Friday, April 25, 2014

జీవితం లో హాస్యం



........అలా కూడా జరుగుతూ వుంటుంది.


పై అంతస్తులో ప్రాంతీయ కార్యాలయం, క్రింద మా కార్యాలయం. పై కార్యాలయం లో పనిచేసే అధికారులూ మేమూ ఒకే సంఘం లో. వాళ్లకి ఓ యూనిట్ సెక్రెటరీ, మా యూనిట్ కి వేరే.
 
సమస్య--పై కార్యాలయం మరుగుదొడ్లలో నీళ్లు పోవడం లేదు. యూనిట్ కార్యదర్శి కి రిపోర్టు చేశారు. ఆయన కార్యాలయ ఉన్నతాధికారి కి అల్టిమేటం ఇచ్చేశాడు--రెండురోజుల్లో అవి శుభ్రపడకపోతే, మర్నాటినుంచి పనిచెయ్యలేము--అంటూ.
 
ఆయనో పెద్ద మేథావి. ఆరోజు సాయంత్రం స్టాఫ్ మీటింగు పెట్టి, మరుగుదొడ్లు శుభ్రం చెయ్యడానికి ఓ కార్మికుణ్ని మాట్లాడాము, అతనికి నెలకింత ఇస్తామని చెప్పాము.....మరి ఉదయమే 6 గంటలకల్లా వచ్చేసి, తనపని చేసుకుపోతాడు. మరి ఆ సమయానికి కార్యాలయం తాళాలు తీసి, పని అయ్యాక మళ్లీ తాళాలు వేసుకొని వెళ్లేవాళ్లు యెవరు? అది తేలిస్తే, సమస్య పరిష్కారం అయిపోయినట్టే....అన్నాడు.
 
ఆ కార్యదర్శి--ఓ సినిమాలో ఓ కానిస్టేబుల్ "మీరెక్కడికో వెళ్లిపోయారు సార్! మీరుకాబట్టి ఇలా క్షణాల్లో పరిష్కారం..........." అంటాడు చూడండి--అదే రకం. బహుశా ఆ సినిమాలో ఆ పాత్ర ఇతన్ని బట్టే సృష్టించి వుంటారు.
 
మామూలుగా యెవరూ ఆ బాధ్యత తీసుకోడానికి ముందుకు రాకపోవడంతో, "నేనున్నాను సార్! నేను చూసుకుంటాను" అని ఒప్పేసుకున్నాడు.
 
తరువాత నాకు విషయం తెలిసి, అతన్ని హెచ్చరించాను......బాబూ, కార్యాలయానికి కొన్ని నిబంధనలు వున్నాయి, అనవసర బాధ్యత నెత్తిన వేసుకొని తరువాత బాధ పడతావు, నీకేమైనా ప్రత్యేక జీతం లేదా భత్యం ఇస్తారా? సమస్య పరిష్కారం ఉన్నతాధికారి బాధ్యత, అలాగే ఇంకోడికి డబ్బులిచ్చి, తాళాల వ్యవహారం అప్పగించొచ్చు, లేదా ఆయన ఇతర నిబంధనల ప్రకారం వ్యవహరించొచ్చు........అని.
 
"కొన్ని బాధ్యతలు తప్పవు కదండీ.......మన పని మనం చేసుకోవాలి కదా?" అంటూ సమర్థించుకున్నాడు.
 
తరువాత ఆయన పాట్లు ఆయనకే తెలుసు. రెండురోజులు అనుకున్నది, వారం పాటు చేయించినా, నీళ్లు పోతే ఒట్టు.......తోటి స్టాఫ్ తో అక్షింతలూ.
 
మళ్లీ నాతో చెప్పుకున్నాడు  "......రేప్పొద్దున్న 'గుర్రం......' పొడి తెచ్చి వేసేస్తానన్నాడు. కేజీ 30 రూపాయలట. డబ్బులు ఇచ్చేశాను. యెల్లుండి నుంచీ నాకీ బాధ వుండదు......"అంటూ.
 
"అదేం పొడి? అంత ఖరీదు యెందుకు?" అనడిగాను.
 
"అబ్బ! యేదైనా పూర్తిగా చెబితేగాని వూరుకోరు మీరు.....అదేదో 'గుర్రం.....' పొడి అన్నాడంతే. ఆఁ! గుర్తొచ్చింది "గుర్రం గెత్తం పొడి" అన్నాడు.
 
అదీ కథ.
 
ఇంతకీ అది "గుర్రం గత్తర పొడి". అంటే గుర్రం లద్దెల పొడి. అందులోని బాక్టీరియా మరుగు దొడ్లకి విరుగుడు. 30 రూపాయలూ తీసుకొని, ఫ్రీగా వచ్చే "గాడిద గత్తర పొడి" తెచ్చి పోసేశాడు. సమస్య పరిష్కారం అయిపోయింది.
 
(తరువాత ఆ బాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్‌ లు వచ్చి కొంతమంది బాగానే వదిలించుకున్నారు మందులకీ వాటికీ)
 
అందుకే కాబోలు అన్నారు.......శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని!

2 comments:

Unknown said...

Very humorous article sir.

A K Sastry said...

చాలా సంతోషం సుధాకర్.

ధన్యవాదాలు.