Friday, May 7, 2010

అవకరాలు

నత్తి

నన్నన్నన్నన్నత్తి అంటే.....

మా...మా...మా...మాటలని....

సలిగ్గా....

అదేంటీ.....బల్కలేపోవడం!

ఇవి 'నత్తి' అని వ్యవహరించే అవకరం లో కొన్ని వెరైటీలు.

ఇది వరకు కొక్కొండ వెంకట రత్నం పంతులు కీ, బహుశా గిడుగు రామ్మూర్తి పంతులికీ అనుకుంటా--ఒకళ్ళ సాహిత్య పంథా ఒకళ్ళకి నచ్చక, పత్రికల్లో వ్యాసాలు వ్రాసుకొనేవారట!

అది యెంతవరకూ వెళ్ళిందంటే, ఓ నాటకం లో ఓ నత్తి పాత్రని ప్రవేశపెట్టి, ఇంకో పాత్ర చేత 'నీ పేరేంట్రా?' అని అడిగించి, నత్తి పాత్ర చేత, 'కొ..క్కొండ వెంకడండీ!' అని చెప్పించేవరకూ!

నిజానికి, చాలామంది, చాలా మాటలు స్పష్టం గా పలకలేరు. అది యే భాషైనా. 

మనకి కాస్త వినోదం అనిపించినా, మనం కూడా అప్రయత్నం గా వాళ్ళ భాషలోనే మాట్లాడతాం.

చిన్న పిల్లల విషయం లోనైతే, వాళ్ళముద్దు ముద్దు మాటల్ని మనం అలాగే అనుకరిస్తాం!

ఓ హిందీ ఆవిడ వాళ్ళ పక్క పోర్షన్ లో వున్న తెలుగావిడని అడిగిందట--"మీరు మొన్న చాలాసేపు 'పపో....తాలందీ' అనే మాట చాలా సార్లు అన్నారు! దాని అర్థం యేమిటండీ?" అని అడిగిందట.

పాపం ఆ తెలుగావిడకి, యెప్పుడూ ఆ మాట వినలేదే--నేను అన్ని సార్లు ఆ మాట వాడానా! అని ఆశ్చర్యం అయ్యిందట.

మళ్ళీ ఆ హిందీ ఆవిడే సహాయ పడిందట. "మీ పాపా, మీరూ పకపకా నవ్వారు చాలా సేపు!" అని చెప్పి.

అప్పుడు తెలుగావిడకి గుర్తుకొచ్చిందట--వాళ్ళ మూడేళ్ళ పాపని కిటికీలో నిలబెడితే, ఆ పాప తన చిన్నెల్లో భాగం గా, ఓ కాలు క్రిందకి వేస్తూంటే, ఆవిడా 'ఒద్దండీ! పడిపోతారండీ' అనడానికి, 'పప్పోతాలందీ' అని అందట!

అదీ సంగతి.

1979 లో మేం మొదటిసారి బొంబాయి (ప్రస్తుతం ముంబై) వెళ్ళినప్పుడు, మాకు బట్టలుతుక్కునే ప్లాస్టిక్ బ్రష్ అవసరమై, షాపుల్లో అడుగుతూ పోతుంటే, షాపు వాళ్ళు 'కట్లెరీ కీ దూకాన్ మే మిల్తా హై' అనేవారు. సరే, ఇంకా కొన్ని ప్లాస్టిక్ సామానుల షాపుల్లో అడుగుతూ పోతుంటే, యెవరూ తెలీదనే అంటున్నారు. ఓ షాపువాడు, 'కప్డే ధోనేకీ బ్రష్' అని అడిగితే, "ఓ....ఆప్ కో 'బురూస్' చాహియే!" అని వెంటనే తీసిచ్చాడు!

అలాగే, ఓ ఫోన్ నెంబరు అవసరమై, హోటెల్ రిసెప్షన్ లో యువతిని 'ఫోన్ డైరెక్టరీ ఓ సారిస్తారా?' అనడిగితే, ఆవిడకి అర్థం కాలేదు! మా పక్కనున్న మా స్నేహితుడు, దొందూ దొందే అన్నట్టు--చేతి వేళ్ళని లావైన పుస్తకాన్ని సూచించేంత వెడల్పు గా పెట్టి, 'ఫోన్ బుక్ ప్లీజ్...ఫోన్ బుక్!' అన్నాడు. (ఆ రోజుల్లో బొంబాయి టెలిఫోన్ డైరెక్టరీ అంటే, 'బాట్లిబాయ్' ఎకౌంటెన్సీ టెక్స్ ట్ కన్నా లావుగా వుండేది!) ఆ అమ్మాయి (బహుశా గోవన్ అయి వుంటుంది) ఆశ్చర్యం గా '....ఫోన్...బూక్?...' అంది. కొంచెం వెలిగినట్టుంది--'యూ మీన్ ఫోన్ డిరెక్టొరీ?' అనడిగింది. 

నేను వెంటనే, అమెరికన్ ఏక్సెంట్ లో, 'యా! ద టెలిఫోన్ డిరెక్టోరీ' అనగానే, మనోహరం గా నవ్వుతూ, అది నా చేతుల్లో పెట్టింది!

మా రూం బాయ్ ని 'చిప్స్' తెమ్మంటే, వాడు గ్రీకో, లాటినో విన్నట్టు ముఖం పెట్టేవాడు. వాడికి వివరణ ఇస్తూ, 'పొటాటో చిప్స్--ఇలా వుంటాయి--' అని వివరిస్తే, వాడు 'ఓ! బటటా చిప్స్? అభీ లావూంగా!' అని వెళ్ళిపోయాడు.

మా అత్తగారి వూరులో, ఓ పదేళ్ళ అమ్మాయి 'అమ్మా! పప్పువుల్లాతి' అనేది! ఆ మాట తప్పితే, ఇంకో మాట రాదు పాపం!

మా ఆడపిల్లలెవరైనా కొంచెం నంగి గా వుంటే, మేం 'పప్పు వుల్లాతి లా వున్నావు!' అని యేడిపిస్తాం.

రేలంగి నించి, బాల కృష్ణ, కేవీ చలం, రాజ బాబు--బ్రహ్మానందం దాకా, ఇలాంటి హాస్య పాత్రలు వేసినవాళ్ళే!

కానీ, ఇలాంటి అవకరం వున్నవాళ్ళని, ఓ రకం వికలాంగులని (ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటున్నారిప్పుడు!) అనుకరించి, హాస్యం పిండుకోవడం ఓ రకం గా అమానుషత్వమే!

కదూ?

Wednesday, May 5, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-4

మేం అక్కడ వుండగానే, మా చిన్న మామయ్య వాళ్ళ ఆవుకి ఓ దూడ పుట్టింది. పూర్తిగా కాషాయరంగులో, యెక్కడా మచ్చలేకుండా, ముద్దొస్తూ వుండేది అది. చెంగు చెంగున పరిగెడుతూ మాతో బలే ఆడేది. అప్పుడు మేం నేర్చుకున్న ఇంకో కొత్తమాట--'తువ్వాయి!'

ఆ వూళ్ళోనే, 'పురెల గాదెలూ', 'వరల గాదెలూ' మొదటిసారి చూసి తెలుసుకున్నాము.

మా చిన్న మామయ్యకి ఓ సవారీ బండి వుండేది. ఓ రోజు ఆ బండి కట్టించి, మమ్మల్ని మా చిన్న దొడ్డ వుండే వూరు (అక్కణ్ణించి ఓ పదిహేను కిలో మీటర్లుంటుందనుకుంటా) పంపించారు. ఆ దారి లోనే మేము 'పల్లకీ బొంగు'లున్న వెదురు పొదల్ని చూసింది!

ఆ బండి తోలిన అబ్బాయి మా నాన్నతో మాట్లాడుతూండగా, మేం విన్న మరో కొత్త మాట 'కాబోలు బాకీలు.' అప్పట్లో అర్థం తెలియకపోయినా, అదో వింత మాటగా గుర్తుంచుకుని, తరవాత విరిగిగా వాడేసేవాళ్ళం.

ఆ రోజు రాత్రి కూడా మా దొడ్డా వాళ్ళింట్లో వుండి, మర్నాడు పొద్దున్న బయల్దేరి, మా అమ్మమ్మగారి వూరు వచ్చేశాం.

వాళ్ళ వూరికో ప్రత్యేకత వుండేది. వూళ్ళో ఓ 30; 40 ఇళ్ళుండేవి. అన్నీ తాటాకు పైకప్పు వున్న ఇళ్ళే. దాని పైన గడ్డి పరిపించేవారు. మా తాతగారిదే రాళ్ళ పునాదులతో, ఇటుకలతో కట్టిన ఇల్లు. మిగిలినవన్నీ మట్టి ఇళ్ళే. పై కప్పు క్రింద, గోడల లెవెల్ వరకూ ఓ మేదరి తడికో, వెదురు తడికో బిగించి, దాన్ని మట్టి తో మెత్తేవారు. పైకి యేమైనా చేర్చడానికి మనిషి పట్టే ఓ కన్నం వుంచేవారు. దానికో వెదురో, చెక్కో నిచ్చెన వుండేది. తడిక పై భాగాన్ని 'మిద్దె' అని వ్యవహరించేవారు.

ప్రత్యేకత యేమిటంటే, ప్రతీ సంవత్సరం వేసంకాలం లో ఆ వూళ్ళో ఇళ్ళన్నీ 'పరశురామ ప్రీతి' అయిపోయేవి!

కొన్ని సార్లయితే, సంవత్సరం లో రెండు, మూడు సార్లు కూడా ఇళ్ళన్నీ అగ్నికి ఆహుతి అయ్యేవి!

'ఆ సూరప్ప లంజె (వెనకింటావిడో, పక్కింటావిడో) జీడిగింజలు కాల్చుకొని, కుంపటి ఆర్పి, మిద్ది మీద పెట్టేసిందటే! నిప్పు మళ్ళీ రాజుకొని, ఇళ్ళన్నీ తగలబడ్డాయి!' అనేది మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చేసి!

మా పెద్ద మామయ్య అప్పటికే తన వుద్యోగ రీత్యా రాజమండ్రి లో వుండేవాడు. (అప్పటికి ఆయనకి ఓ మునిసిపల్ స్కూల్లో ఉపాధ్యాయుడుగా వుద్యోగం అయ్యింది). చిన్న మామయ్య తన సొంత ఇంట్లో వుండేవాడు అదే వూళ్ళో. అమ్మమ్మ ఒక్కతే ఆ యింట్లో వుండేది. కొన్నాళ్ళకి మా చిన్న మామయ్య ఆ యింటికి మళ్ళీ తన పొలం లోంచి తాటి పట్టెలూ, తాటాకులూ, కొబ్బరాకులూ, గడ్డీ తో పై కప్పు వేయించి, ఓ కార్డు ముక్క వ్రాసేవాడు. మళ్ళీ ఈవిడ ప్రయాణం తన సొంత ఇంటికి!    

తరవాత మా చిన్న మామయ్యకి కూడా ఆ వూరికి రెండు కిలో మీటర్ల దూరం లో ఓ పల్లెలో ప్రాధమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా వుద్యోగం రావడం, దాంతో పాటు ఆయనని ఆ వూరి పోస్ట్ మాస్టర్ గా నియమించడం తో, ఆయన ఆ వూళ్ళో ఓ ఇల్లు కట్టుకొని, అక్కడికి మారి పోయారు.

ఆక్కడనించి, మా అమ్మగారి ఇల్లు యేమయిందో, యెవరు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారో యెవరికీ తెలియదు! 

--ఇంకొన్ని గుర్తు తెచ్చుకొని, మరోసారి.