Monday, September 19, 2011

స్నేహితుల దినాలూ



స్నేహ సౌరభం

కొందరికి "భాయ్"లు అయినా, నాకు మాత్రం "గాళ్లే" నా కొండెలు!

మా పేరి మేష్టారు, ప్రతీయేడూ, మొదటిసారి మా క్లాసుకి వచ్చి, అటెండెన్స్ వేస్తూ, ఓ గంటసేపు, మా పేర్లని చిత్రవిచిత్రంగా పిలుస్తూ, మమ్మల్ని నవ్విస్తూ గడిపేశేవారు. అలాంటిపేర్లే మా క్లాసుమేట్లకి శాశ్వతం అయిపోయాయి చాలామందికి!

వుదహరణకి "నూరుల్లా" అనేవాణ్ని--"నరట్లా" అని పిలిచేవారు! వాడికి ఇప్పటికీ అదే పేరు. ఇంకా వాణ్ని "ఒరే! సాయిబ్బు శాస్త్రులూ!" అని పిలిచి, "ఆ 'శత్రుడిదగ్గరికి ' వెళ్లి, ఓ సారి నశ్యం డబ్బాతేరా!" అనేవారు. యెప్పుడూ ఆపని వాడికే చెప్పేవారు! (దీనివెనక్కాలో కథ వుంది--ఇదివరకు టూకీగా వ్రాశాను.)

నన్ను "యేకేవాడా" అనీ, నాతరవాత వాడైన పువ్వాడ కృష్ణమూర్తిని "పీకేవాడా" అనీ పిలిచేవారు.

అలాగే, "సత్యానందం" అనే అబ్బాయి తండ్రి, పేరు "దాసు" ఓ సినిమాహాల్లో పనిచేస్తూ, ఒంటెద్దు బండిలో మైకూ, స్పీకరూ, గ్రామఫోనూ పెట్టుకొని, క్రొత్తగా వచ్చే సినిమాలకి పబ్లిసిటీగా 'వొళ్లు గగుర్పొడిచే పోరాటాలూ, భయంకరమైన కత్తి యుధ్ధాలూ, గుర్రములపై నడచుటా, మర్రివూడలపై పరుగెత్తుట లాంటి విశేషాలతో, నేడే చూడండి....ఆలసించిన ఆశాభంగం....ఇంకా కొన్ని రోజులు మాత్రమే!' అంటూ చెప్పేవాడు.   

ఆ సత్యానందాన్ని మాత్రం, "ఒరే దాసూ" అనే పిలిచేవాడాయన. వాడు స్కూల్లో చదువుకొనే టైములోనే, సినీ రికార్డింగు డ్యాన్సులు వెయ్యడమే కాకుండా, ప్రోగ్రాం మధ్యలో--నాగుపాముచేత, బొట్టూ, కళ్లకు కాటుకా పెట్టించుకొనుట....మొదలైన విద్యల్లో ఆరితేరాడు! యేదో చదివి, ఓ చిన్న వుద్యోగం సంపాదించాడు తరవాత!  

ఆమధ్య నేను మావూరు బదిలీపై వచ్చాక, ఓ రోజు ఒకావిడ తన దగ్గరున్న కొంచెం డబ్బు బ్యాంకులో డిపాజిట్ చెయ్యడానికి వస్తే, ఆవిడభర్తపేరు చూసి, మీ ఆయన్ని ఓ సారి వచ్చి నాకు కనపడమను.....అనగా, ఓ నాలుగైదురోజుల తరవాత, నేను చాలా బిజీగా వుండగా, "నమస్కారం అయ్యగారూ!" అన్న పిలుపు విని, తలెత్తి చూసి, "ఒరే! నేను నీకెప్పుడు అయ్యగార్నయిపోయాన్రా దాసూ?" అని వాడి భుజమ్మీద తట్టి, కవుగలించుకుంటే, వాడు ఆనందభాష్పాలు రాలుస్తూ....ఒరే! నువ్వు పెద్దవాడివి కదా! అంటూ యేదేదో వాగాడు!

అలాగ, స్నేహానికీ, సౌభ్రాతృత్వానికీ, కుల, మతాలు లేవు! వున్నదల్లా మనసులలో కాస్త చోటు--అంతే!

4 comments:

ఆత్రేయ said...

చాలా బాగుంది సార్. బాల్య స్నేహితులని మళ్ళీ కలవడం, జాడీలోని పాత ఉసిరికాయ పచ్చడి మీగడ పెరుగు లో నంచుకున్నంత బాగుంటుంది.
మీ మాస్టారు మిమ్మల్ని ఏకేవాడా అనటానికి కారణం మీరు చిన్నప్పుడు కూడా అందరినీ ఏకే వారా?
(బ్లాగులో లా)

A K Sastry said...

డియర్ ఆత్రేయ!

మీరు చెప్పిన రుచి వుపమానం ఇంకా బాగుంది!

నా పేరు ఆ ఖ్ శాస్త్రి అని, అలా పిలిచి పిలిచి, నన్ను ఇలా తయారు చేశారేమో!

నచ్చినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

'''నేస్తం... said...

వున్నదల్లా మనసులలో కాస్త చోటు--అంతే!
Nijam

A K Sastry said...

డియర్ Kamal!

మీ స్పందనకి చాలా సంతోషం.

ధన్యవాదాలు.