Thursday, May 10, 2012

ఆరోజుల్లో.......



......పెళ్లిచూపులు!

"అమ్మా! పప్పు వేసుకు తినేశాను. ఇప్పుడేం వేసుకోవాలే?"
"పప్పు తరవాత, కూరలున్నాయికద, నీకిష్టమైన కూరవేసుకొని తినూ!"
"ఇది వంకాయ కూర. కలుపుకు తినాలి కదా? ఇది బెండకాయ వేపుడు.....ఇది అద్దుకోవాలి! నాకు తెలుసు. ముందు వంకాయ కలిపేస్తాను! అలాగేనా అమ్మా?"

75 యేళ్లక్రితం, ఓ కొండయ్యగారింట్లో, భోజనాల సమయంలో జరిగిన సంభాషణ ఇది.

ఆ కొండయ్యగారు శ్రోత్రియ బ్రాహ్మడు. పాతికెకరాల ఆసామీ. కొంచెం అనారోగ్యుడు. 

ఆయన అన్నగారు (దద్ద అనేవారుట ఆయన్ని) యేడడుగుల మనిషి. 24 కుంచాల ధాన్యం బస్తాని అవలీలగా భుజం మీద మోసుకొని, నరేంద్రపురం నుంచి రాజా నగరం (దాదాపు 15 కిలోలనుకుంటా) మిల్లుకి తీసుకెళ్లి, వచ్చిన తౌడూ, చిట్టూ వగైరాల సంచులని నడుముక్కట్టుకొని, బియ్యం బస్తాని మోసుకొంటూ సాయంత్రానికి ఇంటికి చేరేవాడట!

కొండయ్యగారికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. మూడో కూతురు పెళ్లికి వుందని తెలిసి (ఆవిడ వయస్సు 8 యేళ్లు), ఒకావిడ తన 12 యేళ్ల కొడుకుని వెంటబెట్టుకొని వీళ్లింటికి పెళ్లిచూపులకీ, సంబంధం మాట్లాడుకోడానికీ వచ్చింది.

ఆరోజుల్లో, మగపిల్లల తల్లులు మేనరికాలుంటే, వాళ్లని బ్రతిమలాడేవారు--పిల్లనివ్వమని. లేకపోతే, ఇలా వూళ్లమీదపడేవారు సంబంధాలకోసం.

యెక్కడ బయలుదేరారో, ఇక్కడికి వచ్చేటప్పటికి భోజనాల సమయం సమీపించడంతో, ముందు భోజనాలు కానిమ్మన్నారు--ఆవూళ్లోని ఇతర బంధువులనీ, ఇరుగు పొరుగునీ కూడా ఆహ్వానించి.

బంతిలో పెద్దవాళ్లతో ఆవిడ కూర్చుంటే, యెదురు బంతిలో, కొంచెం దూరంగా పెళ్లికొడుకు కూర్చున్నాడు. అప్పుడు జరిగాయీ సంభాషణలు!

వెనకగదిలో స్నేహితురాళ్లతో వున్న పెళ్లికూతురు పరిస్థితీ, వాళ్ల వేళాకోళాలూ యెలా వుంటాయో వూహించండి!

ఇవన్నీ గమనించిన "దద్ద", భోజనాలయ్యాక ఆవిడ "పెళ్లిచూపులు......." అంటుంటే, "అఖ్ఖర్లేదు. ఇంక మీరు బయటికి నడవండి!" అని వాళ్లని తోలేశాడట!

అలాంటి దద్ద వున్న ఆ పిల్ల అదృష్టవంతురాలు!

కదా?

12 comments:

రసజ్ఞ said...

హహ బాగుంది! అవును గతికితే అతకదు అంటారు కదూ! మరి ఆవిడ పెళ్లి సంబంధం కోసం వెళ్ళి భోజనం ఎలా చేసింది?

Venkat said...

గతికితే అతకటం కాదు... ఆ పెళ్ళికొడుకు ఏమి తినాలో కూడా నిర్ణయం తీసుకోలేని దద్దమ్మ.. చవట అని ఆయన గ్రహించి వాళ్ళను వెళ్ళగొట్టాడు.
పూర్వంలో పిల్లనివ్వటానికి ప్రతిచిన్న విషయం చూసేవారు... కాళ్ళుకడుక్కోటానికి ఎన్ని నీళ్ళువాడాడు.. ఎలా తింటున్నాడు.. ఎలా మాట్లాడుతున్నాడు, ప్రవర్తిసున్నాడు మొ||

మంచి విషయం ... బాగుంది...

Anonymous said...

12 పన్నెండు సంవత్సరాల అబ్బాయికి సొంత వ్యక్తిత్వం ఉండడం, సొంత ఆలోచనలు ఉండడం అనేవి కొంచెం పెద్ద మాటలు అని నా ఉద్దేశ్యం.
బయట ప్రపంచం చూడని వాళ్లకి వాళ్ళ అమ్మే ఒక ప్రపంచం.కొంతమంది ప్రతీ విషయనకి అమ్మ మీద ఆధారపడతారు. వాళ్ళు చిన్న వాళ్ళు ఐతే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది.
కృష్ణశ్రీ గారు చెప్పినదాని బట్టి , ఈ సంగటన చాల కాలం ముందు జరిగింది. ఆ కాలం లో ఇంత awareness ఉండేది కాదు. ఈ రోజుల్లో టీవీలు , పేపర్స్ ఎక్కువ అవ్వడం వలన, పిల్లలు తమకేం కావాలో ముందే నిర్నయిన్చుకున్తున్నారు కాని ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదు.
చిన్న వయసు లో ప్రతీ దానికి అమ్మ మీద ఆధారపడి , ఆ తరువాత సొంత వ్యక్తిత్వం పెంపొందించుకుని ఆ తల్లి తండ్రులు మాట కే ఎదురు చెప్పిన వాళ్ళ సంగతి నాకు తెలుసు.
అలాగని సొంత వ్యక్తిత్వం ఉండకూడదు అని అనడంలేదు. ఇక్కడ అతను పెళ్లి సంబంధం నిరాకరించడం సబబే అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ పిల్లవాడు పెద్దైన తరువాత తనకంటూ సొంత వ్యక్తిత్వాన్ని అలవార్చుకున్తాడో లేదో తెలియదు
కాబట్టి అతని నిర్ణయం కూడా తప్పు కాకపోవచ్చు.
:కాశి

Anil Atluri said...

ఆ రోజుల్లో పెద్దవాళ్ళు దీపం గూడును, దండెం మీద బట్టల్ని చూసి అమ్మాయి వ్యక్తిత్వాన్ని విశ్లేషించేవారు. కుటుంబం నడపడానికి ఆ రెండు ఆంశాలు చాలా ముఖ్యం.
దండెం మీద బట్టలు ఎక్కువవున్నా, గూట్లో దీపం చుట్టు నూనె ఒలికిన మరకలున్నా, ఆ స్త్రీ కి పొదుపు, శుభ్రం లేవని బద్ధకస్తురాలని, ఆడంబరాలు ఎక్కువ అని నిర్ణయించేవారు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

పళ్ళి కూతురు, పెళ్ళి కొడుకుల వయసు విషయం తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి కథలో! అయినా ఏం చేస్తాం ఆ రోజుల్లో అలానే బాల్య వివాహాలు చేసేవారు కదా!

అయితే ఆరోజుల్లో గతికితే అతకదు సామెతను సీరియస్ గా ఫాలో అయ్యేవారు కదా?

buddhamurali said...

బహుశా ఇలాంటి లోపాలు బయట పడతాయనే గతికితే అతకదు అని అన్నట్టున్నారు . అయినా 12 ఏళ్ళ వయసు అప్పుడయినా .. ఇప్పుడయినా చిన్న వయసేమి కాదు . మరీ అన్నాం లో ఏం కలుపుకోవాలో కూడా తెలియదంటే లోపం ఉన్నట్టే అనిపిస్తుంది . తరువాత ఆ పిల్లడు ఎమయ్య్దో తెలుసుకుంటే అతని నిర్ణయం పై మరింత స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ...

A K Sastry said...

డియర్ రసజ్ఞ!

"నవ రస(జ్ఞ) భరితం" బ్లాగ్ వ్రాస్తున్న మీకు నిజంగా తెలియకే అడిగారనుకోవాలా?

ఆ రోజుల్లో ఆ నానుడి లేదు. దూరాభారాలవల్లా, ప్రయాణ సౌకర్యాలు లేకపోవడం వల్లా అనివార్యమై, కాస్త స్థితిమంతులైతే వాళ్లింట్లోనూ, లేకపోతే యే వూరి పెద్ద లాంటివారింట్లోనో భోజనాలు యేర్పాటు చేసేవారు.

అయినా, "కతకడం" అంటే తినడం అని కదా? మరి ఇప్పుడుకూడా పెళ్లిచూపుల్లో స్వీట్లూ, హాట్లూ, పళ్లూ మెక్కుతున్నారుకదా? అన్నీ అతక్కుండా పోతున్నాయా?

A K Sastry said...

డియర్ Venkat!

చక్కగా వివరించారు. సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

పై అన్నోన్ (కాశి)!

కొన్ని కుటుంబాల్లోనే అలాగ. మరి 12 యేళ్లకే పొలం పనులూ, వృత్తి పనులూ సమర్థించుకోడం నేర్చుకున్నవాళ్లూ వుండేవారు.

మరి ఆ అబ్బాయి పెళ్లికాకుండా అలానే వుండిపోయాడనుకుందామా? గంతకుతగ్గ బొంత యెక్కడో వుండే వుంటుందికదా! ఆ "సూటబులిటీ" చూడ్డమే అక్కడి "సూక్ష్మం".

అందుకే ఆ రోజుల్లో "విడాకులు" వుండేవికావు. (మొగుణ్నొదిలేసి పుట్టింటికి వచ్చెయ్యడం, యెవరితోనో లేచిపోవడం అప్పట్లో కూడా వుండేవి అనుకోండి).

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Anil!

మీ వివరణ బాగుంది. సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ అవినేని భాస్కర్!

అది కథకాదు. వాస్తవం. బాల్యవివాహాలు జరిపేమాట వాస్తవం.

"కతికితే అతకడం" గురించి పైన సమాధానం ఇచ్చాను. వీలైతే చదవండి.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ buddha murali!

మీరన్నది అక్షరాలా నిజం. అందుకే యే వూరిపెద్ద ఇంట్లోనో, మధ్యవర్తి ఇంట్లోనో భోజనాలు యేర్పాటు చేసేవారు. అయినా, మాటల్లో అటు యేడుతరాలూ, ఇటు యేడు తరాల విషయాలు దొర్లి, యే వేలువిడిచిన మేనమామ తండ్రో "గరిట తిప్పాడనో, నీళ్లు మోశాడనో" లాంటి కారణాలతో కూడా సంబంధాలు కుదిరేవి కాదు.

ధన్యవాదాలు.