తియ్యని కల్లలు (కొనసాగింపు)
అసత్యం ఇచ్చే ఆనందం సత్యం ఇయ్యలేదు. నేను ఒకసారి పొరుగూరులో ఉన్న ఒక స్నేహితుడి ఇంటికి వెళ్లాను. ఆ స్నేహితుడు ఊళ్ళోలేడు. కాని అతని భార్య నాకోసం వంటచేసి భోజనానికి లెమ్మన్నది. ప్రత్యేకంగా నాకోసమని వంకాయకూర వండింది. కాని కూరలో ఉప్పు ఎక్కువ పడ్డది. నేను మాట్లాడకుండా తింటున్నాను. ఆ అమ్మాయి 'కూర ఎట్లాగుంది అన్నయ్యా' అని అడిగింది.
ఉప్పు కొంచెం ఎక్కువ అయింది అమ్మా అని చెపితే ఆ బిడ్డ చాలా కష్టపడుతుంది. అందుకని 'కూరకేం అమ్మా, కమ్మగా ఉంది' అని ఒక అబధ్ధం ఆడాను.
ఆ అమ్మాయి ఇంకా కాస్త వేసింది బాగుంది అన్నానని. ఏంజేసేది పారేస్తే? బాగుండదు. అందుకని గబగబా గొంతులో వేసుకుని మ్రింగి కాసిని నీళ్లు తాగాను. చాలా రుచిగా ఉండబట్టే అంత ఆప్యాయంగా తింటున్నానని ఆమె అనుకొని ఇంకాస్త వేస్తానంటూ కూర్చున్నది. వద్దమ్మా వద్దు అని ఇక తినలేను అని ఇంకో అబధ్ధం ఆడాను, నిజానికి ఆకలి తీరకపోయినా. 'ఏం అన్నయ్యా ఎందుకు తినవూ?' అని అడిగితే ఆకలి లేదని ఇంకో అబధ్ధమూ, ఎందుకు ఆకలి లేదూ అంటే, దారిలో కాఫీ తాగి వచ్చానని మరో అబధ్ధము ఆడవలసి వచ్చింది. అయితే ఆ బిడ్డను సంతోషపెట్టటానికి సత్యాన్ని త్యాగం చేసి ఇన్ని అబధ్ధాలు ఆడవలసి వచ్చిందని నాకు నేను చెప్పుకొని సంతోషించాను.
అంతటితో పోతే బాగుండేది.
కాని ఆ తరువాత ఆ అమ్మాయి, అన్నానికి కూర్చుని కూర రుచిచూచి, నేను అన్నీ అబధ్ధాలాడానని తెలుసుకొన్నది. తెలుసుకొన్నది ఊరుకోక నన్ను అడిగింది---'ఏమి అన్నయ్యా, కూరలో అంత ఉప్పు ఎక్కువైతే చెప్పకపోయినావా? ఇంకేదైనా ఆదరవు వేసేదాన్ని. బాగుందంటే, నిజమేననుకొని ఇంకా కాస్త కూడా వేసి తినమని బలవంతం చేశాను పాపిష్టిదాన్ని.' అంటూ ఊ విచారపడటం సాగించింది. ఆ పిల్ల విచారాన్ని పోగొట్టటానికి, 'అదేమిటమ్మా, ఉప్పు ఎక్కువైందా? నాకు తెలియదమ్మా తల్లీ. నేను కాస్త ఉప్పు ఎక్కువ తింటాను. ఎంత ఉప్పు వేసినా సరిపోదని, మీ వదిన ఊరికే గోల పెడుతుంది. అంతేకాని నాకు తెలిస్తే చెప్పకపోయినానా తల్లీ' అని అయిదోసారి అబధ్ధం ఆడాను. ఆ అమ్మాయి నా మాటలు నమ్మి సంతోషించింది.
ఇన్ని అబధ్ధాలు ఆడినందుకు నాకేమీ విచారంలేదు. ఆ పిల్లను సంతోషపెట్టటానికి ఇంకో పది అబధ్ధాలైనా సరే ఆడాలిసిందే. నిజంచెప్పి ఆ బిడ్డకు మనక్లేశం కలుగజేసే కంటే, అబధ్ధాలు ఆడి ఒక ప్రాణిని సంతోష పెట్టటం ఎంతైనా మంచిదని నా ఉద్దేశ్యం.
........మిగతా మరోసారి.
4 comments:
మీరీ శీర్షిక సత్య ప్రమాణకం గా నే రాస్తున్నారా లేక మమ్మల్ని సంతోష పెట్టడానికి అసత్య ప్రమాణకం గా రాస్తున్నారా అన్నది సెలవీయ వలె !!
పూర్తిగా ఏకీ భవిస్తున్నా మీ 'అసత్య' సత్య సంధత కి
జేకే !
చీర్స్
జిలేబి
సంస్కారాన్ని ప్రతిబింబించే కధ. చాలా బాగుంది.
"నీ మనసులో అనుకుంటున్నది చెప్పెయ్", "ఉన్నది ఉన్నట్లు చెప్పెయ్", "అనుకున్నది చేసెయ్", "అలా చెయ్యటమే ఒక సుగుణం (virtue)", "ఎదుటి మనిషిని అవమానించినా ఫరవాలేదు" లాంటి అమర్యాదకర ధోరణులని ప్రొత్సహిస్తూన్న ఈనాటి వ్యాపార / కార్పొరేట్ సంస్కృతి రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇటువంటి సున్నితమైన కధలు చదవడం / చదివించడం సమాజ శ్రేయస్సు కోసం ఎంతైనా అవసరం.
డియర్ Zilebi!
సత్య ప్రమాణకం గా చెపుతున్నాను.......ఈ వ్యాసం యెప్పుడో, యెవరో వ్రాసినది.
మొదలంటా, చివరివరకూ చదవండి....అర్థం అవుతుంది!
ధన్యవాదాలు.
డియర్ విన్నకోట నరసింహా రావు!
పై సమాధానమే మీకూను.
మీ వ్యాఖలు మాత్రం చాలా బాగున్నాయి. సంతోషం.
ధన్యవాదాలు.
Post a Comment