క్రీడా"కారులు" (గుఱ్ఱాలు)
మనకో మెగాస్టారున్నాడు--మెగా మెగా స్టెప్పులేసీ, "యాంటీ కరప్షన్ ఫోర్స్" లాంటివి (సినిమాల్లో) స్థాపించీ, అభిమానుల గుండెలు అదరగొట్టేసేవాడు. మొన్ననే ఓ "మెగా జంప్" చేశాడు కూడా! (సినిమాల్లో బంగీ జంపులు చేసినట్టు!).
ఇంక ఆయన తమ్ముడు "పవర్ స్టార్"! తరవాత ఆయన కొడుకుని "మెగా పవర్ స్టార్" అనో యేదో అంటున్నారు. (అసలు వీళ్లకి ఈ "బిరుదులు" యెవరిచ్చారో? వాళ్లే తగిలించుకున్నారో, వాళ్ల పబ్లిసిటీ తైనాతీలు పెట్టారో!)
సరే బాగానే వుంది.
ఆ చిరుత ఇప్పుడు వార్తల్లోకొచ్చాడు--అదేదో "పోలో" జట్టుని కొనేశాడుట. కాబోయే భార్య అడిగితే, కొండమీది కోతిని కూడా తెస్తారెవరైనా! తనకి తాహతుంది, కొన్నాడు. బావుంది.
ఓ టీవీ ఛానెల్ వాళ్లు తెగ రెచ్చిపోయారు--".....వారం జరగబోయే పోలో మ్యాచ్ లో ....స్టార్ ఆడబోతున్నారా?" అంటూ.
మర్నాడు పేపర్లలో, వాళ్ల ఫోటోలతో, "మ్యాచ్ ని తిలకించారు" అని ఫోటోలు వస్తే, ఆ ఛానెల్ వాళ్లు ".....స్టార్ రైడింగుచేసి ప్రేక్షకులని అలరించారు" అంటూ, ఈక్వెస్ట్రియన్ ట్రాక్ లని చూపించారు! (వాళ్ల కాబోయే ఆవిడ బహుశా వార్నింగిచ్చివుంటుంది--రైడింగు యేదో చిన్నప్పుడు నేర్చుకున్నావేమో.....ఇప్పుడు పోలో అన్నావంటే, 'సుమంగళిలో నాగేశ్వర్రావు ' అయిపోగలవు! అప్పుడు నా గతేమిటి? అని!)
అసలు ఈరోజుల్లో, మన (ఆడ) హీరోయిన్లని ప్రశ్నించినా, మాకు "పోలో, గోల్ఫ్, రగ్బీ, ట్రెక్కింగ్, రాక్ క్లయింబింగ్, రివర్ రాఫ్టింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్"--ఇవన్నీ మాకిష్టం, ఖాళీ దొరికితే అవే ఆడేస్తాము అంటున్నారు!
అసలు వీళ్లకి గోల్ఫ్ గ్రవుండ్ లో మొత్తం యెన్ని కన్నాలు వుంటాయి, యెన్నిరకాల "కర్రలు", యెన్నిరకాల "షాట్లు" వుంటాయి, స్కోర్లు యెలా వేస్తారు, టైము యెంత పడుతుంది--ఇలాంటివేమైనా తెలుసా?
ఇంక పోలో లో ఆ ఛానెళ్లవాళ్లకి కూడా యెన్ని జట్లుంటాయి, గోళ్లు యెలా లెఖ్ఖిస్తారు, పెనాల్టీలు యెలా వుంటాయి, అసలు ప్రత్యర్థి గుర్రాలని గుర్తుపట్టడం యెలా--ఇలాంటివి తెలుసా?
మా చిన్నప్పుడు మామూలుగా స్కూలు వున్న రోజుల్లో బాల్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడుతూ, సెలవలు వస్తే, రోజుకోరకం ఆట--సీజన్ ని బట్టి--గోళీలూ, జీడిపిక్కలూ, బొంగరాలూ, క్రికెట్టూ, ఇంకా ఉప్పట్లూ, గూటీబిళ్లా, కబాడీ (చెడుగుడు), పేడపూతి, ఆకు తెచ్చే--ఇలాంటి ఆటలు ఆడేవాళ్లం!
(వీటిగురించి వివరాలు కావాలంటే మరో టపా వ్రాస్తాను.)
ఇంకా, స్కూల్లో డ్రిల్ పీరియడ్ లో, ఫుట్బాల్, బేస్కెట్ బాల్, వాలీబాల్, హాకీ, ఖోఖో లాంటివికూడా ఆడించేవారు.
ఇప్పుడు కొత్త కొత్త హేండ్ బాలూ, సెపక్ తక్రా (ఇదేదో గేది తక్రం, ఆవు తక్రం లా అనిపిస్తుంది నాకు) లాంటి ఆటలు కూడా ఆడించేస్తున్నారు స్కూళ్లలో!
స్పోర్ట్స్ లో రన్నింగ్ రేసులతో పాటు, జావెలిన్, డిస్కస్, హేమర్, షాట్పట్--ఇలాంటివి నేర్పించేవారు.
మరిప్పుడు మన క్రీడలు యెటుపోతున్నాయి? స్టేడియాలు కట్టించడం, క్రీడా భవనాలు నిర్మించడం, వాటిలో వర్షం నీళ్లు తోడించడం తో ఆగిపోతున్నాయి!
పోటీలూ, బహుమతులూ మాత్రం వచ్చేస్తున్నాయి.
అంతర్జాతీయంగామాత్రం, బాణాలేసే గిరిజనులూ వాళ్లే దిక్కు మనకి--పతకాలు వచ్చాయి అని చెప్పుకోడానికి!
మేరా క్రీడాభారత్ మహాన్!
2 comments:
చక్కగా చెప్పారండీ! 'సుమంగళిలో నాగేశ్వర్రావు ' అయిపోగలవు! అప్పుడు నా గతేమిటి? హహహ భలే నవ్వేసా ఈ వాక్యానికి
డియర్ రసజ్ఞ!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
Post a Comment