తియ్యని కల్లలు (కొనసాగింపు)
అసత్యం పలకటంలో, కల్లలు అల్లడంలో కవులు ఆరితేరారు. వారి అబధ్ధాలు కళారూపం కట్టినవి. అబధ్ధాలు ఆడుతున్నాము చూడండి అని ఢక్కా మీద దెబ్బకొట్టి, మరీ అబధ్ధాలు ఆడారు.
మనుచరిత్ర అని ఓ పుస్తకం వ్రాసిన పెద్దనకవి వ్రాస్తాడు--
"వరుణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాంబరమై, సౌధ సుధా ప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీ హరిణంబై యరుణాస్పదంబనగ నార్యావర్త దేశంబునం బురమొప్పన్ మహికంఠహారతరళస్ఫూర్తిన్ విడంబించుచున్" అన్నాడు..
అరుణాస్పదం అనే ఊరు ఉందిట. వరుణాద్వీపవతీ తటాంచలములో ఉన్నదిట! ఒఠ్ఠిది. అటువంటి ఊరులేదు అసలు! పోనీ ఉందనుకొన్నాము.
ఆవూరి ప్రాకారములు ఆకాశాన్ని తాకుతున్నయ్యనీ, ఆవూళ్లో ఉన్న ఎత్తైన మేడలయొక్క తెల్లదనము చంద్రుడిలోకి కొట్టేసరికి, చంద్రుడిలో ఉన్న నల్లమచ్చ కాస్తా మాయం అయిందనీ వ్రాశాడు. ఇటువంటి ప్రాకారాలు, మేడలు ఎక్కడన్నా ఉంటయ్యయ్యా, ఎందుకీ అబధ్ధాలు అని నిలవేసి అడిగేవాడు లేకపోయినాడు ఆ రోజులలో.
పైగా కృష్ణదేవరాయలవంటి మహా ప్రభువు ఆయనను గౌరవించి, ఎదురైనచో మదకరీంద్రము డిగ్గి చేయూతనిచ్చి ఎక్కించుకొనే వాడట!
అత్యున్నతమైన అబధ్ధాలు ఆడినందులకు అంత గౌరవం లభించింది. అది చూచి మిగతా పిల్లకవులంతా, తమ చేతనైన అబధ్ధాలు ఆడటం సాగించారు.
చిన్న చిన్న విషయాలలో కూడా ఈ కవులు పుటుక్కున అబధ్ధం ఆడేస్తారు. ఓ అమ్మాయిని పట్టుకుని, నీ కళ్లు ఆకర్ణాంత విశాలాలు అని వర్ణిస్తారు. నిజానికి ఎంత అందంగలదైనా, మనిషి జన్మ ఎత్తిఉంటే అంత కళ్లు ఉండవు.
ఆమె జడ సుదీర్ఘమై, నల్లకోడెత్రాచులాగ మిసమిసలాడుతున్నది. అంటాడు. అసలు ఆమె జడ దీర్ఘం కానేకాదు. సవరం పెడితే అంత పొడుగైంది. మిసమిసలాడుతుందట త్రాచులాగ! ఛాఛా! వఠ్ఠి అబధ్ధం! నిజం ఏమిటంటే, ఆమె జడ గరెటెకాడలాగ గట్టిగా ఉన్నది.
పైగా, తనకేదో ప్రియురాలు ఉన్నట్లూ ఆమె ఏదో సౌందర్యనిధి అయినట్టూ పద్యాలు వ్రాస్తారు. పచ్చి అబధ్ధాలు కదా!
ఆ అనాథ బాలిక ప్రియురాలు నాకు. ఆమె కనులలో నీలంపు నిధులుగలవు. అని ఇల్లాగ ఒక కవి వ్రాస్తే నేను అడిగాను ఎవరయ్యా ఆ బాలిక అని! నీకు చెబుతానా నాప్రియురాలు ఎవరో! చచ్చినా నీకు చెప్పను. అని గర్వంగా అన్నాడు. ఉంటే ఎందుకు చెప్పడు. ఒఠ్ఠిది. అతనికి ప్రియురాలూలేదూ, ఎవరూలేదు. అబధ్ధాలు. బొత్తిగా అబధ్ధాలుకదా!
ఇల్లాగ కవులు ఆడే అబధ్ధాలకు అంతూపొంతూ లేదు అదంతా భాషకు అలంకారం అన్నారు.
అబధ్ధాలు భాషకు మాత్రమే అలంకారాలని వాళ్లు అన్నారు. నేను ఏమంటానంటే అబధ్ధాలు జీవితానికే అలంకారాలని అంటాను.
జీవితాన్ని అబధ్ధాలు అల్లిబిల్లిగా అల్లుకుపోయినయి. కల్లా కపటం తెలియనివాడు అంటే శుధ్ధ తెలివితక్కువ వాడని అర్థం. వేమనకూడా కల్లనిజము తెలిసిన మనుజుడెపో, నీతిపరుడు మహిలో వేమా అన్నాడు. కల్లము నిజము అంటే కల్ల నిజ స్వరూపము అన్నమాట! కాబట్టి కల్లలాడటం తెలియకపోయినవాడికి జీవిత సౌందర్యమే తెలియకుండా పోతుంది.
(అయిపోయింది)
రచయితగురించీ, ఇతర వివరాలూ.....త్వరలో. ఈలోగా కూడా మీరు ఊహించి చెప్పవచ్చు.
2 comments:
ఎక్కడో చదివినట్టు లీలగా గుర్తొస్తోంది.... మునిమాణిక్యం వారేనా?
డియర్ puranapandaphani!
గుర్తుంచుకున్న మీరు ధన్యులు.
అవును. ఇంకెవరు? వారే!
ధన్యవాదాలు.
Post a Comment