Friday, September 27, 2013

అసలైన హాస్యం (కామెడీ)

(ఈ క్రింది రచన యెవరిదో తెలిస్తే చెప్పండి లేదా వూహించడానికి ప్రయత్నించండి)

తియ్యని కల్లలు (కొనసాగింపు)

నీకు ఇచ్చిన అయిదు రూపాయలూ ఏమైనవి అని ఇంటావిడ నడిగితే ఆమె నిజం చెపుతుందన్న మాట కల్ల. ముసి ముసి నవ్వులు నవ్వుతూ, "ఇంకా కూర్చుందా ఏమిటండీ. అప్పుడే కర్చు అయిపోయింది" అంటుంది. ఎలా కర్చు అయిపోయిందో చెప్పమని అడిగితే, చాలాసేపు ఆలోచించి చివరకు చెపుతుంది, నాయుడుగారి భార్యకు ఇయ్యాలిసి ఇచ్చేశానని! ఎన్నిసార్లు ఎన్ని అయిదులిచ్చినా, ఆ నాయుడుగారి భార్య అప్పుతీరదు. నేషనల్ డెట్ లాగ పెరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఆవిషయమై తరచి అడగము. ఆ అసత్యవాక్కులో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదించి ఊరుకొంటాము.

నిజం చెప్పు, నిజం చెప్పు అంటారుగాని నిజం ఎట్లా చెబుతాము! ఏకాతంగా ఉన్నప్పుడు భార్య అడుగుతుంది ముద్దుగా తలవంచుకొని, "ఏమండీ నేను అందంగా లేనా?" అని.

అప్పుడు కఠోరమైన నిజం చెప్పాలా, మనోహరమైన అబధ్ధం చెప్పాలా? "నీ బుగ్గలు చిక్కిపోయినవి. నీ పెదవులలో రక్తిమ పోయింది. నీ పళ్లు కొంచెం ఎత్తు. నీకంటె అందమైనవాళ్లు చాలామంది ఉన్నారు" అని సత్య హరిశ్చంద్రుడిలాగ నిజం చెపితే, ఆవిడ ముఖం మాడ్చుకొని నిన్ను గదిలో ఒంటరిగా వదిలేసి, పోయి వసారాలో మంచం వేసుకొని పడుకుంటుంది.

ఎందుకొచ్చిన గొడవ ఇది. ఈ జన్మలో ఆవిడ నీకు ప్రియురాలు. ఆమెతో జన్మాంతం కాపరం చేయదల్చుకొన్నపుడు ఆమెను సంతోషపెట్టటం నీ విధి. దగ్గరకు తీసుకొని ముద్దాడాలె. "నీవు అందంగా లేకపోవటం ఏమిటి? నీవు నా పాలిటి రతీదేవివి" అంటూ ఆమె కళ్లను మృదువుగా తాకి, చుబుకాన్ని ఎత్తి పట్టికొని, బుగ్గపైని చిటిక వెయ్యాలె. ఆమె సంతోషిస్తుంది. ఆమె నేత్రాలు ఉజ్వలములు అవుతయి. ఇంట్లో ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతవి.

అసలు కొన్ని విషయాలలో నిజం చెప్పినా మన ఆడవాళ్లు నమ్మరు. పైగా వెక్కిరిస్తారు. నవ్వుతారు. చూడండి నా సంగతి ఏమైందో!

మనమంతా కోతులలోనుంచి పుట్టామన్న మాట నిజమే కదా! అందులో అబధ్ధం ఏమీలేదు. ఆ విషయం మా అబ్బాయికి చెప్పాను. వాడు వెళ్లి తల్లికి చెప్పాడు, "అమ్మా. అమ్మా మనం కోతులనుంచి పుట్టామే!" అని!

ఈ మాటవిని ఆవిడ ఆశ్చర్యపోయి "అదేమిటిరా మనమంతా కోతులలో నుంచి పుట్టటం ఏమిటిరా?" అని విరగబడి నవ్వింది.

"మన పూర్వులంతా కోతులుటే అమ్మా!" అని వాడు మళ్లీ చెప్పాడు.

"ఛా. తప్పురా నాయినా, అల్లా అనకూడదు మన పూర్వులు కోతులేమిటిరా! నేను బాగా ఎరుగుదును. మా నాన్న మనిషి! మా తాత మనిషి! అంతకంటె పూర్వులు అయినవారు మహ ఋషులు. అంతేగాని కోతులెవఱ్ఱా నాయినా? అని ఆవిడ మళ్లీ నవ్వింది.

మా అబ్బాయికి చాలా చిన్నతనం అయి కోపంగా అన్నాడు - "నాన్న చెప్పాడే, మన పూర్వులంతా కోతులని!"

ఆవిడ ముఖం చిట్లించి "ఏమో నాయినా, మీ నాన్న పూర్వుల సంగతి నాకు బాగా తెలియదు" అని విసుగ్గా అన్నది.

శాస్త్రజ్ఞులు అంతా అంగీకరించిన పరమ సత్యాన్ని ఆవిడ తృణీకరించింది. నిజం చెపితేమటుకు నమ్మేది ఎవరు?

......మిగతా మరోసారి.

8 comments:

TVS SASTRY said...

చాలా బాగుంది,కాంతం కథలు గుర్తుకొచ్చాయి.
టీవీయస్. శాస్త్రి

TVS SASTRY said...

ఇంకెవరు?మునిమాణిక్యం వారు!

టీవీయస్. శాస్త్రి ​

A K Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

మీ ముందు కుప్పిగంతులెయ్యడానికి కాదండోయ్!

చాలా మందికి తెలీదు కదా అని సస్పెన్స్ లో వుంచాను.

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

sri said...

Sir...manchi aarogyakaramina haasyaanni malli gurtkuku techaru....dhanyavaadamulu..ee sandarbham lo maa mitruni vaadana okati mi munduku......
vaanara jaati nundi manava jaati avatariste mari ippudu unna kotulu yekkadivi ? konni kotulu parinaamamu chendakundaa kotulu gaane undipoyaayaa?

sri said...

sir...nenu narasapuram vachinappudu mimmalni kalusukovacha ?

TVS SASTRY said...

ఇంతకూ నన్ను హనుమంతుడిని చేసారు!సంతోషం!!

A K Sastry said...

డియర్ sri!

మీకు నచ్చినందుకు సంతోషం.

మీ మిత్రుడి సందేహం తీరాలంటే "డార్విన్" దగ్గరకి పోవాలేమో! లేదా అనెక టపాల్లో గానీ తీరదు. యెప్పుడైనా ప్రయత్నిస్తాను.

సందేహం యెందుకు--తప్పకుండా వచ్చి కలవండి. ఒచ్చేముందు ఓ చిన్న మెయిల్ పంపించండి.

A K Sastry said...



డియర్ శాస్త్రిగారూ!

"మీలాంటి వాళ్లు" అని వ్రాస్తే ఇంకా చాలామంది యేమంటారో అని "మీ ముందు" అని మాత్రమే అన్నాను--యెలాగూ మీ తమ్ముణ్ణే కదా అని!