'ఉచితాలు 'మా క్లబ్బు సెగట్రీ ‘వారు పోగాల వారు’ లాంటివాడు! మేము పెట్టుకున్న ముద్దు పేరు ‘నారదులవారు’! సాయంత్రం ఆఫీసుల్నించి క్లబ్బుకి చేరి, టెన్నిసో, ష టిలో, కేరం సో, కొండొకప్పుడు పేకతో పూల్ గేములో ఆడుకొని కాస్త రిలాక్స్ అవుదామని ఆరు బయట కుర్చీల్లో అందరూ ఆసీనులవగానే, ఓ ‘వేడి వేడి అంశం’ మీద కొంత మందిని (వారి వారి ప్రతేకతలని బట్టి) రెచ్చగొడతాడు! అక్కడనించీ, అందరికీ వినోదమే వినోదం! ఇవాళ మా రాశ్శేఖర్రెడ్డితో, ‘చూశారా! నెలనెలా బ్యాంకులోకి రెండువేల నగదు బదిలీ, కుటుంబానికో రంగుల టీవీ ఇస్తారట!’ అనగానే…… ‘అధ్యక్షా! ఈసీవారు చూస్తున్నారుకదా! మేం ఫిర్యాదు చెయ్యం! అది మా నైజం కాదు!.........’ అంటూండగానే, మైసూరా అంటాడూ ‘…….లేపేస్తామంతే!’ అని పూరించాడు! పక్కనే వున్న ‘రోశయ్య’ “ఈసీవాళ్ళు మరీనూ…..108, 104ల మీద రాజీవ్ బొమ్మకి స్టిక్కర్లు వెయ్యాలంటుందా? మరి గాంధీ బొమ్మలూ, ఇందిరా గాంధీ బొమ్మలూ, రాజీవ్ విగ్రహాలూ…….(అంబేద్కర్ బొమ్మలూ…….అనరు—మరి భయ్యం!) వీటి మాటేమిటి?” అన్నాడు. ‘ఈ ఖర్చులన్నీ ఈసీవారె పెట్టుకుంటార్లే! నీ లక్షకోట్ల బడ్జెట్లో యేం మిగిలిందని?’ అన్నాడు మైసూరా! ‘అదే వద్దన్నది! నాలిక తీస్తా!’ అని రోశయ్య అంటుండగానే...... నారదులవారు, ‘సరే సార్, ఇంతకీ నగదు బదిలీ……..’ అంటూండగానే...... చెంద్రబాబు ‘అవునండీ! పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి, ఉచిత విద్యుత్తు అనీ, ఒక బల్బుకి ఉచితం అనీ, బిల్లులో పది రూపాయలు తగ్గిస్తామనీ, 18 రూపాయలకే సోనా బియ్యమనీ, 40 రూపాయలకే, పప్పులు, నూనె అనీ…..ఇలాంటి చెత్త వాగ్దానాలకన్నా, నగదు బదిలీ మెరుగు కదూ! మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు! మీ పావలా వడ్డీ మహిళా ఋణాల్లాగ!’ అన్నాడు! ‘ఉచితంగా రంగుల టీవీలమాటేమిటి? కరెంటు యెక్కడనించి తెస్తారు? కరెంటు తీగలకి బట్టలారేసుకోడమే కాదు, చంటిపిల్లలకి ఉయ్యాలలు కూడా వ్రేళ్ళాడదీయ వచ్చు! కమీనిష్టువాళ్ళమీద తుపాకులు పేల్చారుగానీ……..’ అని కిరణ్ కుమార్రెడ్డి అంటూండగానే............. మా రాఘవులు ‘మధ్యలో మాపేరెందుకు? మా మహా కూటమిలో……’ అంటూంటే....... చెంద్రబాబు ‘అవును! రోజంతా కష్టపడి ఇంటికి చేరిన శ్రామికులకి, ఓ రంగుల టీవీ చూస్తే వచ్చే ఆనందం, యెప్పుడూ ఏసీల్లో వుండే, విమానాల్లో తిరిగే, లక్షలకోట్లు రాత్రికి రాత్రి సంపాదించే మీకేమి తెలుస్తుంది? ఇక కరెంటంటారా? మీరు చేసిన జలయజ్ఞంలో వచ్చే కరెంటు మేమాశించం! మాకు వేరే కరెంటు వస్తుంది—సూర్యుడిలోంచీ, సముద్రంలోంచీ, గాలి లోంచీ, నాఫ్తాలోంచీ….మాదంతా హైటెక్ కదా?’ అప్పుడే అక్కడికి చేరుకున్న సర్వానంద (సర్వంబొచ్చు) స్వామి ‘నాయనా! యెందుకు దెబ్బలాడుకుంటారు? మన యెన్నికల్లో, యే (అల్)శేషనో, ఎంజేరావో లేకపోతే, ఈ నవీన్ చావ్లాలు యేమి చేస్తారు? గోపాల స్వామిలూ, సుబ్బారావులూ యేమి చెయ్యగలరు? మనందరికీ తరుణోపాయం—లోక్ సత్తా—జయప్రకాష్ నారాయణ చేస్తున్న ప్రయోగం—అదేదో ఓ నియోజకవర్గం లో ఒకే పదవికి ఇద్దరు పోటీ పడుతుంటే, వాళ్ళిద్దరికీ మధ్య ఆ నియోజక వర్గ ప్రజలకి వోటింగు పెట్టి, 20 నించి 30 బూతుల్లో, ప్రత్యక్ష సీక్రెట్ బాలట్ నిర్వహించి, యెవరు నెగ్గితే వారికి టిక్కెట్ ఇస్తారట! వోటర్లెవరైనా, పదహారో, ముప్ఫైరెండో గుర్తింపు చిహ్నాల్లో యేదో ఒకటి చూపించి, ఓటు వెయ్య వచ్చట!....బాగుందా? మరి ఈ ప్రక్రియకి అయ్యే డబ్బులెక్కడనించి వస్తాయో! అందులో ఓ పది రూపాయలైనా నాది వుంటే సంతోషిద్దును!’ అన్నారు! ‘యేమిటో! మీరింకా సత్తెకాలం లో వున్నట్టనిపిస్తున్నారు స్వామీ’ అన్నాడు మా నారదుడు! ‘కాల చక్రం గిర్రున తిరుగుతూనే వుంటుంది నాయనా!’ అన్నారు చిద్విలాసంగా మా సర్వానంద స్వాములవారు! 'సత్తా'జనో సుఖినోభవంతు!
Thursday, March 12, 2009
కబుర్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment