Tuesday, November 2, 2010

ఈనాడు "తెగులు"

మన తెలుగు

"రేప్పండక్కి యేం చేస్తున్నావొదినా?"

"కొంచెం వెరైటీగా వుంటుందని 'నువ్వుపప్పు' పాయసం చేద్దామనుకొంటున్నానొదినా!"

"యేమిటీ? 'నువ్వు పప్పా'?"

"అవునొదినా".

"అయితే, 'నువ్వు' పప్పా?"

"భలేదానివే. నేను కాదొదినా! 'నువ్వు' పప్పు!"

"బాగుంది. ఇవాళ ఈనాడు వసుంధర లో "నువ్వుల పాయసం" అంటూ వ్రాశారు! ఓ సారి చూడు."

"చూశానొదినా. వాళ్లు పెట్టిన ఫోటో లో మాత్రం చక్కగా తెల్లగానే వుంది. కానీ, నువ్వులతో యెవరైనా పాయసం చేస్తే, అలా వుంటుందంటావా? మరి రుచెలా వుంటుందో?"

"భలేదానివొదినా! ఇంకా నువ్వులతో చేసేశావు కాదు! నువ్వులంటే యేమిటనుకుంటున్నావు? వాళ్ల తెలుగులో 'నువ్వు పప్పు'!"

"వీళ్ల తెలుగు మంటెట్టా! మా యింటి దగ్గర్లో, నా చిన్నప్పుడు తెలుకులవాళ్లు జల్లెడలా చిల్లులుపొడిచిన డ్రమ్ముల్లో నువ్వులనివేసి, నానపెట్టి, చాలా కష్టపడి పొట్టు వొలిచి, పప్పు చేసి, యెండబెట్టడం చూసేదాన్ని! అలాంటిది యెంత తేలిగ్గా నువ్వులు అని వాడేస్తున్నారు వీళ్లు!"

"అంతే కాదొదినా. మీ అన్నగారు ఈ మధ్య తన వుద్యోగానికి నువ్వులూ, నీళ్లూ వొదిలేశారుగా? అప్పుడే తెలిసింది--నువ్వులు అంటే నాకు విశదం గా!"

"ఆవునొదినా! పెద్దవాళ్ల ఆబ్దికాలకి కూడా, తర్పణాలకీ వాటికీ నువ్వులే వాడతారు. అందుకే నాకూ డౌటొచ్చింది!"

"సరే! వాళ్ల తెలుగు మంటెట్టా అన్నావుగా. అలాగేకానీ! పాయసం మాత్రం నాకు కొంచెం పంపించుమీ.....మీ అన్నగారికి!"

"అలాగే వొదినా".

6 comments:

astrojoyd said...

నిర్ణయం ను ఈనాడు షోగ్గా నిరణయం అంటుందని మీకు తెలుసా?

Anonymous said...

కృష్ణ శ్రీ గారూ, నువ్వు పప్పు అనటం తప్పేమీ కాదట.
‘నూపప్పు’ అనే ప్రయోగం ఉందిని కొందరంటున్నారు. ఆంధ్రప్రభలో ఈ లింకు చూడండి. http://andhraprabhaonline.com/commonman/article-65999

అయినా ‘నువ్వుల పరమాన్నం’ అని రాయకుండా, మీరేమిటీ పాయసంలో కాలేశారూ! :)

ఆ.సౌమ్య said...

హ హ నిన్న ఆ వంటకం గురించి ఈనాడు లో నేనూ చూసానుగానీ ఈ నువ్వులకి, నువ్వు పప్పుకి ఉన్న తేడా గమనించలేదండీ, బావుంది. :)

A K Sastry said...

డియర్ astrojoyd!

నిజమా! నేను గమనించలేదు.

ధన్యవాదాలు.

A K Sastry said...

నువ్వు పప్పు అనడం తప్పన్నానా? యెప్పుడు? నేను నువ్వుల పరమాన్నం అని రాయడం యేమిటో!? ప్చ్!

A K Sastry said...

డియర్ ఆ.సౌమ్య!

సంతోషం! కాస్త పై అనోన్ కి కూడా చెప్పమ్మా!

ధన్యవాదాలు.