Sunday, November 4, 2012

తెలుగు క్యామెడీ.....



.....వాడుక భాషలో

అమలాపురంలో ఓ డాక్టరుగారు వుండేవాడుట. ఓ పేషంటు రాగానే, యేమిటిసమస్య అనడిగేవాడట. ఆ పేషంటు “యేమిటో డాక్టరుగారూ…..యేమీ బాగుండడం లేదు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అన్నట్టుంది…….పడుక్కుంటే కాళ్లూ అవీ ఓ లాగేస్తున్నాయి…….” అంటూండగానే……”ఆగండాగండి…..ఓక్కొక్కటీ ఒక్కొక్కసారి చెపితే గానీ…..నేను అర్థం చేసుకోవాలికదా? కాళ్లు సరే, మరి ‘అవి ’ అంటే…..యేమి లాగుతున్నాయి?”అని  అడిగేవాడుట! పేషంటు నాలిక్కరుచుకునేవాడుట.

ఈ సంగతి చెప్పిన మా స్నేహితుడొకడు ఓ రోజున మేము యెక్కడకో వెళ్ళాల్సుండి వాళ్ళింటికి వెళ్లి పిలుస్తే, “ఇప్పుడే ఒక్క నిముషంలో కాస్త మొహం అదీ కడుక్కునివచ్చేస్తాను….” అంటూంటే….. “కంగారులేదుగానీ, కాస్తేం ఖర్మ….పూర్తిగా కడుక్కో……అదే…. మొహం. కానీ ‘అది ‘ ఇప్పుడొద్దులే…..లేటయిపోతుంది!” అన్నాను నేను.

ఓ రోజు మేం భోజనాలు చెయ్యడానికి కూర్చోగానే, మా ఇంటిదగ్గర గుళ్లో ‘హరి అవతారం అన్నం అయ్యా’ అని పాట వినిపిస్తూంటే, నేను మా ఆవిణ్ని ‘కాస్త హరి అవతారం వడ్డించు!’ అన్నాను సరదాగా. అక్కణ్ణించి మా కీర్తీ, శ్రావణీ అల్లుకుపోయారు. ‘లక్ష్మీ అవతారం ‘పప్పయ్యా' అనీ, కూరని ‘బ్రహ్మ అవతారం ‘ అనీ చారుని సరస్వతి అవతారం అనీ, పులుసుని శివుడవతారం అనీ, పెరుగుని పార్వతి అవతారం అనీ, మజ్జిగని గంగ అవతారం అనీ, నూనె ని ఆది శేషుడి అవతారం అనీ, నెయ్యిని నందకం అనీ…..ఇలా క్యామెడీ పండించారు. 

మా కీర్తి “దొడ్డా! కొంచెం హరి అవతారం వడ్డించి, రెండు గరిటెలు శివుడవతారం వేసి, రెండు చెంచాలు నందకం వెయ్యి!” అంటూంటే…..క్యామెడీయే క్యామెడీ!

మొన్న తెలుగు వెలుగు ప్రారంభ సంచికలో ఓ వ్యాసంలో “రాచ్చిప్ప, శిబ్బెం, గోకర్ణం, స్తాళీ, చెంబు, బిందె, జాంబు, పొయ్యి, రోలూ, రోకలీ, విసుర్రాయి, రుబ్బురాయి” లాంటి తెలుగు మాటల ప్రసక్తి తెచ్చారు. 

అలాంటిదే ఇంకో మాట “అరికిలాంతరు”. మా ఎస్ ఎస్ ఎల్ సీ ఇంగ్లీషు పొయెట్రీ లో “లూసీ గ్రే” అని ఓ పద్యభాగం సందర్భంలో మా మేష్టారు చెప్పారు “దాన్ని హరికేన్ లాంటెర్న్” అంటారు అనీ, హరికేన్ అంటే వాయుగుండం అనీ, అలాంటి పరిస్తితుల్లో కూడా అదే సూత్రం ప్రకారం ఆరిపోకుండా వెలుగుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అనీ! దాన్ని మన తెలుగులో అరికిలాంతరు చేసేశారు. 

మా ఇంటికి మూడు పిల్లులు వచ్చేవి—సరిపిల్లి, లేళ్ళపిల్లి, కండిపిల్లి అని—ఇంటి పేర్లున్న ముగ్గురు కుర్రాళ్లు మా నాన్నగారిదగ్గర చదూకోడానికి వచ్చేవారు. రాత్రి చదూకోడానికి యెవరి అరికిలాంతరు వాళ్లు తెచ్చుకొని మా యింట్లోవుంచేవారు. రోజూ సాయంత్రం మా అమ్మ వాటిని చిమ్నీలు తుడిచి, కిరసనాలు పోసి సిధ్ధం చేసేది. వాటిలో కండిపిల్లి వాడి లాంతరు స్పెషల్—వెలిగించిన తరవాత ప్రతీ ఐదు నిమిషాలకీ ఒకసారి “భగ్ భగ్” అంటూ వుండేది. అందుకని వాడి పేరు “మిష్టర్ భగ్ భగ్” అని యేడిపించేవారు మిగతావాళ్లు.

శాండీ హరికేన్ విషాదం నేపధ్యంలో ఈ హరికేన్ లాంతర్ల గొడవ గుర్తొచ్చి వ్రాశాను. విషాదంలో కూడా క్యామెడీ పండించుకొని ఆనందించడం తప్ప మనం యేమి చెయ్యగలం!


Thursday, October 25, 2012

గెలుతు షాభా.......



........నాశనాలూ

తెలుగు భాషాభివృధ్ధి మాటేమోగానీ, మా ఇంట్లో అందరూ గెలుతు షాభ బాగా నేర్చుకొని, దాన్ని వుపయోగిస్తూ, బాగా అభివృధ్ధి చేసుకుంటాము.

ఈ మధ్య తానా, తంతా ల్లా మనం కూడా అమెరికాలో ఓ గెలుతు సంఘం ప్రారంభిస్తే యెలా వుంటుంది? ప్రపంచ గెలుతు మహాసభలు జరిపించచ్చుకదా? లాంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. పేరు "గానా" (గెలుతు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అనిపెడితే బాగుంటుంది అనికూడా నిశ్చయించారు.

ఇంక కార్య రంగంలోకి దూకడమే తరువాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా గెలుతు మాట్లాడేవాళ్లనందరినీ వివరాలు సేకరించడం, ఓ వేదిక మీదికి తీసుకురావడం చాలా కష్టమైన పని. కానీ అసాధ్యం కాదు కదా అనికూడా అంటున్నారు.

ఇంతకీ ఈ టపా యెందుకంటే--గెలుతు భాష కూడా కాలానుగుణ్యంగా యెలా మార్పు చెందుతుందో ఓ చిన్న వుదాహరణ వ్రాయడానికి.

మామూలు తెలుగు లో "స్నానం" అంటే అందరికీ తెలుసు. అది గెలుతులో "నాస్నం" అవుతుంది. అది వాడుక క్రమంలో "నాశనం" గా రూపాంతరం చెందింది ఇప్పటికే. 

ఈ నాశనాల్లో కొన్ని రకాలు వున్నాయి.

యమర్జంటుగా పూర్తి చెయ్యడాన్ని--"కాకి నాశనం" అంటారు. అంటే ముక్కూ మొహం నీళ్లతో కడిగేసి, రెక్కలతో పైపైన నీళ్లు జల్లేసుకొని, తుడిచేసుకోవడమే. 

ఇంకోటి "అర్ధ నాశనం". ఇదికూడా యెమర్జెంటుగా కాకపోయినా, అర్జెంటుగా ముగించడానికి. అంటే, మొహమూ, శరీరం పైభాగం చేతులతో సహా నీళ్లతో కడిగేసి, కాళ్లుమాత్రం కడుక్కొని, తుడిచేసుకోవడం.

మరోటి "మాలూము నాశనం". ఇది సామాన్యంగా రోజూ 'మామూలుగా' చాలామంది చేసేదే. అంటే బాత్రూములో శుభ్భరంగా వొళ్లంతా రుద్దుకుంటూ, తలతడవకుండా చేసేది.

తరవాతది "సర్వ నాశనం". ఇందులో తలకూడా కుంకుడుకాయల పులుసుతోనో షాంపూతోనో రుద్దుకుంటూ, పూర్తిగా స్నానించడం. ఇది మామూలుగా వారానికోసారి చేస్తారు చాలా మంది.

ఇక యెప్పుడో తప్పనిసరిగా చేసేది "టబ్బ నాశనం". దాన్నే తెలుగులో "సచేల స్నానం" అంటారు. యెవరిదైనా మరణవార్త విన్నప్పుడో, పార్థివ శరీరాన్ని చూసి వచ్చినప్పుడో--ఇలా ఇంటి బయటే నూతిలోంచి నీళ్లు తోడుకొని కట్టు బట్టలు తడిసేలా చేసేది.

సరదాగా అందరితో పంచుకోవాలని వ్రాశాను. ఇంకెవరైనా ఇంకేమైనా వెరైటీలు వ్రాస్తే వ్రాయండి.

ఇంతకీ మీ సర్వనాశనం యెప్పుడు?

శుభం.

Friday, May 18, 2012

టాయిలెట్లూ..........



..........నేపీలూ!

"........ఆంటీ! మీ అమ్మచేత నేపీ వేయించుకోలేదా?" అని ప్రశ్నించాడట నాలుగేళ్ల నా మనవడు!

మా అమ్మాయివాళ్లూ అమెరికాలో యేదో ఓ "చూడదగ్గ ప్రదేశానికి" వెళ్లినప్పుడు ఒకచోట విశ్రాంతికోసం ఆగితే, ఓ ఆసియాజాతి స్త్రీ ఆదుర్దాగా వచ్చి, టాయిలెట్లు యెక్కడ వున్నాయి? అని ఆరా తీస్తుంటే, వాడు అన్నమాటలు--"ఇలాంటిచోట టాయిలెట్లుండవు. అందుకే మా అమ్మనడిగి నేపీ (మనవాళ్లు వీటిని డయపర్లు అని కూడా అంటారు) వేయించేసుకొంటాను నేను. ఆంటీ!........". ఇలా సాగిపోతుంటే, మా అమ్మాయి హడావుడిగా ఆవిడకి సూచనలు ఇచ్చి పంపేసిందట! (ఆవిడకి తెలుగు రాకపోవడంతో బ్రతికిపోయాను అంటుంది).

మొన్నీమధ్య మేము ఢిల్లీ టూరు వెళ్లినప్పుడు, సాయంత్రం రెడ్ ఫోర్టులో "సౌండ్ & లైట్" కార్యక్రమానికి వెళ్లాము. అక్కడ టిక్కెట్లు పరిశీలించే చోట వాళ్లు తమ పని తాము చేస్తూండగా, ఒకాయన (విదేశీయుడు కాదనుకుంటా--ఇతర రాష్ట్రాలకి చెందినవాడేమో) "టాయిలెట్లు యెక్కడ వున్నాయి?" అని వాళ్లని అడుగుతున్నాడు. 

వాళ్లలో ఒకడు "ఇక్కడ లేవు. మళ్లీ కోట బయటికి వెళ్లిపోయి, రోడ్డు మీదకి వెళితే, కొంతదూరంలో ఓ ప్రక్కన వుంటాయి" అని చెపుతున్నాడు.

అది ఓ పెద్ద కోట. రోడ్డు మీదనుంచి ఓ అరకిలో నడిస్తే, అక్కడ కోట గుమ్మం. అక్కణ్నించి ఇంకో అరకిలో, పైకి యెక్కుతూ నడిస్తే అక్కడ టిక్కెట్లు పరిశీలించేవాళ్లు! మరి టాయిలెట్ కోసం కిలో దూరం పైగా వెళ్లి రావాలంటే......ఈలోగా "షో" మొదలైపోతే.....ఇలా ఆలోచిస్తున్నాడు అతను. 

"మరెలాగ భాయీ......", "మేమేమీ చెయ్యలేము!" ఇలా ఓ రెండుమూడు నిమిషాలు నడిచింది. (మా టిక్కెట్ల పరిశీలన పూర్తయినా, ఆ ప్రక్కనే నించొని ఆసక్తిగా గమనించాను నేను).

చివరికి వాళ్లలో ఒకడు "చీకట్లో, ఆ చెట్ల వెనుక, కోటగోడ దగ్గర కానిచ్చెయ్యి. అదీ చెప్పాలా?" అని విసుక్కున్నాడు! 

ఆ ప్రక్కనే వున్న అతని స్నేహితుడు "మరెందుకాలస్యం భాయ్! ఇన్ ఇండియా ఎవ్వెరితింగ్ ఈజ్ ఓపెన్!" అంటూ తన ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని తెలియబరుస్తూ, ప్రోత్సహించాడు. (నేను నవ్వుకుంటూ షో లోకి). 

(పర్యావరణం పేరుతో "టూరిస్ట్ స్పాట్" లని జనాలకి దూరంగా జరిపేస్తూ, అనేకమందికి "వుపాధి" కల్పిస్తూ, వాటిని ఇంకా నాశనం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఇంకో బ్లాగులో ఇంకో టపా వ్రాస్తాను. అలాగే ఓ అద్భుతమైన, కోట్లు సంపాదించి పెట్టే వ్యాపార సూచనని కూడా ఇస్తాను).

సరేనా?

Thursday, May 10, 2012

ఆరోజుల్లో.......



......పెళ్లిచూపులు!

"అమ్మా! పప్పు వేసుకు తినేశాను. ఇప్పుడేం వేసుకోవాలే?"
"పప్పు తరవాత, కూరలున్నాయికద, నీకిష్టమైన కూరవేసుకొని తినూ!"
"ఇది వంకాయ కూర. కలుపుకు తినాలి కదా? ఇది బెండకాయ వేపుడు.....ఇది అద్దుకోవాలి! నాకు తెలుసు. ముందు వంకాయ కలిపేస్తాను! అలాగేనా అమ్మా?"

75 యేళ్లక్రితం, ఓ కొండయ్యగారింట్లో, భోజనాల సమయంలో జరిగిన సంభాషణ ఇది.

ఆ కొండయ్యగారు శ్రోత్రియ బ్రాహ్మడు. పాతికెకరాల ఆసామీ. కొంచెం అనారోగ్యుడు. 

ఆయన అన్నగారు (దద్ద అనేవారుట ఆయన్ని) యేడడుగుల మనిషి. 24 కుంచాల ధాన్యం బస్తాని అవలీలగా భుజం మీద మోసుకొని, నరేంద్రపురం నుంచి రాజా నగరం (దాదాపు 15 కిలోలనుకుంటా) మిల్లుకి తీసుకెళ్లి, వచ్చిన తౌడూ, చిట్టూ వగైరాల సంచులని నడుముక్కట్టుకొని, బియ్యం బస్తాని మోసుకొంటూ సాయంత్రానికి ఇంటికి చేరేవాడట!

కొండయ్యగారికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. మూడో కూతురు పెళ్లికి వుందని తెలిసి (ఆవిడ వయస్సు 8 యేళ్లు), ఒకావిడ తన 12 యేళ్ల కొడుకుని వెంటబెట్టుకొని వీళ్లింటికి పెళ్లిచూపులకీ, సంబంధం మాట్లాడుకోడానికీ వచ్చింది.

ఆరోజుల్లో, మగపిల్లల తల్లులు మేనరికాలుంటే, వాళ్లని బ్రతిమలాడేవారు--పిల్లనివ్వమని. లేకపోతే, ఇలా వూళ్లమీదపడేవారు సంబంధాలకోసం.

యెక్కడ బయలుదేరారో, ఇక్కడికి వచ్చేటప్పటికి భోజనాల సమయం సమీపించడంతో, ముందు భోజనాలు కానిమ్మన్నారు--ఆవూళ్లోని ఇతర బంధువులనీ, ఇరుగు పొరుగునీ కూడా ఆహ్వానించి.

బంతిలో పెద్దవాళ్లతో ఆవిడ కూర్చుంటే, యెదురు బంతిలో, కొంచెం దూరంగా పెళ్లికొడుకు కూర్చున్నాడు. అప్పుడు జరిగాయీ సంభాషణలు!

వెనకగదిలో స్నేహితురాళ్లతో వున్న పెళ్లికూతురు పరిస్థితీ, వాళ్ల వేళాకోళాలూ యెలా వుంటాయో వూహించండి!

ఇవన్నీ గమనించిన "దద్ద", భోజనాలయ్యాక ఆవిడ "పెళ్లిచూపులు......." అంటుంటే, "అఖ్ఖర్లేదు. ఇంక మీరు బయటికి నడవండి!" అని వాళ్లని తోలేశాడట!

అలాంటి దద్ద వున్న ఆ పిల్ల అదృష్టవంతురాలు!

కదా?

Saturday, March 10, 2012

అంతులేని విషాదం!



రాధా కొండలీయం

పాపం మన రావికొండలరావు అమెరికాలో జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోడానికి ప్రయాణమై, దుబాయ్ లో ఇంకో విమానం యెక్కబోతుంటే, సెల్ మోగిందట. 

వాళ్లావిడ "ఒరేయ్! నాటకాల సచ్చినోడా....ఒరే కోటిగా!" అంటూంటే, ఆయన "ఒసే! ప్లీజ్! ఇంకెంతో లేదు--ఆ ఎవార్డేదో తీసుకొచ్చేస్తాగా! ఇప్పుడేమీ అనకు" అని బ్రతిమాలుతుంటే, "నేను ప్రక్కన లేకుండా నీకు యెవార్డేమిట్రా?" అని కళ్లెర్రజేస్తూ, "వెళ్లిపోయిందట" రాధాకుమారి--70 యేళ్లకే! పాపం ఆయన తిరిగి ఇండియాకి ప్రయాణం కట్టాడు.

హృదయం ద్రవించే వార్త! ఆమె ఆత్మకి శాంతి కలగాలనీ, కొండలరావుగారు తన హృదయం చిక్కబట్టుకోవాలనీ కోరుకోవడం తప్ప యేమి చేయగలం!

Saturday, February 11, 2012

మనతెలుగులో........



.........నాక్కొన్ని సందేహాలు

తినికూచుంటే అనేక సందేహాలొస్తాయంటారు. తినకుండా కూర్చుంటే రావా అని సందేహించకండి.

ఒకాయన తనింట్లో రోజూ నిలబడే భోజనం చెయ్యడం చూసి, ఇంకొకాయన అడిగాడట.....అలా యెందుకు? అని. "కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారుకదా? మరి నా కొండంత ఆస్తి తరిగిపోతే, రేపేమి తినాలి?" అనడిగాడట ఆయన.

"దేవుడు గ్రుడ్డివాడు" అన్నాట్టొకాయన. యెలా నిరూపించగలవు? అని అడిగితే, "గాడ్ ఈజ్ లవ్; లవ్ ఈజ్ బ్లైండ్ కదా? ఇవన్నీ వొకటే కాబట్టి, గాడ్ ఈజ్ బ్లైండ్ కాదా?" అన్నాట్ట. 

మనకి వున్న శాస్త్రాల్లో తర్క, మీమాంస లాంటి శాస్త్రాలున్నాయి. ఇలాంటి లాజిక్కులనే "తర్క శాస్త్రం" అంటారుట.

మనకి అలాంటి శాస్త్రాల్లో యేవిధమైన ప్రావీణ్యం లేకపోయినా, తరచూ మనం ఇలాంటి లాజిక్కులు మాట్లాడుతూనే వుంటాము.

అసలు విజ్ఞానానికి మూలం సందేహమే అంటారు.

మన కథలేవైనా, "మున్ను నైమిశారణ్యమున సూతుడు శౌనకాది మహా మునులకు....." అని మొదలవుతాయి.

మరి "నైమిశుడు" అనేవాడి పేరుమీద ఆ అరణ్యం యేర్పడిందా?
సూతుడు ఓ మహర్షా?
శౌనకాదుడు ఇంకో మహామునా?
బ్రహ్మాదులు అంటే, "బ్రహ్మాదుడు" అనే ఓ దేవుడుండేవాడా?

అప్పుడే ఇదేం పిచ్చి? అనెయ్యకండి.

మరి "పిప్పలాదుడు" అనే ఋషి వుండేవాడా? వుంటే ఆయన పుట్టు పూర్వోత్తరాలేమిటి?

"ధన్వంతరి" అనే ఆయన మన చరిత్రలో, చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థాన వైద్యుడు. మరి ఆయన దేవతల వైద్యుడు యెప్పుడు అయ్యాడు? మొన్నటి ధన త్రయోదశికీ, ధన్వంతరికీ యెందుకు లింకు పెట్టారు? (ఆయన బంగారం చేసేవాడు, దాన్ని భస్మం చేసి, ఔషధాల్లోవాడేవాడు, అందుకనే ఆ రోజు కొంచెమైనా బంగారం "కొనాలి" అని ఒకాయన వ్రాశాడు అనీ, ఇంకా నయం దాన్ని భస్మం చేసెయ్యాలనలేదు అనీ నా ఇంకో బ్లాగులో ఓ టపాలో వ్రాశాను).

"......ఆ సుందోపసుందులు ఇంకా రాలేదా అని అడిగారు!"
"సుందోపసుందులా! వాళ్లెవరు?"
"ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు!"

ఈ సంభాషణ మన ఓ సినీ కళాఖండం లోది. (గుర్తుకొస్తే నవ్వుకోండి!)

సుందోపుడు, సుందుడు అని వుండేవారా? వాళ్ల చరిత్ర యేమిటి? వాళ్లు దేనికి ప్రఖ్యాతులు? ఇక్కడ సందర్భానికి వాళ్ల పేర్లు సరిపోతాయా? ఆ సంభాషణ రచయిత, తదితర సంబంధితులు యెవరు? (ఇదేమీ క్విజ్ పోటీ కాదండోయ్! కాస్త రిఫ్రెష్ అవుతారని!)

రేపటినుంచి ఇలాంటివన్నీ "నిజాలుగా" చెల్లుబాటు అయిపోవని నమ్మకమేమిటి?

"విఖన/విఖనో" మునీంద్రుడూ, ధన్వంతరి ఆలయం, వాల్మీకి గుడీ వగైరాల గురించి వినలేదా?

మా వూళ్లో రోడ్డు ప్రక్క చెట్లకిందా, సెంటర్లలోనూ "వెలిపిస్తున్న" విగ్రహాలనీ, శిథిలమైపోతున్న గుడులని పునరుధ్ధరిస్తూ, అక్కడి ఋషుల వగైరాలని రోడ్డు ప్రక్కన పడేస్తే వాటినీ మునిసిపాలిటీ సిబ్బంది వలందరువారి రేవుకి తరలించి, ఓ చెట్టు చుట్టూ పేర్చడం మొదలెట్టారు. ఇప్పుడు, గోదావరిలో స్నానం చేసిన "భక్తులు" ఆ విగ్రహాలకి కూడా పసుపూ, కుంకుమా మెత్తేసి, అగరత్తులు వెలిగించి, అరటిపళ్లు కూడా మెత్తేస్తున్నారు. విగ్రహాలు యెక్కడ యే స్థితిలో వున్నా పూజనీయమేనంటారా? నేను కాదనడం లేదుకదా?

"ఘనంగా" ప్రతీనదికీ, కాలవకీ పూజలు నిర్వహించి, అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి వాటిలో వదిలేసీ, "పోలిస్వర్గం" ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం చేస్తున్న రోజులివి! ఇంకా బోళ్లన్ని ఉత్సవాలు రావాలి--సర్వేజనా సుఖినోభవంతు అవ్వాలి మరి.

Friday, January 20, 2012

బాలానందం......



......కలిగించడం సాధ్యమా?

బీర్బల్ ఓ సారి కొలువుకి ఆలస్యంగా వచ్చాడని అక్బర్ విసుక్కున్నాడట. అప్పుడాయన "క్షమించండి జహాఁపనా! మా మనవణ్ని వూరుకోబెట్టి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది" అన్నాడట. 

దాంట్లో అంత కష్టమేముంది నిరూపించమంటే, "నేను చిన్న బాబుననుకోండి, నన్ను వూరుకోబెట్టండి మరి" అని, నాకు  వివిధ సైజుల కూజాలు కావాలి అని యేడిచాడట. సరే అని తెప్పించాడు రాజు. కాసేపు వాటిని ఒకదాంట్లో ఒకటి పెడుతూ ఆనందించి, "ఇప్పుడు నాకు రాజుగారి యేనుగు కావాలి" అన్నాడట. అదీ తెప్పించబడింది. ఇంకాసేపు ఆడుకొని, "ఇప్పుడు ఈ యేనుగుని ఈ కూజాలో పెట్టాలి" అన్నాడట! 

అదెలా సాధ్యం? అని రాజుగారంటే, మరి పిల్లలు అలాంటి కోరికలే కోరుతారు. వాళ్లని సముదాయించేటప్పటికి తలప్రాణం తోకకి రాదా మనకి? అంటే, రాజుగారు నవ్వుకొన్నాడట--కోపమంతా మరచిపోయి.

ఇప్పటివరకూ అనేకమంది చిన్నపిల్లల పెంకెతనాలనీ, అల్లర్లనీ, వింత కోరికలనీ, పేచీలనీ చూశాను. కానీ...... 

మొన్న మా ద్వితీయ దౌహిత్రుడు (మా అమ్మాయి రెండో కొడుకు--వాడికి మూడేళ్లు. మొన్ననే ప్లేస్కూల్లో చేరాడు. కంప్యూటర్లో వాడికి కావలసిన ఆటలూ అవీ పెట్టేసుకొంటాడు. వాడో వెరయిటీ) పెట్టిన పేచీ యెవరూ విని వుండరు.

వాళ్లమ్మ నెమ్మదిగా కొన్ని రోజులనుంచి మోటివేట్ చేసి, మొన్న ప్రొద్దున్నే వాడు లేచి, పాలు త్రాగాక, "ఇప్పుడు నీ చేతివేళ్ల గోళ్లు కత్తిరిస్తానే?" అంటే వెంటనే వొప్పుకున్నాడు. చక్కగా వొళ్లో కూర్చోబెట్టుకొని, ఆకబురూ, ఈ కథా చెపుతూ మొత్తానికి పని పూర్తి చేసేసింది.

తీరా కంప్యూటర్ దగ్గరకి వెళ్కి కీబోర్డు మీద వేళ్లు పెట్టగానే వాడికేం తేడా తెలిసిందో, "ఛీ! నా వేళ్లు బాగాలేవు......మళ్లీ నాగోళ్లు నాకు పెట్టెయ్....." అని లంకించుకున్నాడట!

చెప్పండి....వాడికి బాలానందం యెలా కలిగించాలో!

(తరవాత ఓ గంట నానా తిప్పలూ పడి, వాణ్ని కన్విన్స్ చేసి, మరిపించిందనుకోండి.)

అదీ సంగతి.