Sunday, March 1, 2009

కబుర్లు

‘యేంట్రా కన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’ అన్న నా ప్రశ్నకి, ‘ఆ! యేముందీ! మా ఇంటికీ, గొడ్ల చావడికీ పై కప్పు దేంతో వేద్దామా! ఆని '—ఇదీ మా నాలుగేళ్ళ మనవడి సమాధానం! ఓ ముప్ఫై యేళ్ళ క్రితం రేడియోల్లో ప్రతీ అయిదు నిమిషాలకీ వినిపించిన ‘రాంకో బ్రాండ్ వారి ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల’ అడ్వర్టైజ్ మెంట్ అది! (వాడికి నేనే సరదాగా నేర్పించాననుకోండి!) చెప్పొచ్చేదేమిటంటే, ఈ కాలం పిల్లలు మన కన్నా కొన్ని తరాల ముందు వుంటున్నారు! మనకి చినప్పుడు ఓ పదమూడేళ్ళు వచ్చేవరకూ ‘ఫోన్’ చెయ్యడమెలాగో తెలుసా? నా మట్టుకు నాకు, నేను కాలేజ్ లో పీ యూ సీ చదువుతూ వుండగా (1968--అప్పటికి నాకు 16 యేళ్ళు), ఒక రోజు, మా ఎన్ సీ సీ సుబేదార్ జాన్ గారు ‘ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలి! ఒకసారి ఫోన్ కొట్టు!’ అంటే, యేమి చెయ్యాలో తెలియలేదు! అప్పట్లో ఫోన్ యెత్తగానే ఎక్స్చేంజిలో వున్న ఆపరేటర్ ‘నెంబర్ ప్లీజ్’ అని అడిగి, మనకి కావలసిన నెంబరుని కనెక్ట్ చేసేవారు. అప్పుడే కొత్తగా ‘డయల్ వున్న’ ఫోన్ లు వస్తున్నాయి. నా వెఱ్ఱి మొహం చూసిన సుబేదారు ‘రిసీవరు యెత్తి చెవిదగ్గరపెట్టుకొని, కావలసిన నెంబరు గల చిల్లు లో వేలు పెట్టి, అది యెక్కడ ఆగుతుందో అక్కడదాకా తిప్పాలి! అలా అన్ని నెంబర్లూ తిప్పాక, అవతల ఫోన్ మోగుతున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు నాకు ఇయ్యి.’ అన్నారు. (ఆయన మళయాళీ—నాకు రాదు మళయాళం! హిందీ బాగా వచ్చు—ఆయనకీ వచ్చు—మిలట్రీలో పని చేశాడు కదా!—మధ్యలో కొంచెం ఇంగ్లీషు—ఇలా జరిగింది మా సంభాషణ!) మరి ఇప్పుడో!

No comments: