'ఉచితాలు 'మా క్లబ్బు సెగట్రీ ‘వారు పోగాల వారు’ లాంటివాడు! మేము పెట్టుకున్న ముద్దు పేరు ‘నారదులవారు’! సాయంత్రం ఆఫీసుల్నించి క్లబ్బుకి చేరి, టెన్నిసో, ష టిలో, కేరం సో, కొండొకప్పుడు పేకతో పూల్ గేములో ఆడుకొని కాస్త రిలాక్స్ అవుదామని ఆరు బయట కుర్చీల్లో అందరూ ఆసీనులవగానే, ఓ ‘వేడి వేడి అంశం’ మీద కొంత మందిని (వారి వారి ప్రతేకతలని బట్టి) రెచ్చగొడతాడు! అక్కడనించీ, అందరికీ వినోదమే వినోదం! ఇవాళ మా రాశ్శేఖర్రెడ్డితో, ‘చూశారా! నెలనెలా బ్యాంకులోకి రెండువేల నగదు బదిలీ, కుటుంబానికో రంగుల టీవీ ఇస్తారట!’ అనగానే…… ‘అధ్యక్షా! ఈసీవారు చూస్తున్నారుకదా! మేం ఫిర్యాదు చెయ్యం! అది మా నైజం కాదు!.........’ అంటూండగానే, మైసూరా అంటాడూ ‘…….లేపేస్తామంతే!’ అని పూరించాడు! పక్కనే వున్న ‘రోశయ్య’ “ఈసీవాళ్ళు మరీనూ…..108, 104ల మీద రాజీవ్ బొమ్మకి స్టిక్కర్లు వెయ్యాలంటుందా? మరి గాంధీ బొమ్మలూ, ఇందిరా గాంధీ బొమ్మలూ, రాజీవ్ విగ్రహాలూ…….(అంబేద్కర్ బొమ్మలూ…….అనరు—మరి భయ్యం!) వీటి మాటేమిటి?” అన్నాడు. ‘ఈ ఖర్చులన్నీ ఈసీవారె పెట్టుకుంటార్లే! నీ లక్షకోట్ల బడ్జెట్లో యేం మిగిలిందని?’ అన్నాడు మైసూరా! ‘అదే వద్దన్నది! నాలిక తీస్తా!’ అని రోశయ్య అంటుండగానే...... నారదులవారు, ‘సరే సార్, ఇంతకీ నగదు బదిలీ……..’ అంటూండగానే...... చెంద్రబాబు ‘అవునండీ! పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి, ఉచిత విద్యుత్తు అనీ, ఒక బల్బుకి ఉచితం అనీ, బిల్లులో పది రూపాయలు తగ్గిస్తామనీ, 18 రూపాయలకే సోనా బియ్యమనీ, 40 రూపాయలకే, పప్పులు, నూనె అనీ…..ఇలాంటి చెత్త వాగ్దానాలకన్నా, నగదు బదిలీ మెరుగు కదూ! మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు! మీ పావలా వడ్డీ మహిళా ఋణాల్లాగ!’ అన్నాడు! ‘ఉచితంగా రంగుల టీవీలమాటేమిటి? కరెంటు యెక్కడనించి తెస్తారు? కరెంటు తీగలకి బట్టలారేసుకోడమే కాదు, చంటిపిల్లలకి ఉయ్యాలలు కూడా వ్రేళ్ళాడదీయ వచ్చు! కమీనిష్టువాళ్ళమీద తుపాకులు పేల్చారుగానీ……..’ అని కిరణ్ కుమార్రెడ్డి అంటూండగానే............. మా రాఘవులు ‘మధ్యలో మాపేరెందుకు? మా మహా కూటమిలో……’ అంటూంటే....... చెంద్రబాబు ‘అవును! రోజంతా కష్టపడి ఇంటికి చేరిన శ్రామికులకి, ఓ రంగుల టీవీ చూస్తే వచ్చే ఆనందం, యెప్పుడూ ఏసీల్లో వుండే, విమానాల్లో తిరిగే, లక్షలకోట్లు రాత్రికి రాత్రి సంపాదించే మీకేమి తెలుస్తుంది? ఇక కరెంటంటారా? మీరు చేసిన జలయజ్ఞంలో వచ్చే కరెంటు మేమాశించం! మాకు వేరే కరెంటు వస్తుంది—సూర్యుడిలోంచీ, సముద్రంలోంచీ, గాలి లోంచీ, నాఫ్తాలోంచీ….మాదంతా హైటెక్ కదా?’ అప్పుడే అక్కడికి చేరుకున్న సర్వానంద (సర్వంబొచ్చు) స్వామి ‘నాయనా! యెందుకు దెబ్బలాడుకుంటారు? మన యెన్నికల్లో, యే (అల్)శేషనో, ఎంజేరావో లేకపోతే, ఈ నవీన్ చావ్లాలు యేమి చేస్తారు? గోపాల స్వామిలూ, సుబ్బారావులూ యేమి చెయ్యగలరు? మనందరికీ తరుణోపాయం—లోక్ సత్తా—జయప్రకాష్ నారాయణ చేస్తున్న ప్రయోగం—అదేదో ఓ నియోజకవర్గం లో ఒకే పదవికి ఇద్దరు పోటీ పడుతుంటే, వాళ్ళిద్దరికీ మధ్య ఆ నియోజక వర్గ ప్రజలకి వోటింగు పెట్టి, 20 నించి 30 బూతుల్లో, ప్రత్యక్ష సీక్రెట్ బాలట్ నిర్వహించి, యెవరు నెగ్గితే వారికి టిక్కెట్ ఇస్తారట! వోటర్లెవరైనా, పదహారో, ముప్ఫైరెండో గుర్తింపు చిహ్నాల్లో యేదో ఒకటి చూపించి, ఓటు వెయ్య వచ్చట!....బాగుందా? మరి ఈ ప్రక్రియకి అయ్యే డబ్బులెక్కడనించి వస్తాయో! అందులో ఓ పది రూపాయలైనా నాది వుంటే సంతోషిద్దును!’ అన్నారు! ‘యేమిటో! మీరింకా సత్తెకాలం లో వున్నట్టనిపిస్తున్నారు స్వామీ’ అన్నాడు మా నారదుడు! ‘కాల చక్రం గిర్రున తిరుగుతూనే వుంటుంది నాయనా!’ అన్నారు చిద్విలాసంగా మా సర్వానంద స్వాములవారు! 'సత్తా'జనో సుఖినోభవంతు!
Thursday, March 12, 2009
కబుర్లు
Sunday, March 8, 2009
ఖబుర్లు
శాతవాహనుడి…………రాచ్చిప్ప!ఈ పేరుతో ఓ కధా, నాటికా వున్నాయి! మన తెలుగువాళ్ళకి, ఇంకా మాట్లాడితే భారతీయులకి—సెంటిమెంట్లు యెక్కువ! శేషవస్త్రమైనా, బుద్ధుడి పన్నైనా, మహమ్మదు వెంట్రుకైనా—మనకి చాలా పవిత్రమైనవి! మరి సాక్షాత్తూ ‘గాంధీ’గారు వాడిన చెప్పులూ అవీ అంటే? సాష్టాంగపడిపోమూ! (మన జనాభాలో ఒక శాతమైనా అలా పడతారా అనీ, అందులో యెంతమంది గాంధేయులు అనీ నా సందేహం!) “గాంధీగారి చెప్పులూ, కళ్ళజోడూ, గడియారం, గిన్నె, కంచం—మన దేశానికే దక్కాయండోయ్!” అంటూ వచ్చాడు మా టీవీ సుబ్బరావు! (యే వార్తనైనా టీవీ న్యూస్ రీడర్ లెవెల్లో విజువల్స్ తో సహా కళ్ళకు కట్టినట్టు చెప్పుకొచ్చే మావాడికి మేము పెట్టుకున్న ముద్దు పేరు!) “యెంతైనా మన ప్రభుత్వం అసాధ్యమయిందండోయ్! అవి మనకే దక్కే యేర్పాటు చేస్తానంది—చేసింది! చూశారా?” అన్నాడు మా రాశ్శేఖర్రెడ్డి! (ఈయన పేరేదైనా, ఫక్తు కాంగ్రెస్ అభిమాని! వై యస్ ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు పెట్టాం ఆయనకి ఆ పేరు.) “అసలు అవి ఇతరదేశాలకి వెళ్ళడానికి బాధ్యత కాంగ్రెస్ వారిది కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను” అన్నాడు మా చెంద్రబాబు! (చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగానే ఈయనకి ఆ పేరు పెట్టాము.) “ఆ ఫదికోట్లూ పెట్టి యే లిబర్టీ సెంటర్లోనో భూమి కొని, పేదలకి పంచిపెట్టొచ్చుగా? యెందుకీ వృధా ఖర్చు?” అన్నాడు మా రాఘవులు. (ఈయన కమ్యూనిస్ట్ అభిమాని అని వేరే చెప్పక్కర్లేదుగా? “ఇది ఖచ్చితంగా మైనారిటీలని బుజ్జగించడమే! ఇదివరకు టిప్పుసుల్తాన్ ఖడ్గాన్ని కూడా అలాగే తెప్పించారు.” అన్నాడు మా దత్తాత్రేయ! (ఈయన దృష్టిలో గాంధేయులు మైనారిటీలేకదా మరి) “అసలు అంబికా సోనీ అలా చెప్పు-కొంటోందిగానీ, మల్లయ్య—నాకు భారత ప్రభుత్వం నించి యెలాంటి అభ్యర్ధనా రాలేదు—అంటున్నాడు! ఇదంతా స్టంటు.” అంది మా సుష్మా స్వరాజ్! “అయినా గాంధీగారి వస్తువులు కొనడానికి బ్రాందీ బాబే కావలసి వచ్చాడు చూడు మన కాంగీరేసులకి!” అన్నాడు మా మైసూరా రెడ్డి! “ఇవన్నీ సరేగానీ, వాటి కధా, కమామిషూ కాస్త వివరించండి స్వామీ!” అనడిగారు కోరస్ లో అప్పుడే వేంచేసిన సర్వానంద (సర్వంబొచ్చు) స్వామిని! మా అందర్లోకీ కాస్త బుఱ్ఱ వున్నవాడూ, యెప్పుడూ చిద్విలాసంగా వుండేవాడూ కాబట్టి మొదటిపేరూ, తనకి తెలియందేదీ లేదన్నట్టు లెక్చర్లు ఇస్తూ వుంటాడని బ్రాకెట్లో పేరూ పెట్టుకున్నాము ఆయనకి! “నాయనా! గాంధీ గారి సులోచనాలని ఆయనే స్వయంగా ఓ సైనికాధికారికి ఇచ్చేశారు! బొడ్డులో దోపుకొనే గడియారాన్ని ఇందిరాగాంధీకి కానుకగా ఇచ్చారు. తన కంచాన్నీ, గిన్నె నీ ఆభా గాంధీ కి ఇచ్చారు—తన గుర్తుగా వుంచుకోమని! ఇక చెప్పుల్ని కుక్కెత్తుకు పోతుంటే, ఆయన చేతులోవుండే కర్ర విసిరారు! అప్పట్లో గాంధీగారి ఆశ్రమం పక్కనే వుంటున్న మాతాత పెరట్లో ఆ చెప్పుల్ని వదిలేసి పారిపోయింది ఆ కుక్క. దాంతో పాటే ఆ కర్ర కూడా మా పెరట్లోనే పడింది! అప్పటినించీ అవి మా ఇంట్లోనే వున్నాయి! చూడండి” అని ఓ జత టైరు చెప్పులూ, ఓ పాతకాలం నాటి బాణా కర్రా పట్టుకొచ్చి చూపించారు మా స్వామి! మరి విజై మల్లయ్య పది కోట్లు పోసి కొన్నవేమిటబ్బా? దేశ వ్యాప్తంగా వున్న కొన్నివేల గాంధీ మ్యూజియాల్లో వున్న చెప్పులూ, సులోచనాలూ, కర్రలూ, గడియారాలూ, బొచ్చెలూ, కంచాలూ మాట యేమిటి? మా జిల్లాలో పత్తేపురం లో చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు కట్టించిన గాంధీ ఆశ్రమం లో కూడా ఇవన్నీ వున్నాయే మరి! యేమిటో ఈ సెంటిమెంట్లు! అన్నట్టు ఓట్లు దండుకోడానికేమైనా పనికొస్తాయా అని అలోచిస్తున్నారు మా రాశ్శేఖర్రెడ్డీ, చెంద్రబాబూ వగైరా!
Sunday, March 1, 2009
కబుర్లు
‘యేంట్రా కన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’ అన్న నా ప్రశ్నకి,
‘ఆ! యేముందీ! మా ఇంటికీ, గొడ్ల చావడికీ పై కప్పు దేంతో వేద్దామా! ఆని '—ఇదీ మా నాలుగేళ్ళ మనవడి సమాధానం!
ఓ ముప్ఫై యేళ్ళ క్రితం రేడియోల్లో ప్రతీ అయిదు నిమిషాలకీ వినిపించిన ‘రాంకో బ్రాండ్ వారి ఆస్బెస్టాస్ సిమెంటు రేకుల’ అడ్వర్టైజ్ మెంట్ అది! (వాడికి నేనే సరదాగా నేర్పించాననుకోండి!)
చెప్పొచ్చేదేమిటంటే, ఈ కాలం పిల్లలు మన కన్నా కొన్ని తరాల ముందు వుంటున్నారు! మనకి చినప్పుడు ఓ పదమూడేళ్ళు వచ్చేవరకూ ‘ఫోన్’ చెయ్యడమెలాగో తెలుసా?
నా మట్టుకు నాకు, నేను కాలేజ్ లో పీ యూ సీ చదువుతూ వుండగా (1968--అప్పటికి నాకు 16 యేళ్ళు), ఒక రోజు, మా ఎన్ సీ సీ సుబేదార్ జాన్ గారు ‘ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలి! ఒకసారి ఫోన్ కొట్టు!’ అంటే, యేమి చెయ్యాలో తెలియలేదు!
అప్పట్లో ఫోన్ యెత్తగానే ఎక్స్చేంజిలో వున్న ఆపరేటర్ ‘నెంబర్ ప్లీజ్’ అని అడిగి, మనకి కావలసిన నెంబరుని కనెక్ట్ చేసేవారు.
అప్పుడే కొత్తగా ‘డయల్ వున్న’ ఫోన్ లు వస్తున్నాయి.
నా వెఱ్ఱి మొహం చూసిన సుబేదారు ‘రిసీవరు యెత్తి చెవిదగ్గరపెట్టుకొని, కావలసిన నెంబరు గల చిల్లు లో వేలు పెట్టి, అది యెక్కడ ఆగుతుందో అక్కడదాకా తిప్పాలి! అలా అన్ని నెంబర్లూ తిప్పాక, అవతల ఫోన్ మోగుతున్నట్టు వినిపిస్తుంది. అప్పుడు నాకు ఇయ్యి.’ అన్నారు.
(ఆయన మళయాళీ—నాకు రాదు మళయాళం! హిందీ బాగా వచ్చు—ఆయనకీ వచ్చు—మిలట్రీలో పని చేశాడు కదా!—మధ్యలో కొంచెం ఇంగ్లీషు—ఇలా జరిగింది మా సంభాషణ!)
మరి ఇప్పుడో!
Subscribe to:
Posts (Atom)