Thursday, January 16, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

సాంఘిక వ్యాపారాలలో కూడా అసత్యమే గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. మర్యాద కాపాడుతుంది. నా దగ్గర ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చదువుకొన్న కుఱ్ఱవాడు ఒక రోజున కనపడి నమస్కారం చేశాడు. నేను ఎవరో అని బిక్కగా చూశాను. 'నేనండీ మాస్టారూ నాగేశ్వరరావును. మీదగ్గర చదువుకున్నానూ' అన్నాడు.

నాకు ఆ కుఱ్ఱవాడు ఎవరో జ్ఞాపకం రాలేదు. సందేహంగా చూస్తూ 'అవును. అవును. ఎప్పుడూ నీవు చదువుకున్నదీ?' అని అడిగాను. ఆ కుఱ్ఱవాడు విచారంగా ముఖంపెట్టి, 'అప్పుడే మరిచిపోయినారండీ మాస్టారూ? 1945 లో నండి, మీ క్లాసులో నేను ముందు బెంచీలో కూర్చునేవాడినండి' అని జ్ఞాపకం చేశాడు. ఎప్పుడో నాలుగేండ్ల క్రిందటినాటిమాట! ఈ మధ్య ముందుబెంచీలమీద ఎంతమంది కూర్చున్నారో! జ్ఞాపకం రాలేచు.

ఆ మాట చెపితే వాడు చాలా ఖిన్నుడైపోతాడు. అందుకని జ్ఞాపకం వచ్చినవాడిలాగే చూస్తూ, 'అవునయ్యా నీవు.........సిక్ స్తు ఫారంలో ఉండేవాడివి. కాదూ?' అన్నాను. వాడు తెల్లపోయి 'అదేమిటండీ మాస్టారూ, అల్లాగంటారూ? నేను సిక్ స్తు ఫారం మీదగ్గర చదవలేదండీ' అన్నాడు.

వెధవ, చదవలేదు కామాలు. ఎవరికి జ్ఞాపకం! వాడు బందరు వదిలి వెళ్ళి ఇంకో ఊళ్ళో చదువుకొని ఉంటాడు. సాధారణంగా అట్లాగే జరుగుతూ ఉంటుంది. అందుకనే నేను, 'అవునోయ్, నేను మరిచిపోయినాను. నీవు బందరు వదిలివెళ్ళి ఎక్కడో చదివావు కదూ!' అన్నాను, నవ్వుతూ.

నాఊహ తప్పింది. వాడు అక్కడే చదివాడట. 'నేను ఎక్కడికీ వెళ్ళలేదండీ. మీదగ్గర చదవలేదండీ అంటే, మీ డివిజన్లో లేనండీ. రామమూర్తిగారి డివిజన్లో పడ్డాను' అన్నాడు.

నాకు అసహ్యం అనిపిస్తున్నది. అయినా ఏమీ అనలేక--'అల్లా చెప్పు, ఇంకో డివిజన్ లోకి వెళ్ళావూ, అందుకనే నాకు జ్ఞాపకం లేకపోయింది' అన్నాను.

దానితరువాత ఏవో కుశల ప్రశ్నలు వేయటంలో వాడికి ఏదో అనుమానం కలిగింది, తాను ఎవరైనది నేను సరిగా జ్ఞాపకం తెచ్చుకోలేదని. అందుకని వాడు అన్నాడు. 'మాస్టారూ నేను ఎవరైందీ మీకు సరిగ్గా గుర్తుకు వచ్చినట్టులేదు. నేను సుబ్బారావు తమ్ముణ్ణి' అని సూటిగా జ్ఞాపకం చేశాడు.

సుబ్బారావు తమ్ముణ్ణి అని చెపితే నాకు బాగా గుర్తుకువస్తుందని వాడికి గట్టి నమ్మకంతో ఆమాట అన్నాడు. నేను ఇంకా నీళ్ళునమిలితే వాడికి నామీద అసహ్యం కలుగుతుంది. చిరాకు పుడుతుంది. వాడి మనస్సు కష్టపడుతుంది. అదికాక సుబ్బారావు తమ్ముణ్ణి అని చెప్పినతరువాత కూడా నాకు జ్ఞాపకం రాకపోవటమేమిటి అనుకొని, అప్పుడు సర్వమూ జ్ఞాపకం వచ్చినట్లు నటిస్తూ, నవ్వుతూ, 'ఓరి సన్యాసీ. సుబ్బారావు తమ్ముడివా! ఆ సంగతి మొట్టమొదటే చెపితే బాగుండేది. చంపావు! సుబ్బారావు తమ్ముడివా! సరిసరి' అని మెచ్చుకొని వాడి వీపుపై తట్టి సంతోషపెట్టి పంపాను. ఆ సుబ్బారావు ఎవరో నాకు తెలియదు. గుర్తుకు రాలేదు. ఇహ వాడి తమ్ముడి విషయము అసలే గుర్తుకు రాలేదు. అంతా జ్ఞాపకం వచ్చినట్లు నటించాను. అబధ్ధాలు ఆడాను. అయితే యేం! వాడిని సంతోషపెట్టాను.  అబధ్ధమైనా, ఒక ప్రాణి సంతోషించింది. అల్లాంటి మనోహరమైన అసత్యాలను వదిలి, నిజం చెపుతానంటూ, ఇతరులను ఏడిపించటం ఎందుకో నాకు అర్థం కాలేదు. సత్యం చేదుమందులాంటిది. కల్ల పంచదార మాత్రవంటిది. సత్యం ఒంటరిగా జీవిస్తుంది. కల్ల పిల్లలతల్లి. సత్యానికి రంగులు లేవు. అలంకారాలు లేవు. కల్ల రంగు రంగుల దుస్తులు వేసుకొంటేగాని రాణించదు. సత్యానికి మెఱుపు లేదు. కల్ల మెఱుగులు దిద్దుకొని ఆకర్షిస్తుంది. అసత్యం వెలయాలు. పదిమందినీ సంతోషపెడుతుంది.

........మిగతా మరోసారి.

No comments: