Sunday, January 12, 2014

అసలైన హాస్యం (కామెడీ)


తియ్యని కల్లలు (కొనసాగింపు)

దాంపత్య వ్యాపారంలో సత్యం అనేది అసలు పనికిరాదు. చీర కొనుక్కొని తీసుకొస్తామనుకోండి. ఆ చీర పది రూపాయలు పెట్టి కొన్నాము. పది రూపాయలకే కొన్నామని నిజం చెపితే, ఇంటావిడ ఎల్లాగ ముక్కూ మూతీ విరుస్తోందో గమనించారా? 'ఆఁ కొన్నారు లెద్దురూ, వెధవ పది రూపాయలు పెట్టి ఓ చీరా! జరీ చీర కొన్నారనా, పట్టు చీర కొన్నారనా సంతోషించటానికి!' అని కూడా అంటుంది. పది రూపాయలని చెప్పక, ఇరవై రూపాయలు అయింది అని చెప్పి, నమ్మకపోతే తెలివితేటలతో రెండు మూడు అబధ్ధాలాడి నమ్మించండి, ఎంత సంతోషిస్తుందో ఆవిడ. ఓ పెద్ద సత్యసంధుడిలాగ, నిజం చెప్పి ముక్కులూ, మూల్గులూ తినేకంటే, ఒకటో రెండో తేలికైన అబధ్ధాలు ఆడి, ఆవిడను సంతోషపెట్టి, నీవు సంతోషించమంటాను.

ఎట్లాగూ అబధ్ధాలు ఆడుతూనే ఉంటివి. పెందలాడే ఇంటికి రండి అని ఆవిడ రోజూ చెపుతుంది. ఒక్కరోజు అయినా నీవు రావు. రాకపోవటానికి రోజుకో కారణం కల్పిస్తావు గదా! ఒకరోజున ఆఫీసులోనే ఉండిపోవాలిసి వచ్చింది పని తొందరచేత! రెండో రోజున ఎవరో స్నేహితుడు కనిపించాడు!

ఇల్లాగ రోజుకో కారణం కల్పించి పాపం, ఆ ఇల్లాలును, నమ్మించవలసిన అగత్యం ఉండనే ఉన్నది. అల్లాంటప్పుడు ఆవిడను సంతోష పెట్టటానికి ఇంకొక రెండు అబధ్ధాలు ఆడితే వచ్చే నష్టం ఏమీలేదు. 

నువ్వు అబధ్ధాలు ఆడుతున్నావని ఆవిడ ఏమీ అనుకోదు. ఆవిడా అబధ్ధాలు ఆడుతూనే ఉండె! అసలు జీవితమే అబధ్ధాలతో అల్లుకుపోయింది.

........మిగతా మరోసారి.

No comments: