Thursday, September 22, 2011

మా ఇంటి వంట అనే.....



....కసరత్తుల ప్రహసనం

"కొంచెం అజినమోటో వుంటే ఇస్తావా వదినా?"

"అంటే యేమిటొదినా?"

"యేమోనమ్మా.....నాకూ తెలీదు....మొన్న మా ఎపార్ట్ మెంట్ లో 'మావూరి వంట; మా వీధి పెంట' అనో యేదో టీవీ కార్యక్రమం చిత్రీకరిస్తే, అందులో మా 'డీ-4' ఆవిడ అదేదో 'సోయా ఢాల్ భేజా ఫ్రై కొళంబు-21369' అని వండింది. అందులో.....వెయ్యాల్సినది ఈ అజినమోటో వొకటి! అదే చెయ్యమంటోంది మా మనవరాలు"

"బాగుందొదినా! ఇలాంటి వంటల్లో, మామూలుగా వేసే ఆవాలూ, జీలకర్రా వగైరాలతోపాటు, జాజికాయ, జాపత్రి, గసగసాలూ, లవంగాలూ, యాలకులూ, కొత్తిమీరా, పుదీనా, కరేపాకూ వగైరాలతోపాటు, జీడిపప్పూ, బాదం పప్పూ, పిస్తా పప్పూ, వేరుశెనగపప్పూ, నువ్వులూ (అంటే నూపప్పు అని చదూకోవాలి).....ఇలా అన్నీ వేసేసి, అజినమోటో, నిమ్మగడ్డీ, పనీర్, బట్టర్, సిల్వర్ ఫాయిల్స్....ఇలా అన్నీ వేసెయ్యాలటమ్మా!"

"నాకైతే వొదినా, మనచిన్నప్పుడు చూసిన "చింతామణి" నాటకం, అందులో సుబ్బిసెట్టి డైలాగులు గుర్తొస్తాయి వొదినా!"

"అవునొదినా, భలే హాస్యం వుండేది! ఇంతకీ ఆ డైలాగులు యేమిటో గుర్తుచెయ్యొదినా!"

"నాకు జీడిపప్పూ, మా పెద్దమ్మాయికి బాదం పప్పూ, చిత్రకి పిస్తాపప్పూ అంటే ఇష్టం. కాలక్షేపానికి ఓ రెండు పప్పులు నోట్లో వేసుకొంటూ వుంటాం! అన్నట్టు శెట్టిగారూ, మీదగ్గర ఆ పప్పులన్నీ దొరుకుతాయికదా? ఓ బస్తాడు జీడిపప్పూ, ఓ రెండు బస్తాలు బాదంపప్పూ, ఓ బస్తా పిస్తా పప్పూ పంపించకూడదూ? అన్న శ్రీహరితో, మరి గన్నేరు పప్పో? అనడుగుతాడు సుబ్బిసెట్టి! దానికావిడ.....అది మీయింటికి పంపించండి.....మీ ఆవిడ (స్వర్గానికి చేరి) సుఖపడుతుంది! అంటుంది--శ్రీహరి!"

"భలే నవ్వొస్తూందొదినా ఇప్పటికీ! ఇంకా తన చేతికున్న రాళ్ల వుంగరాలని ఇస్తానంటే, శ్రీహరి, వొద్దులెండి, రాళ్లేం చేసుకుంటాం? అంటే, ఇంకానయం కంకర్రాళ్లన్నావుకాదు--ఇది 'కంపు'; ఇది 'రవల' ఖరీదైన రాళ్లు పొదిగిన వుంగరాలు! అంటాడు చూడు!"

"అద్సరేగానొదినా, వీళ్ల వంటలు చూస్తుంటే, మనకసలు వంట చెయ్యడం వచ్చా? ఇన్నాళ్లు మనం చేసుకుంటున్నవి వంటలేనా అనో సందేహం వస్తూంటుంది నాకు! అదేదో వంటలో--ముందు అన్నం వుడికించేసి, తరవాత దాన్ని నూనెలో వేయించేసి, దాన్ని ముద్దచేసేసి, జంతికల గొట్టంలో కారప్పూసలా చుట్టలు చుట్టేసి, ఆ చుట్టలని ఆవిరిమీద కుడుముల్లా వుడికించి, దింపాక చిన్న చిన్న ముక్కలు చేసి, పళ్లెంలో పెట్టుకోవాలట! ఇంక దాంట్లోకి కూర--అన్ని రకాల కూరగాయల ముక్కలూ, ఆకు కూరలూ, వాటిని వుడికించిన నీళ్లూ, బఠాణీలూ, చిక్కుడు గింజలూ, బీన్సూ, మొలకెత్తిన సెనగలూ, పెసలూ ఇలా అన్నీ వేసేసి, దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్దా; అల్లం కొత్తిమీర ముద్దా; కొత్తిమీర పచ్చి మిర్చి ముద్దా వేసేసి, గరం మసాలా, కర్రీ మసాలా, ఛాట్ మసాలా, నా దిబ్బ మసాలా అన్నీ వేసేసి, చివరలో క్యారట్ రేకలూ, కీరదోస ముక్కలూ, కుంకం పువ్వూ తో అలంకరిస్తే, సరిపోతుందట!"

"మన వంటలంటే గుర్తొచ్చింది వదినా--చక్కగా ఆరు రుచులూ, యేడు రంగులూ స్పష్టంగా తెలిసేవి! ఆరోగ్యానికి ఆరోగ్యం! మరి మా కోడలైతే, మామిడికాయ పప్పులోనూ, టమాటా పప్పులోనూ--ఇలా దేంట్లోనైనా వేసే పోపులో, చేరెడు మినప గుళ్లూ, ఇన్ని మెంతులూ కూడా వేసి పోపు పెట్టేస్తుంది! యేదో రెండుముద్దలు వేడివేడిగా తినెయ్యడం నాకలవాటా? నావసలే దంతసిరి గల పళ్లు! ముద్దనోట్లో పెట్టగానే, "ఫట్"మంటూ ఓ మినపగుండు పడిందనుకో--బుర్ర ఛప్పన్నారు నరకాలనీ చూసి, గుడ్లలో నీళ్లు వెళ్లుకొచ్చేస్తాయి! అధవా నమిలేసినా, అసలు రుచి పోయి, ఓ వెర్రి కమ్మదనంతో గడ్డి తింటున్నామేమో అని అనుమానం! ఇంక మెంతులతో చచ్చే చేదు! అక్కడికీ యెన్నిసార్లో చెప్పాను....అలవాటుగా అన్నీ పడిపోతాయత్తయ్యా! యేమీ అనుకోకండి.....అని వోదార్పు! ఇలాకాదని, పోపుల డబ్బాలోంచి ఆ గిన్నెలు తీసేసి, వేరే పెట్టేశాను. అయినా తన లెఖ్ఖ ప్రకారం పోపులో యేమేమి తగ్గాయో చూసి, వెతుక్కొని, దొరకకపోతే ప్రక్కనే వున్న కొట్లోనో, దగ్గర్లో వున్న బేకరీలోనో అప్పటికప్పుడు కొనుక్కొచ్చి మరీ వేసేస్తుంది! ఇంక నా బాధ చూడలేక, వడ్డించేముందు గబగబా కంటికి కనిపించినవన్నీ యేరేసి, అప్పుడు వడ్డిస్తుంది....పాపం పిచ్చి పిల్ల! ఇంకేమంటాము?"

"అవునొదినా.....తప్పు వాళ్లది కాదు.....ఈ ఛానెళ్లవాళ్లదీ, బ్లాగర్లదీ, వంటలమ్మలదీ!"

"నిన్న టీవీలో పనీర్ చెయ్యడానికి తొందరగా గట్టిపడుతుందని 'జిల్లేడు పాలు' పోసేస్తున్నారనీ, ఇలా యేవేవో చూపించారు! ఇలాంటివి కొనుక్కొనే కన్నా, చక్కగా మన వంటలు మనం చేసుకొని తింటే, ఆకలీ తీరుతుంది, ఆరోగ్యమూ! అజినమోటోలు వద్దులే వదినా! ఇంక వంటిళ్లలోకి వెళదాం!"

"బాగా చెప్పావొదినా!"

14 comments:

Anonymous said...

> "నిన్న టీవీలో పనీర్ చెయ్యడానికి తొందరగా గట్టిపడుతుందని 'జిల్లేడు పాలు' పోసేస్తున్నారనీ
are you serious?

రసజ్ఞ said...

హహహ మీరు చెప్పింది అక్షర సత్యం. నాకు ఎందుకో ఇంట్లో వండే సాంప్రదాయక వంటలే చాలా ఇష్టం. పొరపాటున ఒక్క రోజు బయట ఈ కొత్తరకం వంటలు తింటే అంతే జిహ్వ రుచినే మర్చిపోయినట్లు అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా సాంప్రదాయ వంటలే వండినా అమ్మ అప్పుడప్పుడు ఈ దిక్కుమాలిన టీవీ ప్రోగ్రామ్ములు చూసి అది చేసి పెట్టనా అని ఆటపట్టిస్తుంది. ఒక సారి అదేదో గులాబ్జాం మసాలా కూరట వినడానికే చిరాకు వేసింది గులాబ్జాములు చేసుకుని హాయిగా తినక ఆ పాకం వంచి మసాల చల్లుకుని నూనెలో వేయించుకుని కూర చేసుకోవడమేమిటి? దరిద్రం! ఆధునిక వంటల పేరుతో రుచులకి భేదాలు తెలియకుండా చేసేస్తున్నారు అన్నిటికీ ఒకే రుచి ఉంటే ఏది తింటే ఏమిటి చెప్పండి?

rajasekhar Dasari said...

ఒక బాల చందర్ సినిమా ఇది కథ కాదు లో , చిరంజీవిని జయసుధ వంట ఎలా ఉంది అని అడిగితే, పెంటలాగా ఉంది అంటాడు అల ఉంటాయి మన కార్యక్రమాలు మరియు వంటలు . వాటి వలన జరిగిన మేలు ఏమిటంటే మీ చక్కటి వ్యాసం చదివి మనసారా నవ్వుకున్నాము . జై టీవీ వంటలు జైజై టీవీ వంటల్.

panipuri123 said...

మాఊరి వంట, ఈ వారం 1500వ భాగంలో K. రాఘవేందర రావు "స్పెషల్" ఎపిసోడ్ అంట.

Anonymous said...

హ హ హ....భలే టపా కృష్ణశ్రీ గారూ... రాజశేఖర్ గారు అన్నట్లు ఈ వంటల కార్యక్రమాల వల్ల కాసేపు నవ్వుకునే వీలు చిక్కుతోంది. పోనీలెండి అలా ఐనా ఉపయోగపడుతున్నాయి...!

Anonymous said...

Munakayya payasam ata........... vammmmooooooooooo

సుజాత వేల్పూరి said...

బాగా చెప్పారు! ఈ వంటల పెంట ప్రోగ్రాములకు ఆదివారాలు కూడా సెలవులుండవండీ! ఏదైనా సినిమా వస్తుందేమో అని పెట్టాం అనుకోండి..ఆది వారం కూడా మీరు పైన చెప్పిన లాంటిదేదో వండేస్తూ ఉంటారు, పెళ్ళి కూతురు మేకప్ లో!

కొన్ని న్యూస్ ఛానెళ్ళు కూడా, కాస్త హై ప్రొఫైల్ తో ఏ ఐదు నక్షత్రాల హోటల్ చెఫ్ లనో పిలిపించి థాయ్,లెబనీస్ వంటకాలు వండిస్తూ ఉంటారు చూశారా మీరు?

ఒక రోజు ఒక చెఫ్ అదేదో వండి ప్లేట్లో పెట్టగానే అటుగా పోతున్న నా కూతురు అది చూసి "మొన్న బామ్మ వాళ్ళ డాగీ (మా అత్తగారి పెంపుడు కుక్క) వామిటింగ్ చేసుకుంది జొరం వచ్చి. అచ్చం ఆ ప్లేట్లోది లాగే ఉంది"అని చెప్పి చక్కా పోయింది.

నాకు నవ్వూ ఏడుపూ రెండూ వొచ్చాయి. నిజం చెప్పినందుకు నవ్వూ, పోలికకు ఏడుపూ!

A K Sastry said...

పై మొదటి అన్నోన్!

"అవునొదినా! మొన్న యేదో టీవీలో ఓ స్వీట్ షాపు వాళ్లే ఆ విషయం స్వయంగా చెప్పి, 'అదంత డేంజరు కాదు....కొంచెం డోస్ యెక్కువైతేనే జిల్లేడుపాలు విషంగా మారతాయి' అని చెప్పడం చూసిన ప్రక్కింటావిడ నాకు చెప్పింది! నిజంగా నిజంటొదినా!"

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ రసజ్ఞ!

మీ అమ్మగారికి అలా భయపడుతూనే వుండండి.....వంటికి ఆరోగ్యం!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ rajasekhar Dasari!

వంటల్లో "క్యామెడీ"కి వోటు వేసినందుకు ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ panipuri123!

యేమిటీ! సినీ దర్శక....(అదేదో)....హీరోయిన్ల బొడ్డులమీద పళ్లూ అవీ దొర్లించే, బిందెలూ, గరిటెలూ పాటల్లో చూపించే రాఘవేంద్రరావు వంటలు చేస్తాడా?! తప్పక చూడాల్సిందే!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ అచంగ/.......!

మీరుకూడా "క్యామెడీ" ఎంజాయ్ చేసినందుకు ధన్యవాదాలు.

A K Sastry said...

పై రెండో అన్నోన్!

యేం? తప్పా? ముల్లంగీ, క్యారట్, బీట్ రూట్ వగైరాలతో పాయసం చెయ్యగాలేనిది, మునక్కాయ యేం పాపం చేసింది?

అయినా మనం చేసిన వంటలన్నీ మనమే తినేస్తామా యేమిటీ....(టీవీ యాంఖర్లు తిని, వాహ్! అద్భుతం అని ఓ వందరూపాయల చీరో, "వన్ గ్రామ్ గోల్డ్" ఆభరణమో ఇస్తారుగానీ!).....వాక్!

యేమో యెవరు చెప్పగలరు.....రేపు మీరే "రెడీ టు కుక్" మునక్కాయ పాయసం తయారుచేసి, పేటెంటు తీసుకొని, మునక్కాయపాయసమ్.కామ్ ద్వారా అమ్మితే, డబ్బుకి డబ్బూ, పేరుకి పేరూ! ఇంకా పిచ్చిదంబరం, ప్రణోబ్ ముఖోర్జీలు యే "యువ పారిశ్రామిక.......అదేదో.....రత్న" అని అవార్డ్ ఇచ్చినా ఇవ్వొచ్చు! కదా?!?!?!?!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ సుజాత!

థాయ్, లెబనీస్ కే సరిపెట్టారు. మెక్సికన్, కొరియన్ వగైరాలు ఇప్పటికే వచ్చేశాయి. రేపు "వానపాముల నూడుల్స్"; "మిడతల వేపుడూ"; "బొద్దింకల పులుసూ" వగైరాలు చూపించినా చూపించేస్తారు! మీరన్నట్టే నాక్కూడా నవ్వూ, యేడుపూ రెండూ వచ్చాయి.....మీ అమ్మాయి చెప్పిన పోలిక విన్నాక!

అంతే అమ్మా......మనం యేమి చెయ్యగలం!

ఆ చేత్తోనే, ఈనాడులో నా బ్లాగులగురించి........(హబ్బే! సరదాకన్నాను. అంత ఆశ లేదునాకు!)

ధన్యవాదాలు.