Monday, April 26, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-3

ఆవిడ చిన్నప్పుడు బడులు లేవు--కనుక చదువు ప్రసక్తే లేదు. అయినా చదవడం, వుత్తరం వ్రాయడం నేర్చుకొంది.

అలాగే భగవద్గీత, సుందరకాండ లాంటివి చదివేసేది!

ఆవిడకి ఆ పాండిత్యం యెక్కడనించి వచ్చిందోగానీ, యెవరిదైనా ఇంటిపేరు చెప్పగానే, వాళ్ళ శాఖా, గోత్రం, ఋషులూ అన్నీ చెప్పేసేది. (18 మందీ, 23 మందీ ఋషులు కూడా వున్న గోత్రాలు వున్నాయట!)

ఆవిడ ఇంకో లక్షణం యేమిటి అంటే, కళ్ళు అంతగా స్పష్టం గా కనపడని దశ వచ్చినా, కనపడిన కాయితాన్ని, అది యేదైనా, కూడబలుక్కుని చదవకుండా వదిలేది కాదు! ఇతరభాషా పదాలు తెలుగు లిపిలో వుంటే, 'ఇదేభాషరా?' అని అడిగేది!

ఒక్కొక్కప్పుడు, గది వూడ్చి, తుక్కు యెత్తడానికి ఓ కాయితం సంపాదించి, ఆ కాయితం లో యేమి ప్రింటు చేసి వుందో చదువుతూ కూర్చొని, తుక్కు సంగతి కాసేపు మరిచిపోయేది!

తనకి తెలుసున్నవాళ్ళందరివీ జన్మ నక్షత్రాలు, వాళ్ళు పుట్టిన తెలుగు సంవత్సరాలతో సహా గుర్తుండేవి!

తమాషా యేమిటంటే, మేము 'అమ్మమ్మా! నీదే నక్షత్రం?' అని అడిగితే, 'నేనూ--పితూరీషా నక్షత్రయుక్త సరీసృప లగ్న పుష్కరాంశ లో పుట్టానురా!' అనేది! నిజం మాత్రం యెప్పుడూ చెప్పలేదు!

మేము ఎలిమెంట్రీ స్కూల్లో వుండగా, ఓ సారి వాళ్ళ వూరు వెళ్ళాము.

ఆ వూళ్ళో 'ధర్మారం మేష్టారు' అనే ఆయన వీధి బడి వుండేది. మా మేనమామ కొడుకు అప్పుడు అక్కడే చదువుకొనేవాడు.

ఆ బడి పుణ్యమా అని, కొన్ని కొత్త, వింత అనిపించే పదాలు నేర్చుకొని, నవ్వుకొనేవాళ్ళం.

యెవరింటినించి అయినా ఓ 'బరకం' పట్టుకెళ్ళాలి రోజూ--బళ్ళో పిల్లలు కూర్చొనేందుకు--మేష్టారింటి అరుగు మీద.

అరుగు నిండిపోయి, ఆలస్యం గా బడికి వచ్చేవాళ్ళు యెవరి 'చదర' వాళ్ళు తెచ్చుకోవాలి.

పొద్దున్న బడి అయిపోగానే, 'యాల గంజి' కి ఇంటికి వచ్చి, మళ్ళీ రెండో పూట బడికి వెళ్ళాలి.

--ఇంకొన్ని గుర్తు తెచ్చుకొని, మరోసారి.

Monday, April 12, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ-2

మా అమ్మకి ఓ పదేళ్ళు వచ్చేసరికి, వాళ్ళ అమ్మమ్మ (ఆవిడపేరు నాకు గుర్తులేదు) కి 60 యేళ్ళు వుండేవట. అప్పటికే ఆమెకి మతిస్థిమితం తప్పిందట. ఆవిడకి 13 మంది సంతానం!

సరదాకి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మని 'నీకెంత మంది సంతానం?' అనడిగితే, వ్రేళ్ళతో లెఖ్ఖ ప్రారంభించి, "పెద్దబ్బీ, చిన్నబ్బీ, నారాయుడూ (మా అమ్మమ్మ), దద్ద, సోదెమ్మ......మళ్ళీ పెద్దబ్బీ, చిన్నబ్బీ...."ఇలా వ్రేళ్ళన్నీ అయిపోయినా ఆవిడ లెఖ్ఖ తేలేది కాదట!

ఈ "దద్ద" మా అమ్మ మేనమామ. దాదాపు 8 1/2 అడుగుల పైగా పొడవూ, 4 1/2 అడుగుల కైవారం వుండి, 24 కుంచాల ధాన్యాన్ని బస్తాలో భుజం పై నరేంద్రపురం నించి (రాజమండ్రి--కోరుకొండ--కోటి కేసరం దారిలో వుండేది) మోసుకు వెళ్ళి, రాజానగరం లో మిల్లు ఆడించి, బియ్యం బస్తాతో తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరేవాడట--నడుచుకుంటూ!

నిన్న మొన్న, మా ఆవిడ 'బియ్యం అయిపోతున్నాయి, తెప్పించండి' అంటే, మా దగ్గరలో వున్న షావుకారుకి ఫోనుచేసి, బియ్యం రేటు యెలా వుంది అనడిగితే, 'సోనా మసూరి బస్తా 850/- వుందండి' అన్నాడు. అబ్బా! కేజీ 8-50 కి తగ్గిందే! అని ఆశ్చర్యపోయి, ఓ పది కేజీలు పంపించమంటే, 340/- రూపాయలు బిల్లు వేశాడు! (బస్తా అంటే ఇప్పుడు లెక్క 25 కేజీలు అని ఆ తరవాత నాకు తెలిసింది!)

సరే.............వాళ్ళమ్మ వాళ్ళ సంగతి అలా వుంచితే, మా అమ్మమ్మ..........భలే చిన్నెలు చేసేది. 

ఆవిడ వొంటిమీద చిన్నమెత్తు బంగారం కూడా వుండేది కాదు! (వుంటే ఆవిడ జీవితం యెలా వుండేదో!)

కొడుకుల ఇంట్లో వున్నా, కూతురు ఇంట్లో వున్నా, కొన్ని బియ్యం అమ్మేసి, ఓ బేడ డబ్బులు (అంటే పాత 24 పైసలు) జాగ్రత్త పెట్టుకొనేది--తన శిరో ముండనం ఖర్చుకి! ఇంకో యెర్రకాణీయో (అంటే 3 పాత పైసలు) యెంతో యెక్కువగానే జాగ్రత్తపెట్టుకొనేది!

కొడుకు ఇంట్లోంచి వచ్చేటప్పుడు, వాళ్ళ ఇంట్లో వున్న ఇత్తడి గిన్నెల్లో "పి కొం" అని చెక్కివున్న (పిరాట్ల కొండయ్య--ఆవిడ భర్త పేరు) గిన్నె ఒకటి సంగ్రహించి, సంచీలో వేసుకొని, పైన తన సైను పంచెలు కప్పెట్టి, బస్సులో వచ్చేసేది. తీరా బస్సు దిగేటప్పుడు, ఆ సంచీ మరిచిపోయి, దిగిపోయేది!

వాళ్ళ ఇంట్లో, దొంగతనం ఆరోపణ, ఫలితం దక్కకపోవడం!

ఇదీ ఆవిడ స్థితి!

(పాపం--ఆ కాణీ మాత్రం నాకే ఇచ్చేది--యేదైనా కొనుక్కోరా! అంటూ)

--మళ్ళీ ఇంకోసారి.

Sunday, April 4, 2010

ఙ్ఞాపకాలు

మా అమ్మమ్మ

పిరాట్ల సత్యనారాయణమ్మ!

ఆవిడతో నా తొలి ఙ్ఞాపకం--మా అమ్మకి నా తరవాత మా చెల్లెలు పుట్టినప్పుడు ఆ పాపకి స్నానం చేయించి, యెర్రని గౌను తొడిగి, జల్లెడలో గుడ్డ పరిచి పడుకోబెట్టి, 'చూడరా నీ చెల్లెల్ని--ముండ యెంత ముద్దొస్తూందో!' అనడం.

మా తాతగారు పిరాట్ల కొండయ్యగారు మా అమ్మ చిన్నప్పుడే, పెళ్ళి కాకముందే పోయారట.

వాళ్ళకి ఇద్దరు కొడుకులూ, నలుగురు కూతుళ్ళూ. మా అమ్మ మూడోది.

మా అమ్మమ్మకి కోడళ్ళతో పడేది కాదు--కొడుకుల్నీ వాళ్ళనీ కలిపి తిడుతూండేది. 

అలాని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మానేది కాదు! యేడాదికి మహా అయితే ఓ నెల పెద్దకొడుకుదగ్గరా, ఓ నెల చిన్న కొడుకుదగ్గరా వుండి, వాళ్ళతో తగువాడి, 'మా నరిసిమ్మూర్తి (మా నాన్న) వున్నాడు--నాక్కొడుక్కన్నా యెక్కువ ' అంటూ మా యింటికి వచ్చేసేది. 

మా చెల్లెలు పుట్టాక మా నాన్నగారు ఓ తాటాకిల్లు కొనుక్కొని, అద్దె యింట్లోంచి సొంత యింట్లోకి మారారు. రెండుపక్కలా దాదాపు ఐదున్నర అడుగుల యెత్తు మట్టి అరుగులూ, మధ్యలో అడుగున్నర యెత్తు 5 మెట్లూ, సిం హ ద్వారం తరవాత ఓ హాలు, యెడంపక్కన పడగ్గదీ, వెనుక వసారా లోకి పడగ్గది లోంచి ఒకటి, హాలు లోంచి ఒకటీ గుమ్మాలూ, వాటికి క్రిందకి మెట్లూ....ఆ వసారాయే సగం వంట గదీ, సగం భోజనాల గదీ, వెనక్కాల కావలసినంత పెరడూ, వెనకాల వుమ్మడి బావీ! ఇంటి ముందు కూడా స్థలం వుండేది.

మా అన్నకీ, నాకూ, చెల్లెలికీ మూడేసి యేళ్ళ యెడం. అప్పుడు నాకు నాలుగు దాటి అయిదు వచ్చాయి. అన్నయ్య ఒక్కడే స్కూలుకి వెళుతున్నాడు.

మా అమ్మమ్మ రాత్రుళ్ళు నన్ను తన పక్కన పడుకోమని, 'అచ్యుతం, కేశవం, నారాయణం, నమః కృష్ణ, దామోదరం, శ్రీధరం....' ఇలా స్త్రోత్రం చదివించి నిద్రపుచ్చేది.

అందులో నాకు గుర్తున్న కొన్ని భాగాలు--'దశరథనందన లోకగురో, రావణమర్దన రామనమో, భక్తంతే, పరిపాలయమాం, నామ స్మరణ, ధన్యోపాయం, నహిపశ్యామం, భవహరణే, రామ హరే, కృష్ణహరే, తవనామ వదాను సదాను మతే!'

(ఈ స్తోత్రం యెవరికైనా పూర్తిగా గుర్తుంటే, అది ప్రచురిస్తే సంతోషిస్తాను.)

ఇంకా 'చుంచు దువ్వి పింఛం కడుదురా--గోపాల కృష్ణా--పంచదార పాలు పోతురా' లాంటి పాటలు నేర్పేది. భయం వేస్తోందంటే, ఆంజనేయ దండకం పఠింప చేసేది. 

"శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్య కాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహంపవిత్రం, భజేహం, భజేహం, భజేహం. సాయంత్రమున్నీనామ సంకీర్తనల్జేసితే, పాపముల్ బాసునో, భయములున్ దీరునో, భాగ్యముల్గలుగునో, ఓ వానరాకార, ఓ వర్థగంభీర, ఓ పుణ్య సంచార, నీవేసమస్తమున్.........శాకినీ ఢాకినీ పిశాచమ్ములన్, గాలి దయ్యంబులన్ నీదు వాలంబునంజుట్టి, నేలంబడంగొట్టి...... నమస్తే, నమస్తే, నమః!"

(అంటూ సాగే ఆ దండకాన్ని కూడా పూర్తిగా చెప్పగలవాళ్ళు యెవరైనా ప్రచురిస్తే ఇంకా సంతోషిస్తాను--పుస్తకాల షాపుల్లో కూడా హనుమాన్ చాలీసా లభిస్తోందిగానీ, ఈ దండకం దొరకడంలేదు.)

మా ముగ్గురికీ ఓ పెద్ద కంచం లో 'చల్ది వణ్ణం' పెట్టేది మా అమ్మమ్మ. (అది ఆవిడ పరిభాష! అప్పటికే ఆవిడ వయస్సు దాదాపు 60-65 మధ్య)

రాత్రి యెక్కువ అన్నం మిగలకపోతే, ప్రత్యేకం గా చల్ది వణ్ణాల కోసం మళ్ళీ వండి వార్చేది. 

పెద్ద కంచం లో అన్నం మూడు, నాలుగు కరుళ్ళుగా వడ్డించి, ఆవిడ అరచేతినిండా పచ్చడి (కందిపప్పో, శెనగపప్పో, గోంగూరో, వుసిరికాయో, చింతకాయో, నిమ్మకాయో, ఆవకాయో, మాగాయో, తొక్కుపచ్చడో--ఇంకా చాలా!) పట్టుకొని, చాకచక్యం గా తన బొటన, చూపుడు వ్రేళ్ళతో నిమ్మకాయంత గోళీ చేసి రడీగా వుండేది. అన్నయ్య 
'పచ్చడి' అనగానే, ఆ గోళీని కంచంలో వేసేది. అన్నయ్య వెంటనే 'నూని' అంటే, అప్పటికే నూనె గిన్నె పట్టుకుని, చెంచాలో నూనెతో రడీగా వున్న ఆవిడ, 'బోడిగుండుమీద వెయ్యమంటావా? వెధవా! కలపండిరా!' అని విసుక్కొనేది!

కలుపుకొని ముగ్గురం ఆబగా తినేయ్యగానే, మళ్ళీ అన్నం వడ్డించి, 'ఇప్పుడేమిటి?' అనేది. 

అన్నయ్య 'పచ్చడి' అనగానే (అప్పటిదాకా ఆ పచ్చడి ఆవిడ అరచేతిలోనే వుండేది) మళ్ళీ వ్రేళ్ళతో ఓ గోళీకాయంత పచ్చడి 'ఊఁ' అంటూ కంచంలో పడేసేది. కావలసినంత అన్నం కలిపి, 'ఇంకొంచెం పచ్చడి' అనగానే, ఇంకో చిన్న గోళీకాయంత పచ్చడి మళ్ళీ 'ఊఁ'. మళ్ళీ 'ఇంకొంచెం పచ్చడి' అంటే, మరో బుల్లి గోళీకాయంత పడేసి, మళ్ళీ 'ఊఁ'!--ఇలా ఓ అరగంట సాగేది ఆ కార్యక్రమం.

--మళ్ళీ ఇంకోసారి.