Sunday, December 20, 2009

ముదావహం

తడబాటు


మా వూరి మునిసిపల్ చైర్మన్ గారు వుండేవారు--ఆ రోజుల్లో మొదటిసారిగా లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు ఎలక్షన్లలో! డబ్బైతే బాగా సంపాదించాడు, తెలివైనవాడు--కాని కాస్త చదువే తక్కువ--తడబాటు యెక్కువ!  


యేదైనా స్పీచ్ ఇవ్వవలసి వస్తే ఆయనతో కలిసి చదువుకున్నవాళ్ళలో కొంత తెలివైనవాళ్ళని సలహా అడిగి, పాయింట్లు చిన్న కాయితమ్ముక్కమీద వ్రాసుకొని, పాయింటుకి అనుగుణం గా వుపన్యాసం కొనసాగించేవాడు.  


మా వూరి ప్రజల అదృష్టం కొద్దీ, ఓ సారి ఘంటసాలవారు వచ్చారు--వారికి సన్మానం! అధ్యక్షులు--శ్రీ చైర్మన్ వారే!  


అధ్యక్షుని తొలిపలుకుల్లో 'ఈయన ఘంటసాలగారు--ఈయన తెలియనివాళ్ళు యెవరూ వుండరు--ఈయన పాట విననివాళ్ళు వుండరు! మీకు మరోసారి గుర్తుచేస్తున్నా--మన సినిమాలలో, నాగేశ్వరరావుకీ, రామారావుకీ, రేలంగోడికీ, సావిత్రికీ--ఇలా అందరికీ పాటలు పాడేది--ఇంకెవరు? ఈయనే!' జనాలు ఘొల్లున నవ్వుతున్నా, ఇలా సాగింది ఆయన వుపన్యాసం!  


తరువాత మరోవక్త, ఆయనని కవర్ చెయ్యలని, 'మన చైర్మన్ గారు చెప్పింది నిజంగా నిజం--ఘంటసాలవారు సావిత్రికి కూడా పాడారు--మాయాబజార్ సినిమాలో, అహనాపెళ్ళంట అంటూ' అనగానే, అప్పుడు పండింది అసలు కామెడీ--ముందు ఆయన మాట్లాడినప్పుడు గమనించనివారుకూడా, ఇప్పుడు గ్రహించి, చప్పట్లే చప్పట్లు!  


పాపం ఆయనకి కాస్త కన్ఫ్యూజన్ యెక్కువ--ముఖ్యం గా 'ముదావహం' 'శోచనీయం' అనే రెండు పదాలు నేర్చుకున్నాడు గానీ వాటిని వాడడం లో తడబడేవాడు!  


ఓ సంతాప సభలో, 'ఈ రోజు ఫలానావారు--నిన్నటివరకూ మన మధ్యనేవున్నవారు--ఇప్పుడు మనమధ్య లేకపోవడం చాలా ముదావహమైన విషయం! ప్రభుత్వం వారు ఆయన సేవలని ఇన్నాళ్ళూ గుర్తించకపోవడం ఇంకా ముదావహం! గుడ్డిలో మెల్లగా ఈ మధ్యనే ఆయనకి పదవోన్నతి ఇవ్వడం మాత్రం నిజంగా శోచనీయం!............' అంటూ, వెనకవున్నవాళ్ళు గోకుతున్నా, పావుగంటలో పదహారు ముదావహాలూ, శోచనీయాలూ వాడేశాడు--జనం గొల్లుమంటూ వుండగా!  


ఇంకో విషయం యేమిటంటే, ఆయనకి ఆవేశం వస్తే, మాటలు ముందువి వెనక్కీ, వెనకవి ముందుకీ మారి పోయేవి!  


మావూళ్ళో మొదటిసారి ప్రత్యేకాంధ్ర వుద్యమం సందర్భంగా అనుకుంటా పోలీసుకాల్పులలో ఒకరు చనిపోయినప్పుడు, 'ఇలా తుపాకీ వారి సీ ఆర్ పీ గుళ్ళకి నా పౌరులు మరణిస్తూ వుంటే నేను చూస్తూ వూరుకోలేను--నా రాజీనామాకి పదవిని ప్రకటిస్తున్నాను' అన్నారు--బహిరంగ సభలో! (జనం చాలా బాధపడ్డారు!)  


పాపం అయన ఆత్మ శాంతిగానే వుండి వుంటుంది!

Saturday, December 5, 2009

కామెడీ అనే....


నిజమైన హాస్యం
తెలుగు సినిమాల్లో ‘కామెడీ’ విషయానికొస్తే, విజయా వాహినీలే మొదట చెప్పుకోవాలి. శ్రీ హెచ్ ఎం రెడ్డిగారు, కే వీ రెడ్డిగారు మంచి హాస్య ప్రియులు!

చక్రపాణి సినిమాలో ‘డాక్టరు గారింట్లో నెయ్యికేమి కొదువ! అందులోనూ పశువుల డాక్టరు గారింట్లో!’ లాంటి సంభాషణలు మచ్చు తునకలు.

ఇక మిస్సమ్మ విషయానికొస్తే, స్వయంగా ఏ ఎన్ ఆర్ తనకి ఆ (డిటెక్టివ్) పాత్ర ఇమ్మని అడిగానని ప్రకటించారు—అది ఆ సినిమాకి ఆయువుపట్టులాంటి పాత్ర!

నటుల్లో అంజిగాడి దగ్గర్నుంచి, రేలంగి, రమణా రెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య—ఇంకా రాజ బాబు, కేవీ చలం, చలం—తమదైన బాణీల్లో హాస్యం ఒలికించారు!

మన జంధ్యాల ప్రత్యేకం గా తెలుగు లో ‘హాస్య ప్రధానమైన’ సినిమాలకి ఒరవడి చుట్టారు.

‘గుడ్డు తండ్రి గాండ్రిస్తున్నాడు’; ‘తవికలు ‘; ‘నా ఆశ్వాన్ని తిసుకురండి’; ‘నా కొడుకూ కూతురూ రెండు పుర్రెలూ, యెముకలూ తీసుకెళ్ళి……………’ లాంటి సంభాషణలతో చెరగని తమ ముద్ర వేశారు కదా!

ఇలాంటి చమక్కుల వెనక ఓ రహస్యం వుందట!

అదేమిటో మరోసారి!