Friday, April 25, 2014

జీవితం లో హాస్యం



........అలా కూడా జరుగుతూ వుంటుంది.


పై అంతస్తులో ప్రాంతీయ కార్యాలయం, క్రింద మా కార్యాలయం. పై కార్యాలయం లో పనిచేసే అధికారులూ మేమూ ఒకే సంఘం లో. వాళ్లకి ఓ యూనిట్ సెక్రెటరీ, మా యూనిట్ కి వేరే.
 
సమస్య--పై కార్యాలయం మరుగుదొడ్లలో నీళ్లు పోవడం లేదు. యూనిట్ కార్యదర్శి కి రిపోర్టు చేశారు. ఆయన కార్యాలయ ఉన్నతాధికారి కి అల్టిమేటం ఇచ్చేశాడు--రెండురోజుల్లో అవి శుభ్రపడకపోతే, మర్నాటినుంచి పనిచెయ్యలేము--అంటూ.
 
ఆయనో పెద్ద మేథావి. ఆరోజు సాయంత్రం స్టాఫ్ మీటింగు పెట్టి, మరుగుదొడ్లు శుభ్రం చెయ్యడానికి ఓ కార్మికుణ్ని మాట్లాడాము, అతనికి నెలకింత ఇస్తామని చెప్పాము.....మరి ఉదయమే 6 గంటలకల్లా వచ్చేసి, తనపని చేసుకుపోతాడు. మరి ఆ సమయానికి కార్యాలయం తాళాలు తీసి, పని అయ్యాక మళ్లీ తాళాలు వేసుకొని వెళ్లేవాళ్లు యెవరు? అది తేలిస్తే, సమస్య పరిష్కారం అయిపోయినట్టే....అన్నాడు.
 
ఆ కార్యదర్శి--ఓ సినిమాలో ఓ కానిస్టేబుల్ "మీరెక్కడికో వెళ్లిపోయారు సార్! మీరుకాబట్టి ఇలా క్షణాల్లో పరిష్కారం..........." అంటాడు చూడండి--అదే రకం. బహుశా ఆ సినిమాలో ఆ పాత్ర ఇతన్ని బట్టే సృష్టించి వుంటారు.
 
మామూలుగా యెవరూ ఆ బాధ్యత తీసుకోడానికి ముందుకు రాకపోవడంతో, "నేనున్నాను సార్! నేను చూసుకుంటాను" అని ఒప్పేసుకున్నాడు.
 
తరువాత నాకు విషయం తెలిసి, అతన్ని హెచ్చరించాను......బాబూ, కార్యాలయానికి కొన్ని నిబంధనలు వున్నాయి, అనవసర బాధ్యత నెత్తిన వేసుకొని తరువాత బాధ పడతావు, నీకేమైనా ప్రత్యేక జీతం లేదా భత్యం ఇస్తారా? సమస్య పరిష్కారం ఉన్నతాధికారి బాధ్యత, అలాగే ఇంకోడికి డబ్బులిచ్చి, తాళాల వ్యవహారం అప్పగించొచ్చు, లేదా ఆయన ఇతర నిబంధనల ప్రకారం వ్యవహరించొచ్చు........అని.
 
"కొన్ని బాధ్యతలు తప్పవు కదండీ.......మన పని మనం చేసుకోవాలి కదా?" అంటూ సమర్థించుకున్నాడు.
 
తరువాత ఆయన పాట్లు ఆయనకే తెలుసు. రెండురోజులు అనుకున్నది, వారం పాటు చేయించినా, నీళ్లు పోతే ఒట్టు.......తోటి స్టాఫ్ తో అక్షింతలూ.
 
మళ్లీ నాతో చెప్పుకున్నాడు  "......రేప్పొద్దున్న 'గుర్రం......' పొడి తెచ్చి వేసేస్తానన్నాడు. కేజీ 30 రూపాయలట. డబ్బులు ఇచ్చేశాను. యెల్లుండి నుంచీ నాకీ బాధ వుండదు......"అంటూ.
 
"అదేం పొడి? అంత ఖరీదు యెందుకు?" అనడిగాను.
 
"అబ్బ! యేదైనా పూర్తిగా చెబితేగాని వూరుకోరు మీరు.....అదేదో 'గుర్రం.....' పొడి అన్నాడంతే. ఆఁ! గుర్తొచ్చింది "గుర్రం గెత్తం పొడి" అన్నాడు.
 
అదీ కథ.
 
ఇంతకీ అది "గుర్రం గత్తర పొడి". అంటే గుర్రం లద్దెల పొడి. అందులోని బాక్టీరియా మరుగు దొడ్లకి విరుగుడు. 30 రూపాయలూ తీసుకొని, ఫ్రీగా వచ్చే "గాడిద గత్తర పొడి" తెచ్చి పోసేశాడు. సమస్య పరిష్కారం అయిపోయింది.
 
(తరువాత ఆ బాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్‌ లు వచ్చి కొంతమంది బాగానే వదిలించుకున్నారు మందులకీ వాటికీ)
 
అందుకే కాబోలు అన్నారు.......శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని!

Saturday, April 5, 2014

కొన్ని జోకులు........



.........చాలామందికి తెలియవు 

మా బ్యాంకుల్లో, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు వుంటాయి. వాటివల్ల యెంత ప్రయోజనం అనేది ప్రక్కన పెడితే, ఒక్కో వుద్యోగికీ యెన్నిసార్లు శిక్షణ ఇచ్చారు, దానికి యెంత ఖర్చు పెట్టారు లాంటి వాటికి యేవో నిబంధనలు వుంటాయి. పైగా యాజమాన్యం గొప్పగా చెప్పుకోవచ్చు".....గత సంవత్సరంలో ఇంతమందికి, ఇంత ఖర్చు చేసి, మానవ వనరుల వృధ్ధికోసం, నైపుణ్యాల వృధ్ధికీ, కెరీర్ వృధ్ధికీ, పెర్సనాలిటీ వృధ్ధికీ శిక్షణ ఇచ్చాం" అని.

అలాంటి శిక్షణకార్యక్రమాల్లో బ్యాంకు నియమించిన శిక్షకులే కాకుండా, బయటి బ్యాంకులనుంచి, ఇతర శిక్షణా సంస్థ్హలనుంచీ ప్రవీణులని, నిపుణులని, రప్పించి, ఉపన్యాసాలిప్పిస్తారు. 

సామాన్యంగా......శిక్షణ పొందేవారు ఇలాంటి వాళ్లని పెద్దగా లెఖ్ఖ చేయరు. 'ఆఁ యేం చెప్తాడులే' అనుకుంటూ. 

కానీ వాళ్లు నిజంగా వాళ్ల రంగాల్లో నిపుణులే......ఇట్టే కట్టిపడేస్తారు వినేవాళ్లని. ఇంక నవ్వులు, పువ్వులతో సమయమే తెలీదు, తెలియకుండానే చాలా నేర్చుకుంటారు శిక్షితులు!

(వుపోధ్ఘాతం కొంచెం యెక్కువయ్యింది...క్షంతవ్యుణ్ణి. ఇందులో యేమి కామెడీ వుంది అనెయ్యద్దప్పుడే).

అలాంటి ఓ తరగతిలో, ఒకాయన 'మీరు యేదైనా ఒక విషయం అనుకోండి, దాన్ని సాధించగలను అనుకోండి, ప్రయత్నించండి, తప్పకుండా సాధించగలరు' అనే విషయాన్ని నొక్కి వక్కాణించడానికి ఇలా చెప్పారు. 

ఓ పాఠశాల తరగతిలో, 'మీరు పెద్దయ్యాక యేమి చేయాలి/సాధించాలి అనుకుంటున్నారో "I think I can..........! (And Sure,) I can..........." అనే మాటలతో చెప్పండి' అని అడిగారు టీచర్. అక్కణ్నుంచీ అందరూ, నేదు దేశానికి ప్రథానమంత్రిని అవుతాను, నేను ఐ యే యస్/ఐ పీ యస్ అవుతాను, నేను పైలట్ అవుతాను, నేను అంతరిక్ష యాత్రికుణ్ని అవుతను.......ఇలా చెపుతున్నారు. 

తరువాత ఓ అమ్మాయి, 'నేను మంచి గృహిణిని అవుతాను, ముత్యాల్లాంటి పిల్లలకి తల్లిని అవుతాను'. అని చెప్పిందిట. ఆ తరువాతి అబ్బాయి, "నేను ఆ అమ్మాయికి తన లక్ష్యం నెరవేరడానికి శాయశక్తులా కృషి చేస్తాను". అన్నాడట!

అలాగే, ఇంకొకాయన యెంత ప్రతికూల పరిస్థితులనైనా, అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెపుతూ...... 

కురుక్షేత్ర యుధ్ధం అయిపోయింది, కౌరవులందరూ హతులయ్యారు. అశ్వథ్థామ కోపం పట్టలేక, బ్రహ్మాస్త్రం ధరించి, పాండవులని వెతుక్కుంటూ బయల్దేరాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం పసిగట్టాడు. వెంటనే దూర్వాస మహర్షిని సాయం కోరాడు. ఆయన 'నువ్వు చెపితే యేమైనా చేస్తాను కానీ, అబధ్ధం మాత్రం చెప్పను' అన్నాట్ట. "సరే స్వామీ, నిజం మాత్రమే చెప్పండి" అని ఒప్పుకొని, పాండవులందర్నీ భూమిలో ఓ తొట్టె నిర్మించి, అందులో దాక్కోబెట్టి, పైన మూత వేయించి, దుర్వాసుణ్ణి దాని మీద కూర్చో పెట్టాడట. 

అసలే యెండకి మండుతున్నా, కృష్ణుడికిచ్చిన మాట కోసం ఆయన ఓపిగ్గా కూర్చున్నాడట. అప్పుడు వచ్చి, అశ్వథ్థామ "మహామునివర్యా, పాండవుల జాడ యేమైనా తెలుసా" అని అడిగాడట. ఇంకేముందీ.....పళ్లు పటపటా నూరుతూ, "పాండవులా? నా ముడ్డి క్రింద వున్నారు చూస్కో!" అనేశాడట. పాపం అశ్వథ్థామ, ఇంకేం మాట్లాడితే యేం శపిస్తాడో ఈయన అని భయపడి వెళ్లిపోయాడట. అలా బ్రతికి బయట పడ్డారు పాండవులు......కృష్ణుడు చేసిన మాయోపాయం వల్ల!

ఇవాళే సాయంత్రం మా స్నేహితుడొకాయన మాటల్లో, "నిజంగా ఇవాళ తెలంగాణా వచ్చిందంటే, దానికి మన బొర్రముక్కోడి వాగ్ధాటే కారణం" అన్నాడు. మిగిలినవాళ్లందరూ, "పోదురూ....వాడికి వాగ్దాటి యెక్కడ యేడిచిందీ....పీల గొంతుతోనే పీకలు కోస్తాం, నాలికలు చీరేస్తాం, బొంద పెడతాం....అంటుంటే కామెడీగా వుండేది" అని తీసిపడేశారు. ఆయనన్నాడూ, "తెలంగాణా ఇస్తానంటే, బొంతపురుగుని కూడా ముద్దాడతానూ అన్నాడు. అవునా? అదే, 'తెలంగాణా ఇస్తే, బొంతపురుగుతోనైనా కాపురం చేస్తా!' అని వుంటే......ఈపాటికి సోనియా ఇటలీకి పారిపోయి వుండేది కాదా?" అని. 

హేపీ న్యూ తెలంగాణా అండ్ అవక్షేప ఆంధ్రప్రదేశ్!