Thursday, July 7, 2011

వార్తాహరులూ........2

.......సందేశాలూ
......ఆ సబ్ పోస్ట్ మాష్టరు.....కొంచెం తెల్లగా, పొడుగు ముక్కు తప్పితే, "అమ్యమ్యా" సినిమాలో అల్లు రామలింగయ్యలా వుండేవాడు......యేదో సీరియస్ గా పని చేస్తున్నట్టు నటిస్తూ, అరగంటకి గానీ బుర్రపైకెట్టి కళ్లజోడు పైనుంచి చూసేవాడు కాదు. ఈ లోపల వెనక్కాల కొంత క్యూ పెరిగేది. నా చేతిలోని కవరు తూచి, '....రూపాయలు అంటించండి ' అని బయటికి విసిరేసి, "నెక్స్ట్..." అనేవాడు....ఆ స్టాంపులు కొనుక్కొనే అవకాశం కూడా ఇవ్వకుండా. మళ్లీ క్యూ చివర చేరి, వాడి దగ్గరకి వచ్చేసరికి ఇంకో అరగంట. అప్పుడు ఇచ్చేవాడు స్టాంపులు. సరే, వాటిని అంటించి, డబ్బాలో వేసేవాడిని. ఓ గంట ఆలస్యంగా కాలేజీ కి వెళ్లేవాడిని.

ఓ సారి బాగా వొళ్లు మండిపోయి, వీడిమీద యెలా కక్ష తీర్చుకోవాలా అని తీవ్రంగా ఆలోచించి, ఓ పథకం వేశాను. అదే.....ఓ అరఠావు తెల్లకాయితం తీసుకొని, దాన్ని ఇన్లేండ్ లెటర్ ఆకారంలో కత్తిరించి, దానిమీద, "ఒరే అల్లు రామలింగయ్యా! యెంతసేపూ వచ్చినవాళ్లని పట్టించుకోకుండా యేమి మిడుకుతావు? ఆ మిడికేదేదో వచ్చినవాళ్ల అవసరాలు చూసి, ఖాళీగా వున్నప్పుడు మిడిక్కోవచ్చు కదా? నీకు మిడకడానికే కాదు జీతం ఇస్తున్నది. కార్డులూ, కవర్లూ, స్టాంపులూ అమ్మాలి, రిజిస్టర్ కవర్లు తీసుకోవాలి....ఇలా బోళ్లు పనులు అప్పచెప్పారు కదా? ఇంకెప్పుడైనా నీ కిటికీ ముందు ఇద్దరో, ముగ్గురో క్యూలో కనపడినా నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను జాగ్రత్త!" అని వ్రాసి, చక్కగా మడిచి జిగురుతో అంటించేసి, టు అడ్రెస్ లో "పోస్ట్ మాస్టర్..." అంటూ వాడి అడ్రెస్ వ్రాసి, ఫ్రమ్ అడ్రెస్లో, "పీ ఎం జీ, హైదరాబాద్" అని రబ్బర్ స్టాంప్ అకారంలో నల్ల సిరాతో చెక్కి, కవరుపై అంటించవలసిన స్టాంపు స్థానంలో "పోస్టేజ్ విల్ బి పెయిడ్ బై ది అడ్రెసీ" అని చిన్న అక్షరాల్లో ప్రింటులా వ్రాసి, వాడి పోస్టు డబ్బాలోనే ఓ సాయంత్రం పూట వేసేశాను. (దీనికి సాక్ష్యం, నాకు నేల టిక్కెట్టుతో సినిమా చూడ్డం నేర్పాడని చెప్పానుచూడండి--వాడే--భాస్కర రావు అనే నా కొండెగాడు). తరవాత యేమయిందో, రకరకాలుగా సీన్లు వూహించుకొంటూ, నవ్వుకుంటూ, యేకపాత్రాభినయాలు చేస్తూ, యెంతో ఆనందించేవాళ్లం! ఆ మర్నాటినుంచీ, కిటికీ ముందుకి యెవరు వచ్చినా, తన కళ్లజోడుపైనుంచి అనుమాన దృక్కులు పరుస్తూనే,  గబగబా వాళ్ల పని చేసి పంపించేసేవాడు. క్యూ యెప్పుడూ కనపడలేదంటే నమ్మండి! నా కొండెగాడు ఇప్పటికీ అంటూ వుంటాడు--"అబ్బాయిగారి దెబ్బంటే....గోలుకొండ అబ్బా!" అని. అదీ పిట్టకథ. (బాగా వుపయోగించానంటారా.....ఇంగ్లాండు కవరుని?)

ఇంక వార్తాహరుల గురించి అసలు విషయానికొస్తే, మా ఆవిడా నేనూ సరదాకయినా, సీరియస్ గా నైనా, వాదన లో పడితే, మేమిద్దరూ ప్రకటించే యేకాభిప్రాయం--"అసలు ఆ పోస్ట్ మ్యాన్ ని తన్నాలి!" అని!

ఆ కథాక్రమంబెట్టిదనిన......

1972 చివర్లో, మేం నిరుద్యోగుల సంఘం తరఫున ప్రత్యేక ఆంధ్రోద్యమం చివర్లో వుండగా, మా ఇంటి వార్డు పోస్ట్ మ్యాన్ (ఆయన పేరు గుర్తు లేదు--ఇంటిపేరు 'పితాని '. మంత్రి పితానికి యేమైనా అవుతాడోలేదో తెలీదు.) నాకు ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం వచ్చినట్టు అపాయింట్ మెంట్ లెటరు తెచ్చిచ్చాడు. ఇంటిల్లిపాదికీ ఆనందం. అందులో "త్వరలో మీకు వుత్తరం వ్రాస్తాము. మేము చెప్పిన తేదీల్లో, మెడికల్ టెస్ట్ కి హాజరు కావలసి వుంటుంది" అని కూడా వ్రాశారు. అక్కడనించీ, యెదురు చూపు ప్రారంభం. యెంతకీ ఆ వుత్తరం రాదు. ఓ రోజున, ఆ పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్లిపోతుంటే, మా కాలవగట్టున అతన్ని ఆపి, మా ఇంటి అడ్రెస్ కి వుత్తరాలు యేమీ రాలేదా? అని అడుగుతూంటే, ప్రక్కన వున్న యెవరో, "ఈయనకి ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం వచ్చింది. మెడికల్ టెస్ట్ కి ఇంకో వుత్తరం రావాలిట--అందుకనీ ఆతృత!" అనగానే, పోస్ట్ మ్యాన్ "మెసెంజరుగానా?" అని అడగడం, ప్రక్కాయన, "ఈయన బీ కాం సెకండు క్లాసు--కేషియరు వుద్యోగమే!" అనడం, పోస్ట్ మ్యాన్ "అబ్బో! ఇంకేం! నక్కని తొక్కారు" అనడం, నాకిప్పటివరకూ గుర్తే. కానీ ఆ మెడికల్ టెస్ట్ వుత్తరం మాత్రం రాలేదు! (దాని గురించి వ్రాస్తే ఇంకో ప్రహసనం! యెవరైనా అడిగితే, మరోసారి....)

మొత్తానికి, 12-03-1973 న, ఆంధ్రా బ్యాంకు గాంధీనగర్, విజయవాడ శాఖలో వుద్యోగంలో చేరాను. (అప్పటికి వుప ముఖ్యమంత్రి బీ వీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేసి, వుద్యమంలో చేరడంతో, రాష్ట్రపతి పాలన విధించారో, విధించనున్నారో!) విజయవాడలో అన్ని బ్యాంకులూ, వాటి శాఖలూ, వారానికి రెండురోజులు మాత్రమే పని చేసేవి. (దాని ప్రభావం నా వుద్యోగమ్మీద సంగతి వేరే కథ.)

అలా నా వుద్యోగంలో నేనుండగా.......
   
........తరువాయి మరోసారి!

No comments: