Saturday, September 25, 2010

మేనేజ్ మెంట్ మరియూ......

కంప్యూటర్ వెర్రి

ఎం బీ యే--అంటే, యెంత పెద్ద వ్యాపారాన్నైనా, తన కొనగోటితో అలవోకగా నిర్వహించి పారేశేవాడు.

ఎం సీ యే--అంటే, తెల్లారి లేస్తే, పళ్లు తోముకోవడం దగ్గరనించీ కంప్యూటరు చేతే చేయించుకోగల మాయల మరాఠీ.

ఇవీ ఒకప్పటి చాలామంది అభిప్రాయాలు.

మా అమ్మాయి ఎం ఎస్ సీ (కంప్యూటర్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతూండగానే (ఆంధ్రా యూనివర్సిటీలో ఆ కోర్స్ లో వాళ్లదే మొదటి బ్యాచ్), మా ఆవిడ సతాయింపు యెక్కువై, సరే, ఇప్పటినించీ పెళ్లి సంబంధాలు చూస్తే మంచిదే కదా అని నిశ్చయించుకొని, ఈనాడు పెళ్లి పందిరిలో, త్వరలో (పెళ్లి కోసమే) ఇండియా రానున్న ఓ అమెరికా పెళ్లికొడుకు వివరాలు నచ్చి, వాళ్లిచ్చిన ఫోను నెంబరు కి చేశాను--ఓం ప్రథమం గా.

అటునించి, అబ్బాయి తండ్రి "అమ్మాయేం చేస్తూంది?" అనగానే, ఇలా ఎం ఎస్ సీ అని చెపుతున్నాను.

త్రాచుపామంత కోపం వచ్చింది ఆ పెద్దాయనకి! "మేము ఎం సీ యే గానీ, బీ టెక్ గానీ అయితేనే కాంటాక్టు చెయ్యమని చాలా క్లియర్ గా చెప్పామే?" అంటూ గై గైలాడుతుంటే, "చాలా సంతోషం! ఇకముందు కూడా అంత క్లియ్యర్ గానే వుండండి" అని ఫోను పెట్టేశాను.

(నా ఙ్ఞాపకం గా ఆ మూర్ఖుడి అడ్రెస్సూ, ఫోను నెంబరూ వగైరా మాత్రం నా డైరీలో భద్రపరచుకున్నాను!)

మా జిల్లాలో మొన్న జరిగిన ఎంబీయే, ఎంసీయే కోర్సుల ప్రవేశాలకోసం జరిగిన కౌన్సెలింగ్ చూస్తే, ఎంసీయే కి 36 కళాశాలల్లో వున్న 2150 సీట్లకీ, 10 కళాశాలల్లో పది నించి పదిహేనుమందీ, ఇంకో 16 కళాశాలల్లో ఒక్కడంటే ఒక్కడూ చేరారట. మిగిలిన 10 కళాశాలలకీ అది కూడా లేదట!

ఇక యాజమాన్యాలు తలలు పట్టుక్కూర్చున్నాయట! ఒక్కడికోసం అంతమంది టీచర్లనీ, లేబ్ లనీ యెలా మేపాలిరా భగవంతుడా! అని.

మీ ద్వారా యెవరినైనా చేరిస్తే, మీకు ఇంత కమీషన్ ఇస్తాం అని కన్సల్టెన్సీ వాళ్లని బతిమాలుతున్నారట!

ఎంబీయేల సంగతి కొంచెం మాత్రమే మెరుగుట!

మేము యూత్ గా వుండగా, సినిమాలు విడుదలైన రోజే చూసేసి, తరవాత అడిగినవాళ్లకి మా అమూల్యాభిప్రాయం వుచితం గా చెప్పేవాళ్లం. ఫ్లాప్ సినిమా ఐతే, "థియేటరు వాడు మనం వెళ్లగానే, మెడలో దండ వేసి, పేపర్ ప్లేట్లో ఓ సమోసా చేతికిచ్చి, తింటుండగానే గ్లాసుతో నీళ్లు ప్రక్కన పెట్టి, వేడి వేడి ఇరానీ టీ ఇచ్చి, అయ్యాక, రండి రండి అంటూ ఓ పది మంది మనల్ని లోపలకి తీసుకెళ్తున్నారు!" అని చెప్పేవాళ్లం.

ఇప్పుడీ కాలేజీ యజమానులు, పాతకాలం మహారాజుల లగా, చేరేవాళ్లకి "అర్థరాజ్యం, కూతురుని ఇచ్చి పెళ్లీ" కూడా ఆఫరు చేస్తారేమో ఇంక!

దటీజ్ ఎంసీయే!

Tuesday, September 21, 2010

నేను నేర్చుకున్న......

కన్నడ పాఠం

"చింతపండు అయిపోయింది....చూసుకోలేదు....వచ్చేటప్పుడు ఓ పావుకేజీ తెస్తారా?" సాయంత్రం నడకకి బయలుదేరుతున్న నన్ను వినయపూర్వకం గా ఆఙ్ఞాపించింది మా ఆవిడ ఓ రోజు.

"అదెంత భాగ్యం" అంటూ బయలుదేరాను.

మేం అనంతపురం జిల్లా, రాయదుర్గం లో వున్నప్పుడు సాయంత్రం పూట అలా బళ్లారి వెళ్లే రోడ్డుకో, ఇలా చెళ్లికెరె మీంచి బెంగుళూరు వెళ్ళే రోడ్డులోనో, ఇటు కళ్యాణదుర్గం వెళ్లే రోడ్డులోనో, ఓ మూడుకిలోలు దూరం వెళ్లి, మళ్లీ తిరిగి రావడం అలవాటు.

బాగా వెలుగుండగానే బయలుదేరి, చీకటి పడుతూండగా తిరిగి వచ్చేవాణ్ని.

మా ఇంటి ముందే వుండేది--ఓ కిరాణా-కమ్-ఫాన్సీ-కమ్-బడ్డీ కొట్టు. యెప్పుడైనా చిన్న చిన్నవి అవసరమైతే అక్కడ తీసుకొనేవాళ్లం. రాయదుర్గం లో అందరూ దాదాపు ఇంట్లో కన్నడమే మాట్లాడుకుంటారు. మహమ్మదీయులు ఉర్దూలో మాట్లాడుకుంటారు. తెలుగు మాట్లాడినా, కన్నడం కలిపే!

సరే, తిరిగి వచ్చేటప్పుడు యెంతసేపు తీసుకొని ఇంట్లోకి వెళ్లాలిలే అనుకొని, నడక సాగించాను.

నడక అయ్యాక, ఆ కొట్టు దగ్గర ఆగి, "బాబూ ఓ పావుకేజీ చింతపండు ఇవ్వు" అన్నాను. అప్పటికి చీకటిపడి, లైట్లు వెలిగించేశారు వీధి లైట్లతో సహా. 

"లైట్ హెలిగిత్తది--హిగ్గది" అన్నాడు వాడు కన్నడం లో, పైనుంచి వేళ్లాడుతున్న లైటుని చూపిస్తూ! (నాకలా వినిపించిందో!)

అంత సీరియస్ గా అంటున్నాడు, కన్నడం లో యేమైనా తిట్టాడా అని నేను అనుకుంటుంటే, మళ్లీ వాడే, "అఫ్టర్ లైట్, నో సేల్, చింతపండు!" అన్నాడు. ఆహా, రాత్రి అయితే చింతపండు అమ్మకూడదు అని వాళ్ల సెంటిమెంటు అన్నమాట అనుకొని, సరేలే అని ఇంట్లోకి చేరాను.

మా ఆవిడ చింతపండేదీ? అనడిగితే, నేను కూడా, "లైట్ హెలిగిత్తది--హిగ్గది" అన్నాను సీరియస్ గా. 

సంగతి చెప్పాక, పడీ పడీ నవ్వు! "పోనీలెండి, ఇవాళకి వుప్మాతో సరిపెట్టుకుందాం!" అంది.

అదీ మా కన్నడ పాఠం ప్రహసనం.



Friday, September 10, 2010

మన బ్యాంకులూ.......

........సెలవులూ

అదేదో సామెజ్జెప్పినట్టు, బ్యాంకు వుద్యోగులకి సెలవొచ్చిందన్న ఆనందం యేమాత్రం వుండదు.

ఇప్పుడు చూడండి--దాదాపు నెలరోజుల క్రితం నించీ, వరసగా 3 రోజులు సెలవలు వస్తున్నాయని (బ్యాంకులకి ఈ సందర్భం చాలా అరుదు), చాలా కాలం తరవాత సొంత వూళ్లకో, వేరే వూళ్లకో ప్రయాణాలు పెట్టుకొని, రిజర్వేషన్లూ గట్రా చేసుకొని, గురువారం సాయంత్రానికి బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టుకొని, పడుతూ లేస్తూ స్టేషన్ కో, బస్ కాంప్లెక్స్ కో చేరి, దారిలో యే విజయవాడకో చేరాక, ప్రభుత్వం ఓ రాత్రివేళ--శుక్రవారం (10-09-2010) సెలవు కాదు అని ప్రకటించేసింది!

అది కూడా, రాష్ట్ర ప్రభుత్వం వారు "ప్రభుత్వ కార్యాలకు సెలవు లేదు" అని ప్రకటించి వూరుకుంటారు.

ఇక బ్యాంకువాళ్లకి సంకటం మొదలు. శంఖం లో పోస్తేగానీ తీర్థం కానట్టు--ఆ సెలవుగానీ, సెలవు లేకపోవడం గానీ "నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం క్రింద" వర్తిస్తాయా లేదా--అని. 

బ్యాంకులవాళ్లు మళ్లీ ప్రత్యేకం గా ప్రభుత్వం వారిని అడిగాక,ఇంకో గంటో, రెండు గంటలో పోయాక, అప్పుడు ప్రకటిస్తారు--అసలు సంగతి!

ఇదివరకోసారి (నా 'ఓ ప్రపంచపౌరుడు ' బ్లాగులో) వ్రాశాను--ప్రస్తుతం ఈ నె. ఇ. చట్టం బ్యాంకులకి సెలవలు ప్రకటించడానికి మాత్రమే వుపయోగించబడుతోంది గానీ, వేరే యే విధం గానూ అమలు కావడం లేదు అని. అది వేరే సంగతి.

(అన్నట్టు, "ఈ నె. ఇ. చట్టం క్రింద" అనేదానికి ఈనాడు వారు తమకే తెలిసిన ఓ కొత్త నిర్వచనం ఇచ్చారు--"ప్రైవేటు సంస్థలకు వేతనం తో కూడిన సెలవు" అని!) 

కొత్తసంవత్సరం ఇంకా రాకుండానే, వచ్చే కేలెండరు సంవత్సరం లో, యేయే రాష్ట్రాల్లో యేయే రోజులు సెలవలు అనేది ప్రభుత్వం నిర్ణయించాక, బ్యాంకులు తమ ప్రణాలికల్ని రచించుకుంటాయి. 

మరి వాటి మీద నిలబడి, 'సెలవులు యెప్పుడో ప్రకటించేశాం, ఇక మార్చం--మీరు తన్నుకు చస్తే చావండి ' అనే ధైర్యం ఈ ప్రభుత్వాలకి లేదు!

(అమ్మో! ఇంకేమైనా వుందా--మతభావాలు దెబ్బతినవూ?)

ఇక మత పెద్దలు చూడాలి--చంద్రుడు కనపడ్డాడనో, కనపడలేదు అనో, తిథి మిగులు వుంది అనో, ఇంకా
తగులుకోలేదు అనో, మా ఇమాం చెప్పాడు అనో, రాత్రి కలలో 'విఖనో మునీంద్రుడో, 'పాంచరాత్రేశ్వరుడో' కనపడి చెప్పాడు అనో--పండగల్ని ఓ రోజు ముందుకో, వెనక్కో మార్చేస్తూ వుంటారు.

అసలు ఆ చంద్రుడు ఢిల్లీలోని ఆ ఇమామ్ కే యెందుకు కనిపించాలో, కనిపించకుండా వుండాలో, ఆ మునీంద్రులో ఈశ్వరులో ఫలనా జీయరు స్వామికే యెందుకు చెప్పాలో నాకు అర్థం కాదు.

(నిజం చెపుతున్నాను--గత యాభై యేళ్లలో నేనెప్పుడూ ఈ విఖనో మునీంద్రుడో, విఖన మునీద్రుడో--వీడి పేరు యెక్కడా వినలేదు. ఈ మధ్య మాత్రం యేకం గా వాడికి విగ్రహాలు పెట్టేసి, గుడులు కట్టెయ్యడమో, వున్న గుళ్లలో ప్రతిష్ట చేసెయ్యడమో చేస్తున్నారు! అలాగే వాల్మికికీ, వ్యాస భట్టారక/మునీంద్ర/భగవాన్ కీ కూడా. ఇక ప్రతీ గుడిలోనూ మంటపాలపైనో, గోడల పైనో సప్త ఋషుల్నీ విగ్రహాలు పెట్టేస్తున్నారు--అందరికీ నెత్తిమీద పెద్ద పెద్ద చుట్టలూ, గడ్డాలూ, మీసాలూ కామను). 

అసలు మన జాతీయ వుత్సవాలు--స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధిజీ జన్మదినం--ఈ మూడింటికి మాత్రమే సెలవులు ఇచ్చి, శని ఆదివారాలు రెండూ సెలవలుగా ప్రకటించి, మిగిలిన సెలవలు అన్నీ రద్దు చేసేస్తే యెంత బాగుండును!

ఇక బ్యాంకు వుద్యోగుల పాట్ల గురించి మరోసారి.