Sunday, November 1, 2009

పెళ్ళిళ్ళలో సరదాలు

బెందాళం  


మా చదువులు పూర్తయ్యాక, వుద్యోగాలు రావడానికి ముందు దాదాపు ఓ యేడాది ఖాళీగా బలాదూరు తిరగవలసొచ్చింది. ఆ సమయం లో ఓ యేడేనిమిదిమంది చిన్నప్పటి స్నేహితులు--అందులో కొంతమందికి కొంతవరకూ చదువొచ్చింది, కొంతమందికి అదీ లేదు--ఓ గ్యాంగ్ గా కలుస్తూండేవాళ్ళం. మేం చెయ్యని అల్లరి లేదు (ఒక్క ఆడపిల్లల్ని యేడిపించడం తప్ప).  


తెలిసినవాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగితే, మేం హాజరు. అక్కడ మాత్రం, ఆడపిల్లల్ని ఆకర్షించడానికి మంచి డ్రెస్సులూ, బూట్లూ, మేకప్ తో హాజరు అయిపోయేవాళ్ళం. ఇంకా వాళ్ళని అల్లరల్లరిగా ఆటపట్టించి, వాళ్ళ దృష్టి ఆకర్షించడానికి పోటీ పడేవాళ్ళం.  


ఓసారి, మా గ్యాంగ్ లో భాస్కర రావు (నా కొండెగాడు కాదు) చెల్లెలి పెళ్ళి వచ్చించి. మా గ్యాంగ్ హాజరు--ఆడపెళ్ళివారి తరఫున!  


మధ్యాన్నం రెండింటికో యెప్పుడో ముహూర్తం. వేసవి కాలం. పొద్దున్న 8.00 కల్లా వచ్చేశారు మగపెళ్ళివారు. 


యెదురుకోళ్ళూ అవీ జరిగాయి--భాస్కర రావు మా సలహాపై 'గోల్డ్ స్పాట్' లు తెప్పించాడు వేసవికాలం కదా అని. యెందుకో మగపెళ్ళివారు కొంచెం యెక్కువగా 'డిమాండ్లు ' మొదలెట్టారు. వాళ్ళలో ఆడవాళ్ళు మరీ! స్నానాలదగ్గరనించీ యేవో కోపతాపాలు.  


కొంతసేపయ్యాక, మగపెళ్ళివారు 'కూలింగ్ వాటర్ ' అడుగుతున్నారని కబురు. మా భాస్కర్ అప్పటికీ ఓ డ్రమ్ము నీళ్ళలో ఐస్ వేసి పెట్టాడు. కొందరికి గోల్ద్ స్పాట్లు యెలాగూ ఇస్తున్నారు. అవి చాలేలా లేదు. మళ్ళీ తెమ్మని ఒకణ్ణి మార్కెట్ కి తోలాము.  


ఇంతలో మా భాస్కర్ విసుగ్గా--'కొంచెం బెందాళం పుచ్చుకొంటారేమో అడగండ్రా' అన్నాడు. మాకూ తెలీదు బెందాళం అంటే. వాణ్ణి అడిగితే మా చెవుల్లో చెప్పాడు.  


ఇక మేము విజృంభించాం--'యేమండీ--కూల్డ్ వాటరు తాగారా, గోల్డ్ స్పాట్ తాగుతారా? పోనీ ఓ గ్లాసు బెందాళం తెమ్మన్నారా?' అంటూ.


వాళ్ళు మొహమాటంగా 'వద్దండీ' అనేవారు!  


ఒకడు బెందాళం అనగానే, రెండోవాడు, 'మరే! బిందెడు బెందాళం రడీగా వుంది--వేడి వేడిగా! వేసంకాలం కాబట్టి, ఐస్ కూడావేసి చల్లటి బెందాళాన్ని కూడా సిధ్ధం చేశాం! ముగ్గురు నలుగురు పెద్దవాళ్ళు అడిగి మరీ తాగారు! మన వయసువాళ్ళకి ఇది తెలేదు లేరా!' అనేవాడు!  


భోజనాలు అయ్యి ముహూర్తం సమీపించే వేళకి, ఆడ పిల్లలూ, మగపిల్లలూ ఒకటే ముసిముసినవ్వులు బెందాళం పేరు చెప్పగానే! (మరి మావాడొకడు హీరోగా ఓ అమ్మాయిదగ్గర బెందాళం గురించి లీక్ చేశాడు!)  


అలా జాలీగా పెళ్ళి జరిపించేశాము.  


ఇంతకీ బెందాళం అంటే 'గంజి'  


అదండీ సంగతి!



4 comments:

శ్రీ said...

hammo ganji icchi pelli chesaara .. asaldule sumee

A K Sastry said...

డియర్ శ్రీ!

హబ్బే! మేము తయారు చేసిందీ లేదు, ఇచ్చిందీ లేదు--యెవరికీ తెలియని ఆ మాటతో 'క్యామెడీ' సృష్టించామంతే! దాంతో అందరూ సరదాగా గడిపారు కదా!

ధన్యవాదాలు!

మాలా కుమార్ said...

మీ బెందాళం కామెడి బాగుందండి .

A K Sastry said...

డియర్ మాలా కుమార్!

చాలా సంతోషం!

మీ ఆనందమే నాకానందం!

ధన్యవాదాలు!