..........నేపీలూ!
"........ఆంటీ! మీ అమ్మచేత నేపీ వేయించుకోలేదా?" అని ప్రశ్నించాడట నాలుగేళ్ల నా మనవడు!
మా అమ్మాయివాళ్లూ అమెరికాలో యేదో ఓ "చూడదగ్గ ప్రదేశానికి" వెళ్లినప్పుడు ఒకచోట విశ్రాంతికోసం ఆగితే, ఓ ఆసియాజాతి స్త్రీ ఆదుర్దాగా వచ్చి, టాయిలెట్లు యెక్కడ వున్నాయి? అని ఆరా తీస్తుంటే, వాడు అన్నమాటలు--"ఇలాంటిచోట టాయిలెట్లుండవు. అందుకే మా అమ్మనడిగి నేపీ (మనవాళ్లు వీటిని డయపర్లు అని కూడా అంటారు) వేయించేసుకొంటాను నేను. ఆంటీ!........". ఇలా సాగిపోతుంటే, మా అమ్మాయి హడావుడిగా ఆవిడకి సూచనలు ఇచ్చి పంపేసిందట! (ఆవిడకి తెలుగు రాకపోవడంతో బ్రతికిపోయాను అంటుంది).
మొన్నీమధ్య మేము ఢిల్లీ టూరు వెళ్లినప్పుడు, సాయంత్రం రెడ్ ఫోర్టులో "సౌండ్ & లైట్" కార్యక్రమానికి వెళ్లాము. అక్కడ టిక్కెట్లు పరిశీలించే చోట వాళ్లు తమ పని తాము చేస్తూండగా, ఒకాయన (విదేశీయుడు కాదనుకుంటా--ఇతర రాష్ట్రాలకి చెందినవాడేమో) "టాయిలెట్లు యెక్కడ వున్నాయి?" అని వాళ్లని అడుగుతున్నాడు.
వాళ్లలో ఒకడు "ఇక్కడ లేవు. మళ్లీ కోట బయటికి వెళ్లిపోయి, రోడ్డు మీదకి వెళితే, కొంతదూరంలో ఓ ప్రక్కన వుంటాయి" అని చెపుతున్నాడు.
అది ఓ పెద్ద కోట. రోడ్డు మీదనుంచి ఓ అరకిలో నడిస్తే, అక్కడ కోట గుమ్మం. అక్కణ్నించి ఇంకో అరకిలో, పైకి యెక్కుతూ నడిస్తే అక్కడ టిక్కెట్లు పరిశీలించేవాళ్లు! మరి టాయిలెట్ కోసం కిలో దూరం పైగా వెళ్లి రావాలంటే......ఈలోగా "షో" మొదలైపోతే.....ఇలా ఆలోచిస్తున్నాడు అతను.
"మరెలాగ భాయీ......", "మేమేమీ చెయ్యలేము!" ఇలా ఓ రెండుమూడు నిమిషాలు నడిచింది. (మా టిక్కెట్ల పరిశీలన పూర్తయినా, ఆ ప్రక్కనే నించొని ఆసక్తిగా గమనించాను నేను).
చివరికి వాళ్లలో ఒకడు "చీకట్లో, ఆ చెట్ల వెనుక, కోటగోడ దగ్గర కానిచ్చెయ్యి. అదీ చెప్పాలా?" అని విసుక్కున్నాడు!
ఆ ప్రక్కనే వున్న అతని స్నేహితుడు "మరెందుకాలస్యం భాయ్! ఇన్ ఇండియా ఎవ్వెరితింగ్ ఈజ్ ఓపెన్!" అంటూ తన ఇంగ్లీషు ప్రావీణ్యాన్ని తెలియబరుస్తూ, ప్రోత్సహించాడు. (నేను నవ్వుకుంటూ షో లోకి).
(పర్యావరణం పేరుతో "టూరిస్ట్ స్పాట్" లని జనాలకి దూరంగా జరిపేస్తూ, అనేకమందికి "వుపాధి" కల్పిస్తూ, వాటిని ఇంకా నాశనం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఇంకో బ్లాగులో ఇంకో టపా వ్రాస్తాను. అలాగే ఓ అద్భుతమైన, కోట్లు సంపాదించి పెట్టే వ్యాపార సూచనని కూడా ఇస్తాను).
సరేనా?
6 comments:
మరి అతి పెద్ద పెజాసామ్యమ్యా దేశామంటే ఏటనుకున్నారేటి?! ఎక్కడన్నా పోసుకునే స్వేచ్చలేని ఆ దేసాలదీ ఓ పెజాసామ్యమేనా?!
ఓ జోకు:
నెహ్రూ వెంట కారులో పర్యటిస్తున్న ఓ తెల్లాయన రోడ్డు పక్కన పోసేస్తున్న ఒకణ్ణి చూపి ఇలాంటివి మాదేశంలో వుండవు అని దెప్పాడట. ఏమీ అనలేక నెహ్రూ వూరకున్నాడట. మళ్ళీ ఎపుడో అదే మనిషితో వాళ్ళదేశంలో నెహ్రూ కారులో వెళుతుండగా దూరంగా ఓకడు రోడ్డు పక్కన కానిస్తూ కనిపించాడట. అది చూపించి నెహ్రూ ఆయన్ని దెప్పాడట. ఆ తెల్లాయన ముహం ఎర్రబడి పోలీసులని వాణ్ణి అరెస్ట్ చేయండి అని పురమాయించాడట. కాసేపయ్యాక వాళ్ళు అరెస్ట్ చేయకుండా తిరిగి వచ్చారట. ఏమని అడిగితే ఆ మనిషికి దౌత్యపరమైన రక్షణ వుంది అని బదులిచ్చారట. ఆయన ఇండియా రాయబారి అని ఆ తరువాత వాళ్ళు చెప్పే వరకూ నెహ్రూగారి ముసిముసి నవ్వులు ఆగలేదట.
:) / :(
చత్తీస్‌గఢ్‌లో బిలాస్‌పుర్ బస్‌స్టాండ్ వెనుక టాయ్లెట్లు ఉన్నాయి కానీ బస్‌స్టాండ్ గోడలు మాత్రం నిత్యం కంపు కొడుతూ ఉంటాయి. మన ఇండియాలో టాయ్లెట్లు ఉన్నా all public walls are free to urinate.
డియర్ SNKR!
ఏ దేశమైనా, ఏ స్వామ్యమైనా, అలాంటి అవసరాలు మానవులందరికీ సహజమే! యెటొచ్చీ........ఇంకొకళ్లముందు..........సభ్యత పేరుతో సమాజం అంగీకరించదంతే!
జోక్ బాగుంది కానీ, మనల్ని మనం అంత కించపరచుకోవలసిన అవసరం వుందంటారా?
ధన్యవాదాలు.
డియర్ puranapandaphani!
ధన్యవాదాలు.
డియర్ Praveen Mandangi!
ఈ విషయంలో, వీలైతే ఇంకో టపా వ్రాస్తాను.
ధన్యవాదాలు.
Post a Comment