Thursday, January 22, 2015

యే ఎండకి ఆ గొడుగు!

ఓ ఉపన్యాసం                 

               ఇంక అక్కడ జరుగుతున్న తతంగాన్ని దాదాపు ఐదువందల మంది ప్రేక్షకులు, నోళ్లు తెరుచుకుని, ఆశ్చర్యంగా చూస్తున్నారు. హటాత్తుగా అలజడి మొదలైంది. "ప్రెసిడెంట్ గారు వచ్చేశారు" అంటూ. సోమూ చాలా ఆత్రుతగా బయటికి పరిగెట్టాడు ఆయన్ని స్వాగతించడానికి. ప్రేక్షకుల్లో ఓ కలకలం--మెడలు రిక్కించుకొని ప్రెసిడెంట్ గారిని చూడాలని. ఆయన్ని ప్రతీరోజూ చూస్తున్నా, వాళ్లెప్పుడూ రెట్టించిన ఉత్సాహంతో ఆయన్ని చూడడానికి వెనుకాడరు. ఇంక ఇలాంటి సెట్టింగు మధ్య ఆయన బాగా ఆసక్తికరంగా ఉన్నాడు. ఓ భారీ నల్లటి వ్యక్తి, రంగు కళ్లద్దాలతో, వెడల్పాటి నవ్వుతో, ఆ సమావేశం లో ప్రవేసించాడు. "నన్ను క్షమించాలి!" అని గట్టిగా అరుస్తూ, "కోర్టు పని వుండడం వల్ల ఆలస్యమైంది. అంతా ఐపోయిందా?" అనడిగాడు. వాళ్లు ఆయన్ని ఓ పేము కుర్చీలో కూలేశాక, తన జేబులోంచి ఆహ్వానాన్ని బయటికి తీశాడు కార్యక్రమాలు ఓ సారి చూద్దామని. ఓసారి పూలమాలలతో నిండిపోయిన కెమెరా వంకా, ఆ దగ్గరే వున్న బ్రాహ్మణుల వంకా చూస్తూ, "ఇప్పుడు తియ్యబోతున్న మొట్టమొదటి సీను ఇదేనా?" అనడిగాడు. సంపత్ ప్రెసిడెంటు గారికి సంజాయిషీ ఇచ్చుకుంటూ వివరణ ఇచ్చి, క్షమించాలంటూ ఓ దండ వేసి, బొకే చేతికిచ్చాడు. "యెందుకు అందరూ ఆయన మీద అంత ప్రేమ ఒలకబోస్తున్నారు? ఇవాళ అందరూ ఇక్కడ చేరింది ఆయన కి మడుగులొత్తడానికా, వాళ్ల సినిమా ప్రారంభించడానికా?" ఆశ్చర్యంగా అనుకున్నాడు శ్రీనివాస్. ఈ అనవసర హంగామా యెలా దారి తీస్తూందో చకితుడై చూస్తున్నాడు. స్టుడియో మూలనున్న ఓ తిరగేసిన చెక్కపెట్టె మీద కూర్చుంటూ, 'అంతర్గత అసంబధ్ధాలు' అనుకున్నాడు. అప్పటికి, ప్రెసిడెంట్ ని ఓ మైక్ ముందుకు తీసుకొచ్చారు. తన మెడచుట్టూ ఉన్న గులాబీ మాలని తడుముకుంటూ, "లేడీస్ అండ్ జెంటిల్మె్న్" అంటూ మొదలెట్టి, "నాకు సినిమాలగురించి యేమీ తెలీదు. పైగా కోర్టు పనితో అక్కడ వుండిపోయి ఆలస్యమై, ఇక్కడకి కొంచెం ముందు వచ్చే అదృష్టాన్ని కోల్పోయాను. నేను సాధారణంగా సినిమాలు చూడను--యెప్పుడో యేడాదికోసారి మా చిన్నారి కూతురూ, కొడుకూ లాక్కెళితే తప్ప!" అన్నాడు, తన హాస్య చతురతకి తానే చిన్నగా నవ్వుకుంటూ. అలా ఓ గంటసేపు అనర్గళంగా మాట్లాడాడు. జనాలు వెనక్కి జారబడి, కాళ్లు జాపుకుని వింటూన్నట్టు నటిస్తుంటే, అప్పుడు సినిమాలు యెలా తియ్యాలో వాళ్లకి చెప్పడం మొదలెట్టాడు. "మనచుట్టూ అనేక పురాణ కథలూ, పురాతన కథలూ చూస్తున్నాను. మీరు వాటన్నింటినీ విసిరి పారేయాలి. సినిమాలంటే, ఎడ్యుకేట్ చెయ్యాలి. మీరు ఓ గ్రామీణుడికి యెలా బ్రతకాలి, తన పరిసరాలని యెలా శుభ్రంగా వుంచుకోవాలి, వడ్డీ వ్యాపారుల బారిన యెలా పడకూడదు, ఇలాంటి విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. సినిమా అంటే ఓ కథ చెప్పడమే కాదు అమాయక ప్రజలకి ఓ సందేశం కూడా ఇవ్వాలి. వ్యవసాయానికి సంబంధించీ, నేలకి సంబంధించీ అనేక సమస్యలున్నాయి. వాటన్నింటినీ స్పృశించాలి. మీరు వాటిలో తియ్యలేనిది అంటూ లేదు--మీకు సామాన్య జనానికి సేవ చెయ్యాలనుంటే. సినిమా అనేది ఓ త్వరితమైన మాధ్యమం అంటారు. మనం సినిమాలు చూడడానికి ఇష్ట పడతాం; మనకి యేదైనా చెప్పే సినిమాలే చూద్దాం! మీరు ఇప్పటికే చాలా కాలం నుంచి ఈ రాక్షసుల, దేవుళ్ల గురించీ, వాళ్ల గొప్పతనాలగురించీ శ్రధ్ధగా చూస్తూనే వున్నారు. నాకైతే, మనం నూతన అంశాలతో తీసేవరకూ, మన భారతీయ సినిమాలని బహిష్కరించాలని ఒట్టేసుకుంటే బాగుంటుందనిపిస్తూంది". ఇక్కడకొచ్చేసరికి, చిన్న అంతరాయం! వాళ్లంతా ఇందాకటి నుంచీ ఆయన్ని పీక పిసికి చంపేస్తే బాగుండును అనుకుంటున్నారు. కానీ, ఓ జిల్లా జడ్జి ని అందులోనూ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రెసిడెంట్ ని అలా చంపడం తేలిక కాదు అని ఊరుకొంటున్నారు! సంపత్, సోమూ గబుక్కున ఆయన రెండు ప్రక్కలా చేరి, చెవుల్లో చాలా సేపు గుసగుసలాడారు. తర్వాత జడ్జి గారు, నొచ్చుకుంటూ "క్షమించాలి....నా దృష్టి కి రాలేదు...." అంటూ, జేబులోంచి ఆహ్వానాన్ని బయటికి తీసి చూస్తూ, ".......వీళ్లు యే సినిమా తీస్తున్నారో! ఇప్పుడు నా ఫ్రెండ్ సోమూ చెపుతున్నాడు అది ఓ పురాణ కథ అని. మన పురాణాలు జ్ఞానానికీ, ఆధ్యాత్మికతకీ నిలయాలైన గొప్ప భాండాగారాలని చెప్పడం లో నాకేమీ సందేహం లేదు. అవి మనకి నిరంతరమైన, నిత్య సత్యాలైన, యే కాల పాత్రాలకైనా వర్తించే, సందేశాలు ఇస్తున్నాయి--జాతి, వయో లింగ భేదాలు లేకుండా అందరికీ! కావలసింది యేమిటంటే, వాటిని చక్కగా తియ్యాలి. భారతదేశం మిగతా ప్రపంచానికి ఓ పాఠం చెప్పగలదు. ప్రపంచానికి మన పురాతన సంస్కృతి గురించీ, జ్ఞానం గురించీ, నాగరికత గురించీ ఓ నమూనా చూపిద్దాం. మన జిల్లాలో వున్న అడవులూ, నదీ, పర్వతాలవల్ల మనందరం ధన్యులమయినట్టే, ఇలాంటి శక్తివంతులైన వారి నాయకత్వం లో 'మాల్గుడి' మన దేశం మొత్తం తనని చూసి అసూయపడేలా తయారవుతుందనీ, ముందు ముందు 'హాలీవుడ్ ఆఫ్ ఇండియా' అని పిలవబడుతుందనడం లో నాకు యేమీ సందేహం లేదు!". డి మెల్లో స్వరం, సెంటిమెంట్ తో వూగిపోతూ "హియర్! హియర్!" అనడం, జనాల చప్పట్లతో మార్మోగడం జరిగింది. ప్రెసిడెంట్ గారు తన సీటు దగ్గరకి వెళ్తూ, మళ్లీ తిరిగి వచ్చి, మైకు అందుకుంటూ, "మళ్లీ మరిచిపోయాను క్షమించాలి....మీకో సంతోషకరమైన వార్త ప్రకటించమన్నారు .... తరవాత మంచి నిష్ణాతులైన యువ కళాకారులతో ఓ చక్కటి నాట్యప్రదర్శన వుంది!" అన్నారు. వెంటనే స్టూడియో వాద్య బృందం సహకారం తో కొంతమంది క్రొత్తగా జేరిన కళాకారిణులు, స్టూడియో లైట్ల కాంతుల్లో, కాళ్లూ, చేతులూ, తలలూ విసురుతూ, నాట్య ప్రదర్శన ఇచ్చారు. తరవాత, ప్రెసిడెంట్ గారిని కెమేరా ప్రక్కన నిలబెట్టి, సోమూ, సంపత్ కెమేరా స్విచ్ మీద చేతులు వుంచి, విభిన్న కోణాల్లో స్టిల్ ఫోటోలు తీయించుకున్నారు. అప్పటికి కొన్ని బుట్టలు వచ్చాయి. వాటిలోంచి కాయితం సంచుల్లో కొబ్బరిముక్కలూ, స్వీట్లూ తీస్తూ, అందరికీ పంచారు. సంపత్ మైక్ తీసుకుని, ప్రేక్షకులకీ, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు విచ్చేసినందుకూ కృతజ్ఞతలు ఒలకబోస్తూ, వందన సమర్పణ చేశారు. 

*     *     *

ఈ సన్నివేశం--మొట్టమొదట 1949 లో లండన్‌ లోనూ, 1956 లో ఇండియా లోనూ ప్రచురింపబడి, 2000 నాటికి 13 సార్లు పునర్ముద్రణ చెందిన "మాల్గుడి" ఆర్ కే నారాయణ్ నవల Mr. Sampath లోనిది.  స్వేఛ్ఛానువాదం నాది. అందులో యెన్ని నిత్య సత్యాలని హాస్య స్ఫోరకంగా వర్ణించారో చూశారా? అదీ రచన అంటే, అదీ అసలైన కామెడీ అంటే! 

Saturday, October 18, 2014

అతి తక్కువ ధరలకే..........


............."అమ్మకాలి"స్తున్నారు!

మైక్ లో ఓ ప్రకటన.........

"రండి........కొనండి.........దసరా దీపావళి సందర్భంగా, మీ, మా, మన, వూళ్లోనే, ప్రఖ్యాతిగాంచిన "హోర్"

దుకాణం లో.......అన్ని వస్తువులమీదా......అతి తక్కువ ధరలకే......అమ్మకాలిస్తున్నారు! త్వరపడండి!"

ఓ కోణంగి వ్యాఖ్యానం--"అవున్నిజమే! అమ్మకాలిస్తున్నారు........'నాన్నకాలు' మాత్రమే

తీసుకుంటున్నారు!"

అదీ సంగతి!

Friday, April 25, 2014

జీవితం లో హాస్యం



........అలా కూడా జరుగుతూ వుంటుంది.


పై అంతస్తులో ప్రాంతీయ కార్యాలయం, క్రింద మా కార్యాలయం. పై కార్యాలయం లో పనిచేసే అధికారులూ మేమూ ఒకే సంఘం లో. వాళ్లకి ఓ యూనిట్ సెక్రెటరీ, మా యూనిట్ కి వేరే.
 
సమస్య--పై కార్యాలయం మరుగుదొడ్లలో నీళ్లు పోవడం లేదు. యూనిట్ కార్యదర్శి కి రిపోర్టు చేశారు. ఆయన కార్యాలయ ఉన్నతాధికారి కి అల్టిమేటం ఇచ్చేశాడు--రెండురోజుల్లో అవి శుభ్రపడకపోతే, మర్నాటినుంచి పనిచెయ్యలేము--అంటూ.
 
ఆయనో పెద్ద మేథావి. ఆరోజు సాయంత్రం స్టాఫ్ మీటింగు పెట్టి, మరుగుదొడ్లు శుభ్రం చెయ్యడానికి ఓ కార్మికుణ్ని మాట్లాడాము, అతనికి నెలకింత ఇస్తామని చెప్పాము.....మరి ఉదయమే 6 గంటలకల్లా వచ్చేసి, తనపని చేసుకుపోతాడు. మరి ఆ సమయానికి కార్యాలయం తాళాలు తీసి, పని అయ్యాక మళ్లీ తాళాలు వేసుకొని వెళ్లేవాళ్లు యెవరు? అది తేలిస్తే, సమస్య పరిష్కారం అయిపోయినట్టే....అన్నాడు.
 
ఆ కార్యదర్శి--ఓ సినిమాలో ఓ కానిస్టేబుల్ "మీరెక్కడికో వెళ్లిపోయారు సార్! మీరుకాబట్టి ఇలా క్షణాల్లో పరిష్కారం..........." అంటాడు చూడండి--అదే రకం. బహుశా ఆ సినిమాలో ఆ పాత్ర ఇతన్ని బట్టే సృష్టించి వుంటారు.
 
మామూలుగా యెవరూ ఆ బాధ్యత తీసుకోడానికి ముందుకు రాకపోవడంతో, "నేనున్నాను సార్! నేను చూసుకుంటాను" అని ఒప్పేసుకున్నాడు.
 
తరువాత నాకు విషయం తెలిసి, అతన్ని హెచ్చరించాను......బాబూ, కార్యాలయానికి కొన్ని నిబంధనలు వున్నాయి, అనవసర బాధ్యత నెత్తిన వేసుకొని తరువాత బాధ పడతావు, నీకేమైనా ప్రత్యేక జీతం లేదా భత్యం ఇస్తారా? సమస్య పరిష్కారం ఉన్నతాధికారి బాధ్యత, అలాగే ఇంకోడికి డబ్బులిచ్చి, తాళాల వ్యవహారం అప్పగించొచ్చు, లేదా ఆయన ఇతర నిబంధనల ప్రకారం వ్యవహరించొచ్చు........అని.
 
"కొన్ని బాధ్యతలు తప్పవు కదండీ.......మన పని మనం చేసుకోవాలి కదా?" అంటూ సమర్థించుకున్నాడు.
 
తరువాత ఆయన పాట్లు ఆయనకే తెలుసు. రెండురోజులు అనుకున్నది, వారం పాటు చేయించినా, నీళ్లు పోతే ఒట్టు.......తోటి స్టాఫ్ తో అక్షింతలూ.
 
మళ్లీ నాతో చెప్పుకున్నాడు  "......రేప్పొద్దున్న 'గుర్రం......' పొడి తెచ్చి వేసేస్తానన్నాడు. కేజీ 30 రూపాయలట. డబ్బులు ఇచ్చేశాను. యెల్లుండి నుంచీ నాకీ బాధ వుండదు......"అంటూ.
 
"అదేం పొడి? అంత ఖరీదు యెందుకు?" అనడిగాను.
 
"అబ్బ! యేదైనా పూర్తిగా చెబితేగాని వూరుకోరు మీరు.....అదేదో 'గుర్రం.....' పొడి అన్నాడంతే. ఆఁ! గుర్తొచ్చింది "గుర్రం గెత్తం పొడి" అన్నాడు.
 
అదీ కథ.
 
ఇంతకీ అది "గుర్రం గత్తర పొడి". అంటే గుర్రం లద్దెల పొడి. అందులోని బాక్టీరియా మరుగు దొడ్లకి విరుగుడు. 30 రూపాయలూ తీసుకొని, ఫ్రీగా వచ్చే "గాడిద గత్తర పొడి" తెచ్చి పోసేశాడు. సమస్య పరిష్కారం అయిపోయింది.
 
(తరువాత ఆ బాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్‌ లు వచ్చి కొంతమంది బాగానే వదిలించుకున్నారు మందులకీ వాటికీ)
 
అందుకే కాబోలు అన్నారు.......శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని!

Saturday, April 5, 2014

కొన్ని జోకులు........



.........చాలామందికి తెలియవు 

మా బ్యాంకుల్లో, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు వుంటాయి. వాటివల్ల యెంత ప్రయోజనం అనేది ప్రక్కన పెడితే, ఒక్కో వుద్యోగికీ యెన్నిసార్లు శిక్షణ ఇచ్చారు, దానికి యెంత ఖర్చు పెట్టారు లాంటి వాటికి యేవో నిబంధనలు వుంటాయి. పైగా యాజమాన్యం గొప్పగా చెప్పుకోవచ్చు".....గత సంవత్సరంలో ఇంతమందికి, ఇంత ఖర్చు చేసి, మానవ వనరుల వృధ్ధికోసం, నైపుణ్యాల వృధ్ధికీ, కెరీర్ వృధ్ధికీ, పెర్సనాలిటీ వృధ్ధికీ శిక్షణ ఇచ్చాం" అని.

అలాంటి శిక్షణకార్యక్రమాల్లో బ్యాంకు నియమించిన శిక్షకులే కాకుండా, బయటి బ్యాంకులనుంచి, ఇతర శిక్షణా సంస్థ్హలనుంచీ ప్రవీణులని, నిపుణులని, రప్పించి, ఉపన్యాసాలిప్పిస్తారు. 

సామాన్యంగా......శిక్షణ పొందేవారు ఇలాంటి వాళ్లని పెద్దగా లెఖ్ఖ చేయరు. 'ఆఁ యేం చెప్తాడులే' అనుకుంటూ. 

కానీ వాళ్లు నిజంగా వాళ్ల రంగాల్లో నిపుణులే......ఇట్టే కట్టిపడేస్తారు వినేవాళ్లని. ఇంక నవ్వులు, పువ్వులతో సమయమే తెలీదు, తెలియకుండానే చాలా నేర్చుకుంటారు శిక్షితులు!

(వుపోధ్ఘాతం కొంచెం యెక్కువయ్యింది...క్షంతవ్యుణ్ణి. ఇందులో యేమి కామెడీ వుంది అనెయ్యద్దప్పుడే).

అలాంటి ఓ తరగతిలో, ఒకాయన 'మీరు యేదైనా ఒక విషయం అనుకోండి, దాన్ని సాధించగలను అనుకోండి, ప్రయత్నించండి, తప్పకుండా సాధించగలరు' అనే విషయాన్ని నొక్కి వక్కాణించడానికి ఇలా చెప్పారు. 

ఓ పాఠశాల తరగతిలో, 'మీరు పెద్దయ్యాక యేమి చేయాలి/సాధించాలి అనుకుంటున్నారో "I think I can..........! (And Sure,) I can..........." అనే మాటలతో చెప్పండి' అని అడిగారు టీచర్. అక్కణ్నుంచీ అందరూ, నేదు దేశానికి ప్రథానమంత్రిని అవుతాను, నేను ఐ యే యస్/ఐ పీ యస్ అవుతాను, నేను పైలట్ అవుతాను, నేను అంతరిక్ష యాత్రికుణ్ని అవుతను.......ఇలా చెపుతున్నారు. 

తరువాత ఓ అమ్మాయి, 'నేను మంచి గృహిణిని అవుతాను, ముత్యాల్లాంటి పిల్లలకి తల్లిని అవుతాను'. అని చెప్పిందిట. ఆ తరువాతి అబ్బాయి, "నేను ఆ అమ్మాయికి తన లక్ష్యం నెరవేరడానికి శాయశక్తులా కృషి చేస్తాను". అన్నాడట!

అలాగే, ఇంకొకాయన యెంత ప్రతికూల పరిస్థితులనైనా, అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెపుతూ...... 

కురుక్షేత్ర యుధ్ధం అయిపోయింది, కౌరవులందరూ హతులయ్యారు. అశ్వథ్థామ కోపం పట్టలేక, బ్రహ్మాస్త్రం ధరించి, పాండవులని వెతుక్కుంటూ బయల్దేరాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం పసిగట్టాడు. వెంటనే దూర్వాస మహర్షిని సాయం కోరాడు. ఆయన 'నువ్వు చెపితే యేమైనా చేస్తాను కానీ, అబధ్ధం మాత్రం చెప్పను' అన్నాట్ట. "సరే స్వామీ, నిజం మాత్రమే చెప్పండి" అని ఒప్పుకొని, పాండవులందర్నీ భూమిలో ఓ తొట్టె నిర్మించి, అందులో దాక్కోబెట్టి, పైన మూత వేయించి, దుర్వాసుణ్ణి దాని మీద కూర్చో పెట్టాడట. 

అసలే యెండకి మండుతున్నా, కృష్ణుడికిచ్చిన మాట కోసం ఆయన ఓపిగ్గా కూర్చున్నాడట. అప్పుడు వచ్చి, అశ్వథ్థామ "మహామునివర్యా, పాండవుల జాడ యేమైనా తెలుసా" అని అడిగాడట. ఇంకేముందీ.....పళ్లు పటపటా నూరుతూ, "పాండవులా? నా ముడ్డి క్రింద వున్నారు చూస్కో!" అనేశాడట. పాపం అశ్వథ్థామ, ఇంకేం మాట్లాడితే యేం శపిస్తాడో ఈయన అని భయపడి వెళ్లిపోయాడట. అలా బ్రతికి బయట పడ్డారు పాండవులు......కృష్ణుడు చేసిన మాయోపాయం వల్ల!

ఇవాళే సాయంత్రం మా స్నేహితుడొకాయన మాటల్లో, "నిజంగా ఇవాళ తెలంగాణా వచ్చిందంటే, దానికి మన బొర్రముక్కోడి వాగ్ధాటే కారణం" అన్నాడు. మిగిలినవాళ్లందరూ, "పోదురూ....వాడికి వాగ్దాటి యెక్కడ యేడిచిందీ....పీల గొంతుతోనే పీకలు కోస్తాం, నాలికలు చీరేస్తాం, బొంద పెడతాం....అంటుంటే కామెడీగా వుండేది" అని తీసిపడేశారు. ఆయనన్నాడూ, "తెలంగాణా ఇస్తానంటే, బొంతపురుగుని కూడా ముద్దాడతానూ అన్నాడు. అవునా? అదే, 'తెలంగాణా ఇస్తే, బొంతపురుగుతోనైనా కాపురం చేస్తా!' అని వుంటే......ఈపాటికి సోనియా ఇటలీకి పారిపోయి వుండేది కాదా?" అని. 

హేపీ న్యూ తెలంగాణా అండ్ అవక్షేప ఆంధ్రప్రదేశ్! 

Monday, March 31, 2014

ఏప్రిల్ ఫూల్......!



..........ఓ ఫూలిష్ రోజు 

"మేష్షాండీ.......వాడు నా చొక్కా వీపు మీద ఇంకు పోశాడండీ!"

"మేష్షాండీ.......వాడు నా చొక్కా వీపు మీద ముద్దరేశాడండీ!"

అలా మొదలయ్యాయి మా ఏప్రిల్ ఫూల్ సరదాలు.

ఎదటి వాడికి తెలియకుండా, వాడి వీపు మీ ద పెన్నులోని సిరా చల్లేయడం, బంగాళా దుంపని సగానికి కోసేసి, దాన్ని "ఏ ఎఫ్" అనే అక్షరాలు పైకి వచ్చేలా బ్లేడుతో చెక్కేసి, దాన్ని స్టాంపు ఇంకులోనో, పెన్ను ఇంకులోనో అద్దేసి, ఎదటివాడి వీపు మీద ముద్దర వేసెయ్యడం అలా. 

అప్పట్లో ఫౌంటెన్‌ పెన్నులే. తెలుగులో ఊట కలాలు. యెంత జాగ్రత్తగా స్క్రూ, కేప్ బిగించినా, అవి కక్కేసి జేబులు పాడు చేసేవి. అలాంటివి, కేప్ తెరిచి, ఊపగానే, యెదటివాడి వీపుమీద చుక్కలు చుక్కలుగా డిజైన్‌ పడిపోయేది.

ఇంక బంగళా దుంపలైతే, పైనే చెప్పానుగా. అలా యెంతమంది వీపులమీద ముద్ర వేస్తే అంత గ్రేట్. 

అప్పట్లో, తాలూకాఫీసు ముద్ర యేదైనా కాగితం పై వేస్తే, ఒక్క అక్షరమూ కనిపించేది కాదు. అందుకని, ఈ బంగళా దుంప ట్రిక్ ని  ఆ ముద్రకోసం వుపయోగించిన రోజులు కూడా వున్నాయి. 

యెవరికైనా "ఇన్‌కమ్‌ సర్టిఫికెట్" కావాలంటే, ఆకుపచ్చ ఇంకుతో తాసిల్దారు సంతకాన్ని పెట్టేసి, బంగళాదుంప ముద్ర వేసేసి, ఇచ్చేసేవాళ్లం. దాన్ని స్కూల్లో దాఖలు చేస్తే, యెవరికీ అనుమానమే వచ్చేది కాదు. 

నిజమే. అది ఫోర్జరీనే. నేరమే. మరెందుకు అంటే, నిజంగా ఆ సర్టిఫికెట్ తాలూకాఫీసులో తీసుకుంటే, దాని మీద ముద్ర వేసేందుకు డవాలా బంట్రోతుకి అర్థరూపాయి ఇవ్వవలసి వచ్చేది! "అలా కూడా ఇచ్చుకొలేని వాళ్లకోసమే" మా నేరాలు!

వ్యవస్థ అప్పటికీ ఇప్పటికీ కొంత మారింది. కానీ అది చాలదు.

యెన్నికల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు అభ్యర్థులు. వాళ్లకి మనల్ని ఫూల్ చేసే ఛాన్‌స్ ఇవ్వకండి. 

చివరిగా ఈ ప్రపంచం లోని ప్రతి మనిషీ ఒక ఫూలే అని యేడాదికోసారి గుర్తు చేసేదే--ఈ మూర్ఖుల పండగ!

హేపీ ఏప్రిల్ ఫూల్! 

Monday, February 17, 2014

సరదా సాహిత్యం


భాష--యాస

మన భాషల్లో,  యాసల్లో, పదాల్లో చాలా తమాషాలుంటాయి.

"రే రేవడ్సడ్సా?"

అని ఒకడడిగితే, రెండోవాడి సమాధానం:

"లే ఇస్కిస్కిస్కే!" (ఇదే భాష? అని సందేహం వస్తుంది)

ఇంతకీ మొదట పడవలోని సరంగు అడిగింది "అరే! రేవు అడుసు అడుసుగా వుందా?" అని.

ఒడ్డునున్నతను జవాబిచ్చింది "లేదు! ఇసక ఇసకగానే వుంది" అని.

(ఆ మధ్య తెలుగు వెలుగు పత్రికలో వేరెవరో వ్రాసిందే ఇది)

మా వూళ్లో ఓ బ్రిటిష్ దొరగారు ఒకసారి ఒకతన్ని పిలవవలసి వచ్చి......

"కోక్ కీర్ గాడ్ వేన్ మే యా!" అని పిలిచాడట, పేరు ఇంగ్లీషులో వ్రాసి వున్నా. (VAN MAY YA అని)

ఇంతకీ అతని పేరు "కొక్కిరిగడ్డ వనమయ్య"!

ఓ పాతిక ముఫ్ఫై యేళ్లక్రితం ఓ పత్రికలో వచ్చిన కార్టూన్లో, ఓ ఆర్టిస్ట్ బోర్డులు వ్రాస్తూంటాడు.

"టాక్లెస్వర్క్మోర్", "ఇక్కడ్చాపల్పట్రాదు"...............లాంటి బోర్డులు వ్రాసి పెట్టివుంటాడు. అతని షాపు పేరు "పిస్నారార్ట్స్"!

అర్థమయ్యాయనుకుంటా?

"టూటు టూటు టూటూ......."

దీన్ని ఓ కమల్ హాసన్ సినిమాలో వాడుకున్నారు. దీనర్థం?

ఇది "ఆమదాలవలస" లో "కోణార్క్ ఎక్స్ ప్రెస్" సమయం! 2 to 2-00 TO 2-02 అని!
(రెండు నిమిషాల తక్కువ రెండుగంటలకి వచ్చి, రెండుగంటల రెండు నిమిషాలకి వెళ్లిపోతుందని).

ఒక మోహన్ సింగ్ గారు, మనదేశానికి మొదటిసారి "బోయింగ్" విమానం వస్తూందంటే, చూడడానికి వెళ్ళాడట. తీరా అది లేండ్ అయ్యే సమయానికి సంతోషం పట్టలేక "బోయింగ్ ఈజ్ కమింగ్! బోయింగ్ ఈజ్ కమింగ్!" అని అరవడం మొదలుపెట్టాడట. ప్రక్కనున్నాయన, "అరే యార్! బీ సైలెంట్!" అన్నాడట. మన సింగ్ గారు అతనితో, "ఓ! థాంక్యూ!" అని చెప్పి, "ఓయింగ్ ఈజ్ కమింగ్, ఓయింగ్ ఈజ్ కమింగ్!" అని అరవడం మొదలెట్టాడట!

ఇదో సరదా ఇంగ్లీషు జోకు.

ఓ దేశంలో, వాళ్ల భాషలో, "మూడు వందల ముఫ్ఫై మూడు" అనమన్నామంటే, వెంటనే లెంపకాయ కొట్టేస్తారట! యెందుకంటే, "మూడు" అనడానికి వాళ్లు "పొయెటర్రా రోరింకో రోక్" అనాలట! మరి "ముఫ్ఫై మూడు కోట్ల, ముఫ్ఫైమూడు లక్షల........" ఇలా పూర్తిగా అనమంటే యేం చేస్తారో?

(ఇది నేను చిన్నప్పుడు యెప్పుడో ఓ పత్రికలో చదివింది)

ఇలాంటివి ఇంకెన్నో!

Friday, January 24, 2014

ఆమ్ ఆద్మీ.....వీధుల్లో....


వృధ్ధి కనబడదూ?

"వంకాయ్ లు, దొండకాయ్ లు, బెండకాయ్ లు, బీరకాయ్ లు, కాకరకాయ్ లు, అరిటికాయ్ లు, ఆనపకాయ్ లు, పొట్లకాయ్ లు, ఉల్లిపాయ్ లు, బంగాళదుంపలు, టమాటాలూ..........."

"గోంగూర, తోటకూర, మెంతికూర, పాలకూర, చుక్కకూర, బచ్చలికూర, పొన్నగంటికూరా......"

"........మెత్తళ్లు, బొమ్మిడాయిలు, పచ్చిరెయ్యలు, పిత్తపరిగెలూ............"

......దాదాపు అన్ని వూళ్లలోనూ ప్రొద్దున్నపూట వీధిలో వినిపించే కేకలు ఇవి. (మిగిలిన రాష్ట్రాల్లో భాషలు వేరే....అంతే).

దశాబ్దాలుగా వినవచ్చిన ఇతర కేకలు చూడండి.

అల్లావుద్దీన్--అద్భుత దీపం రోజుల్లో........

"పాత దీపాలకి కొత్త దీపాలిస్తాం......."

1950 లూ 60 ల్లో ఇలా వినిపించేవి......

"ఇత్తడీ, రాగీ, కంచూ, సీవెండీ......జీళ్లు జీళ్లేయ్...."
(కొందరు ఆకతాయి పిల్లలు "వెండికీ, బంగారానికీ...." అనికూడా కలిపి అరిచేవారు).

"మరమరాలు, శెనగపప్పు, బటానీలు, వేరుశెనక్కాయలూ......."

1970 ల్లో......

"పాతబట్టలకి స్టీలు సామాన్లిస్తాం........."

"ఐదు శాల్తీలూ వందరూపాయలే......"

1980 ల్లో......

".......పండగ సందర్భంగా.......20 శాతం డిస్కవుంట్"

1990 ల్లో....

"ఇప్పుడు మీ ప్రియమైన షాంపూ 2 రూపాయలకే...."

"ఇప్పుడు.....సాషేల్లో....తగ్గింపు ధరలకే....."

2000 ల్లో.......

"బొంబై కా మాల్ ఆఫ్ రేట్......"

"కలకత్తా శారీ ఎగ్జిబిషన్ కమ్ సేల్.....నమ్మలేని తక్కువ ధరల్లో....."

2010 ల్లో....

"ఒకటి కొంటే ఒకటి ఫ్రీ", "ఒకటి కొనండి రెండు ఉచితంగా పొందండి"

"ఫలానా పండుగ సందర్భంగా 10 నుంచి 90 శాతంవరకూ డిస్కౌంట్!"

"కార్లపై డిస్కవుంట్ ఆఫర్లు....ఇన్సూరెన్స్ ఫ్రీ.....ఎం పీ 3 ఫ్రీ......"

ఇంక 2020 ల్లో.......

"పీసీలు, లేప్ టాప్ లు, టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు, ఐ పేడ్లు, ఐ పాడ్లు, ఐ ఫోన్లూ...."

"మారుతీలు, టాటాలు, హ్యుండైలు, హోండాలు, రెనాల్టులు, ఆడీలు, క్రిజ్లర్లూ........"

"నెక్లెస్లు, హారాలు, గొలుసులు, గాజులు, వుంగరాలు, దుద్దులు, చెవికమ్మలు, బ్రేస్లెట్లు, పైటపిన్నులూ......"

"వజ్రాభరణాలు, ప్లాటినం ఆభరణాలూ......"

.........ఇలాంటి కేకలు వినబడితే ఆశ్చర్య పోకండేం?!

(యెవరన్నారు.......వృధ్ధిరేటు బాగా లేదని?)