Sunday, November 4, 2012

తెలుగు క్యామెడీ..........వాడుక భాషలో

అమలాపురంలో ఓ డాక్టరుగారు వుండేవాడుట. ఓ పేషంటు రాగానే, యేమిటిసమస్య అనడిగేవాడట. ఆ పేషంటు “యేమిటో డాక్టరుగారూ…..యేమీ బాగుండడం లేదు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అన్నట్టుంది…….పడుక్కుంటే కాళ్లూ అవీ ఓ లాగేస్తున్నాయి…….” అంటూండగానే……”ఆగండాగండి…..ఓక్కొక్కటీ ఒక్కొక్కసారి చెపితే గానీ…..నేను అర్థం చేసుకోవాలికదా? కాళ్లు సరే, మరి ‘అవి ’ అంటే…..యేమి లాగుతున్నాయి?”అని  అడిగేవాడుట! పేషంటు నాలిక్కరుచుకునేవాడుట.

ఈ సంగతి చెప్పిన మా స్నేహితుడొకడు ఓ రోజున మేము యెక్కడకో వెళ్ళాల్సుండి వాళ్ళింటికి వెళ్లి పిలుస్తే, “ఇప్పుడే ఒక్క నిముషంలో కాస్త మొహం అదీ కడుక్కునివచ్చేస్తాను….” అంటూంటే….. “కంగారులేదుగానీ, కాస్తేం ఖర్మ….పూర్తిగా కడుక్కో……అదే…. మొహం. కానీ ‘అది ‘ ఇప్పుడొద్దులే…..లేటయిపోతుంది!” అన్నాను నేను.

ఓ రోజు మేం భోజనాలు చెయ్యడానికి కూర్చోగానే, మా ఇంటిదగ్గర గుళ్లో ‘హరి అవతారం అన్నం అయ్యా’ అని పాట వినిపిస్తూంటే, నేను మా ఆవిణ్ని ‘కాస్త హరి అవతారం వడ్డించు!’ అన్నాను సరదాగా. అక్కణ్ణించి మా కీర్తీ, శ్రావణీ అల్లుకుపోయారు. ‘లక్ష్మీ అవతారం ‘పప్పయ్యా' అనీ, కూరని ‘బ్రహ్మ అవతారం ‘ అనీ చారుని సరస్వతి అవతారం అనీ, పులుసుని శివుడవతారం అనీ, పెరుగుని పార్వతి అవతారం అనీ, మజ్జిగని గంగ అవతారం అనీ, నూనె ని ఆది శేషుడి అవతారం అనీ, నెయ్యిని నందకం అనీ…..ఇలా క్యామెడీ పండించారు. 

మా కీర్తి “దొడ్డా! కొంచెం హరి అవతారం వడ్డించి, రెండు గరిటెలు శివుడవతారం వేసి, రెండు చెంచాలు నందకం వెయ్యి!” అంటూంటే…..క్యామెడీయే క్యామెడీ!

మొన్న తెలుగు వెలుగు ప్రారంభ సంచికలో ఓ వ్యాసంలో “రాచ్చిప్ప, శిబ్బెం, గోకర్ణం, స్తాళీ, చెంబు, బిందె, జాంబు, పొయ్యి, రోలూ, రోకలీ, విసుర్రాయి, రుబ్బురాయి” లాంటి తెలుగు మాటల ప్రసక్తి తెచ్చారు. 

అలాంటిదే ఇంకో మాట “అరికిలాంతరు”. మా ఎస్ ఎస్ ఎల్ సీ ఇంగ్లీషు పొయెట్రీ లో “లూసీ గ్రే” అని ఓ పద్యభాగం సందర్భంలో మా మేష్టారు చెప్పారు “దాన్ని హరికేన్ లాంటెర్న్” అంటారు అనీ, హరికేన్ అంటే వాయుగుండం అనీ, అలాంటి పరిస్తితుల్లో కూడా అదే సూత్రం ప్రకారం ఆరిపోకుండా వెలుగుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అనీ! దాన్ని మన తెలుగులో అరికిలాంతరు చేసేశారు. 

మా ఇంటికి మూడు పిల్లులు వచ్చేవి—సరిపిల్లి, లేళ్ళపిల్లి, కండిపిల్లి అని—ఇంటి పేర్లున్న ముగ్గురు కుర్రాళ్లు మా నాన్నగారిదగ్గర చదూకోడానికి వచ్చేవారు. రాత్రి చదూకోడానికి యెవరి అరికిలాంతరు వాళ్లు తెచ్చుకొని మా యింట్లోవుంచేవారు. రోజూ సాయంత్రం మా అమ్మ వాటిని చిమ్నీలు తుడిచి, కిరసనాలు పోసి సిధ్ధం చేసేది. వాటిలో కండిపిల్లి వాడి లాంతరు స్పెషల్—వెలిగించిన తరవాత ప్రతీ ఐదు నిమిషాలకీ ఒకసారి “భగ్ భగ్” అంటూ వుండేది. అందుకని వాడి పేరు “మిష్టర్ భగ్ భగ్” అని యేడిపించేవారు మిగతావాళ్లు.

శాండీ హరికేన్ విషాదం నేపధ్యంలో ఈ హరికేన్ లాంతర్ల గొడవ గుర్తొచ్చి వ్రాశాను. విషాదంలో కూడా క్యామెడీ పండించుకొని ఆనందించడం తప్ప మనం యేమి చెయ్యగలం!