Saturday, October 8, 2011

ఇలాంటివాళ్లని చూశారా?



......నేను చూశాను మరి!   

లండాచోరీ--పితలాటకం--లిటికిలేషన్--యెడ్డెం అంటే తెడ్డెం--ఇలా కొన్ని మాటలున్నాయి మనతెలుగులో. కొన్ని అచ్చతెలుగు పదాలూ, కొన్ని పరభాషా స్వీకర్తాలూ!

వీటివెనుక కొన్ని "తర్క, మీమాంసా" వగైరా శాస్త్రాలున్నాయి(ట).

ఒకాయన బజార్లో నిమ్మకాయలు కొనడానికొచ్చి, అడిగాడు "యెలా ఇస్తున్నావు?" అని. 

వాడు రసికుడు--"చేత్తోనే" అన్నాడు. 

"ఆహా! అలాగా? అయితే ఒక్కోటీ యెంతకిస్తావు?" 

"ఒక్కోటీ ఓ రూపాయికిస్తానండి!" 

"బాగుంది. పళ్లు బాగున్నాయి. నువ్వు ఒక్కోటీ పాతిక రూపాయలన్నా కొనుక్కోవలసిందేకదా? అవసరం నాది మరి! సరే....ఓ పది ఇవ్వు" అంటూ పదిరూపాయల నోటిచ్చాడు. 

వాడు ఓ పది నిమ్మకాయలని (పళ్లని) ఓ సంచీలో వేసి ఇచ్చాడు. 

తీసుకొని వెళ్లిపోవచ్చుకదా? వూహూఁ! 

(బుట్టలో ఇంకా ఓ అరవై డెభ్భయి నిమ్మపళ్లున్నాయి.) 

"ఇప్పుడు చెప్పు. ఈ యెండలో ఆ బుట్టలో పళ్లన్నీ ఒక్కోటీ రూపాయకి సాయంత్రందాకా అమ్ముకుంటావా? లేక, యేదో రేటుకి మొత్తం నాకిస్తావా? ఇస్తే యెంతకిస్తావు?" 

"మారాజులడగాలేగానండీ, ఓ యాభై రూపాయలకిస్తానండి!" 

"పదిహేనిస్తాను" 

"ఖుదరదండి" 

"సరే! ఇరవై?" 

"రావండి" 

"ఫైనల్గా చెపుతున్నాను. ఇరవై రెండు.....నీ యిష్టం!" 

"ఇవ్వలేనండి.....సరే, మారాజులు ఓ పాతికిప్పించండి!" 

పావుగంటలోపలే బేరం ఫైసల్! ఆయన పాతికా ఇచ్చి, బుట్టెడు కాయలూ తీసుకొన్నాడు. 

"రండిబాబూ! రండి! నిమ్మపళ్లు కావాలా? వూరికే ఇస్తున్నాను! తీసుకోండి!" అంటూ, పావుగంటలో వెళ్లేవాళ్లకీ, వచ్చేవాళ్లకీ పంచిపెట్టేసి, కారెక్కి, వెళ్లిపోయాడు!

ఈ లండాచోరీ యేమిటీ? ఇందులో యెవరి బలం యెంత? యెవరి బలహీనత యేమిటి? ఇలాంటివే "తర్క, మీమాంసా"వగైరా శాస్త్రాలు!

(ఆ బుట్టగలవాడు రైతు కాదు! ఓ వందకాయలు పాతిక రూపాయలకి రైతుదగ్గరకొన్న 'దళారి!')

 యెవరి వ్యాపారం వారిదికదా!?

(తెలివి ఒక్కడి సొమ్ముకాదోయ్!)


Monday, October 3, 2011

బాగా "పండుతున్న" క్యామెడీ.....



.....గుర్తింపు కార్డులూ

మన ప్రభుత్వ విధానాలూ, ప్రకటనలూ చూస్తూంటే, కొన్ని కార్టూన్లూ, జోకులూ గుర్తొస్తాయి నాకు. 

అందులో, కొంటెబొమ్మల బాపు వేసినది మొదటిది. 

ఓ అందమైన అమ్మాయి రోడ్డు ప్రక్కన నిలబడి వుంటుంది. ఒకడు ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ, స్పీడుగా వచ్చేస్తూంటాడు. ఆ ప్రక్కనే ఓ డ్రైనేజీ కాలువ వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చేవాడు ఆ కాలువలో పడటం ఖాయం! అప్పటికే ఆ కాలువలో వున్న ఇద్దరు ముగ్గురిలో ఒకడంటాడు..."ఇంకోడొస్తున్నాడు! జరగండి, జరగండి" అని! 

ఆ అమ్మాయీ, వచ్చేవాడూ, ఆ మాటలన్నవాడూ....వాళ్ల హావభావాలు యెంతచక్కగా చిత్రించారంటే, యెవరైనా "జరగండి" అనగానే ఫక్కున నవ్వు వచ్చేస్తుంది నాకు! 

ఇంకో జోకు....ఒకడు రోడ్డు ప్రక్కన నుంచొని, "పదకొండు.....పదకొండు...." అని లెఖ్ఖ మరిచిపోకుండా వల్లెవేసుకొంటూ వుంటాడు. చాలా సేపు అతన్ని గమనించిన ఇంకొకడు "యేమిటీ ఇందాకణ్నుంచీ లెఖ్ఖ పెడుతున్నావు?" అనడిగితే, దగ్గరకి రమ్మని వాణ్ని ప్రక్కనున్న డ్రైనేజి కాలవలో తోసేసి, "పన్నెండు.....పన్నెండు...." అంటూ వల్లెవేయడం మొదలెడతాడు! 

ఇంకో స్కిట్ లో, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఓ పేషంటుగా, డాక్టర్ దగ్గరకి వెళ్లి, ఆయనరాసిన అన్ని టెస్టులూ చేయించుకొని, అన్ని మందులూ కొని, అన్నీటికీ ఫీజులు, డబ్బులూ  చెల్లించుకొంటూ, "వాళ్లు కూడా బ్రతకాలిగా మరి?" అంటూంటాడు. చివరికి ఆ మందులన్నీ మురిక్కాలవలో పారేస్తాడు! అదేమిటీ అని అడిగితే, "నేను కూడా బ్రతకాలిగా మరి?!" అంటాడు. 

నిద్రలో కూడా నవ్వు పుట్టిస్తూ, చురకలు వేసే ఇలాంటివి "అజరామరాలు!"

మొన్నీమధ్య మా జిల్లాలో, వోటర్ల లిస్టుల సమీక్షలో, ఇంటింటికీ తిరిగి సేకరించిన వివరాలగురించి ఓ పెద్దాయన పరిశీలించి, "జనాభా ఇంత పెరిగితే, మొత్తం వోటర్లు ఇంత శాతం పెరిగితే, కొత్తగా వోటు హక్కు పొందినవాళ్లు.....'ఇంత శాతమేనా?' అంటే మీరు మీ ఇంట్లో బజ్జునే, ఇంటింటి సర్వే చేసేశారన్నమాట!" అంటూ చిర్రుబుర్రులాడారట. హెంత మాట!

మన కి కు రె, తన పథకాలని ప్రకటిస్తూ, ప్రతీదానికీ ".....అవినీతిని తగ్గించడానికి" అంటూ ప్రకటిస్తూండడంతో, వుద్యోగుల సంఘాలు, ముఖ్యంగా రెవెన్యూ వుద్యోగులు "యేం? వేళాకోళంగా వుందా? మీ మంత్రులూ, రాజకీయులూ అనేక కార్యక్రమాలపేరుతో మా వూళ్లకి వచ్చినప్పుడు, వాళ్లకి 'సుక్కా, ముక్కా....'లతో మర్యాదలు చెయ్యడానికి డబ్బులు మీబాబిస్తున్నాడా? పైగా, ప్రతీవాడూ 'మర్యాదలు సరిగ్గా జరగలేదు ' అని నీకు ఫిర్యాదు చేసేవాడే!" అంటూ ఖస్సుమంటున్నారట! 

2003 వరకూ చంద్రబాబు చేసిన తప్పిదమల్లా "నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనియ్యను" అనడమేననీ, తరవాత "నందోరాజా భవిష్యతి" జరిగింది అనీ మరిచిపోతే యెలా?

ఇంక విషయానికొస్తే, ఇప్పటివరకూ.....ఆథార్ తో సహా.....కొన్ని పదుల సంఖ్యలో....కంటిపాపల, వ్రేలిముద్రల, కాలి ముద్రల, చెవితమ్మెల, ముక్కు వంగిన కోణాల రికార్డులతో.....కార్డులు జారీచేయబడుతున్నాయి.....భాగ్యశాలులైన దేశ ప్రజలందరికీ! 

ఇప్పుడింకో "స్మార్ట్ కార్డ్" రాబోతోందట! (జరగండి....జరగండి.....!) 

2013 లోగా, "దేశంలోని వయోజనులందరికీ" బహుళ ప్రయోజన గుర్తింపుకార్డులు జారీచెయ్యాలని "భారత రిజిస్ట్రార్ జనరల్" ప్రతిపాదిస్తే, ప్రభుత్వం తగిన "కసరత్తు" చేస్తోందట!  రేషన్ కార్డుగా, యెన్నికల కార్డుగా....ఇలా అనేక రకాలుగా వుపయోగించవచ్చట. ప్రభుత్వానికి "యెంతో ఖర్చు ఆదా" అవుతుందట. 

దేశజనాభాలో 65% వయోజనులున్నారు. ఒక్కో స్మార్ట్ కార్డు తయారీకీ రూ.50/- మాత్రమే ఖర్చు అవుతుంది. (65 కోట్లూ X 50....యెంత?). 

ఇంకా, ఎన్ ఐ సీ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో కమీటీ వేశామనీ, వాళ్ల సిఫార్సులు అందితే, అప్పుడు "అసలు ధర" నిర్ణయం అవుతుందనీ కూడా సెలవిచ్చారట! (ఆ కమిటీ కెంతో, ఆ రిపోర్టులకెంతో, యెన్నాళ్లు పనిచేస్తుందో, చివరాఖరికి "అంచనా వ్యయాలు" యెంతకు పెరుగుతాయో!) 

ఇంకా, ఆథార్ సంఖ్యలతోపాటు, ఫోటోలూ, వ్రేలిముద్రలూ, కనుపాపముద్రలూ "లాంటి"వన్నీ ఈ స్మార్ట్ కార్డులో నిక్షిప్తమై వుంటాయట. "వివిధ కార్డుల స్థానంలో" కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "ఈ స్మార్ట్ కార్డు" వుపయోగించొచ్చు....అని "బయోమెట్రిక్ మార్కెట్ నిపుణులు" చెపుతున్నారట. 

(ఓప్రక్క "తన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయిందో" అంటూ యెవరో "తొలి" ఫిర్యాదు దాఖలు చేశారట......ఆ "ఆథార్" అధికార సంస్థకి. ఇది కూడా స హ చట్టం క్రింద దరఖాస్తు చేస్తేనే తెలిసిందట. ప్రస్తుతానికైతే ఫిర్యాదు "నమోదు" చేసుకొని, సంబంధిత విభాగానికి పంపించాము "అని మాత్రమే" వెల్లడించారట!)

మన వ్యాలెట్లలోని కార్డుల్లో పైన వున్నది మిగిలినవాటితో అంటోందీ...."జరగండి, జరగండి, ఇంకోటొస్తోంది!" అని.

పనికిరానికార్డులని పారేస్తూ, "ఐదు.....ఐదు....ఆరు" అంటూ లెఖ్ఖ పెడుతూ వల్లెవేస్తూ వుండాలేమో మనం! (పోయింది మనడబ్బేగా!)

ఈ కంప్యూటర్, బయోమెట్రిక్, మార్కెటింగ్....ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూలు....అంటారూ, "యెవరి జీవనోపాధి వారిది, యెవరి వ్యాపారం వారిది, యెవరి సంపాదన వారిది.....'అందరూ బ్రతకాలిగా'?"....అని!

"సామాన్యుడూ! సామాన్యుడూ! నీ వోటేవరికి?" అనడిగితే, "అందరూ సామాన్యులేగానీ, వాళ్లలో కొంచెం 'యెక్కువ ' సామాన్యుడికేనండి బాబయ్యా!" అన్నాడట.

కార్డులూ.....పథకాలూ.....యెన్నికలూ.....మీకు జోహార్లు!