Thursday, January 22, 2015

యే ఎండకి ఆ గొడుగు!

ఓ ఉపన్యాసం                 

               ఇంక అక్కడ జరుగుతున్న తతంగాన్ని దాదాపు ఐదువందల మంది ప్రేక్షకులు, నోళ్లు తెరుచుకుని, ఆశ్చర్యంగా చూస్తున్నారు. హటాత్తుగా అలజడి మొదలైంది. "ప్రెసిడెంట్ గారు వచ్చేశారు" అంటూ. సోమూ చాలా ఆత్రుతగా బయటికి పరిగెట్టాడు ఆయన్ని స్వాగతించడానికి. ప్రేక్షకుల్లో ఓ కలకలం--మెడలు రిక్కించుకొని ప్రెసిడెంట్ గారిని చూడాలని. ఆయన్ని ప్రతీరోజూ చూస్తున్నా, వాళ్లెప్పుడూ రెట్టించిన ఉత్సాహంతో ఆయన్ని చూడడానికి వెనుకాడరు. ఇంక ఇలాంటి సెట్టింగు మధ్య ఆయన బాగా ఆసక్తికరంగా ఉన్నాడు. ఓ భారీ నల్లటి వ్యక్తి, రంగు కళ్లద్దాలతో, వెడల్పాటి నవ్వుతో, ఆ సమావేశం లో ప్రవేసించాడు. "నన్ను క్షమించాలి!" అని గట్టిగా అరుస్తూ, "కోర్టు పని వుండడం వల్ల ఆలస్యమైంది. అంతా ఐపోయిందా?" అనడిగాడు. వాళ్లు ఆయన్ని ఓ పేము కుర్చీలో కూలేశాక, తన జేబులోంచి ఆహ్వానాన్ని బయటికి తీశాడు కార్యక్రమాలు ఓ సారి చూద్దామని. ఓసారి పూలమాలలతో నిండిపోయిన కెమెరా వంకా, ఆ దగ్గరే వున్న బ్రాహ్మణుల వంకా చూస్తూ, "ఇప్పుడు తియ్యబోతున్న మొట్టమొదటి సీను ఇదేనా?" అనడిగాడు. సంపత్ ప్రెసిడెంటు గారికి సంజాయిషీ ఇచ్చుకుంటూ వివరణ ఇచ్చి, క్షమించాలంటూ ఓ దండ వేసి, బొకే చేతికిచ్చాడు. "యెందుకు అందరూ ఆయన మీద అంత ప్రేమ ఒలకబోస్తున్నారు? ఇవాళ అందరూ ఇక్కడ చేరింది ఆయన కి మడుగులొత్తడానికా, వాళ్ల సినిమా ప్రారంభించడానికా?" ఆశ్చర్యంగా అనుకున్నాడు శ్రీనివాస్. ఈ అనవసర హంగామా యెలా దారి తీస్తూందో చకితుడై చూస్తున్నాడు. స్టుడియో మూలనున్న ఓ తిరగేసిన చెక్కపెట్టె మీద కూర్చుంటూ, 'అంతర్గత అసంబధ్ధాలు' అనుకున్నాడు. అప్పటికి, ప్రెసిడెంట్ ని ఓ మైక్ ముందుకు తీసుకొచ్చారు. తన మెడచుట్టూ ఉన్న గులాబీ మాలని తడుముకుంటూ, "లేడీస్ అండ్ జెంటిల్మె్న్" అంటూ మొదలెట్టి, "నాకు సినిమాలగురించి యేమీ తెలీదు. పైగా కోర్టు పనితో అక్కడ వుండిపోయి ఆలస్యమై, ఇక్కడకి కొంచెం ముందు వచ్చే అదృష్టాన్ని కోల్పోయాను. నేను సాధారణంగా సినిమాలు చూడను--యెప్పుడో యేడాదికోసారి మా చిన్నారి కూతురూ, కొడుకూ లాక్కెళితే తప్ప!" అన్నాడు, తన హాస్య చతురతకి తానే చిన్నగా నవ్వుకుంటూ. అలా ఓ గంటసేపు అనర్గళంగా మాట్లాడాడు. జనాలు వెనక్కి జారబడి, కాళ్లు జాపుకుని వింటూన్నట్టు నటిస్తుంటే, అప్పుడు సినిమాలు యెలా తియ్యాలో వాళ్లకి చెప్పడం మొదలెట్టాడు. "మనచుట్టూ అనేక పురాణ కథలూ, పురాతన కథలూ చూస్తున్నాను. మీరు వాటన్నింటినీ విసిరి పారేయాలి. సినిమాలంటే, ఎడ్యుకేట్ చెయ్యాలి. మీరు ఓ గ్రామీణుడికి యెలా బ్రతకాలి, తన పరిసరాలని యెలా శుభ్రంగా వుంచుకోవాలి, వడ్డీ వ్యాపారుల బారిన యెలా పడకూడదు, ఇలాంటి విషయాలు అర్థమయ్యేలా చెప్పాలి. సినిమా అంటే ఓ కథ చెప్పడమే కాదు అమాయక ప్రజలకి ఓ సందేశం కూడా ఇవ్వాలి. వ్యవసాయానికి సంబంధించీ, నేలకి సంబంధించీ అనేక సమస్యలున్నాయి. వాటన్నింటినీ స్పృశించాలి. మీరు వాటిలో తియ్యలేనిది అంటూ లేదు--మీకు సామాన్య జనానికి సేవ చెయ్యాలనుంటే. సినిమా అనేది ఓ త్వరితమైన మాధ్యమం అంటారు. మనం సినిమాలు చూడడానికి ఇష్ట పడతాం; మనకి యేదైనా చెప్పే సినిమాలే చూద్దాం! మీరు ఇప్పటికే చాలా కాలం నుంచి ఈ రాక్షసుల, దేవుళ్ల గురించీ, వాళ్ల గొప్పతనాలగురించీ శ్రధ్ధగా చూస్తూనే వున్నారు. నాకైతే, మనం నూతన అంశాలతో తీసేవరకూ, మన భారతీయ సినిమాలని బహిష్కరించాలని ఒట్టేసుకుంటే బాగుంటుందనిపిస్తూంది". ఇక్కడకొచ్చేసరికి, చిన్న అంతరాయం! వాళ్లంతా ఇందాకటి నుంచీ ఆయన్ని పీక పిసికి చంపేస్తే బాగుండును అనుకుంటున్నారు. కానీ, ఓ జిల్లా జడ్జి ని అందులోనూ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రెసిడెంట్ ని అలా చంపడం తేలిక కాదు అని ఊరుకొంటున్నారు! సంపత్, సోమూ గబుక్కున ఆయన రెండు ప్రక్కలా చేరి, చెవుల్లో చాలా సేపు గుసగుసలాడారు. తర్వాత జడ్జి గారు, నొచ్చుకుంటూ "క్షమించాలి....నా దృష్టి కి రాలేదు...." అంటూ, జేబులోంచి ఆహ్వానాన్ని బయటికి తీసి చూస్తూ, ".......వీళ్లు యే సినిమా తీస్తున్నారో! ఇప్పుడు నా ఫ్రెండ్ సోమూ చెపుతున్నాడు అది ఓ పురాణ కథ అని. మన పురాణాలు జ్ఞానానికీ, ఆధ్యాత్మికతకీ నిలయాలైన గొప్ప భాండాగారాలని చెప్పడం లో నాకేమీ సందేహం లేదు. అవి మనకి నిరంతరమైన, నిత్య సత్యాలైన, యే కాల పాత్రాలకైనా వర్తించే, సందేశాలు ఇస్తున్నాయి--జాతి, వయో లింగ భేదాలు లేకుండా అందరికీ! కావలసింది యేమిటంటే, వాటిని చక్కగా తియ్యాలి. భారతదేశం మిగతా ప్రపంచానికి ఓ పాఠం చెప్పగలదు. ప్రపంచానికి మన పురాతన సంస్కృతి గురించీ, జ్ఞానం గురించీ, నాగరికత గురించీ ఓ నమూనా చూపిద్దాం. మన జిల్లాలో వున్న అడవులూ, నదీ, పర్వతాలవల్ల మనందరం ధన్యులమయినట్టే, ఇలాంటి శక్తివంతులైన వారి నాయకత్వం లో 'మాల్గుడి' మన దేశం మొత్తం తనని చూసి అసూయపడేలా తయారవుతుందనీ, ముందు ముందు 'హాలీవుడ్ ఆఫ్ ఇండియా' అని పిలవబడుతుందనడం లో నాకు యేమీ సందేహం లేదు!". డి మెల్లో స్వరం, సెంటిమెంట్ తో వూగిపోతూ "హియర్! హియర్!" అనడం, జనాల చప్పట్లతో మార్మోగడం జరిగింది. ప్రెసిడెంట్ గారు తన సీటు దగ్గరకి వెళ్తూ, మళ్లీ తిరిగి వచ్చి, మైకు అందుకుంటూ, "మళ్లీ మరిచిపోయాను క్షమించాలి....మీకో సంతోషకరమైన వార్త ప్రకటించమన్నారు .... తరవాత మంచి నిష్ణాతులైన యువ కళాకారులతో ఓ చక్కటి నాట్యప్రదర్శన వుంది!" అన్నారు. వెంటనే స్టూడియో వాద్య బృందం సహకారం తో కొంతమంది క్రొత్తగా జేరిన కళాకారిణులు, స్టూడియో లైట్ల కాంతుల్లో, కాళ్లూ, చేతులూ, తలలూ విసురుతూ, నాట్య ప్రదర్శన ఇచ్చారు. తరవాత, ప్రెసిడెంట్ గారిని కెమేరా ప్రక్కన నిలబెట్టి, సోమూ, సంపత్ కెమేరా స్విచ్ మీద చేతులు వుంచి, విభిన్న కోణాల్లో స్టిల్ ఫోటోలు తీయించుకున్నారు. అప్పటికి కొన్ని బుట్టలు వచ్చాయి. వాటిలోంచి కాయితం సంచుల్లో కొబ్బరిముక్కలూ, స్వీట్లూ తీస్తూ, అందరికీ పంచారు. సంపత్ మైక్ తీసుకుని, ప్రేక్షకులకీ, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు విచ్చేసినందుకూ కృతజ్ఞతలు ఒలకబోస్తూ, వందన సమర్పణ చేశారు. 

*     *     *

ఈ సన్నివేశం--మొట్టమొదట 1949 లో లండన్‌ లోనూ, 1956 లో ఇండియా లోనూ ప్రచురింపబడి, 2000 నాటికి 13 సార్లు పునర్ముద్రణ చెందిన "మాల్గుడి" ఆర్ కే నారాయణ్ నవల Mr. Sampath లోనిది.  స్వేఛ్ఛానువాదం నాది. అందులో యెన్ని నిత్య సత్యాలని హాస్య స్ఫోరకంగా వర్ణించారో చూశారా? అదీ రచన అంటే, అదీ అసలైన కామెడీ అంటే! 

No comments: