Sunday, March 8, 2009

ఖబుర్లు

శాతవాహనుడి…………రాచ్చిప్ప!
ఈ పేరుతో ఓ కధా, నాటికా వున్నాయి! మన తెలుగువాళ్ళకి, ఇంకా మాట్లాడితే భారతీయులకి—సెంటిమెంట్లు యెక్కువ! శేషవస్త్రమైనా, బుద్ధుడి పన్నైనా, మహమ్మదు వెంట్రుకైనా—మనకి చాలా పవిత్రమైనవి! మరి సాక్షాత్తూ ‘గాంధీ’గారు వాడిన చెప్పులూ అవీ అంటే? సాష్టాంగపడిపోమూ! (మన జనాభాలో ఒక శాతమైనా అలా పడతారా అనీ, అందులో యెంతమంది గాంధేయులు అనీ నా సందేహం!) “గాంధీగారి చెప్పులూ, కళ్ళజోడూ, గడియారం, గిన్నె, కంచం—మన దేశానికే దక్కాయండోయ్!” అంటూ వచ్చాడు మా టీవీ సుబ్బరావు! (యే వార్తనైనా టీవీ న్యూస్ రీడర్ లెవెల్లో విజువల్స్ తో సహా కళ్ళకు కట్టినట్టు చెప్పుకొచ్చే మావాడికి మేము పెట్టుకున్న ముద్దు పేరు!) “యెంతైనా మన ప్రభుత్వం అసాధ్యమయిందండోయ్! అవి మనకే దక్కే యేర్పాటు చేస్తానంది—చేసింది! చూశారా?” అన్నాడు మా రాశ్శేఖర్రెడ్డి! (ఈయన పేరేదైనా, ఫక్తు కాంగ్రెస్ అభిమాని! వై యస్ ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు పెట్టాం ఆయనకి ఆ పేరు.) “అసలు అవి ఇతరదేశాలకి వెళ్ళడానికి బాధ్యత కాంగ్రెస్ వారిది కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను” అన్నాడు మా చెంద్రబాబు! (చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగానే ఈయనకి ఆ పేరు పెట్టాము.) “ఆ ఫదికోట్లూ పెట్టి యే లిబర్టీ సెంటర్లోనో భూమి కొని, పేదలకి పంచిపెట్టొచ్చుగా? యెందుకీ వృధా ఖర్చు?” అన్నాడు మా రాఘవులు. (ఈయన కమ్యూనిస్ట్ అభిమాని అని వేరే చెప్పక్కర్లేదుగా? “ఇది ఖచ్చితంగా మైనారిటీలని బుజ్జగించడమే! ఇదివరకు టిప్పుసుల్తాన్ ఖడ్గాన్ని కూడా అలాగే తెప్పించారు.” అన్నాడు మా దత్తాత్రేయ! (ఈయన దృష్టిలో గాంధేయులు మైనారిటీలేకదా మరి) “అసలు అంబికా సోనీ అలా చెప్పు-కొంటోందిగానీ, మల్లయ్య—నాకు భారత ప్రభుత్వం నించి యెలాంటి అభ్యర్ధనా రాలేదు—అంటున్నాడు! ఇదంతా స్టంటు.” అంది మా సుష్మా స్వరాజ్! “అయినా గాంధీగారి వస్తువులు కొనడానికి బ్రాందీ బాబే కావలసి వచ్చాడు చూడు మన కాంగీరేసులకి!” అన్నాడు మా మైసూరా రెడ్డి! “ఇవన్నీ సరేగానీ, వాటి కధా, కమామిషూ కాస్త వివరించండి స్వామీ!” అనడిగారు కోరస్ లో అప్పుడే వేంచేసిన సర్వానంద (సర్వంబొచ్చు) స్వామిని! మా అందర్లోకీ కాస్త బుఱ్ఱ వున్నవాడూ, యెప్పుడూ చిద్విలాసంగా వుండేవాడూ కాబట్టి మొదటిపేరూ, తనకి తెలియందేదీ లేదన్నట్టు లెక్చర్లు ఇస్తూ వుంటాడని బ్రాకెట్లో పేరూ పెట్టుకున్నాము ఆయనకి! “నాయనా! గాంధీ గారి సులోచనాలని ఆయనే స్వయంగా ఓ సైనికాధికారికి ఇచ్చేశారు! బొడ్డులో దోపుకొనే గడియారాన్ని ఇందిరాగాంధీకి కానుకగా ఇచ్చారు. తన కంచాన్నీ, గిన్నె నీ ఆభా గాంధీ కి ఇచ్చారు—తన గుర్తుగా వుంచుకోమని! ఇక చెప్పుల్ని కుక్కెత్తుకు పోతుంటే, ఆయన చేతులోవుండే కర్ర విసిరారు! అప్పట్లో గాంధీగారి ఆశ్రమం పక్కనే వుంటున్న మాతాత పెరట్లో ఆ చెప్పుల్ని వదిలేసి పారిపోయింది ఆ కుక్క. దాంతో పాటే ఆ కర్ర కూడా మా పెరట్లోనే పడింది! అప్పటినించీ అవి మా ఇంట్లోనే వున్నాయి! చూడండి” అని ఓ జత టైరు చెప్పులూ, ఓ పాతకాలం నాటి బాణా కర్రా పట్టుకొచ్చి చూపించారు మా స్వామి! మరి విజై మల్లయ్య పది కోట్లు పోసి కొన్నవేమిటబ్బా? దేశ వ్యాప్తంగా వున్న కొన్నివేల గాంధీ మ్యూజియాల్లో వున్న చెప్పులూ, సులోచనాలూ, కర్రలూ, గడియారాలూ, బొచ్చెలూ, కంచాలూ మాట యేమిటి? మా జిల్లాలో పత్తేపురం లో చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు కట్టించిన గాంధీ ఆశ్రమం లో కూడా ఇవన్నీ వున్నాయే మరి! యేమిటో ఈ సెంటిమెంట్లు! అన్నట్టు ఓట్లు దండుకోడానికేమైనా పనికొస్తాయా అని అలోచిస్తున్నారు మా రాశ్శేఖర్రెడ్డీ, చెంద్రబాబూ వగైరా!

No comments: