Friday, May 20, 2011

వేణ్నీళ్లకి చన్నీళ్లు.....



......అనబడే పాట్లు

పెద్ద పెద్ద జీతాలు తీసుకొంటూ, పదవీ విరమణ చేశాక, "పింఛను" అనే వేణ్నీళ్లకి "ఇంకో జీతం" అనే చన్నీళ్లు తోడవుతాయంటూ కక్కుర్తి వుద్యోగాలు చేస్తున్నవాళ్ల పాట్లని చూస్తే, నవ్వు రావడమే కాదు....పగవాళ్లకి కూడా వద్దురా బాబూ....అనిపిస్తోంది.

మా వూళ్లో వేదాంతం వెంకట సుబ్బయ్య అని ఒకాయన వుండేవాడు. వార్డు కౌన్సిలరు దగ్గరనించీ--దేశాధ్యక్షుడిదాకా అన్ని యెన్నికల్లోనూ నామినేషన్ వేసేవాడు ఇండిపెండెంట్ గా. 

తన సైకిలు కడ్డీ మీద కొన్ని పాత న్యూస్ పేపర్లు వ్రేళ్లాడేసి, అవి పడిపోకుండా ఓ తాడు కట్టి, ఓ చిన్న నిచ్చెనని ఓ ప్రక్క తగిలించుకొని, ఓ వాడేసిన పందుంపుల్లా, కాస్త నీలిమందూ, ఓ గిన్నెలో మైదా జిగురూ, ఓ హరికేన్ లాంతరూ పట్టుకొని బయలుదేరేవాడు. తనకి ముఖ్యం అనిపించిన సెంటర్లలో ఆగి, న్యూస్ పేపరు మీద నీళ్లలో తడిపిన నీలిమందులో పందుంపుల్ల ముంచి, "ఫలానా గుర్తుకే మీ వోటు" అని వ్రాసి, నిచ్చెన వేసుకొని, సినిమా వాల్ పోస్టరుల క్రిందో, ప్రక్కనో మైదా జిగురుతో అంటించి, అక్కడ మీటింగు పెట్టేవాడు. ఓ రేకు గొట్టం--పాత న్యూస్ రీళ్లలోనూ, బొలో స్వతంత్ర భారత్ కీ అనేవాళ్లు వుపయోగించిందీ--మూతి పట్టేంత వెడల్పు వుండి, తరవాత సన్నగా వుండి, పోనుపోనూ వెడల్పుగా ఓ 18 అంగుళాలు పొడవుండే గొట్టం--లోంచి మాట్లాడుతూ తనకి వోటు వెయ్యమని అభ్యర్థించేవాడు.

(ఆయన యెప్పుడూ నెగ్గలేదు, డిపాజిట్ దక్కించుకోలేదు అని వేరే చెప్పఖ్ఖర్లేదుగా? కానీ "ప్రజాస్వామ్యం మీద" ఆయనకి అంత నమ్మకం మరి!)

ఇంక, ప్రత్యేక ఆంధ్ర రాష్ ట్రోద్యమం లో, మా నరసాపురం మునిసిపాలిటీకి "రాబోయే యెన్నికల్లో కాబోయే ఛైర్మన్" గా తన పదవికి రాజీనామా ఇచ్చిన కొవ్వలి అయ్యన్న నాయుడి గురించి ఇదివరకోసారి వ్రాశాను. (తరవాత ఓసారి అసెంబ్లీ యెన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి, ప్రథాన పార్టీల ప్రత్యర్థులకి షాకులమీద షాకులిచ్చాడు--కౌంటింగ్ పూర్తయ్యేదాకా.)

తాత-మనవడు, స్వర్గం-నరకం, పాలూ-నీళ్లూ లాంటి జంట పదాలతో దా నా రా వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీశాడు. అవన్నీ పకడ్బందీ స్క్రీన్ ప్లేతో, తన వెరయిటీ ట్రీట్మెంటూ, సింబాలిజాలతో, జనాలకి తెగ నచ్చేశాయి. మేఘం లో తన పేరు వేసుకోవడం కూడా అప్పట్లో ఓ వెరయిటీ! తరవాత కొన్ని "కళా ఖండాలు" కూడా తీశాడు--మేక...సారీ...మేఘ సందేశం; ప్రేమాభి.....ప్రేమకి పట్టాభి.....ఇలా!

కడుపులో చల్ల కదలకుండా వున్న చిరంజీవిని ముఖ్య మంత్రిని చెయ్యకపోగా, ముక్కు వూడిన మంత్రిని చేశాడు. ఇప్పుడు బాల కృష్ణ మీద పడ్డాడు. ఆయనేమౌతాడో మరి!

ఇవన్నీ యెందుకు గుర్తు వస్తున్నాయంటే, కాలేజీల ప్రిన్సిపాల్ లగానూ, లెక్చరర్లగానూ పని చేసి, యూజీసీ స్కేళ్లతో యాభయ్యేసివేల రూపాయల జీతాలతో పదవీ విరమణ చేసినవారు, "వేణ్నీళ్లకి చన్నీళ్లు" అంటూ ప్రైవేటు కాలేజీలలో కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ లు, సూపర్వైజర్లు గా, నెలకి 3 నుంచి ఫదివేల రూపాయలకి కుదురుకొంటున్నారు--బాగానే వుంది.

ఇప్పుడు వాళ్లని, వేసవి సెలవల్లో మీకు జీతం కావాలంటే, రాత్రి వేళల్లో మన కాలేజీ పబ్లిసిటీకి వాల్ పోస్టర్లు అంటించండి అనీ, పగలు యెండలో, డోర్ టు డోర్ తిరిగి, విద్యార్థులని మన కాలేజీలో చేర్పించండి అనీ వుత్తర్వులు జారీ చేస్తున్నారట!

సంచీ లాభం చిల్లు తీర్చిందని, యెంత బాగున్నాయో--వేణ్నీళ్లూ, చన్నీళ్లూ--పాలూ, నీళ్లూ--!

(ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో "లైఫ్ సర్టిఫికెట్ కమ్ నాన్ రీ-ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్" మాత్రం చిరునవ్వుతో సంతకంపెట్టి పారేస్తారు--లేకపోతే మొదటికే మోసం కదా మరి!)

5 comments:

voleti said...

వాళ్ళేం రాజకీయ నాయకుల్లా కోట్లకి కోట్లు అడ్డంగా దోచుకోట్లేదు.. వచ్చే పెన్షన్ డబ్బులు తమ కుటుంబ అవసరాలకి చాలక ఇటువంటి పనులు చేస్తున్నారు.. వాళ్ల చేత ఇలా చేయించుకుంటూ, లక్షలు, కోట్లు సంపాదిస్తున్న కార్పొరేట్ కాలేజి వాళ్ల అమానుషత్వానికి సిగ్గు పడాలి..దీనికి దాసరి కి లింక్, (కామెడీ) ఏంటో?

Anonymous said...

వాళ్లు అవసరార్ధమో, వంట్లో ఓపికుండి, ఇంట్లో ఖాళీగా కూర్చోటం ఎందుకనో, అంతకంటే అప్పటివరకు చెప్పిన పాఠ్ఠాలు చెప్పకుండా ఉండలేకో ఎదో వాళ్లకు తోచినంతలో కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకొంటున్నారు.

ఎదో కులంలో పుట్టాను కాబట్టి, దాని ఆధారంగా నా బాబు లక్షాధికారి అయినా సరే ప్రబుత్వం ఊరి సొమ్ముతో మమ్ములను ఎద్దులు లాగా మేపాలి అనుకొనేవారికంటే, అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షల కోట్లు ప్రజల భూములు, గనులు అమ్ముకొని సంపాదించి, అదేదో కష్టానికి సాక్షి అనేవాళ్లు, వాళ్ళకు జే జే లు కొట్టే చదువుకొన్న కులగజ్జి వీరులు కంటే ఇది ఏ రకంగా తప్పు అంటారు,
రిటైర్ అయినా కష్టపడే వాళ్లంటే వారు ఎవరయినప్పటికీ అభినందనీయులే నా దృష్టిలో.

A K Sastry said...

డియర్ voleti!

పేరులోనే "కార్పొరేట్" అనిపించుకునేవాళ్లు తమ లాభాలకీ, తామిచ్చే జీతాలకి సరిపడా పని రాబట్టుకోడానికే ప్రయత్నిస్తారు మరి. అంటే, వీళ్ల తప్పూ లేదు, వాళ్ల తప్పూ లేదు.

వూరికే.....జంటపదాలతో పేరు పెట్టానుకదా టపాకి.....అందుకని దా నా రా సినిమా పేర్లు గుర్తొచ్చి, రాసేశాను. అంతే!

మీ బ్లాగ్ బావుంది. మీ భావాలూ, వ్యక్తీకరణా కూడా బాగున్నాయి. కీపిటప్.

ధన్యవాదాలు.

A K Sastry said...

పై అన్నోన్!

తప్పనలేదు.....మరీ అంత కష్టమా అని!

ధన్యవాదాలు.

voleti said...

thank u brother