Monday, January 13, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

అయితే మరీ పచ్చి అబధ్ధాలు ఆడితే అసహ్యంగానే ఉంటుంది. అబధ్ధం ఆడడంలో కూడా అందం ఉంది.

చూడండి అబధ్ధం ఆడినా ఎంత సరసంగా ఉందో!

ఒకసారి సుబ్బారావుగారి భార్య మా యింటికొచ్చింది, మా ఆవిడను చూడటానికి. సుబ్బారావుగారూ అంటే మా జిల్లాలో పెద్ద భాగ్యవంతుడు. ఆవిడకు మెడనిండా సొమ్ములు, రాళ్ల దిద్దులు, ఉంగరాలు, కెంపులు తాపిన నెక్ లేసులు ఉన్నయి. మా ఆవిడకు మెడలో ఒక గొలుసు, వ్రేలికో ఉంగరం, ఉన్నవి. అంతకంటే ఏమీలేవు.

ఆవిడ తన గొప్పలన్నీ చెపుతూ, మాటల సందర్భలో, కెంపులు, వైడూర్యాలు, పచ్చలు ఇల్లాంటివి మాసినా, నీరుదిగినా, ఏంజెయ్యాలో చెపుతున్నది. వైడూర్యాలు మాస్తే ఫలాని యాసిడ్ తో కడగాలె, పచ్చలు మాస్తే దీనితో కడగాలె, కెంపులు మాస్తే ఇల్లాగ శుభ్రం చెయ్యాలె అని ఇల్లాగ చెప్పింది తన గొప్పతనాన్ని వలకబోస్తూ.

ఎవరికి కావాల ఈ గొడవంతా.

మా ఆవిడకు ఇదంతా వెధవగొడవగా ఉంది. అయినా వింటూ ఊరుకొన్నది మర్యాదగా. ఆవిడ చెప్పి చెప్పి, చివరకు 'అయితే కెంపులు మాస్తే మీరేం చేస్తారమ్మా' అని అడిగింది.

కెంపులు మాకు ఉండి ఏడిస్తేగద! ఆవిడకు విషయం తెలియకనా! ఏదో అడిగింది మా ఆవిడను చిన్నతనం చెయ్యాలనో ఏమో మరి.

మా ఆవిడకు ఒళ్ళు మండి పోయింది ఈ ప్రశ్న అడిగేసరికి. అందుకని ఏం చెప్పిందంటే, 'కెంపులుగానీ, వైడూర్యాలు కానీ, ఏవైనాసరే మాస్తే మేము ఏమీ చెయ్యమమ్మా! మాసినవాటిని విసిరి గోడ అవతల పారేసి కొత్తవి కొనుక్కొంటాము ' అన్నది.

మాకు కెంపులు లేవు అని నిజం చెప్పి చిన్నతనం పొందేకంటే బ్రహ్మాండమైన అబధ్ధం ఇల్లాగ ఒకటి ఆడేయటంలో చాలా అందం ఉందని నా ఉద్దేశ్యము.

అసలు అబధ్ధం ఆడటంలోనే అందం ఉంది. దాని కల్పన, నిర్మాణం, ప్రదర్శన, అంతా కూడా ఒక కళ. ప్రకృతిలో ఎక్కడా కనుపించని సౌందర్యాన్ని చిత్రకారుడు చిత్రిస్తాడు. ఆ కల్పనలో ఆ కూర్పులో అందం ఉంది. అసత్యానికి కూడా, కల్పనా, కూర్పూ కావాలె. దాని నిర్మాణంలో పనితనానికి ఎంతైనా అవసరం ఉంది. అందుకనే సత్యానికంటే అసత్యము ఎక్కువ సుందరమైనది.

నేను ప్రభుత్వోద్యోగిని. నాకు సెలవు కావాలె. ఎందుకూ? జ్వరం వచ్చిందా? లేదు. కాని ఏదో బధ్ధకంగా ఉంది. ఇంట్లో పడుకోవాలె అనిపించింది. లేకపోతే భార్యతో కబుర్లు చెప్పుకొంటూ కూర్చోవాలెనని బుధ్ధి పుట్టింది. సెలవకు వ్రాయాలె. సత్యాన్ని ఆశ్రయిస్తే ఉద్యోగాన్ని ఊడకొడుతుంది.

సాయింత్రం మా ఆవిడ, నేను ఎంతో కష్టపడి మిగిల్చిన డబ్బుతో కొన్న పట్టుచీర కట్టుకుని పేరంటానికి వెడుతుంది. ఆవిడ చీరకట్టుకొన్న సౌందర్యాన్ని నేను ముందుగా చూడాలని ఉంది. మధ్యాహ్నం సెలవు కావాలె. నిజం చెపితే సెలవు దొరుకుతుందా?

అసత్యాన్ని ఆశ్రయించాలె. ఆవిడ ఓ చక్కని ఉపాయం చెబుతుంది. జబ్బు, తలనొప్పి, కడుపులో పోట్లు అని వ్రాయమని చెప్పటమే కాకుండా ముఖం ఇల్లాగ పెట్టు, నడుం ఇల్లాగ వంచు, కళ్ళు కొద్దిగా చిట్లించు, ఇట్లా నడు, ఇల్లాగ బాధతో మాట్లాడు అని చెబుతుంది గదా! మనచేత చక్కని నాటకం ఆడిస్తుంది. సత్యం అయితే ఒకమాటతో సరి. అసత్యమైతే ఒక కావ్యం అల్లాలె.

పదిమందిలో తలెత్తుకొని తిరిగేది అసత్యమే కాని సత్యంకాదు. రాజకీయ వేత్త అసత్యాన్ని అందలంలో పెట్టి ఊరేగిస్తాడు. న్యాయవాది అసత్యానికి అందమైన ఆసనం ఇస్తాడు. వర్తకుడు నెత్తిన పెట్టుకొంటాడు. సత్యం ఏ మహాత్ముణ్ణో ఆశ్రయిస్తుంది. అడవులలోనూ, ఆశ్రమాలలోనూ తలదాచుకొంటుంది. అసత్యం పట్టణాలలో మేడలలో నివసిస్తుంది.

........మిగతా మరోసారి.

4 comments:

voleti said...

Wrong concept..

Zilebi said...

మీ టపా బాగుందండి !

అసత్య వచనాత్ స్వకార్యం స్వామి కార్యం సిద్ధయేత్ అని ఆర్యోక్తి !

జేకే !

చీర్స్
జిలేబి

A K Sastry said...

డియర్ voleti!

మీరు ఈ టపాలు ప్రారంభం నుంచీ చదువుతున్నట్టులేదు! ఈ వ్యాసం, ఇప్పుడు, నేను వ్రాస్తున్నది కాదు.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Zilebi!

చాలా సంతోషం.

జేకే--ఏమిటో అర్థంకాలేదు!

ధన్యవాదాలు.