పుట్టింది. సెలవకు వ్రాయాలె. సత్యాన్ని ఆశ్రయిస్తే ఉద్యోగాన్ని ఊడకొడుతుంది.

సాయింత్రం మా ఆవిడ, నేను ఎంతో కష్టపడి మిగిల్చిన డబ్బుతో కొన్న పట్టుచీర కట్టుకుని పేరంటానికి వెడుతుంది. ఆవిడ చీరకట్టుకొన్న సౌందర్యాన్ని నేను ముందుగా చూడాలని ఉంది. మధ్యాహ్నం సెలవు కావాలె. నిజం చెపితే సెలవు దొరుకుతుందా?

అసత్యాన్ని ఆశ్రయించాలె. ఆవిడ ఓ చక్కని ఉపాయం చెబుతుంది. జబ్బు, తలనొప్పి, కడుపులో పోట్లు అని వ్రాయమని చెప్పటమే కాకుండా ముఖం ఇల్లాగ పెట్టు, నడుం ఇల్లాగ వంచు, కళ్ళు కొద్దిగా చిట్లించు, ఇట్లా నడు, ఇల్లాగ బాధతో మాట్లాడు అని చెబుతుంది గదా! మనచేత చక్కని నాటకం ఆడిస్తుంది. సత్యం అయితే ఒకమాటతో సరి. అసత్యమైతే ఒక కావ్యం అల్లాలె.

పదిమందిలో తలెత్తుకొని తిరిగేది అసత్యమే కాని సత్యంకాదు. రాజకీయ వేత్త అసత్యాన్ని అందలంలో పెట్టి ఊరేగిస్తాడు. న్యాయవాది అసత్యానికి అందమైన ఆసనం ఇస్తాడు. వర్తకుడు నెత్తిన పెట్టుకొంటాడు. సత్యం ఏ మహాత్ముణ్ణో ఆశ్రయిస్తుంది. అడవులలోనూ, ఆశ్రమాలలోనూ తలదాచుకొంటుంది. అసత్యం పట్టణాలలో మేడలలో నివసిస్తుంది.

........మిగతా మరోసారి.

Sunday, January 12, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

దాంపత్య వ్యాపారంలో సత్యం అనేది అసలు పనికిరాదు. చీర కొనుక్కొని తీసుకొస్తామనుకోండి. ఆ చీర పది రూపాయలు పెట్టి కొన్నాము. పది రూపాయలకే కొన్నామని నిజం చెపితే, ఇంటావిడ ఎల్లాగ ముక్కూ మూతీ విరుస్తోందో గమనించారా? 'ఆఁ కొన్నారు లెద్దురూ, వెధవ పది రూపాయలు పెట్టి ఓ చీరా! జరీ చీర కొన్నారనా, పట్టు చీర కొన్నారనా సంతోషించటానికి!' అని కూడా అంటుంది. పది రూపాయలని చెప్పక, ఇరవై రూపాయలు అయింది అని చెప్పి, నమ్మకపోతే తెలివితేటలతో రెండు మూడు అబధ్ధాలాడి నమ్మించండి, ఎంత సంతోషిస్తుందో ఆవిడ. ఓ పెద్ద సత్యసంధుడిలాగ, నిజం చెప్పి ముక్కులూ, మూల్గులూ తినేకంటే, ఒకటో రెండో తేలికైన అబధ్ధాలు ఆడి, ఆవిడను సంతోషపెట్టి, నీవు సంతోషించమంటాను.

ఎట్లాగూ అబధ్ధాలు ఆడుతూనే ఉంటివి. పెందలాడే ఇంటికి రండి అని ఆవిడ రోజూ చెపుతుంది. ఒక్కరోజు అయినా నీవు రావు. రాకపోవటానికి రోజుకో కారణం కల్పిస్తావు గదా! ఒకరోజున ఆఫీసులోనే ఉండిపోవాలిసి వచ్చింది పని తొందరచేత! రెండో రోజున ఎవరో స్నేహితుడు కనిపించాడు!

ఇల్లాగ రోజుకో కారణం కల్పించి పాపం, ఆ ఇల్లాలును, నమ్మించవలసిన అగత్యం ఉండనే ఉన్నది. అల్లాంటప్పుడు ఆవిడను సంతోష పెట్టటానికి ఇంకొక రెండు అబధ్ధాలు ఆడితే వచ్చే నష్టం ఏమీలేదు. 

నువ్వు అబధ్ధాలు ఆడుతున్నావని ఆవిడ ఏమీ అనుకోదు. ఆవిడా అబధ్ధాలు ఆడుతూనే ఉండె! అసలు జీవితమే అబధ్ధాలతో అల్లుకుపోయింది.

........మిగతా మరోసారి.