(ఈ క్రింది రచన యెవరిదో తెలిస్తే చెప్పండి లేదా వూహించడానికి ప్రయత్నించండి)
తియ్యని కల్లలు
కల్ల అంటే అసత్యము. అసత్యాలు తియ్యగా ఉంటవి. నిజం అంత మధురంగా ఉండదు. నిజం చెపితే నిష్టూర్యము అనే సామెత ఉండనే ఉన్నది.
నేనొకసారి సినిమాకు వెళ్లి రాత్రి పదిగంటల వేళ ఇంటికి వస్తున్నాను. దారిలో ఒకచోట ఇద్దరు సాహేబులు తప్పతాగి పోట్లాడుకుంటున్నారు. ఒకడు అది రాత్రి అంటాడు. రెండోవాడు అది పట్టపగలు అటాడు. ఆ తగూ ఎంతసేపటికీ తెగలేదు. వాళ్లు మధ్యవర్తిని అడుగుదామనుకున్నారు. నేను కనబడ్డాను.
"మహరాజ్ ఇది రాత్రి అంటే ఈడు కాదు పగలు అంటాడు. ఈడ్కి ఏమన్నా తెలివి ఉందీ లేదూ సెప్పాలె మీరు" అన్నాడు ఒకడు.
"అరె బేవకూఫ్. ఇంత హెల్గు ఉండి పట్ట పగలు ఉంటే దీన్‌కి రాతిరి అని ఏ హెదవ అంటాడ్?" అని సవాల్ చేశాడు రెండోవాడు. వాళ్లు ఇద్దరూ చెరోరెక్కా పుచ్చుకొని నిజం చెప్పమని నన్ను బలవంత పెట్టారు. అది రాత్రి అంటే ఒకరికి కోపంవస్తుంది. పగలు అంటే రెండవవాడికి కోపం వస్తుంది. ఎవరిచేతనో ఒకరిచేత తన్నులు తప్పేలాగున లేవు. చివరకు నేను ఒక అబధ్ధం ఆడి తప్పించుకొన్నాను. నేను అన్నానూ "అబ్బాయి. నేను ఈవూరికి కొత్తవాణ్ణి, నాకు బాగా తెలియదు, నన్ను వదిలిపెట్టి ఇంకెవరినైనా అడగండి," అని.
నిజమేననుకొని ఇద్దరూ నన్ను వదిలేశారు. నేను బ్రతికి బైటపడ్డాను. నేను అబధ్ధం ఆడాను. అయినా ఆ సత్యంలో మాధుర్యం ఉంది.
ఇంకో ఉదాహరణకూడా ఇస్తాను. ఈ మద్యపాన నిషేధము వచ్చిన తరువాత ఒక క్రైస్తవ సోదరుడు కొంచెము సారాయి సంపాదించి తీసుకొని పోతున్నాడు. దారిలో పోలీసులు పట్టుకొన్నారు. పట్టుకొని సీసాలోది ఏమిటని అడిగారు. ఆ ఆసామి తనను వాళ్లు శిక్షిస్తారని భయపడి...."అందులోది మరేం కాదండి. మంచినీళ్లండి" అని ధైర్యంగా అబధ్ధం చెప్పేశాడు.
పోలీసులు ఆ సీసాలోని ద్రవ్యాన్ని వాసన చూచి, కొంచెం రుచిచూచి, "నీళ్లా! ఎందుకయ్యా అబధ్ధం! ఇది సారాయి!" అన్నారు.
పోలీసు అధికారి కూడా చాలా కోపంగా అడిగాడు. "ఇది సారాయి కాదంటావేమయ్యా? స్పష్టంగా సారాయని తెలుస్తుంటే!" అన్నాడు.
"నేను ఏమంటానండీ. మీరు సారాయి అంటూంటే సారాయే కావచ్చు" నన్నాడు క్రైస్తవ ఆసామి.
"అయితే ఎందుకు తెచ్చావు?" అని ఉరిమిచూస్తూ అడిగాడు అధికారి.
క్రైస్తవ సోదరుడు "అయ్యా, నేను నీరే తెచ్చుకొన్నాను. ఇది సారాయి కావటం కేవలం ఏసు ప్రభువు మహిమ." అంటూ మోకరించి ప్రార్థన చేయటం సాగించాడు. చాలా తమాషా అయిన అబధ్ధం ఆడాడు ఆ ఆసామి. తియ్యని అబధ్ధాలు అంటే ఇవి!
ఇల్లాంటి తియ్యని అబధ్ధాలు మనం రోజూ వింటూనే ఉంటాము. అవి మన చుట్టూ మూగి నృత్యం చేస్తున్నవి. ఎదురైన స్నేహితుణ్ణి ఎక్కడిదాకానోయ్? అని అడిగితే వాడు చెప్పే జవాబు ఈరకానికి చెందిన అబధ్ధమే!
......మిగతా మరోసారి.
2 comments:
Very nice.
చాలా సంతోషం శాస్త్రిగారూ!
ధన్యవాదాలు.
Post a Comment